భారత్ కు అమెరికా మరో షాక్?

15 షిప్ మెంట్ల మామిడి పండ్ల ధ్వంసం!

భారత్, అమెరికా మధ్య దాదాపు కోల్డ్ వార్ లాంటి పరిస్థితి నెలకొందా అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే అనాల్సి వస్తున్నది. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరు భారత్ కు ఒకింత ఇబ్బందికరంగా పరిణమించిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకుర ఇరు దేశాలనూ ఒప్పించింది తానేనని ట్రంప్ ప్రకటించడం, భారత్ దానిని ఖండించడం తెలిసిందే. భారత్ పాకిస్ధాన్ వ్యవహారాలలో మూడో దేశం ప్రమేయం లేదనీ, ఇరు దేశాల సైన్యాధ్యక్షుల మధ్య చర్చల్లోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ విస్పష్టంగా తేల్చేసింది.

అలాగే, ఆ తరువాత భారత్ అమెరికాకు వంద శాతం సుంకాల మినహాయింపు హామీ ఇచ్చిందని అమెరికా ఏకపక్షంగా చేసిన ప్రకటననూ ఇండియా నిర్ద్వంద్వంగా ఖండించింది.  దీంతో అమెరికా పెద్దరికం చిన్నబోయింది. అమెరికా ఒత్తిడిని భారత్ ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదని ప్రపంచ దేశాలకు విస్పష్టంగా తెలిసియింది. ఈ నేపథ్యంలోనే అమెరికా భారత్ పట్ల ఒకింత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని అంటున్నారు. అమెరికా వ్యవహార శైలి కారణంగా ఇరు దేశాల మధ్యా బంధాలు దెబ్బతింటున్న పరిస్థితులు కానవస్తున్నాయి.  

తాజాగా  భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయిన 15 మామిడి పండ్ల షిప్ మెంట్ లను దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల్లో అధికారులు నిలిపివేశారు.  సరైన పత్రాలు లేవనే కారణం చూపుతూ వాటిని దేశంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. వీటి విలువ 5 లక్షల అమెరికా డాలర్లు.  భారతీయ కరెన్సీలోదాదాపు  రూ.42,694,000లు. దీంతో వీటిని తిరిగి భారత్ కు తీసుకెళ్లిపోవడం లేదా అక్కడే ధ్వంసం చేయడం తప్ప మరో అవకావం లేని  పరిస్దితి ఎగుమతి చేసిన మామిడి రైతులకు ఎదురైంది. దీంతో తిరిగి ఇంత సరుకు భారత్ కు రవాణా ఛార్జీలు భరించి తీసుకెళ్లే పరిస్దితి లేక అక్కడే ధ్వంసం చేసేస్తున్నారు.

 భారత్ నుంచి వచ్చిన మామిడి పండ్లను లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా పలు ఎయిర్ పోర్టుల్లో అమెరికా అధికారులు ఏకకాలంలో అడ్డుకోవడం వెనుక అమెరికా ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలే కారణమని అంటున్నారు. దీంతో అమెరికాకు మామిడి పండ్లను ఎగుమతి చేసిన  భారతీయ రైతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఘటనతో మరోసారి అమెరికాకు మామిడి పండ్లు పంపేందుకు రైతులు సాహసించలేని పరిస్దితి ఏర్పడింది. వాస్తవానికి భారత్ కు అతిపెద్ద మామిడిపండ్ల ఎగుమతిదారు   అమెరికాయే. ఇప్పుడు అమెరికా చర్య కారణంగా రైతులకే కాకుండా, భారత ప్రభుత్వానికి కూడా గట్టి షాక్ తగిలిందనే భావించాల్సి ఉంటుంది.   కాల్పుల విరమణపైనా, ఆ తర్వాత సుంకాలపైనా ట్రంప్ ప్రకటనల్ని భారత్ ప్రభుత్వం ఖండించిన నేపథ్యంలో ఈ మామిడి పండ్ల తిరస్కరణ వ్యవహారం ఇరు దేశాల్లోనూ చర్చనీయాంశమైంది. అయితే దీనిపై అటు అమెరికా కానీ, ఇటు ఇండియా కానీ ఇంత వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.