బాబుకి బహిరంగ లేఖ, సినీ స్టైల్లో జగన్ డైలాగ్ లు
posted on Oct 15, 2015 4:04PM

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించవద్దని, ఆహ్వానించినా తాను రాలేనంటూ వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.... బహిరంగ లేఖ రాశారు, రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, కార్పొరేట్ శక్తులకు వేలాది ఎకరాల భూములను కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అందుకే రాజధాని శంకుస్థాపనకు రావడం లేదన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను లెక్క చేయకుండా వ్యవహరించడం, పేదల భూములను బలవంతంగా లాక్కోవడం, అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ ను చులకనగా చూడడం వంటి కారణాల రీత్యా ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాను శంకుస్థాపనకు రాలేనని జగన్ తెలిపారు. పైగా రాజధాని శంకుస్థాపన పేరుతో 400 కోట్ల రూపాయలను దుబారా చేయడాన్ని జగన్ తప్పుబట్టారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ను, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ను తానే స్వయంగా ఆహ్వానిస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో జగన్ ఈ లేఖ రాశారు, అయితే లేఖలో జగన్ ప్రస్తావించినా అంశాలు పరమ రొటీన్ గానూ, సినిమా డైలాగ్స్ లా ఉన్నాయి, రాష్ట్ర విభజన కారణంగా కట్టుబట్టలతో నడిరోడ్డున పడ్డ ఆంధ్రప్రదేశ్ ను పునాదుల నుంచి నిర్మించడమంటే మాటలు కాదు, అలాగే నవ్యాంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి ఆయువుపట్టు అయిన అంతర్జాతీయ రాజధానిని కట్టడమంటే అది ఒక యుద్ధం లాంటిదే, మరి యుద్ధం అన్నాక...కష్టనష్టాలు కచ్చితంగా ఉంటాయ్, త్యాగాలు ఇబ్బందులుంటాయ్, రిస్క్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి ప్రాణనష్టం ఉంటుంది. నవ్యాంధ్ర పునర్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మహాయజ్ఞమే చేస్తున్నారు, సాధ్యమైనంతవరకూ ఎవరికీ ఎలాంటి నష్టం జరగకుండా సరికొత్త విధానాలతో ముందుకెళ్తూ ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు, రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసమీకరణ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి రైతుల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండా దాదాపు 35వేల ఎకరాలను ఆయన సమీకరించగలిగారు, ఇక్కడ రైతుల త్యాగం ఎంతో గొప్పదైనా, వారిని ఒప్పించడంతో బాబు సక్సెస్ అయ్యారు, అలాగే అంతర్జాతీయస్థాయి నగరాన్ని నిర్మించాలంటే లక్షలకోట్ల రూపాయలు కావాలి, అంత డబ్బు ఎక్కడ్నుంచి తేవాలి? అందుకే కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు, దాన్లో భాగంగానే సింగపూర్, జపాన్ లాంటి దేశాలకు... కేపిటల్ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించారు.
ఇలా నవ్యాంధ్రప్రదేశ్ డెవలప్ మెంట్ కు చంద్రబాబు బాటలు వేస్తుంటే, సహకరించాల్సిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... అడ్డుబండలు వేయడం సరికాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహాయజ్ఞం చేస్తుంటే... కొన్ని కష్టనష్టాలు తప్పకుండా ఉంటాయనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని, ప్రతిదానికీ కోడిగుడ్డ మీద ఈకలు పీకకుండా, మంచి పనులను ప్రోత్సహించాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.