అనంత వైసీపీలో ముదిరిన గొడవలు

 

2014 ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్సే వైసీపీ కొంపముంచిందంటారు, అనంతపురం జిల్లాలో అదిమరీ శృతిమించి పార్టీని నిలువునా ముంచేసిందని, గెలవాల్సిన చోట కూడా ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చిందంటారు, దీనికి నేతల మధ్య అనైక్యతే కారణమని, అనంత వైసీపీలో ఏ ఇద్దరి నేతల మధ్య సఖ్యత లేదని, దాంతో జిల్లాలో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి మధ్య ఉన్న వైరం తారాస్థాయికి చేరిందంటున్నారు,అదే సమయంలో ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డితోనూ గుర్నాథ్ కు పొసగడం లేదని చెప్పుకుంటున్నారు, 2014లో తన ఓటమికి వెంకట్రామిరెడ్డే కారణమనే భావన ఉన్న గుర్నాథరెడ్డి... అనంతపై గుర్రుగా ఉన్నారని అంటున్నారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్ నారాయణతో కూడా గుర్నాథ్ కు వైరం ఉందంటున్నారు. దాంతో గుర్నాథ్ రెడ్డి... వైసీపీలో కొనసాగడం కష్టమేనంటున్నారు, అదే సమయంలో కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా జగన్ వైఖరిపై అసహనంతో ఉన్నాడని, మైనార్టీ సభ్యుడినైన తనకు పార్టీలో సరిగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోతున్నట్లు తెలిసింది.

ఇక అనంత వైసీపీ అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆవేదన మరోలా ఉంది, జిల్లాలో తనను ఎవరూ గౌరవించడం లేదని, పార్టీ మీటింగ్స్ పెట్టినా హాజరుకావడం లేదని వాపోతున్నారు, జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పెత్తనం కోసం పాకులాడుతున్నారని, గుర్నాథ్ రెడ్డి వ్యవహారమైతే పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు, అలాగే జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటాడనుకున్న అనంత వెంకట్రామిరెడ్డి కూడా మొక్కుబడిగా పార్టీ సమావేశాలకు వస్తూ సైడైపోతున్నాడని, దాంతో జిల్లా పార్టీలో అసలేం జరుగుతుందో అర్థంకాక ద్వితీయశ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. పైగా ఇప్పటివరకూ జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల, గ్రామ కమిటీలే వేయలేదని, అధినేత జగన్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్నారు

ప్రస్తుతం అనంతలో వైసీపీ పరిస్థితి రెక్కలు విరిగిన ఫ్యాన్ లా ఉందని, జిల్లాపై జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టకపోతే పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu