ఆత్మాహుతి దాడేనా?
posted on Nov 11, 2025 9:37AM

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (నవంబర్ 10) సంభవించిన పేలుడు ఆత్మాహుతిదాడి అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడు ఘటన జరిగిన ఎర్రకోట పరిసరాలలో బుల్లెట్ దొరకడం సంచలనంగా మారింది. అదలా ఉంటే.. ఈ పేలుడు ఘటన ఆత్మాహుతి దాడిగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. గుజరాత్ లో అనుమానితులను అరెస్టు చేసిన సమయంలో తప్పించుకున్న ఉగ్రవాదే ఈ దాడికి పాల్పడి ఉంటాడని ఎన్ఐఏ అనుమానిస్తోంది.
ఇలా ఉండగా ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి పుల్వామాలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన ఆమిర్ రషీద్, ఉమర్ రషీద్ సోదరులలో ఒకడైన అమీర్ పేలుడు జరిగిన కారు కీ తీసుకుంటున్న ఫొటోలు బయటకు రావటంతో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కారు రిజిస్టర్ అయి ఉన్న తారిఖ్ ఎవరో తమకు తెలియదని ఈ సోదరుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన కారు ముగ్గురు చేతులు మారినట్టు తెలుస్తోంది.
అదలా ఉంటే.. ఢిల్లీ పేలుడు ఘటనపై ఉగ్రవాద నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదైంది. ఎక్స్ ప్లోజివ్స్ యాక్ట్ సహా పలు కీలక సెక్షన్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడి చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఉమర్ మృతదేహానికి డీఎస్ఏ టెస్టులు చేస్తున్నారు. ఫరియాబాద్లో ఆర్డీఎక్స్, ఆయుధాల స్వాధీనం కేసులో ఉమర్ పరారిలో ఉన్నాడని తెలిపారు.కాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫొటోను పోలీసులు విడుదల చేశారు.