ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం
posted on Nov 11, 2025 9:15AM

ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రయాణమంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాద ఘటన వంటిదే మరో సంఘటన మంగళవారం ఉదయం సంభవించింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కందుకూరు వెడుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్, విజయవాడ జాతీయరహదారిపై చిట్యాల మండలం పిట్టంపల్లి వద్దు మంటల్లో చిక్కుకుంది. ముందుగా బస్సులో పొగలు వ్యాపించడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి.. ప్రయాణీకులను కిందకు దించేశాడు.
దీంతో పెను ప్రమాదం తప్పి.. ప్రయాణీకులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు మంటల్లో దగ్ధమైంది. ఈ ఘటనకు ముందు బస్సును డ్రైవర్ చౌటుప్పల్ వద్ద టీ బ్రేక్ కోసం ఆపాడు. మళ్లీ బస్సు బయలుదేరిన పది నిముషాలకే బస్సు మంటల్లో చిక్కుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ అప్రమత్తత కారణంగానే తాము క్షేమంగా బయటపడగలిగామని వారు చెబుతున్నారు.