ఔరంగజేబు జీవితంలో ఆసక్తికర విషయం!!

మొగల్ పాదుషా ఔరంగజేబు కఠినమైన మనిషని చరిత్రలో చదువుతుంటాం. కానీ ఈ కాఠిన్యం ఇతరుల విషయంలోనే కాకుండా, తన విషయంలో కూడా అంతే కఠినంగానూ ఉండేవాడు. మతవిధుల్ని తు.చ. తప్పకుండా అమలు జరుపాలనే విషయంలో చాలా నిక్కచ్చిగా వుండేవాడు. తన స్వంత ఖర్చు కోసం ఖజానాలోని డబ్బు ముట్టుకొనేవాడు కాదు. ప్రార్థన వేళల్లో ముస్లిములు శిరస్సుపై ధరించే టోపీలు, కోరాన్ గ్రంథం కాపీలు తయారు చేసి వాటి అమ్మకం ద్వారా వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు. ప్రవక్త, దేవుడు వీరిద్దరి యెడల అతడి భక్తి అపారం. 


తను నివసించే ప్రాంతంలోని వారంతా ఒకచోట చేరి భగవత్ ప్రార్థనలు జరిపితే బాగుంటుందని అతడికో ఆలోచన తట్టింది. ఎంతోమంది ఒక్కచోట చేరి ఏకహృదయంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే చూడముచ్చటగా వుంటుందని అనిపించింది. దానికోసం పెద్ద మసీదును ఒకదాన్ని నిర్మింపజేసాడు. ప్రార్థన చేపే ఒక్కొక్కరికి ఒక్కో నలుచదరపు గడి ఉండేట్లుగా ఏర్పాటు చేయించాడు. మిగతా అందరితో బాటు తాను కూడా ప్రార్థన వేళకు అక్కడ హాజరయేవాడు. అంతా వస్తున్నారా? అందరూ ఈ ఏర్పాట్లు చూసి సంతోషిస్తున్నారా? అని కనుక్కుంటుండేవాడు. అందరు వస్తున్నారు కానీ, మసీదు పక్కనే నివసించే ఒకతడు మాత్రం రావడం లేదని చెప్పారు పనివారు. 


 “ఎవరా మనిషి? నేను చేసిన శాసనం తెలియదా? అందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థించాలనే నా ఆకాంక్ష అతడికి తెలియజేయలేదా?” అన్నాడు.


 "తెలియజేశామండీ, కానీ పట్టించు కోకుండా ఆ వీధుల కూడలిలో అలాగే కూచుంటాడండీ" అని సమాధాన మిచ్చారు వాళ్ళు.


"మసీదుకు ప్రార్థన సమయంలో వచ్చి తీరాలనే నా ఆజ్ఞ అతడికి తెలియజేయండి” అన్నాడు పాదుషా.


 పాదుషా వారి ఆజ్ఞ అని చెప్పామండీ. ఎంతో వేడుకున్నాము. కానీ కదలడండీ." అన్నారు పనివారు.


"అయితే బలవంతంగా పట్టుకురండి” అన్నాడు  పాదుషా. 


ఆ మర్నాడు అతన్ని బలవంతంగా మసీదుకు పట్టుకువచ్చి ఒక నలచదరపు గడిలో నుంచోబెట్టారు. అలా నుంచోనుండగా అక్కడున్న మిగతా వారందరూ మోకాళ్ళమీద వంగి ప్రార్థనలు చేస్తున్నారు. చక్రవర్తి కూడా ప్రార్థిస్తున్నాడు. మసీదులోని ముల్లా ఎలుగెత్తి ప్రార్థన ప్రారంభించాడు. ఇటువంటి పవిత్ర వాతావరణంలో, ఈ బలవంతం మీద వచ్చిన మనిషి హఠాత్తుగా పెద్ద పెట్టున అరిచాడు. “నీ తుచ్ఛమైన దైవం నా పాదాలకింద ఉన్నాడు" అని వెర్రికేక పెట్టి ఆ మసీదు నుండి విసురుగా నడుస్తూ వెళ్ళిపోయాడు. భక్తులు నివ్వెరపోయారు. సాక్షాత్తూ పాదుషా కూడా వారి మధ్యనే ఉన్నాడు. ఎంత అపచారం జరిగిందనేది అందరూ కళ్లారా చూశారు, చెవులారా విన్నారు.


ప్రార్థన పూర్తయిన తర్వాత పాదుషా తన మంత్రులను పిలిచి "అరిచిందెవరో, ఆ దైవ ద్రోహిని ఉరి తీయించండి" అని ఆదేశించాడు. అలా అరిచిన వ్యక్తిని ఉరితీసారు. 


కానీ ఆనాటి నుండి ఔరంగజేబు మనసు హాయిగా వుండేది కాదు. తానే అపరాధం చేశానేమో అన్నట్లు బాధపడుతుండేవాడు. ఒకనాడు మంత్రుల్ని పిలిచి ఆ మసీదు వద్దకు పోయివద్దాం పదండి. ఆ మసీదులో నుంచోనుండగా ఆ వ్యక్తి అలా వెర్రికేక పెట్టటానికి ఏదో బలమైన కారణముండి వుండాలి అంటూ దారి తీసాడు. మసీదువద్దకు వెళ్ళి, ముల్లాను పిలిపించి "నిజంచెప్పు. సంకోచించవద్దు. నీవు ఆనాడు ప్రార్థన చేసే సమయంలో ఆ వ్యక్తి అలా దురుసుగా కేక పెట్టి వెళ్ళిపోయాడు కదా. ఆ ప్రార్థన వేళలో నీ మనస్సు సంపూర్తిగా అల్లామీదనే వుండేనా?” అని అడిగాడు.


 అందుకు సమాధానంగా ఆ ముల్లా "ప్రార్థన ప్రారంభించేప్పుడు మనసు దేవుడు మీదనే లగ్నమై వుండెనండీ, కాని కొద్ది సేపట్లోనే నా మనసులో ఒక రకమైన ఆలోచన మెదిలింది. చక్రవర్తి ఇక్కడే వున్నారు కదా మరింత గట్టిగా ప్రార్థన సలిపితే పాదుషా సంతోషిస్తారు. నా కూతురు వివాహం తలపెట్టినప్పుడు పాదుషాను అభ్యర్థిస్తే డబ్బు సులభంగా మంజూరవుతుంది" అనే ఆలోచన వచ్చింది.


పాదుషాకు ఛట్టున ఏదో స్ఫురించి "ఆ మనిషి నుంచున్న గడి క్రింద తవ్వి చూడండి" అన్నాడు. తవ్వారు. లోతున పెద్ద పాతర కనిపించింది. ఎంతో ధనమున్నది. చక్రవర్తికి పూర్తిగా అర్థమై పోయింది. “నీ దేవుడు నా పాదాలక్రింద ఉన్నాడని" ఆ మనిషి ఆగ్రహంతో ఎందుకు కేక పెట్టాడో, తాను ఎటువంటి మహాభక్తున్ని సంహరింప జేసాడో తెలిసే సరికి, అతడికి మనశ్శాంతి లేకుండా పోయింది. 


పాప పరిహారార్థం తన మరణానంతరం తన దేహాన్ని ముక్కలు చేసి, ఒక్కో ముక్కను ఒక్కొక్క మహాపురుషుడి సమాధి వద్ద ఉంచమని, ఆ విధంగానైనా తనకు మనశ్శాంతి లభిస్తుందని వీలునామాలో వ్రాసిపోయాడని అంటారు. అందుకనే ఔరంగజేబు గోరీలకు ఏవిధమైన పై పూతలు రాతలు లేకుండా సాధారణమైనవిగా నెలకొల్పారట. మట్టితో నిర్మించిన ఈ నిరాడంబరమైన గోరీల వద్ద రోజ్మేరీ మొక్కను ఒకదాన్ని మాత్రం నాటారు.        

 ◆నిశ్శబ్ద