ఈ రెండూ మీ జీవితాన్ని మార్చేస్తాయ్!
posted on Jun 19, 2025 9:30AM
.webp)
మీరు కొత్త సంవత్సరంలో తీసుకున్న దృఢ నిర్ణయాలు సంగతి ఏమిటి? వాటి సంగతే మర్చిపోయారు కదూ! ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే తప్ప గుర్తుకురావడం లేదు కదూ! మీరే కాదు, ఇలాగే చాలా మంది 'కొత్త సంవత్సరంలో బరువు తగ్గాలనీ, వేకువజామున లేచి వ్యాయామం చేయాలనీ, లేదా నడకకు వెళ్ళాలనీ, ప్రతి రోజూ ఫలానా సమయంలో చదువుకోవాలనీ, తినడం తగ్గించాలనీ' తాము ఇలా మారాలనుకున్న విషయాలను జనవరి 1వ తేదీన సంప్రదాయంగా తీసుకునే నిర్ణయాలుగా మార్చి, ఈపాటికి మర్చిపోయే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకునేవారు ఇరవైనాలుగు గంటలు గడవకముందే తమ ప్రమాణాలను తీసి గట్టున పెడతారని ఒక సర్వేలో తేలింది.
మనం తీసుకునే ఇలాంటి కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మనకు ప్రయోజనాలను చేకూరుస్తాయని తెలిసినా నిర్ణయాలకు కట్టుబడి ఉండడం లేదు. మొదటి రోజున్నంత దృఢ నిశ్చయం ఆ తరువాత లేకపోవడం, అవి కేవలం ఉద్వేగభరితమైన మాటలుగానే మిగిలిపోవడం చాలామందికి నిత్యం అనుభవమే. సంకల్పబలం, క్రమశిక్షణ మాత్రమే అంతర్గత శక్తిని మేల్కొలిపి, బలహీనతల్ని జయించేలా చేయగలవు. జీవితంలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే పై రెండూ సహకరించకుండా ఏదీ సాధ్యం కాదు.
సంకల్పబలం :
సంకల్పబలం కలిగినవాళ్ళు మానసిక బలహీనతలకు దూరంగా ఉంటారు. సోమరితనాన్నీ, వాయిదా మనస్తత్వాన్నీ ఆమడదూరంలో ఉంచుతారు. జీవితంలో తమదంటూ ప్రత్యేకశైలితో ఉంటూ విజయం వైపు పయనిస్తారు. అనవసరమైన, పనికిరాని అలవాట్లకు బానిసలు కారు. వారిలోని అంతర్గత శక్తి వారిని ఉద్వేగాలకు గురి కాకుండా మార్పునకు వ్యతిరేకధోరణిని వ్యక్తం చేయనీయ కుండా వారిని మానసికంగా బలవంతులుగా తయారుచేస్తుంది.
క్రమశిక్షణ :
క్రమశిక్షణ అనేది సంకల్పబలంతో కలసి పనిచేసే మానసిక శక్తి. అనుకున్నవి సాధించే ప్రయత్నంలో భాగంగా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శక్తినిచ్చేదే క్రమశిక్షణ. ముఖ్యంగా క్షణికసుఖాలను దూరంగా ఉంచి ఉత్తమ నిర్ణయాలను తీసుకునే శక్తిని కూడా ఇస్తుంది. ఉదాహరణకు క్రమశిక్షణ కలిగిన విద్యార్థి సంకల్పబలం తోడైతే గంటసేపు టీవీ చూసే కన్నా చదువు మీదే పెట్టే సమయం వల్ల ప్రయోజనం కలుగుతుందనీ, పొద్దున్న ఇంకా నిద్రపోవడం కన్నా వాకింగ్ చేయడం, యోగాభ్యాసం చేయడం ఉత్తమమనీ తెలుసుకుంటాడు.
ప్రయోజనాలు:
సంకల్పబలం, క్రమశిక్షణ తోడైతే మనిషి తన ప్రవర్తనలను, చర్యలను, ఉద్వేగాలను అదుపులో ఉంచుకునే చైతన్యస్థితిలో ఉంటాడు. అవి లేనివారు వాటికి బానిసలవుతారు. మీ విషయంలోనే ఆలోచించండి. మీరు కచ్చితంగా ఈ సారి చేయాలని నిర్ణయించుకున్న పనులు ఎన్ని వాయిదా వేసుకున్నారు? ఒక పని మొదలు పెట్టి తరువాత వదిలేసిన అనుభవాలున్నాయా? పై బలహీనతల నుంచి బయట పడి, అనుకున్న పని అనుకున్న సమయంలోనే పూర్తిచేసినప్పుడు కలిగే విజయగర్వం, మానసిక తృప్తి, తత్సబంధ ఫలితాలు అనుభవిస్తేనే తెలుస్తుంది.
ఇలా భావాల్ని అదుపులో ఉంచుకుని క్రమశిక్షణతో జీవించడమంటే జీవితాన్ని నిస్సారంగానో, నిస్తేజంగానో గడిపినట్లు అనుకుంటారు కొంతమంది. నిజానికి ఇలా జీవించడమే, అనవసర ఆలోచనలను దూరం చేసి ఉత్సాహంగా ఉండటమంటే...
◆నిశ్శబ్ద.