ఇలా ఆలోచిస్తే… జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకోవచ్చు!

మనకు ప్రతి రోజూ ప్రతి సందర్భంలో ఏదో ఒకటి అవసరం అవుతూ ఉంటుంది. నిజానికి అవసరం అవుతూ ఉంటుంది అనడం కంటే మనకు అది కావాలి, ఇది కావాలి అని అనిపిస్తూ ఉంటుంది అనడం సమంజసం ఏమో… అందరూ తమకు లేనిదాని గురించి, కావలసిన దాని గురించి, సాధించుకోవలసిన దాని గురించి ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ వుంటారు. వాటికోసం ప్రణాళికలు కావచ్చు, వాటిని నెరవేర్చుకునే మార్గాలు కావచ్చు, వాటి గురించి సమాచారం కావచ్చు. ఖచ్చితంగా వాటిని జీవితంలో అవసరం కింద లెక్కవేసుకుని  ఇక వాటిని మనం కచ్చితంగా నెరవేర్చుకోవాలి అన్నంత బలంగా వాటి కోసం ఆలోచిస్తారు. 

అయితే మన దైనందిన జీవితంలో మనలో ఎవరికైనా ఏమీ లేని దాని గురించి ఆలోచించడానికి సమయం ఉందా? ఏమీ లేకపోవడం అంటే ఏంటి అని సందేహం అందరికీ వస్తుంది. ఏమి లేకపోవడం అంటే మనకు అవసరం లేని,  మనకు సంబంధంలేని విషయం గురించి ఆలోచించడం అని అర్థం. అలా ఆలోచించే తీరిక ఎవరికైనా ఉందా అని అడిగితే… చాలామంది "దాని గురించి ఆలోచించే తీరిక నాకు ఒక్కక్షణం కూడా లేదు" అని చెబుతారు.

 సమయం, పని, మరి ఇతర కారణాల వల్ల ఇప్పటి కాలంలో వారు  జీవితంలో చాలా ఒత్తిళ్లకు గురి అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఆధునిక జీవితం ఒకప్పటి జీవితం కన్నా చాలా ఒత్తిడితో కూడుకుని ఉంది.  ప్రతి ఒక్కరూ ప్రతిరోజు, ఆరోజంతా చేయాల్సిన పని గురించి ఆలోచించడం, వాటికి తగిన సన్నాహాలు చేసుకోవడం, వాటి కోసం పరుగులు పెట్టడం ఆ పనిని పూర్తి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేయడం చేస్తారు. అందువల్ల అందరూ ఆనందాన్ని కోల్పోతున్నారు. 

ఏమిటిది?? ఇలా పనులు చేయడం వల్ల ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుందా?? అనే ప్రశ్న వేసుకుంటే…. ఇలా ఒక ఆశింపు భావనతో చేసే పనులలో ఆర్థిక పరమైన అవసరాల కోసం చేయడమే ఉంటుంది కానీ మానసిక ప్రశాంతత, మనసుకు తృప్తి లభించే కోణంలో చేసే పనులు ఉండవు. 

ఎప్పుడైనా సరే  కేవలం పది నిమిషాలు మీకు కావాల్సి వస్తుంది. దేని గురించి ఆలోచించకుండా అంటే కావలసిన వాటి గురించి, అవసరమైన వాటి గురించి ఆలోచించకుండా కేవలం శూన్యత కోసం సమయం కేటాయించడానికి. అప్పుడు రకరకాల ఆలోచనలు  బుర్రలో తిరుగుతుంటాయి. అలా బుర్రను అవరించుకునే ఆలోచనలను  ఒకటొకటిగా బయటకు పంపించే ప్రయత్నం చేయాలి.

ఆ సమయంలో  అలా చేస్తున్నప్పుడు అప్పటి  ప్రస్తుత స్థితిని గమనించడం ప్రారంభిస్తారు. చుట్టూ ఉన్న వాతావరణం ప్రకృతిలోని సూక్ష్మమైన మార్పులు నిశితంగా గమనిస్తే గనుక అవి మిమ్మల్ని సజీవంగా ఉంచుతాయి.చాలామంది ఏదో విషయాలను ఆలోచిస్తూ పర్సధ్యానంగా ఉంటారు. అయితే అలా ఇతర విషయాల వల్ల  పరధ్యానంలో లేనప్పుడు నిజాయితీతో కూడిన స్వచ్ఛమైన  వ్యక్తిత్వం బయటకు వస్తుంది. అప్పుడు ఇతరత్రా వాటి గురించి ఆలోచించడానికి సమయం కూడా ఉండదు.   నిజమైన వ్యక్తిత్వాన్ని  చూసుకున్నప్పుడు అది మనిషికి ఎంతో తృప్తిని, తనలో తాను చేసుకోవలసిన మార్పులను స్పష్టం చేస్తుంది. ఇలా వేరే ఆలోచనలు చేయడానికి సమయం వెచ్చించకపొవడం అనేది సాధారణ జీవితాన్ని అద్భుతంగా  సృష్టించుకునే దిశగా వేసే మొదటి అడుగు అవుతుంది.

                                       ◆నిశ్శబ్ద.