యాచించడం కాదు.. శాసించే స్థాయికి చేరాలి.. చంద్రబాబు
posted on Oct 2, 2025 12:16AM

విజయదశమి రోజు సంకల్పించిన ప్రతి పనీ విజయవంతం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో విజయదశమి రోజు (అక్టోబర్ 2) ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీకి విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఖాదీ సంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. ఖాదీ ఉద్యమంలో...స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్న వారి ఫొటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. ఖాదీసంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాట్నంపై చంద్రబాబు నూలు వడికారు. అనంతరం ప్రసంగించిన చంద్రబాబు ప్రపంచాన్ని యాచించే స్థాయిని దాటిపోయిందని...ఇకపై శాసించే స్థాయికి భారత్ చేరుకోవాలని అన్నారు. ఖాదీసంత స్వదేశీ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా తయారవుతుందన్నారు.
ఇప్పటి వరకూ విదేశీ వస్తువులు, విదేశీ టెక్నాలజీనే వాడుతూ వచ్చామనీ, ఇప్పుడు ప్రధాని మోదీ టెక్నాలజీ రంగంలోనూ స్వదేశీకి పిలుపునిచ్చారన్నారు. కోవిడ్ సమయంలో భారత్ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లే వివిధ దేశాల ప్రజల ప్రాణాలు కాపాడాయన్నారు. 2038 నాటికి భారత్ తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరిస్తుందనీ, ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుతుందని చెప్పారు. 2047 నాటికి అగ్రస్థానంలోకి ఇండియా చేరుతుందన్నారు. శాటిలైట్ లను ఇతర దేశాల నుంచి ప్రయోగించే పరిస్థితి నుంచి ప్రైవేటు వ్యక్తులు కూడా ఉపగ్రహాలను తయారు చేసి లాంచ్ చేసే పరిస్థితికి వచ్చేశామన్నారు. దేశ జనాభాయే మనకు అతి పెద్ద ఆస్తి అన్న చంద్రబాబు మన ఉత్పత్తులు మనమే వినియోగించుకుంటే డిమాండ్ పెరిగి ఆర్ధిక లావాదేవీలు పెరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొబ్బరి ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ఇలా వేర్వేరు నాణ్యమైన ఉత్పత్తులు తయారు అవుతున్నాయి. వీటిని మనమే ప్రమోట్ చేసుకోవాలి. వీటి వినియోగం పెరిగితే.. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవటంతోపాటు.. మన ఆర్థిక వృద్ధికి తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుందన్నారు.