గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు...100 ఎకరాల భూమికి విముక్తి
posted on Sep 21, 2025 11:17AM

హైదరాబాద్ గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సర్వే నంబర్ 397 పరిధిలో 100 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చెర నుంచి విముక్తి చేసింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కి కేటాయించిన భుమిలో బడాబాబుల ఆక్రమణలు, పేదవారి పేరు చెప్పి షేడ్లు వేయించారు. భారీగా పోలీసే బందోబస్తు మధ్య ఆ షెడ్ల కూల్చివేతలు హైడ్ర ప్రారంభించింది.
గాజులరామారం ప్రాంతంలో అధికారులు చేపట్టిన చర్యలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ దాదాపు రూ.4,500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కబ్జాదారులు ప్రభుత్వ భూమిని చిన్నచిన్న (60–70 గజాల) ప్లాట్లుగా విభజించి, ఒక్కింటిని సుమారు రూ.10 లక్షలకు విక్రయించినట్టు హైడ్రా విచారణలో బయటపడింది. అందిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు అప్రమత్తమయ్యారు.
శనివారం మేడ్చల్ జిల్లా కలెక్టర్, హైడ్రా ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా ప్రాంతాన్ని పరిశీలించి, ఆక్రమణల తీవ్రతను అంచనా వేశారు. ప్రభుత్వ ఆస్తిని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించి, ఆదివారం ఉదయం నుంచే భారీ భద్రత నడుమ కూల్చివేతలు ప్రారంభించారు.
కూల్చివేతల సమయంలో స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి ఆపరేషన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైడ్రా సిబ్బంది, పోలీసులు వారిని అడ్డుకుని పక్కకు తప్పించారు. ఆందోళనలు కొనసాగుతుండగానే అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్‌తో గాజులరామారం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.