పానీపూరీ కోసం వెక్కివెక్కి ఏడుస్తూ.... మహిళ నిరసన
posted on Sep 19, 2025 7:03PM

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన ఓ మహిళ సాయంత్రం వేళ బయట తిరుగుతూ పానీపూరీ బండి దగ్గరకు వెళ్లింది. రూ.20 ఇచ్చి ప్లేట్ కావాలని అడగగా, బండి యజమాని సాధారణంగా ఇస్తున్న ఆరు పూరీల బదులు కేవలం నాలుగు పూరీలు మాత్రమే ఇచ్చాడు. ధరలు పెరిగాయని, ఇకపై ఒక ప్లేట్‌లో నాలుగు పూరీలే ఇస్తున్నట్టు చెప్పాడు.
దీనికి ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.
“పూర్తి ప్లేట్ ఇవ్వకపోతే కదలను” అంటూ రోడ్డుపైనే కూర్చుంది. రెండు పూరీలు ఇచ్చేదాకా లేవనని పట్టుబట్టింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోయి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ప్రశాంతపరిచారు. స్థానికులు కూడా ఆమెను అర్థం చేసుకునేలా ప్రయత్నించారు. చివరికి ఆ మహిళ బండి యజమానిని క్షమించమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
పానీపూరీ కోసం ట్రాఫిక్ నిలిపివేయడం సరైనదా కాదా అన్న దానిపై నెటిజన్లు వాదోపవాదాలు చేస్తున్నారు. కొందరు “ఇది చిన్న విషయం కోసం హడావిడి” అని వ్యాఖ్యానిస్తే, మరికొందరు “ధరలు పెరిగినా ముందే కస్టమర్లకు చెప్పాలి” అంటున్నారు.ఘటన అనంతరం బండి యజమాని “ధరలు పెరగడంతో నాలుగు పూరీలకే పరిమితం చేయాల్సి వచ్చింది, కానీ కస్టమర్లకు ముందే చెప్పకపోవడమే తప్పు” అని అంగీకరించాడు.