చిక్కని ఆరోగ్యానికి చక్కని సూత్రాలు!

రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టుగా ఈ కాలంలో మంచి ఉద్యోగాలు, బోలెడు వసతులు, కావలసినంత సంపాదన ఉన్నా ఆరోగ్యమే సరిగ్గా ఉండటం లేదు. పుట్టడంతోనే జబ్బులతో పుట్టేస్తున్నారు పిల్లలు. పెరిగే వయసులో తగినంత శారీరక ఎదుగుదలకు సహకరించే ఆటలకు దూరం ఉండి ఎప్పుడూ పుస్తకాలతో ఉండటం వల్ల శారీరకపరంగా దృఢంగా ఉండలేకవుతున్నారు. ఇక ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు సంసారం ఇదంతా గడుస్తూ ఉంటే వాటితో సతమతం అవ్వడం తప్ప ఆరోగ్యం అనే ఆప్షన్ గురించి సీరియస్ గా తీసుకోలేరు. పైపెచ్చు ఏదైనా జబ్బులొస్తే టెంపరరీగా నయమయ్యేందుకు మెడిసిన్స్ వాడి హమ్మయ్య అనుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో మనిషిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది అనారోగ్యమే. డబ్బు పెట్టినా కూడా పూర్తిగా కోలుకోలేని విధంగా తయారైపోతున్నారు. అలాంటి అనారోగ్యాలు ఉండకుండా చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

మొట్టమొదట సంతోషంగా వుండాలి.... 

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. సంతోషంగా ఉన్నప్పుడు సమస్యలు పెద్దగా ప్రభావం చూపించవు. అలాగని లేని సంతోషాన్ని ఎలా మనం తెచ్చిపెట్టుకోవడం అనిపిస్తుందేమో కానీ సంతోషం అంటే ఉన్నదనితో తృప్తిగా ఉండటం అలాగే పరిష్కరించలేని సమస్యల విషయంలో అనవసరంగా ఆలోచించి బాధపడి లాభంలేదు. పరిష్కరించ గలిగిన సమస్యల గురించి ఆలోచించనవసరం లేదు. ఎందుకంటే పరిష్కరించలేము అని తెలిసాక కేవలం రోజువారీ పనులు చేసుకుంటూ పోవడమే, ఇక పరిష్కారం అవుతాయి అని తెలిసిన పనుల గురించి అసలు ఆలోచనే అవసరం లేదు కదా.

ఆహార మార్గం!

శారీరకంగా మనిషి బాగుండాలి. శరీరంలో ఏర్పడే అసమతుల్యత చాలా సమస్యలకు దారితీస్తుంది. అందుకే మంచి ఆహారం ఎంతో ముఖ్యం. కేవలం ఆహారం తీసుకుంటూ ఉంటే సరిపోదు.తినే ఆహారానికి తగినంత వ్యాయామం కూడా ఎంతో ముఖ్యం. వ్యాయామం మనిషిలో ఉల్లాసాన్ని పెంచుతుంది. మంచి ఆహారం తీసుకుంటూ కనీసం గంట సేపు వ్యాయామం చేస్తూ వుంటే ఆరోగ్యం బావుంటుంది.

బాడ్ హబిట్స్ బంద్!

చెడు అలవాట్లు శరీరాన్ని కుళ్ళబొడుస్తాయి. ఏ రకమైన చెడు అలవాట్లను దగ్గరకు రానీయకండి. చాలామంది స్మోకింగ్, డ్రింకింగ్, కొన్ని ఇతర అలవాట్లను ( తినకుడాని ఆహార పదార్థాలు అతిగా తినడం, టైమ్ మేనేజ్మెంట్ లేకపోవడం, సోమరితనంగా ఉండటం. కష్టపడే అవసరం లేదని ఎలాంటి ఉద్యోగాలు చేయకపోవడం. ఇవన్నీ కూడా నిజానికి బాడ్ హాబిట్స్ ఏ)  నిజానికి పొగ త్రాగడం కాని, ఆల్కహాలు కాని, జూదం కాని మనకు హాయిని ప్రశాంతతను ఇవ్వలేవు. ప్రతి మనిషికి ఒక వ్యాపకం అంటూ ఉండాలి. 


రీడింగ్ ఈజ్ ఏ వండర్!

మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. పుస్తకాలలో కావలసినంత విజ్ఞానం లభిస్తుంది. ఎంతోమంది జీవితాలు, ఆ జీవితాలలో జరిగిన ఎన్నో విషయాలు, వాటిని ఎలా డీల్ చేయాలి, గొప్ప ఆలోచనలు ఎలా ఉంటయి?? జీవితం ఉన్నతంగా ఉండటం అంటే ఏమిటి?? ఆర్థిక, మానసిక సమస్యలు, మనుషుల మధ్య అటాచ్మెంట్స్ వంటివి అన్నీ పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు.  అదొక అద్భుత ప్రపంచం అవుతుంది. 

మెడిసిన్ లెస్ లైఫ్!

ఎన్ని సార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన మాట సాధ్యమైనంత వరకు ఔషధాల వాడకం తగ్గించాలి.  శరీరానికి ఆహారపదార్థాల ద్వారానే జబ్బును నయం చేసుకునే మార్గాన్ని తెలుసుకోవాలి. వీలైనంత వరకు ఇమ్యూనిటీ పెంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సీజనల్ వారిగా దొరికే ఆహారం అమృతంతో సమానంగా పనిచేస్తుంది. రుచి కోసమో, సీజన్ దాటి దొరుకుతున్నాయనే ఆశతోనో వేటినీ తీసుకోవద్దు. కుదిరితే ఇంటి ముందు నాలుగు రకాల ఆకుకురా మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చు అప్పుడు రసాయనాలు లేని ఆహారం మీ ముందున్నట్టే. బాగా అవసరమైనప్పుడు మాత్రమే మందులను అల్లో చేయాలి. 

ప్రశాంతత!

ప్రస్తుతం అందరి సమస్య ఒకటే ప్రశాంతత లేకపోవడం. దానివల్లనే ఎన్నోరకాల మానసిక సమస్యలు చుట్టుముడతాయి.  మనసు ప్రశాంతంగా వుంటే చక్కటి నిద్ర పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనసును బయట ప్రపంచం నుండి వెనక్కి లాక్కొచ్చి ఒక్కచోట ఉంచుకోవాలి. అదే ధ్యానం చేసే పని. అలా చేస్తుంటే చక్కటి నిద్ర సొంతమవుతుంది.  చక్కటి నిద్ర మాత్రమే మంచి ఆరోగ్యానికి చిహ్నం. ఎక్కువగా పనిచేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఆలోచనతో మానసికంగా, శారీరకంగా కష్టపెట్టుకోవద్దు.

ఇవన్నీ పాటిస్తే చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది.

                                ◆వెంకటేష్ పువ్వాడ