అమ్మాయిలూ… ఈతప్పు చేయొద్దు!

జీవితంలో తప్పులు జరగడం అనేది సహజం. ఆ తప్పులలో కొన్నింటిని సరిదిద్దుకోవద్దు, అయితే కొన్ని తప్పులు సరిదిద్దుకోలేరు. అలా సరిదిద్దుకోలేమని చాలామందికి తెలియకుండా తప్పులు చేస్తారు. అమ్మాయిలు తమ జీవితంలో కొన్ని తప్పులు చేస్తారని, తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారని కొన్ని సర్వేలలో స్పష్టమయింది. అమ్మాయిల ఆలోచనా విధానమే దానికి కారణమని కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నారు. అమ్మాయిలు చేసే తప్పులు, తీసుకునే తప్పు నిర్ణయాల గురించి అమ్మాయిలు తప్పక తెలుసుకోవాలి మరి.

స్వేచ్ఛను కోల్పోవద్దు!!

స్వేచ్ఛ అంటే చాలామంది వేరే అర్థం తీసుకుంటారు. పొట్టి పొట్టి బట్టలేసుకుని ఇష్టమొచ్చినట్టు తిరుగుతూ నా ఇష్టం నా స్వేచ్ఛ అనే వాళ్లకు నిజమైన స్వేచ్ఛ అంటే అర్థం తెలియకపోవచ్చు.  కానీ స్వేచ్ఛ అంటే ఒకరి చెప్పుచేతల్లో లేకుండా ఇష్టమైనదాన్ని పొందడం. 

నచ్చినది తినడం, నచ్చినది చదవడం, నచ్చినది భయం లేకుండా అడగడం. ఇవన్నీ అమ్మాయిలలో ఆత్మవిశ్వాసపు స్థాయిలను చాలా గొప్పగా తీర్చిదిద్దుతాయి. ఏదైనా అడిగితే ఇంట్లో ఏమంటారో అనే భయాన్ని వదిలిపెట్టాలి. అవసరమైన వస్తువు ఎందుకు అవసరం అనే విషయాన్ని వివరించాలి.

భారంగా ఆలోచించొద్దు!!

చాలామంది ఇళ్లలో అడపిల్లల్ని భారంగా చూస్తారు. ఇది చిన్నతనంలో ఎక్కువగా కనిపించకపోయినా పెద్దయ్యే కొద్దీ ఈ భావాన్ని తల్లిదండ్రులు ఆడపిల్లల దగ్గర మాటల్లో వ్యక్తం చేస్తుంటారు. 

ఆడపిల్లలు ఏదైనా ఖరీదైన వస్తువులు అడిగినప్పుడు "నీకోసం ఇంత దాచిపెట్టాలి. ఇప్పుడే ఇంతింత ఖర్చులు భరించాలంటే ఎలా??" 

"నువ్వు ఇలా అడిగితే ఎలా రేపు నీ పెళ్లికి చాలా డబ్బు కావొద్దు" అని అంటుంటారు. అవన్నీ విని విని ఆడపిల్లలు కుటుంబానికి భారం అవుతారేమో అని చదువు విషయంలో పెద్దపెద్ద కలలవైపు వెళ్లకుండా ఆగిపోతారు. నిజానికి భారం అవుతున్నామేమో అనే ఆలోచనతోనే ఆడపిల్లలు ఇంటి భారాన్ని మోస్తున్నవాళ్ళున్నారు. ఇంటి భారం మోయడం తప్పుకాదు కానీ తామే ఇంటికి భారం అనుకోవడం తప్పు.

కాంప్రమైజ్ అవ్వద్దు!!

ఆడపిల్ల అంటేనే కాంప్రమైజ్ కి మారుపేరు అన్నట్టు పెంచుతారు కొందరు. తినే విషయం దగ్గర నుండి అవసరమైన వస్తువుల వరకు ప్రతిదాంట్లో కాంప్రమైజ్ అవడం నేర్పిస్తారు. ఇలా  కాంప్రమైజ్ ల మధ్య బతికి ఆడపిల్లలు వేసే ఒక పెద్ద రాంగ్ స్టెప్ ఏమిటంటే జీవితకాల నిర్ణయం అయిన పెళ్లి విషయంలో కూడా కాంప్రమైజ్ అయిపోవడం.

ఇంట్లో వాళ్లకు భారం తగ్గిపోతుంది, ఏదో ఒక సంబంధం అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది. ఇంట్లో ఇబ్బందులు అవుతున్నాయి నా పెళ్లైపోతే అంత సెట్ అయిపోతుంది అని ఆలోచించే అమ్మాయిలు ఈకాలంలో కూడా ఉన్నారంటే ఆశ్చర్యమే వేస్తుంది.

ఇష్టాలు వదిలిపెట్టద్దు!!

అందరికీ ఇష్టాలుంటాయి. అలాగే ఆడపిల్లలకు కూడా. కానీ ఇంట్లో తల్లిదండ్రుల కష్టాలను చూసే ఆడపిల్లలు తమ ఇష్టాలను బయటపెట్టరు. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇష్టాలను బయటపెట్టని వాళ్ళున్నారు. అలాగని అందరూ ఇలా త్యాగం చేసేస్తారని అనడం లేదు. కానీ ఆడపిల్లలు తమకున్న చిన్న చిన్న ఇష్టాలను వధులుకోకూడదు. ఆ అసంతృప్తి చాలా మానసిక సమస్యలకు దారితీస్తుంది.

ఆర్థిక సంపాదన మానుకోవద్దు!!

కొంతమంది మగవాళ్లకు సంపాదన బాగుంది కదా అనే ఆలోచనతో ఆడపిల్లలను సంపాదించడానికి ప్రోత్సహించరు. తల్లిదండ్రులేమో ఆడపిల్లను బయటకు పంపించాలంటే భయమనే సాకుతో ఉద్యోగానికి పంపరు, పెళ్లయ్యాక భర్త, అత్తమామలు ఏమో మా సంపాదన ఉందిగా ఇంట్లో హాయిగా ఉంటే చాలు అంటారు. ఇలా రెండు వైపులా ఆడపిల్లలను ఆర్థికంగా ముందడుగు వేయకుండా చేసేవాళ్ళు ఉన్నారు.

తమకంటూ ఆర్థిక సంపాదన లేకపోతే పెళ్లి కాని వాళ్ళు అయినా, పెళ్లి అయిన వాళ్ళు అయినా తమ అవసరాల కోసం భర్త దగ్గర, అత్తమామల దగ్గర చెయ్యి చాపుతూనే ఉండాలి. అందుకే తమ చేతిలో ఏ విద్య ఉన్నా, దాని సహాయంతో తమకంటూ కొంత సంపాదించుకోవాలి. ఏమో ఎవరు చెప్పొచ్చారు ఇలా సంపాదించే ఆడపిల్లలు ఆర్థిక వేత్తలు కూడా కాగలరు.

◆ వెంకటేష్ పువ్వాడ.