జీవితంలో ఎదగాలంటే వీటిని కంట్రోల్ పెట్టాలి!

మన జీవితంలో సమయం ఎంతో విలువైనది. మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేదాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. అంటే మనం గొప్పగా ఉండాలన్నా, మనకంటూ ప్రత్యేకత సృష్టించుకోవాలన్నా సమయాన్ని కూడా దానికి తగ్గట్టు ఉపయోగించుకోవాలి, మనం పనికిరానివాళ్లుగా మిగిలిపోవాలంటే సమయాన్ని  కూడా అలాగే వృధా చేసుకుంటూ ఉండాలి. మొత్తానికి మన జీవితాన్ని నడిపిస్తున్న అతిగొప్ప వాహకం సమయమే.

అయితే పైన చెప్పుకున్నట్టు సమయాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఉండాలని అనుకునేవాళ్లే కానీ పనికిరానివాళ్లుగా మారిపోవాలని ఎవరూ అనుకోరు. అందుకే సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఎక్కడ సమయాన్ని వేస్ట్ చేస్తాం అనే విషయాన్ని టైం ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా!!

సోషల్ మీడియా అనేది చాలా పెద్ద వ్యసనం అయిపోయింది ఈ కాలంలో. ఎక్కడెక్కడో ఉన్న కొత్త వ్యక్తులను స్నేహితులుగా చేసే వేదికగా ఈ సోషల్ మీడియా యాప్స్ ఉంటున్నాయి. వాటిలో పోస్ట్ లు పెట్టడం, వేరే వాళ్ళతో కబుర్లు చెప్పడం, పోస్ట్ లకు లైక్స్ చేయడం, కామెంట్స్ పెట్టడం ఇదంతా ఒక తంతు అయితే ఆ సోషల్ మీడియా లో కొన్నిసార్లు పోస్ట్ ల విషయంలోనూ, కామెంట్స్ విషయంలోనూ మాటమాట అనుకుని అక్కడ ఇగో పెరిగిపోయి జరిగే యుద్ధాలు చాలానే ఉంటాయి. వీటన్నిటి వల్ల సమయం వృధా అవుతుందే తప్ప ఒనగూరే ప్రయోజనం ఏమి ఉండదు. 

కొన్నిసార్లు ఈ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ అందరితో సరదాగా చాటింగ్ చేసుకుంటూ కాసేపయ్యక సమయం చూసుకుంటే అమ్మో ఇంత సమయం అయిపోయిందా అనిపిస్తుంది. అంటే అప్పటికి ఈ సోషల్ మీడియా వల్ల ఎంత సమయం వృధా అవుతుందో గుర్తుచేసుకోండి. అదే సమయంలో జీవితాన్ని మెరుగుపరుచుకునే బోలెడు పనులు చేసుకోవచ్చు.

 ప్లానింగ్!!

ప్లానింగ్ అంటే ఏదేదో చేయడం కాదు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రేపు చేయాల్సిన పనులు ఏంటి?? ఏ సమయంలో ఏది చేయడం బాగుంటుంది వంటివి ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల పనులన్నీ పక్కాగా పూర్తయిపోతాయి. అంతేకాదు పనులు పక్కాగా, తొందరగా పూర్తయిపోవడం వల్ల సమయం మిగులుతుంది. ఆ మిగిలే సమయంలో నచ్చిన పనులు, అభిరుచులు, ఇంకా వేరే విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే ప్లానింగ్ అనేదానికి దూరం ఉండకూడదు. 

అదే ప్లానింగ్ చేయకపోతే రోజులో ఎంత పని చేసినా ఇంకా ఏదో మిగిలి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది.

నిద్రపోవడం!!

నిద్ర మహా బద్దకమైన మనుషుల్ని తయారుచేస్తుంది. అతినిద్ర అనేది రోజులో చాలా సమయాన్ని తినేస్తుంది. నిద్రకు కూడా సరైన టైమింగ్ పెట్టుకోవడం ఎంతో అవసరం. ఉదయం లేవడం నుండి రాత్రి పడుకోవడం వరకు అన్ని పనులను ఎలాగైతే ప్లానింగ్ చేసుకుంటారో రాత్రి పడుకుని ఉదయం లేవడానికి కూడా సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే నిద్ర కూడా హాయిగా పడుతుంది. అంతేకానీ రోజులో ఎప్పుడంటే అప్పుడు పడకమీదకు ఎక్కి వెచ్చగా బజ్జోవడం మంచిది కాదు.

అతిగా ఆలోచించడం!!

ఏదైనా పని చేయడానికి  ఆలోచన అవసరమే కానీ అతిగా ఆలోచించడం మాత్రం చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. తింటూ ఉంటే కొండలు కరిగిపోయినట్టు ఆలోచిస్తూ ఉంటే గంటలు గంటలు అలా దొర్లిపోతాయి. కొంతమంది అలాంటి అతి ఆలోచనల వల్ల రోజులో చేయాల్సిన పనులను కూడా చేయకుండా నిర్లక్ష్యంగా, బద్ధకంగా, నిరాసక్తిగా ఉంటారు. అందుకే అతి ఆలోచనలను దూరం పెట్టాలి.

టీవీ చూడటం!!

సినిమాలు, సీరియల్స్, కామెడీ షో లు, ఆదివారం వచ్చిందంటే ప్రత్యేక ప్రోగ్రామ్స్, వంటలు, వింతలు, విచిత్రాలు, రాజకీయం, గాసిప్స్ అబ్బో ఇవన్నీ టీవీ లో వస్తున్నప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు మార్చి మార్చి చూస్తూ వాటికి అతుక్కుపోయేవాళ్ళు ఉన్నారు. అయితే అపుడపుడు చూడచ్చేమో కానీ అతిగా టీవీ చూడటం  రోజుమొత్తాన్ని గంగలో కలిపేస్తుంది.

షాపింగ్!!

ఆన్లైన్ కావచ్చు, ఆఫ్ లైన్ కావచ్చు షాపింగ్ చేసేటప్పుడు గంటలు గంటలు తిరుగుతూనే ఉంటారు. ఈరకమైన షాపింగ్ అప్పుడప్పుడు అంటే పర్లేదు. కానీ ఎక్కువగా షాపింగ్ చేస్తే సమయం, డబ్బు రేణు ఖర్చైపోతాయి.

వాయిదా వేయడం!!

పనులను మొదలుపెట్టాక పూర్తిచేయడం ఉత్తమం. దాన్ని వాయిదా వేస్తే ఆ తరువాత ఆసక్తి తగ్గి అది పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంటుంది.

ఫోన్ కాల్స్!!

అన్ లిమిటెడ్ కాల్స్ ఆఫర్ వచ్చాక ఎవరైనా ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడేస్తుంటారు. అవేమైన చాలా ముఖ్యమైన విషయాలా అంటే ఉహు కాదు పిచ్చాపాటి కబుర్లు అవన్నీ. ఫోన్ లో ఎక్కువ మాట్లాడకుండా విషయం ఒక్కటి చెప్పడం, తెలుసుకోవడం చేసి దాన్ని పక్కన పెట్టాలి. ఇతరుల గురించి మాట్లాడుకోవడానికో, ఇతరుల విషయాలను కథలుగా చెప్పుకోవడానికో సమయాన్ని వృధా చేయకూడదు.

ఇలా అన్నీ గమనించి పాటిస్తే మనిషి ఎదుగుదలకు కారణమయ్యే సమయం చాలా విలువైనదిగా కనబడుతుంది, విలువైనదని అర్థమవుతుంది.

                             ◆ వెంకటేష్ పువ్వాడ.