అనాథశవాలకు అంతిమ గౌరవం.. ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం..
posted on May 29, 2021 8:07PM
నారా భువనేశ్వరి. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి. భర్తే ఆమెకు సర్వస్వం. రాజకీయం తెలీదు. తన వ్యాపారమేదో తాను చేసుకుంటూ ఉంటారు. చాలా అరుదుగా మాత్రమే ప్రజల ముందుకు వస్తారు. ఏదైన విషయం తనను తీవ్రంగా కలిచివేస్తే మాత్రం.. తప్పకుండా స్పందిస్తారు. గతంలో అమరావతి రైతుల ఆక్రందన ఆమెను కలిచివేసింది. రైతు దీక్షా శిబిరాన్ని సందర్శించి.. అమరావతి ఉద్యమానికి తన వంతు సాయంగా, అప్పటికప్పుడు తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి విరాళంగా ఇచ్చారు. అమరావతి కోసం నేను సైతమంటూ ముందుకొచ్చారు.

తాజాగా, ఏపీలో కరోనా కల్లోలంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. టెస్టుల నుంచి ట్రీట్‌మెంట్ వరకూ.. ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ అట్టర్‌ఫ్లాప్ అయింది. కరోనాతో చనిపోతే కనీసం అంత్యక్రియలూ జరిపించలేని దుస్థితిలో ఉంది ప్రభుత్వ యంత్రాంగం. అలాంటి ఉదంతాలు చూసి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కలత చెందారు. అనాథ శవాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో అంత్యక్రియలు చేస్తామని ఆమె ప్రకటించారు.
కరోనా బారిన పడి మృతిచెందిన వారిని కొన్ని చోట్ల రోడ్ల పక్కన వదిలేయడంపై కలత చెందామని నారా భువనేశ్వరి అన్నారు. కరోనా మృతుల కుటుంబీకులు ముందుకు రాకపోతే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసినట్లు వివరించారు.
మరోవైపు, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాలుగు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్మాణానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపల్లె, పాలకొల్లు, టెక్కలి, కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ తెలిపింది. ఇప్పటికే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.