ఓయూ లో నకిలీ ఐఏఎస్ ల హల్ చల్!
posted on Sep 3, 2025 9:46AM

చదువుల తల్లి కొలువుతీరిన ఉస్మానియా యూనివర్సిటీలో ఆకతాయిల ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సాధారణ జనాలకు అనుమతి ఉండడంతో అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకూ పెచ్చరిల్లుతోంది. యూనివర్సిటీ లో విద్యార్థులు వెళ్లలేని ప్రాంతాలలోకి కూడా వెళ్లి హల్ చల్ చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో ఒక ఇన్నోవా కారు ఆపి అక్కడ ఓ నలుగురు మూత్ర విసర్జన చేయడాన్ని ఒక విద్యార్థి అడ్డుకున్నాడు. ఈ ప్రాంతంలో విద్యా ర్థులు తిరుగుతూ ఉంటారని, ఇక్కడ మూత్రవిసర్జన చేయడం కరెక్ట్ కాదని వారించాడు. దీంతో ఆ నలుగురూ విద్యార్థిపై దాడి చేశారు.. తాము ఐఏఎస్ అధికారు లమని, నేషనల్ హైవే అథారిటీ కోసం పని చేస్తు న్నామని, నేషనల్ హైవే సర్వే కోసం వచ్చామని, ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వస్తే తమని అడ్డుకుంటావా అంటూ విద్యార్థిపై చేయి చేసుకున్నారు.. విద్యార్థిని పరుగులు పెట్టించి మరీ కొట్టారు.. .అయితే విద్యార్థిని కొడు తుంటే కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి రావడంతో వాళ్ళందరూ పరారయ్యే ప్రయత్నం చేశారు.. తోటి విద్యార్థు లంతా కలిసి ఆ నలుగురిని పట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు అప్పగించారు.
తాము ఐఏఎస్ అధికారులమని పోలీసుల ముందు బుకాయించే ప్రయత్నం చేశారు . దీంతో పోలీస్ అధికారులు తమదైన శైలిలో వాళ్ళని ప్రశ్నించ డంతో అసలు విషయం బట్టబయలైంది. ఐఏఎస్ అధికారుల పేర్లు చెప్పుకొని , వీళ్ళు దందా లు చేస్తున్నారని, అంతేకాకుండా వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీసుల విచార ణలో బయటపడింది.ఈ నేపథ్యం లో నేషనల్ హైవే అథారిటీ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న నలుగురిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే యూనివర్సిటీలో అసభ్యకర రీతిలో ప్రవర్తించడం, విద్యార్థిపై దాడి కేసులు కూడా రిమాండ్ కు తరలించారు.