జగన్ తో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదు: రఘువీరా రెడ్డి
posted on Oct 26, 2015 8:32AM
(2).jpg)
ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన నిరాహార దీక్షకి మదతు తెలిపిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ సింగ్, ప్రత్యేక హోదా సాధించడానికి తమ పార్టీ వైకాపాతో కలిసిపోరాడటానికి సిద్దంగా ఉందని కూడా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు ఎన్నికలలో చాలా ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ, ఆ తరువాత నిలద్రొక్కుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు దానిని పట్టించుకోవడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే రాష్ర్టం నుండి కాంగ్రెస్ పార్టీ కనబడకుండా పోయే ప్రమాదం ఉంది. బహుశః అందుకే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వైకాపా సహాయంతో పార్టీని కాపాడుకోవాలని భావిస్తున్నట్లుంది.
వైకాపాతో కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దమని దిగ్విజయ సింగ్ చెప్పిన తరువాత పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తమకు ఎటువంటి బేషజాలు లేవని తెలిపారు. ప్రత్యేక హోదా సాధించేందుకు రాష్ట్రంలో అన్ని పార్టీలు సమైక్యంగా పోరాడవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి దానిని మంజూరు చేయవలసిన ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించనంతవరకు ప్రజలు ఆయన చేస్తున్న పోరాటాలను విశ్వసించరని రఘువీరా రెడ్డి అభిప్రాయ పడ్డారు. జగన్ అంగీకరిస్తే వైకాపాతో కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయదానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. ఆయన అంగీకరిస్తే కాంగ్రెస్ శ్రేణులు వచ్చి ఆయన వెనుక నిలబడేందుకు సిద్దంగా ఉన్నాయని స్పష్టం అవుతోంది. ఇప్పుడు బంతి జగన్ కోర్టులోనే ఉంది కనుక ఆయనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది.