డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాముతో హల్‌చల్

 

హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఓ ఆటో డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపగా, అతడి చర్యలు ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీశాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండే చంద్రాయణ గుట్ట చౌరస్తా వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానా స్పదంగా ఆటో నడుపు తున్న డ్రైవర్‌ను ఆపి బ్రెత్ అనలైజర్‌తో పరీక్షించగా, అతడికి డ్రంకన్ డ్రైవ్‌లో 150 వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 

దీంతో డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే, కేసు నమోదు అనంతరం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆటో డ్రైవర్, అకస్మాత్తుగా తన ఆటోలో నుంచి పామును బయటకు తీసి ట్రాఫిక్ పోలీసులను బెదిరించాడు. అంతేకాకుండా పామును పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ నానా హల్చల్ సృష్టించాడు. ఈ అనూహ్య ఘటనతో చెక్‌పోస్ట్ వద్ద ఉన్న పోలీసులు, వాహనదారులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

పాము కనిపిం చడంతో  వెంటనే పోలీసులు అప్రమత్తమై డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆలోపే అతడు పాముతో పాటు ఆటోను తీసుకుని సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటన కారణంగా కొద్ది సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు చెక్‌పోస్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ... డ్రంక్ డ్రైవింగ్‌కు తోడు విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరించిన కేసులో ఆటో డ్రైవర్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

పరారైన డ్రైవర్‌ను గుర్తించేందుకు ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని, అతడిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రమాదాలకు దారి తీసే డ్రంక్ డ్రైవింగ్‌పై పోలీసులు ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి ఘటనలు ప్రజల భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతాయని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపకుండా బాధ్యతగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu