ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్ కు భారీ ఊరట
posted on Jan 5, 2026 12:12PM

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఆ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమంటూ జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.