జనసేన తెలంగాణ కమిటీలు రద్దు
posted on Jan 5, 2026 11:55AM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీసుకునే చర్యలలో భాగంగా ముందుగా రాష్ట్రంలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేయాలని నిర్ణయించారు.
ఆ మేరకు జనసేనాని ఆదేశాల మేరకు తెలంగాణలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సోమవారం (జనవరి 5) అధికారికంగా ప్రకటించారు. రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో పార్టీని పునర్వ్యవస్థీకరించి కేడర్ మరింత చురుకుగా పని చేసేలా స్థానిక నాయకత్వానికి గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.