మదురో కోసం ప్రాణాలొడ్డిన 32 మంది క్యూబన్ కమెండోలు

వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన ఆపరేషన్  32 మంది క్యూబన్ సైనికులు, నిఘా అధికారుల ప్రాణాలు తీసింది. మదురోకు రక్షణగా ఉన్న 32 మంది క్యూబన్ సైనికులు, నిఘా అధికారులు ఆయనను రక్షించేందుకు అమెరికా కమెండోలతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వైమానిక దాడులు, నేల మీద జరిగిన భీకర కాల్పుల వల్ల ఈ మరణాలు సంభవించాయి.  క్యూబన్ సైనికులు, నిఘా అధికారుల మరణాన్ని క్యూబా అధికారికంగా ధృవీకరించింది. ఒక దేశాధినేతను రక్షించే క్రమంలో తమ సైనికులు ప్రాణత్యాగం చేశారని పేర్కొన్న ఆ దేశం సోమ (జనవరి 5; మంగళ(జనవరి 6) వారాలను  దేశవ్యాప్తంగా సంతాప దినాలుగా ప్రకటించింది.
మదురోకు రక్షణగా ఉన్న తమ దేశ భద్రతా దళాలు అమెరికా కమెండోలను చివరి వరకు అడ్డుకున్నాయని వెల్లడించిన క్యూబా, వారు తమ బాధ్యతను అత్యంత గౌరవప్రదంగా, వీరోచితంగా నిర్వహించారని,  ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటంలో, బాంబు దాడుల వల్ల వారు వీరమరణం పొందారని ఒక ప్రకటనలో పేర్కొంది.

మదురో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత భద్రతను క్యూబా పర్యవేక్షిస్తోంది. అయితే దాడి జరిగిన సమయంలో ఎంతమంది క్యూబన్లు అక్కడ ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కరాకస్‌లో అమెరికా ప్రత్యేక బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో 63 ఏళ్ల నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సీలియా ఫ్లోరస్‌ను కూడా బంధించి,  విమానంలో అమెరికాకు తరలించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఒక డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న మదురోను.. సోమవారం రోజు మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో హాజరు పరచనున్నారు.

మదురోపై అమెరికా ప్రధానంగా డ్రగ్స్ స్మగ్లింగ్, ఉగ్రవాదం ఆరోపణలు మోపింది. 2020లో విడుదల చేసిన అభియోగపత్రం ప్రకారం.. మదురో ప్రభుత్వం అమెరికాలోకి వేల టన్నుల కొకైన్‌ను సరఫరా చేసే ముఠాలకు సహకరిస్తోందని అమెరికా వాదిస్తోంది. ఈ నేరాలకు సంబంధించి ఆయనను విచారించేందుకే ఈ అపహరణ ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. అయితే మదురో ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూనే ఉన్నారు.

దశాబ్ద కాలంగా వెనిజులాను ఏలుతున్న మదురో ఇలా అమెరికా జైలు పాలవ్వడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు క్యూబన్ల మరణంతో ఈ వివాదం కేవలం అమెరికా-వెనిజులా మధ్యే కాకుండా క్యూబాతో కూడా దౌత్యపరమైన చిక్కులను తెచ్చిపెట్టింది. నిందితుడిగా కోర్టు ముందుకు వెళ్తున్న మదురోకు మద్దతుగా రష్యా, చైనా వంటి దేశాలు ఎలా స్పందించనున్నాన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu