జోక్యం చేసుకుంటే జోక్ అయిపోతారు!

స్నేహితులు, చుట్టాలు, ఇరుగు పొరుగు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు, సహోద్యోగులు ఇలా మన లైఫ్ లో చాలామంది ఉంటారు. వీళ్ళందరిలో కొందరు కేవలం తెలిసిన వాళ్ళలా ఉండిపోతే మరికొందరు చాలా సన్నిహితులు అవుతారు. దగ్గరితనం వల్లనో లేక వయసులో అవతలి వాళ్ళకంటే  కాస్త పెద్దవాళ్ళం అవడం వల్లనో మొత్తానికి కారణం ఏదైనా వాళ్ళ లైఫ్ లో కొన్ని ముఖ్యమైన విషయాలు, వాటిలో వాళ్ళ సమస్యలు చెప్పి సలహాలు అడుగుతూ ఉంటారు. అయితే విన్నవాళ్ళు తోచిన సలహా ఏదో ఇస్తూ ఉంటారు. మరికొందరు అత్యుత్సాహంతో సాధ్యం కాని సలహాలను సొల్యూషన్ గా సజెస్ట్ చేస్తుంటారు. అయితే ఇలా ఇతరులు అడిగితేనో లేక సాన్నిత్యం ఉందనే అనే కారణంతోనో సలహాలు ఇచ్చేస్తే ఆ తరువాత ఎదుటివారి దృష్టిలో మీ పట్ల ఉన్న అభిప్రాయాలు మారిపోతాయి.

ఎందుకని?

జీవితంలో సమస్యలు, సందేహాలు అనేవి సహజమే. వాటి సొల్యూషన్ కోసం చాలామంది తమకు సన్నిహితులుగా  ఉన్నవారిని అడుగుతూ ఉంటారు. అయితే ప్రతి విషయం ఆ వ్యక్తి మానసిక, ఆర్థిక, సామాజిక స్థితికి తగ్గట్టు ఎక్కువ ప్రభావవంతంగానూ ఉండచ్చు, సాధారణంగానూ ఉండచ్చు. ముఖ్యంగా వాటిని మోసేవాళ్లకే ఆ సమస్యల బరువు వాటి తాలూకూ ఎమోషన్స్ స్పష్టంగా తెలుస్తాయి. కానీ సలహా అడిగారు కదా అని బుర్రకు తోచిన ఐడియా ఇచ్చేస్తే అది ఆచరణలోకి వచ్చేసరికి ఇంకా పెద్ద ప్రాబ్లెమ్ తెచ్చి పెట్టడం లేదా ఏదైనా నష్టాన్ని కలిగించడం వంటి వాటికి కారణం కావచ్చు. అసలే సమస్యతో ఏడుస్తున్నవాళ్లకు పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ ఎదురయ్యే సమస్య ఇంకా ఎక్కువ ఇర్రిటేషన్ తెప్పించి చెత్త సలహా ఇచ్చి సచ్చారు అనే మాట ఇన్నర్ వాయిస్ గా దొర్లిపోతుంది అవతలి వాళ్లకు. 

మరేం చెయ్యాలి?

ఎవరైన ఏదైనా చెప్పుకుని సలహా లేదా సొల్యూషన్ అడిగినప్పుడు అవగాహన గనుక ఉంటే వాళ్ళ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి, దాన్ని అన్ని కోణాల నుండి ఎలా చూడాలి, దానికి కారణం ఏంటి?? దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు వంటి విషయాలను మాత్రం చెప్పాలి. అవన్నీ చెప్పిన తరువాత వాళ్ళకే అర్థం అయిపోతుంది ప్రాబ్లెమ్ లో ఉన్న మెయిన్ రీసన్ ఏంటి దానికి ఏమి చెయ్యాలి అనేది. 

ఫోర్స్ చేయద్దు!

బాగా పరిచయం ఉన్నవాళ్లు, ఎంతో సన్నిహితంగా ఉన్నవాళ్లు వాళ్ళ సమస్యను షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనకు ఎంతో ఇష్టం లేక అభిమానం అయి ఉంటే అలా చేసుకో ఇలా చేసుకో ఇదే కరెక్ట్, ఇలాగైతేనే బాగుంటుంది అంటూ ఒకటే చెప్పేస్తూ ఉంటారు. ఇంకా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటే గనుక చెప్పినట్టు వినూ, తం వేస్ట్ చేసుకోకు, తరువాత లాస్ అవుతావు అని కూడా చెబుతూ ఉంటారు. అయితే ప్రతి మనిషికి సమస్యలో ఉన్నప్పుడు ఒక స్టెప్ వేయడానికి సొంతంగా ఒక క్లీయరెన్స్ అనేది ఎంతో ముఖ్యం. అది లేకుండా వేసే స్టెప్ వల్ల ఎదుటివారిని దానికి బాధ్యులుగా చేసేస్తారు. కాబట్టి ఎవరి సమస్యనూ చేతుల్లోకి తీసుకుని వాళ్ళను ఫోర్స్ చేయద్దు.

తోడుగా ఉండాలి తేడాగా కాదు!

కొందరు సమస్యలు చెప్పినప్పుడు అది ఎంతో సిల్లిగానూ, కామెడిగానూ అనిపిస్తుంది. అలాంటి వాటిని గురించి బాగా నవ్వేసి ఆ తరువాత ఎదో చెత్త సలహా ఒకటి పడేసి వేరే పనుల్లోకి వెళ్లిపోతుంటారు. అయితే సమస్య ఎంతో ఇబ్బంది పెట్టేది అయితే తప్ప మనతో చెప్పుకునేవాళ్ళు అంత ఎమోషన్ అవ్వరు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సమస్యకు సలహా ఇవ్వకపోయినా పర్లేదు కానీ హేళన చేయడం అనేది చాలా తప్పు. దానివల్ల మరింత మానసిక బాధ అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. సమస్యకు సలహా ఇవ్వకపోయినా పర్లేదు కానీ హేళన చేయడం అనేది చాలా తప్పు. దానివల్ల మరింత మానసిక బాధ అనుభవిస్తారు. 

కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే మీరు జోక్ అయిపోతారు.

                                 ◆వెంకటేష్ పువ్వాడ.