పేకాట శిబిరాలపై చర్యల నివేదిక.. డీజీపీకి పవన్ కల్యాణ్ ఆదేశం
posted on Oct 22, 2025 9:21AM

గత వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహించిన పలు చట్ట విరుద్ధ కార్యకలాపాలలో జూదం ఒకటి. రమ్మీ క్లబ్‌లు, పేకాట శిబిరాలు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ నేతలు సహా జూద గృహాలను నిర్వహించారు. నిర్వహిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో తెలుగుదేశం నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరి 18 మాసాలు అయినా కూడా ఈ జూద గృహాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సహా ఈ పేకాట జాడ్యం విస్తరించింది. దీనిపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయానికి పేకాట శిబిరాలు, జూదగృహాలపై పలు ఫిర్యాదులు అందాయి. వివిధ జిల్లాల ప్రజలు పంపిన ఫిర్యాదుల్లో, కొందరు ప్రముఖులు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారీ మామూళ్లు అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, 1974 ప్రకారం జూదం నిర్వహించడం, ఆడడం శిక్షార్హమైన నేరాలు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అక్రమంగా కొనసాగుతున్న పేకాట కేంద్రాలపై ఉప ముఖ్యమంత్రి దృష్ఠి సారించారు. చట్ట విరుద్ధంగా రాష్ట్రంలో సాగుతున్న ఈ పేకాట శిబిరాలు, జూదగృహాలపై ఇప్పటి వరకూ తీసుకున్న చర్యల నివేదిక తనకుసమర్పించాల్సిందిగా పవన్ కల్యాణ్ డీజీపీని ఆదేశించారు.