రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లీస్ అమెరికాలో అరెస్ట్
posted on Oct 16, 2025 2:26PM

ప్రముఖ విదేశాంగ విధాన నిపుణుడు, భారత సంతతికి చెందిన రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లీస్ అమెరికాలో అరెస్ట్ అయ్యారు. యూఎస్‌కు చెందిన రక్షణ రహస్యాలను కలిగిఉండటంతో పాటు చైనా అధికారులతో రహస్య సమావేశాలు జరిపినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధికారులు ఆయన్ను అరెస్టు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
విదేశాంగ విధాన నిపుణుడు, రక్షణ రంగ వ్యూహాకర్త, భారతీయ మూలాలున్న ఆష్లే టెల్లీస్ ను ప్రస్తుతం ఫెడరల్ అధికారులు ప్రశ్నిస్తున్నారని వర్జినియాలోని అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ఇక ఆయన నివాసంలో సైతం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో రహస్య పత్రాలను గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆష్లే టెల్లీస్ వద్ద రక్షణ రంగానికి చెందిన అత్యంత కీలకమైన సమాచారం ఉంచుకోవడం ద్వారా నిబంధనలు అతిక్రమించారని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.
అమెరికా న్యాయవాది లిండ్సే హాలిగన్ ఆష్లేపై ఉన్న అభియోగాలను ప్రకటించారు. వాటి ప్రకారం.. 64 ఏళ్ల ఆష్లే డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌లో కాంట్రాక్టర్‌గా పని చేశారు. 2001 నుంచి ఇందులో పనిచేస్తున్న ఆయన దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇళ్లల్లో అధికారులు సోదాలు చేయగా.. ‘సీక్రెట్’, ‘టాప్ సీక్రెట్’ అని ఉన్న వెయ్యికి పైగా పత్రాలు లభ్యమయ్యాయి.
ఇటీవల ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న తన సహ ఉద్యోగిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్‌లు తనకివ్వమని ఆష్లే అడిగినట్లు ఫెడరల్ అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేసినట్లు తెలిపారు. మరోవైపు.. గత కొన్ని సంవత్సరాలుగా ఆష్లే చైనా ప్రతినిధులతో రహస్య సమావేశాలు జరిపాడని పేర్కొన్నారు. అలా 2022లోనూ 2023 ఏప్రిల్ 11న బీజింగ్ అధికారులతో జరిగిన విందులోను ఆష్లే పాల్గొన్నట్లు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల కూడా ఇలాంటి భేటీయే జరగ్గా... చైనా అధికారుల నుంచి ఆష్లేకు గిఫ్ట్‌గా బ్యాగు లభించిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నదని ఫెడరల్ అధికారులు తెలిపారు. వీటిల్లో ఆయన దోషి అని తేలితే.. 10 ఏళ్ల వరకూ జైలు 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.