నారా లోకేష్ కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?
posted on Sep 29, 2025 3:13PM

దుబాయ్ లో ఆదివారం రాత్రి జరిగిన ఆసియాకప్ ఫైనల్ లో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఆ విజయం కూడా దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుపై. దాదాపు 41 ఏళ్ల తరువాత ఆసియాకప్ ఫైనల్ లో భారత్, పాకిస్థాన్ లు తలపడటం ఇదే తొలిసారి. అటువంటి కీలక మ్యాచ్ లో భారత్ చొమటోడ్చినా కంఫర్ట్ బుల్ గా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వెళ్లినా ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. సరే అది పక్కన పెడితే ఈ విజయంలో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ అత్యంత కీలక పాత్ర పోషించాడు.
తొలి నాలుగు ఓవర్లలోనే అత్యంత కీలకమైన అభిషేక్ వర్మ, శుభమన్ గిల్, స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ ల వికెట్లు కోల్పోవడంతో టీమ్ ఇండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. ఈ టోర్నీలో గ్రూపు దశలోనూ, సూపర్ ఫోర్ లోనూ పాకిస్థాన్ తో రెండు సార్లు తలపడిన టీమ్ ఇండియా ఆ రెండు మ్యాచ్ లలోనూ అలవోకగా గెలిచింది. అయితే కీలకమైన ఫైనల్ లో తడబడుతోందా? అన్న ఆందోళన టీమ్ ఇండియా అభిమానుల్లోనూ వ్యక్తమైంది. అయితే తిలక్ వర్మ మాత్రం పట్టుదలతో ఆడి భారత్ కు అద్భుత విజయాన్ని అందించింది. నంబర్ 4గా బరిలోకి దిగిన తిలక్ వర్మ చివరి వరకూ క్రీజ్ లో నిలిచి, అజేయంగా 69 పరుగులు చేశాడు. జట్టుకు చిరస్మరణీయమనదగ్గ విజయాన్ని అందించాడు. మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు కూడా అందుకున్నాడు.
అటువంటి తిలక్ వర్మ.. ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు.ఇంతకీ తిలక్ వర్మ లోకేష్ కు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే.. అతడి క్యాప్. లోకేష్ అన్నా.. ఇది నీ కోసమే అంటూ తన క్యాప్ పై రాసి సంతకం చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేశారు. దీనిపై నారా లోకేష్ స్పందించారు. తిలక్ వర్మ అభిమానం తనను ముగ్ధుడిని చేసిందంటూ సామాజిక మాధ్యమంలో పేర్కొన్న లోకేష్ ‘తమ్ముడూ.. నీవిచ్చిన ఆ అపురూపమైన బహుమతిని నీ చేతుల మీదుగా అందుకోవాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులూ తెగ వైరల్ అవుతున్నాయి.