మహిళా క్రికెటర్ శ్రీచరణికి భారీ నగదు ప్రోత్సాహకం
posted on Dec 17, 2025 5:11PM

ఉమెన్ వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ క్రికెటర్ శ్రీ చరణికి కూటమి ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆమెకు ఈ చెక్కును అందజేశారు. ఈ నగదు బహుమతితో పాటు విశాఖలో 500 గజాల నివాస స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని శ్రీచరణిని అభినందించారు. క్రీడల్లో మహిళలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండి భరణి, స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ పాల్గొన్నారు.