నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామా
posted on Dec 17, 2025 3:13PM
.webp)
నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి పై అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించి, ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ రూఫ్ కుమార్ యాదవ్ ను మేయర్ చేయాలన్న అధికార పార్టీ పెద్దల కోరిక నెరవేరింది. అయితే అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ ను గద్దె దించాలన్న ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఎందుకంటే.. గురువారం (డిసెంబర్ 18) మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వ్యూహాలు రచించి, క్యాంపు రాజకీయాలు చేపట్టిన అధికార పార్టీ నేతలకు మేయర్ స్రవంతి తన రాజీనామా ద్వారా షాక్ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానానికి ముందే తన పదవికి రాజీనామా చేసిన మేయర్ తన రాజీనామా లేఖనం జిల్లా కలెక్టర్ కు వాట్సప్ ద్వారా పంపారు. దీంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం అటకెక్కింది.
ఇలా ఉంటే.. గంట గంటకు మారుతున్న నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం మేయర్ స్రవంతి పై గురువారం (డిసెంబర్ 18) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో కార్పొరేటర్లు పార్టీలు మారుతూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లలో ఐదుగురిని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. వైసీపీకి ఉన్న కార్పొరేటర్ లను ఒక్కొక్కరిని పార్టీలోకి చేర్చుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో సిటీ నియోజకవర్గంలో మైనార్టీ కార్పొరేటర్ కరిముల్లా మంత్రి నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అది జరిగిన మూడు గంటల్లోనే.. వైసీపీ నగర అధ్యక్షుడు, 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీకి షాక్ ఇచ్చి.. సైకిల్ ఎక్కారు.
దీంతో 54 స్థానాలు కలిగిన నెల్లూరు కార్పొరేషన్ లో.. 41 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. అవిశ్వాసం నెగ్గి మెజారిటీ టిడిపికి ఉండగా.. వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నట్లు ఆ పార్టీ చెబుతోంది. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. శ్రీకాళహస్తి తో పాటు తిరుమల, గోవా పాండిచ్చేరి వంటి ప్రాంతాలలో క్యాంపులు ఏర్పాటు చేశారు. వైసీపీలో ఉన్న 11 మందీ కూడా తెలుగుదేశంకే మద్దతు ఇస్తున్నారు, ఇస్తారు అంటూ అధికార పార్టీ ప్రచారం చేసుకుంటున్న వేళ నెల్లూరు నగర మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు.
2021 నవంబర్ 24న మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన స్రవంతి.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తప్పడుగులు వేశారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి రాజీనామా చేసి.. తెలుగుదేశం గూటికి చేరేందుకు మేయర్ స్రవంతి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆమె రెండు పార్టీలకూ దూరం పాటిస్తూ వచ్చారు. ఈ క్రమంలో నవంబర్ 24న ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. 25వ తేదీన వారందరూ జిల్లా కలెక్టర్ ను కలిసి నోటీసు అందజేశారు. అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. తమ పార్టీకి మేయర్ కి సంబంధం లేదని.. ఆమె ఎప్పుడో వైసీపీకి రాజీనామా చేశారని వెల్లడించారు. దీంతో మేయర్ స్రవంతికి మద్దతు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.
ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ మీటింగ్ నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ క్రమంలో తమకు పూర్తిగా మద్దతు ఉందని సైలెంట్ గా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఐదుగురు కార్పొరేటర్లు తెలుగుదేశంకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం గట్టి షాక్ ఇచ్చింది. దీనిపై మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వైసీపీలో ఉండే కార్పొరేటర్లను ఒక్కొక్కరిగా లాగేయడం మొదలుపెట్టారు. దీంతో వైసిపి షాక్ కు గురైంది. సిటీ నియోజకవర్గంలో ఉండే ముగ్గురు కార్పొరేటర్లను లాగేసేందుకు అధికార పార్టీ స్కెచ్ వేసిన సమయంలోనే తాను మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు స్రవంతి.