లాస్ ఏంజెల్స్ లో సైన్యం మోహరింపును తప్పుపట్టిన అమెరికా కోర్టు
posted on Sep 3, 2025 10:54AM
.webp)
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వానికి ఫెడరల్ కోర్టులో చుక్కెదురైంది. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైన్యాన్ని మోహరించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. కాంగ్రెస్ దేశంలో చట్టాల అమలుకు సైనిక బలగాలను ఉపయోగించడంపై ఉన్న నిషేధ చట్టాన్ని ట్రంప్ సర్కార్ ఉల్లంఘించిందని చీవాట్లు పెట్టింది. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా ఈ ఏడాది జూన్‌లో లాస్ ఏంజెలెస్‌లో జరిగిన నిరసనలను అణచివేయడానికి ట్రంప్ ప్రభుత్వం నేషనల్ గార్డ్ దళాలను, మెరైన్లను మోహరించింది.
అయితే, ఇది 'పోసీ కమిటాటస్ యాక్ట్'ను ఉల్లంఘించడమేనని కోర్టు తీర్పు వెలువరించింది. లాస్ ఏంజిల్స్ లో జరిగినవి నిరసనలు మాత్రమేననీ, తిరుగుబాటు ఎంత మాత్రమూ కాదనీ పేర్కొన్న కోర్టు, ఆ నిరసనలను అదుపు చేయాల్సింది పోలీసులు మాత్రమేననీ స్పష్టం చేసిన కోర్టు.. ఇప్పటికీ అక్కడ నేషనల్ గార్డ్స్ సిబ్బంది మోహరించి ఉండడాన్ని తప్పుపట్టింది. ఈతీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాలిఫోర్నియా గవర్నర్ అయితే ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కోర్టు పరిరక్షించిందని వ్యాక్యానించారు. ఈ తీర్పును వైట్‌హౌస్ వ్యతిరేకించింది. దీనిని ఫెడరల్ అప్పీల్ కోర్టులో సవాల్ చేసింది.