ఏ సమస్యకయినా పరిష్కారం ఒకటే...అదే జగన్ ముఖ్యమంత్రి అవడం!

 

మీ వీధిలో దీపాలు వెలగడం లేదా? మీకు పెన్షన్ సక్రమంగా అందడం లేదా? మీ పంటలకు సక్రమంగా నీళ్ళు అందడం లేదా? మీ అబ్బాయి/అమ్మాయికి ఉద్యోగం దొరకడం లేదా?మీకు ప్రత్యేక హోదా కావాలా? సమస్య ఏదయినా సరే పరిష్కారం ఒకటే..అదే అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం. ఈ సమస్యలకి ఆయన ముఖ్యమంత్రి అవడానికి సంబంధం ఏమిటి అనుకోవద్దు. ఎటువంటి సమస్యలయినా తను ముఖ్యమంత్రి అవగానే తీర్చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. విజయవాడలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించిన తరువాత జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సమస్యకు మళ్ళీ అదే సరయిన పరిష్కారం అన్నట్లు చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మధ్య నిషేధం అమలు చేసేస్తామని అక్కడిక్కడే ప్రకటించేశారు.

 

గుజరాత్ రాష్ట్రంలో చాలా కాలంగా మధ్య నిషేధం అమలులో ఉందని అయినా ఆ రాష్ట్రం దేశంలో నెంబర్: 1 స్థానంలో ఉందని, త్వరలో బిహార్ రాష్ట్రంలో కూడా మధ్య నిషేధం అమలుచేయబోతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారని, అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎందుకు మధ్య నిషేధం అమలుచేయలేకపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. మధ్య నిషేధం అమలు చేసే అవకాశాన్ని ముందుగా తెదేపా ప్రభుత్వానికే వదిలిపెడుతున్నామని, ఒకవేళ తెదేపా అమలుచేయలేకపోయినట్లయితే తరువాత తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించేశారు.

 

మద్యపానం వలన అనేక కుటుంబాలు చిద్రమవుతున్నప్పటికీ, కల్తీ మద్యం వలన అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నప్పటికీ మనకి మద్యం వలన వచ్చే ఆదాయం అవసరమా? అని జగన్ ప్రశ్నించారు. త్వరలో జరుగనున్న శాసనసభ సమావేశాలలో ఈ కల్తీ మద్యం గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ తెలిపారు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం త్రాగినవారికి సానుభూతి తెలిపేందుకు వచ్చేరా లేక తనను ముఖ్యమంత్రిని చేయమని ప్రజలను అడిగేందుకు వచ్చేరా? అని ప్రజలకి సందేహం కలిగితే ఆశ్చర్యమేమీ లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu