ముచ్చటగా ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణకు కసర్తతు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి, సామాజిక సమీకరణలు, ఆయా జిల్లాల్లో టీడీపీ పరిస్థితి, పార్టీ బలోపేతం ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త టీమ్ మెంబర్స్ ను బాబు ఎంపిక చేసుకుంటున్నారు. కొందరు సీనియర్లు, బాబు సన్నిహితులు ఇలా ఎంతోమంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నప్పటికీ వారందరినీ కాదని మూడు కొత్త పేర్లు బయటికొచ్చాయి. ఈ ముగ్గురూ ఎమ్మెల్సీలే కావడం విచిత్రమైతే, అందులో ఒకరు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన లీడర్ కావడం మరో విశేషం.

గత ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన గుమ్మడి సంధ్యారాణిని కేబినెట్ లోకి తీసుకుంటారని వినిపిస్తోంది, ఇటీవలే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన చంద్రబాబు... ఎస్టీ కోటాలో కేబినెట్ లోకి తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి, అరకు పార్లమెంట్ పరధిలో వైసీపీకి పట్టుందని, ముఖ్యంగా ఎస్టీలు గత ఎన్నికల్లో వైసీపీకి పట్టకట్టడంతో, ఆ వర్గాలను దగ్గర చేసుకునే వ్యూహంలో భాగంగానే సంధ్యారాణికి మంత్రి పదవి ఇవ్వాలని డిసైడయినట్లు తెలుస్తోంది.

ఇక తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసిన పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎంఏ షరీఫ్ కు అవకాశమివ్వాలని భావిస్తున్నారట, పశ్చిమ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎంఏ షరీఫ్ కు కూడా కేబినెట్ బెర్త్ ఇవ్వడం ద్వారా ముస్లిం మైనార్టీలను ఆకట్టుకోవాలనేది బాబు ప్లాన్ గా చెబుతున్నారు,  గత ఎన్నికల్లో ముస్లింలు ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారని, అందుకే ముస్లిం జనాభా అధికంగా నియోజకవర్గాల్లో జగన్ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని, షరీఫ్ కి అవకాశం ఇవ్వడం ద్వారా ముస్లింలను కూడా తమవైపు తిప్పుకోవచ్చని ఆలోచిస్తున్నారట.

వైఎస్సార్ కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రకాశం జిల్లాపైనా ఫోకస్ పెట్టిన చంద్రబాబు.... కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నారట, ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల్లో వైసీపీకి మెజార్టీ సభ్యులున్నా, మాగుంటను పోటీకి నిలబెట్టి భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపించుకున్న బాబు... కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా రెడ్డి కమ్యూనిటీకి గాలం వేయాలనుకుంటున్నారు, ప్రకాశం జిల్లాలో వైసీపీకి పట్టుండటం, పైగా రెడ్డి కమ్యూనిటీ ప్రభావం అధికంగా ఉండటంతో మాగుంటను టీమ్ లోకి తీసుకోవాలని బాబు అనుకుంటున్నట్లు సమాచారం, అందుకే టీడీపీ సీనియర్ లీడర్ కరణం బలరామ్ ను సైతం కాదని, ఇటీవల మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారని, ఇప్పుడు ఏకంగా కేబినెట్ లోకి తీసుకునే ఆలోచన చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ ముగ్గురిని ఎంపిక చేసుకోవాలనే ఆలోచన వెనుక భవిష్యత్ వ్యూహం ఉందంటున్నారు, ఏం చేసినా పార్టీ బలోపేతం, 2019లో మళ్లీ విజయమే లక్ష్యంగా కొత్త టీమ్ ఎంపిక ఉంటుందని చెప్పుకుంటున్నారు.