పశ్చిమలో ‘ఫ్యాన్‘ తిరిగే ఛాన్సే లేదా?
posted on Oct 3, 2015 5:55PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పశ్చిమగోదావరి జిల్లాకు ఓ ప్రాముఖ్యత ఉంది, రెండు ఎంపీ, 15 ఎమ్మెల్యే స్థానాలున్నా ఈ జిల్లాలో ఎవరు అత్యధిక సీట్లు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్, నానుడి ఉంది, ఇది గతంలోనూ ఎన్నోసార్లు రుజువైంది కూడా, అదే సంప్రదాయం ప్రకారం 2014 ఎన్నికల్లో టీడీపీ ఏలూరు ఎంపీ, 13 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోగా, మిత్రపక్షమైన బీజేపీ నర్సాపురం ఎంపీతోపాటు రెండు ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది, అప్పటివరకూ మాంచి ఫామ్ లో ఉందని చెప్పుకున్న వైసీపీ మాత్రం ఒక్కచోట కూడా జెండా ఎగరేయలేకపోయింది, దీనికి జగన్ వ్యూహాత్మక తప్పిదాలే కారణం కాగా, జిల్లాలో వైసీపీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ మరో రీజన్.
అయితే గత ఎన్నికల్లో చావుదెబ్బతిన్న పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు, జగన్ చేసిన తప్పిదాలతో 2014లో కోలుకోలేని దెబ్బతింటే, పార్టీని బతికించుకోవాల్సిన నేతలు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు, జిల్లాలో రెండు ఎంపీలు, 15 ఎమ్మెల్యే స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన వైసీపీ... ముందుముందు కూడా జెండా ఎగరేయడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైనా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని, వర్గ విభేదాలతో కొట్టుకుచస్తున్నారని కార్యకర్తలు, జగన్ అభిమానులు వాపోతున్నారు, వర్గ విభేదాల కారణంగా భవిష్యత్ లో పార్టీ కనుమరుగైనా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.
ఇదిలా ఉంటే కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆళ్ల నాని మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరందని, వీళ్లిద్దరికీ అస్సలు పడటం లేదని చెప్పుకుంటున్నారు. కొత్తపల్లి రాకముందు పశ్చిమ వైసీపీకి అంతా తానై వ్యవహరించిన ఆళ్ల నాని... ఇప్పుడు గుర్రుగా ఉన్నాడంటున్నారు, జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కొత్తపల్లితో పలువురికి పొసగడం లేదని, దాంతో చాలామంది నేతలు తెలుగుదేశం వైపు చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి, గత ఎన్నికల్లో ఓడిపోయిన గ్రంథి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వర్రావు లాంటి వాళ్లు తీవ్ర అసంతప్తితో ఉన్నారని, ఏదోఒక పార్టీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమని అంటున్నారు. పవన్ జనసేన పార్టీ యాక్టివ్ అయితే అందులోకి దూకేయడానికి చాలామందికి రెడీగా ఉన్నారని, అలాకానీ పక్షంలో టీడీపీ, బీజేపీల్లో చేరిపోతామని కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారట.
ప్రస్తుతం పశ్చిమలో వైసీపీ పరిస్థితి రెక్కలు విగిరిన ఫ్యాన్ ఉందని, పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే జిల్లాలో జగన్ పార్టీకి నాయకులే కరువవుతారని హెచ్చరిస్తున్నారు.