తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త
posted on Oct 1, 2025 8:37PM

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం), జగిత్యాల జిల్లా - జగిత్యాల రూరల్ మండలం చెల్గల, వనపర్తి జిల్లా - నాగవరం శివారులో ఏర్పాటు చేయనున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( తెలిపారు. గత రెండేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించేందుకు రూ.400 కోట్లతో 832 పీఎం-శ్రీ స్కూల్స్‌ను మంజూరు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు.
దేశవ్యాప్తంగా పీఎం శ్రీ స్కూల్స్ కోసం ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణనే కావడం విశేషమన్నారు. మరోవైపు ఏపీకి కూడ కేంద్ర ప్రభుత్వం నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. శ్రీకాకుళం జిల్లా మంగసముద్రం (చిత్తూరు), బైరుగానిపల్లె (కుప్పం), పలాస (శ్రీకాకుళం), శాఖమూరు (అమరావతి)లో వీటిని ఏర్పాటు చేయనుంది. దీంతో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదలు తెలిపారు.