నితీష్ కుమార్ X ములాయం సింగ్
posted on Sep 22, 2015 9:46PM
.jpg)
నిన్న మొన్నటి వరకు కూడా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ చుట్టూ ప్రదక్షిణాలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన జనతా పరివార్ కు గుడ్ బై చెప్పేసి బయటకి వెళ్ళిపోయినా తరువాత ఇప్పుడు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీతో రహస్య అవగాహన కుదుర్చుకొన్నందునే ఆయన జనతా పరివార్ ని విడిచిపెట్టి వెళ్లిపోయారని విమర్శించారు. ములాయం సింగ్ కూడా నితీష్ పై బాణాలు వేయడం మొదలుపెట్టారు.
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నితీష్ కుమార్ లో నుంచి ఒక సరికొత్త ‘సెక్యులర్ నితీష్’ పుట్టుకొస్తున్నాడని ఆయన ఎద్దేవా చేసారు. ఎందుకంటే అంతకు ముందు నితీష్ కుమార్ ఎన్డీయే కూటమిలో ఉండేవారు. బీజేపీ మద్దతుతో బీహార్ లో ప్రభుత్వం నడిపారు. కానీ ఎన్డీయే నుండి బయటకు వచ్చేసిన తరువాత నుండి బీజేపీకి దూరం అయ్యారు. ఇంతకు ముందు ఏ బీజేపీతో అంతకాగేరో ఇప్పుడు అదే బీజేపీని ఘాటుగా విమర్శిస్తున్నారు. అందుకే సెక్యులర్ నితీష్ పుట్టుకొచ్చాడని ములాయం సింగ్ ఎద్దేవా చేసారు. దానికి నితీష్ కూడా అంతే దీటుగా బదులిచ్చారు.
ములాయం సింగ్ తనేమయినా సెక్యులర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సిలర్ గా భావిస్తున్నారేమో కానీ మేము మాత్రం ఆ యూనివర్సిటీలో రీసర్చ్ స్కాలర్స్ కామని ఆయన గ్రహిస్తే బాగుంటుంది. రెండేళ్ళ క్రితమే నేను బీజేపీతో సంబంధాలు తెంపుకొన్నాను. కనుక ఎన్నికల కోసం నేను సెక్యులర్ వేషాలు కట్టనవసరం లేదు. జనతా పరివార్ ని ఎదుర్కోవడానికి ఆయన సెక్యులర్ వేషం కదతారేమో చూద్దాం,” అని చురకలు వేశారు.
ఇంతకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ కూడా ఇలాగే చాలా ఘాటుగా విమర్శలు చేసుకొనే వారు. కానీ అకస్మాత్తుగా బంధుత్వాలు కూడా కలుపుకొని ప్రాణ స్నేహితుల్లాగా మసులుతున్నారిప్పుడు. కనుక ఎన్నికల తరువాత పరిస్థితులను బట్టి ములాయం సింగ్ తో దోస్తీ చేసినా ఆశ్చర్యం లేదు. కానీ ఎన్నికలు పూర్తయ్యేవరకు బీహార్ ప్రజలను మభ్యపెట్టేందుకు రాజకీయ పార్టీలన్నీ బద్ద శత్రువులలాగే నటించకా తప్పదు...ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోకా తప్పదు.