టీటీడీ వర్సెస్ షర్మిళ....తాజాగా మరో కొత్త వ్యవహారం
posted on Oct 5, 2025 11:08AM

ఈ మధ్య ఏపీసీసీ చీఫ్ షర్మిళతో పెద్ద చిక్కొచ్చి పడింది. ఆమె తన ఉనికి చాటుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరిపైనా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. తాజాగా టీటీడీ విషయంలో ఆమె ఎంత పెద్ద దుమారం చెలరేగేలా చేశారో తెలిసిందే.
దళిత వాడల్లో ఐదు వేల ఆలయాలను నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటిస్తే.. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన షర్మిళ.. బాబు ఆర్ఎస్ఎస్ లో చేరిపోయారా? అంటూ విరుచుకుపడ్డారు. అంతే కాదు దళితులు ఏమైనా ఆలయాలు నిర్మించమని అడిగారా? అంటూ మండిపడ్డారామె.
దీని వెనక నేపథ్యం సంగతి అలా ఉంచితే.. ఇప్పుడు బాబు మరో కొత్త పథకం ప్రవేశ పెట్టారు. టీటీడీ నిర్వహించే ప్రతి ఆలయంలో అచ్చం తిరుమలలోలా నిత్యాన్నదానం ప్రవేశ పెడుతున్నట్టు చెప్పారు. ఇపుడు షర్మిళ దీనిపై కూడా ఏదైనా కామెంట్ చేస్తారో అన్న కామెంట్లు పేలుతున్నాయ్ బీజేపీ వర్గాల వారి నుంచి.
దళిత వాడల్లో ఆలయాల విషయానికి వస్తే.. ఆమె గతంలో తన అన్న జగన్ తో విడిపోవడానికి కారణమే.. ఊరూరా చర్చి నిర్మించాలన్న ప్రతిపాదన చేయడం వల్లేనంటారు కొందరు. ఈ విషయంలో నిజమెంతో తెలీదు కానీ దీన్ని జగన్ ఒప్పుకోలేదనీ.. ఇప్పటికే తనపై హిందూయేతర సీఎంగా ముద్ర పడింది కాబట్టి కుదరదని ఖరాఖండిగా తేల్చి చెప్పారని అంటారు కొందరు వైసీపీ వర్గాల వారు.
అయితే ఇందుకు బలం చేకూర్చుతూ జగన్ తన ఇంటి ఆవరణలోనే వెంకన్న ఆలయ సెట్ వేయించారు. దీంతో జగన్ హిందూ ఓట్లను ఆకర్షించడానికి ఎన్నో పాట్లు పడుతున్నారని అర్ధమైందా టైంలో. అంటే, షర్మిళ జగన్ మధ్య ఇలాంటిదేదో జరిగిందని దీన్ని బట్టీ చెప్పొచ్చంటారు కొందరు.
ఇదిలా ఉంటే, షర్మిళ భర్త బ్రదర్ అనిల్ కుమార్.. మరో లీడ్ ఇచ్చారీ విషయంలో. అదేంటంటే, 2024 ఎన్నికల ముందు విశాఖ వెళ్లిన అనిల్.. క్రిష్టియన్ సమూహాలను ఏకం చేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. మీరెవరూ మా బావ జగన్ కి ఓటు వేయొద్దని వారికి సూచించారాయన.
వీటన్నిటిని బట్టీ చూస్తుంటే.. షర్మిళ తన అన్న జగన్ తో ఇలాంటి మతపరమైన అంశమేదో ప్రతిపాదించారనీ.. అందుకు ఆయన ససేమిరా అన్నారనీ.. ఆ తర్వాత షర్మిళ దంపతులు పార్టీ నుంచి వేరుపడి.. కొత్త పార్టీ పెట్టి, దాన్ని కాంగ్రెస్ లో కలిపి.. ఏపీకి పీసీసీ చీఫ్ గా వచ్చారని అంచనా వేస్తారు కొందరు. మొన్న కూడా ఆమె ఆర్ఎస్ఎస్ భావజాలానికి చెందిన ఉపరాష్ట్రపతి అభ్యర్ధి రాధాకృష్ణన్ కి జగన్ తన ఎంపీల చేత ఓట్లు వేయించడాన్ని సైతం తప్పు పట్టారామె.
ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే.. తన అన్న జగన్ తో సహా సీఎం చంద్రబాబు వరకూ అందర్నీ మతపరంగా ఆక్షేపణలు చేస్తోన్న షర్మిళ అసలు గుట్టు మొత్తం ఈ మతమనే వ్యవహారం చుట్టూ అల్లుకుని కనిపిస్తుంది మనకు. ఆమె వైవాహిక బంధమే మతపరమైన కోణంలో జరిగింది.
అలాంటి షర్మిళ మతం మీద ఈ విధంగా విరుచుకుపడ్డమేంటన్నది కొందరు సంధించే ప్రశ్నాస్త్రం. తాజాగా టీటీడీ ఆలయాల్లో అన్నదానంపైనా ఆమె ఎలా రియాక్టవుతారో అన్న ప్రశ్న తలెత్తుతోంది. వారేమైనా మిమ్మల్ని అన్నదానం చేయమని అడిగారా? అని ఆమె ఎక్కడ అంటారేమో అన్న ఛలోక్తులు విసురుతున్నారు కొందరు నెటిజన్లు.