ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
posted on Oct 3, 2025 6:27PM

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినేట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేల ఆర్థిక సాయం అందించే పథకాన్ని రేపు ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
కారవాన్ పర్యాటకానికి, అమృత్ పథకం 2.0 పనులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కుష్ఠు వ్యాధి పదం తొలగించేందుకు వీలుగా చట్టసవరణ చేయాలని నిర్ణయించింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.