పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ వన్.. పారిశ్రామిక ప్రగతిలోనూ గణనీయ పురోగతి
posted on Jan 3, 2026 10:22AM

దేశంలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన సంవత్సరంలో దేశంలో నమోదైన మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా పాతిక శాతానికి మించి ఉంది. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కూడా గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు.
గడిచిన ఏడాదిలో దేశం మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా 25.3 శాతమని పేర్కొన్నా ఆయన ఇది దేశంలో ఏ ఇతర రాష్ట్రం కన్నా అధికమని పేర్కొన్నారు. ఇక పారిశ్రామిక ప్రగతి విషయంలో ఏపీ ఒడిషా, మహారాష్ట్రాలను దాటి ముందంజలో ఉందన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుసరించిన విధానాలు, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఎట్మాస్ఫియర్ కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయనీ, రానున్న రోజులలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయనీ లోకేష్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
తన ట్వీట్ కు దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందంటూ ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కథనాన్ని ట్యాగ్ చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా ఏపీ దక్కించు కోగా, ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో 13.1 శాతం వాటాతో ఒడిశా రెండో స్థానంలో 12.8 శాతం వాటాతో మహారాష్ట్ర మూడో స్థానంలోనూ నిలిచింది. ఈ మూడు రాష్ట్రాలూ కలిసి దేశ వ్యాప్తంగా పెట్టుబడులలో 51.2 శాతం వాటా దక్కించుకున్నాయి.