అమరావతి నిర్మాణానికి కేంద్రం వాటా రూ. 27,097 కోట్లు మాత్రమే!

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సుమారు 1.25 లక్షల కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేస్తుంటే, కేంద్రప్రభుత్వం కేవలం రూ.27,097 కోట్లు ఉంటే సరిపోతుందని ప్రకటించింది. రాజధాని నిర్మాణం వ్యయం అంచనా వేసేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన ఆధారంగా కేంద్ర మంత్రి హెచ్.పి.చౌదరి లోక్ సభలో ఈ ప్రకటన చేసారు. ఆ నివేదిక ప్రకారం రాజధానిలో భవనాల నిర్మాణానికి రూ. 10,519 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.1,563 కోట్లు అవసరమని ప్రకటించారు.

 

రాజధాని నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం ఇంతవరకు రూ.1850 కోట్లు విడుదల చేసింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మరో రూ.25, 247 కోట్లు విడుదల చేస్తే సరిపోతుంది. కేంద్రప్రభుత్వం మొదటి నుండి కూడా రాజధాని ప్రధాన నగర నిర్మాణానికి, దానిలో సచివాలయం, శాసనసభ, రాజ్ భవన్, హైకోర్టు తదితర భవనాల నిర్మాణానికి మాత్రమే నిధులు మంజూరు చేస్తానని చెపుతోంది. కనుక ఆ లెక్క ప్రకారమే అంచనాలు వేసి రాజధాని నిర్మాణం కోసం తను ఇవ్వబోయే మొత్తం ఎంతనే విషయంపై నేడు పార్లమెంటులో స్పష్టత ఇచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. ఇంతవరకు విడుదల చేసిన డబ్బు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు ఖర్చు చేసినట్లు, అందుకు కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చేయి. ఒకవేళ ఆ వార్తలు నిజమనుకొంటే, ఖర్చయిపోయిన ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించుకోవలసి ఉంటుంది.

 

రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్న లెక్కలకి, కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిదులకి ఎక్కడా పొంతన లేదు. ఇది ముందుగానే గ్రహించినందునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిని “స్విస్ ఛాలంజ్” పద్దతిలో నిర్మించభోతున్నట్లు ప్రకటించారు. ఆ విధానంలో రాజధాని నిర్మాణంలో పాలుపంచుకొనే విదేశీ సంస్థలే పెట్టుబడులు పెడతాయి. అందుకు ప్రతిఫలంగా వాటికి రాజధానిలో వాణిజ్య స్థలాలు లేదా అవి నిర్మించి ఇస్తున్న భవనాలలో దీర్ఘ కాలం లీజు క్రింద ఇస్తారు. తద్వారా కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వకపోయినా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ వినూత్నమయిన ఆలోచన రాష్ట్రానికి మేలే చేస్తుందో లేక నష్టపోవలసి వస్తుందో కాలమే చెప్పాలి.

 

ఏమయినప్పటికీ చంద్రబాబు నాయుడు కలలు కంటున్నా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అయితే బహుశః అందులో సామాన్య ప్రజలకు చోటు ఉండక పోవచ్చును. ఎందుకంటే అత్యుత్తమ, అత్యాధునిక సౌకర్యాలు, సదుపాయాలు, హంగులు ఆర్భాటాలు కల్పిస్తునప్పుడు దానికి అక్కడ నివసిస్తున్నవారు చాలా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. కనుక కేవలం లక్షాధికారులు, కోటీశ్వరులకు మాత్రమే రాజధానిలో నివసించే యోగ్యత కలిగి ఉంటారేమో? ఏమో? ఈ సందేహానికి కాలమే సమాధానం చెపుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu