ఎందుకీ భజన రాజేంద్ర ప్రసాద్?

 

ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ నేతలు చేసిన సోనియా, రాహుల్ గాంధీల భజనలతో ప్రజల చెవులు చిల్లులు పడ్డాయి. ఇప్పుడు ఆ వారసత్వ భజన కార్యక్రమాన్ని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అందిపుచ్చుకొన్నట్లున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఆయన కుమారుడు నారా లోకేష్ కి భజన చేసేస్తున్నారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతారని, నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఆ నోటితోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి రాష్ట్రపతి పదవి కేటాయించేసారు.

 

అంతవరకు బాగానే ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడి తనేమీ పదవిలో నుండి తప్పుకొంటానని ప్రకటించలేదు. పైగా చంద్రబాబు నాయుడు తనకి జాతీయ స్థాయి రాజకీయాలలో పాల్గొనే ఆసక్తి లేదని ప్రకటించారు. మరి అటువంటప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఈవిధంగా మాట్లాడటం వలన ప్రయోజనం ఏమిటి? దీనిని బీజేపీ నేతలు ఏ విధంగా స్వీకరించాలి?

 

ఇక నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకోవడం వలన కూడా ఏమీ ప్రయోజనం ఉండబోదు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు, బలాబలాలు ఎలాగా ఉంటాయో, అప్పటికి రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైకాపా భారీ మెజార్టీతో గెలుస్తుందని, తనే ముఖ్యమంత్రి అవుతానని జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా నమ్మారు. కానీ చివరికి ఏమయిందో అందరికీ తెలుసు. మళ్ళీ వచ్చే ఎన్నికలలో తమ పార్టీయే గెలిచి అధికారంలోకి రాబోతోందని జగన్మోహన్ రెడ్డి కూడా జోస్యం చెప్పుకొంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కలలు కంటోంది.

 

కనుక తెదేపా నేతలు భవిష్యత్ గురించి కలలు కనే ముందు వర్తమానంలో దాని కోసం ఏమి చేస్తున్నాము? ఇంకా ఏమేమీ చేయాల్సి ఉంది? అని ఆలోచించి అందుకు అనుగుణంగా పనిచేసుకుపోతే కలలు నిజమవుతాయి. లేకుంటే అవి పగటి కలలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu