గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు.. అల్లు అర్జున్ పై పవన్ కల్యాణ్ విసుర్లు
posted on Dec 30, 2024 1:37PM

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా జరుగుతున్న చర్చ ఏదైనా ఉందంటే అది పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు, మధ్యంతర బెయిలు, తెలంగాణ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల చర్చ అంశాలపైనే. కాగా ఈ అంశంపై తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఎలాంటి భేషజాలకూ పోకుండా ఈ సంఘటనపై ఆయన స్పందన చాలా ముక్కుసూటిగా ఉంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు సంబంధించి ఆయన ఎవరినీ బాధ్యులను చేయలేదు. అదే సమయంలో ఎవరికీ మద్దతుగా మాట్లాడలేదు. కానీ స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఈ విషయంలో అల్లు అర్జున్ తీరును ఆయన తప్పుపట్టారు. సరిగా స్పందించడంలో విఫలమై అల్లు అర్జున్ గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మరణించడం, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొన్న పవన్ కల్యాణ్.. సంఘటన జరిగిన తరువాత అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని తప్పుపట్టారు. అల్లు అర్జున్ లేదా ఆయన ప్రతినిథులు ఎవరో ఒకరు వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చి ఉండాల్సిందన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరును పవన్ కల్యాణ్ మెచ్చుకున్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు వంటివి పరిశ్రమను ప్రోత్సహించడానికి దోహదపడతాయేమో కానీ.. అలా ప్రోత్సహించడం కోసం శాతి భద్రతల విషయంలో రాజీ పడటం సరైనది కాదనీ, అందుకే రేవంత్ వ్యవహరించిన తీరు నిష్పాక్షికంగా ఉందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని రేవంత్ చాటారనీ, హీరోలైనంత మాత్రాన వారేం పైనుంచి దిగి రాలేదని రేవంత్ నిరూపించారని చెప్పారు.
చిరంజీవి కూడా అభిమానులతో కలిసి సినిమా ప్రదర్శనలు చూసేవారనీ, అయితే ఆయన చాలా సాదా సీదాగా, ఎవరి కంటా పడకుండా థియేటర్ కు వెళ్లేవారని వివరించిన పవన్ కల్యాణ్.. అల్లు అర్జున్ ఆర్భాటంగా సంధ్యా థియేటర్ కు రోడ్ షో చేస్తూ వెళ్లడమే తొక్కిసలాటకు కారణంగా కనిపిస్తోందన్నారు. సంఘటన జరిగిన తరువాత అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు సమస్యను పెద్దది చేసిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుపై చంద్రబాబు సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ ఒక్క సారిగా జోరందుకుంది. అలాగే నిర్మాత దిల్ రాజు ఆహ్వానం మేరకు ఆయన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెడతారా అన్న చర్చ కూడా మొదలైంది. ఒక సమయంలో ఆయన బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంపు వంటివి సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు దోహదపడతాయని, అలాగే శాంతి భద్రతల విషయంలో రాజీ కూడదని అనడంతో కొన్ని షరతులతో ఏపీ సర్కార్ సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని పరిశీలకులు అంటున్నారు.