అర్ధనగ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడు.. ఫియాన్స్‌పై నటి కంప్లయింట్!
తమిళ తార జెన్నిఫర్ (24) తన ఫియాన్స్ నవీన్ కుమార్‌పై పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. నవీన్‌తో పాటు అతని తండ్రి ఉదయకుమార్, చిట్టిబాబు అనే పోలీసుపై కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఇటీవల తన మొదటి పెళ్లిని దాచిపెట్టి తనతో పెళ్లికి సిద్ధమయ్యిందంటూ నవీన్ కుమార్ ఆరోపించడంతో జెన్నిఫర్ వార్తల్లోకి ఎక్కారు. నవీన్‌పై తాను చేసిన ఫిర్యాదు తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు.
శరవణన్‌తో తనకు ఇదివరకే పెళ్లయి, విడాకులు తీసుకొనే ప్రాసెస్‌లో ఉన్నామని తెలిసే పెళ్లి చేసుకుందామని నవీన్ తనకు ప్రపోజ్ చేశాడని జెన్నిఫర్ వెల్లడించారు. అప్పట్నుంచీ తామిద్దరం సహజీవనం చేస్తున్నామన్నారు. నవీన్‌కు అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగం పోవడంతో తన నగలు తాకట్టుపెట్టి అతడికి రూ. 2 లక్షలు ఇచ్చాననీ, అతను తరచుగా డబ్బులు డిమాండ్ చేస్తూ రావడంతో సమస్యలు మొదలయ్యాయనీ ఆమె చెప్పారు.
తాము పాండిచ్చేరిలో ఉండగా, మార్చి 25న నవీన్ తనపై దౌర్జన్యం చేశాడనీ, దీనిపై అతని తల్లిదండ్రులకు కంప్లయింట్ చేస్తే, అతనితో మాట్లాడి స్నేహపూర్వకంగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. ఆ తర్వాత కూడా ఏప్రిల్ 14న నవీన్ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడనీ, తాను ఇవ్వనని చెప్పడంతో, తన డ్రస్ చింపి, అర్ధనగ్నంగా ఉన్న తన వీడియోలు తీసి, వాటిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడనీ ఆమె ఆరోపించారు. నవీన్ వ్యవహారం గురించి చెప్పినా అతని తల్లిదండ్రులు పట్టించుకోలేదనీ, అతడిని వెనకేసుకొచ్చారని కూడా ఆమె ఆరోపించారు.
తాను రాజీపడేందుకు ఒప్పుకోకపోవడంతో ఏప్రిల్ 18న నవీన్‌తో పాటు పోలీసైన అతని తండ్రి, అతని ఫ్రెండ్స్ తనను, తన తండ్రినీ, తన సోదరినీ వేధించారనీ, దీనిపై తాను చేసిన ఫిర్యాదును పోలీస్ స్టేషన్‌లో తీసుకోలేదనీ ఆమె ఆరోపించారు. నవీన్‌నీ, అతని తండ్రినీ కాపాడ్డానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారనీ, పైగా వ్యభిచారం కేసులో తనను ఇరికిస్తామని బెదిరిస్తున్నారనీ ఆమె తెలిపారు.
చివరకు కమిషనర్ ఆఫీస్‌లో తన కంప్లయింట్ తీసుకున్నారని వెల్లడించిన ఆమె, మరో చిత్ర (డిసెంబర్ 6న ఆత్మహత్య చేసుకున్న తమిళ టీవీ నటి) లాగా తాను కాదలచుకోలేదననీ, అందుకే అన్ని అడ్డంకుల్నీ ఎదుర్కొంటూ తన సమస్యను బయటకు వినిపిస్తున్నానీ ఆమె అన్నారు. సెంబరుతి అనే సీరియల్‌తో పాపులర్ అయిన జెన్నిఫర్, ప్రస్తుతం వానదై పోల అనే సీరియల్ చేస్తున్నారు.