న‌వ్య స్వామితో సుధీర్ పెళ్లి! వీడియో వైర‌ల్‌!!

  బుల్లితెరపై ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సుడిగాలి సుధీర్ ఒకరని చెప్పాలి. ఆయన పెళ్లి మ్యాటర్ ఎప్పటినుండో వైరల్ అవుతోంది. 'జబర్దస్త్' యాంకర్ రష్మీ గౌత‌మ్‌తో సుధీర్ లవ్ ఎఫైర్ నడిపిస్తున్నారని మీడియాలో చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజం లేదని ఎప్పటికప్పుడు ఈ జంట క్లారిటీ ఇస్తూనే ఉంది. అయితే గతంలో ఓ షోలో భాగంగా సుధీర్, రష్మీలకు రీల్ పెళ్లి చేసేశారు. ఇప్పుడు మరోసారి సుధీర్ కి పెళ్లి చేయడం హాట్ టాపిక్ గా మారింది.  బుల్లితెరపై ప్రసారమవుతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి సుధీర్ గా హోస్ట్ గా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ షోలో కమెడియన్స్ సరికొత్త కాన్సెప్ట్ లను ఎన్నుకొని ప్రేక్షకులను నవ్విస్తున్నారు. తాజాగా 'జంబలకడిపంబ' కాన్సెప్ట్ తీసుకొని ఎంటర్టైన్ చేశారు. అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా.. జంబలకడిపంబ స్టైల్‌తో సాగే ఈ స్కిట్‌ లో సుధీర్ కి సీరియల్ నటి నవ్య స్వామితో పెళ్లి చేసేశారు.  ముందుగా పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అబ్బాయి గెటప్ లో రోహిణి  'ఏమైనా పాటలొచ్చా' అని సుధీర్‌ని అడగగా.. 'కనపడిన ప్రతీ ఒక్కరిని అడిగా.. అడిగా అని అడుగుతూనే ఉండేవాడు' అంటూ ఇమ్మాన్యుయేల్ పంచ్ వేశాడు. ఆ తరువాత ఈ స్కిట్‌లో ఆటో రామ్‌ప్రసాద్‌, హైపర్‌ ఆది డైల్సాగ్స్‌తో నవ్వించారు. అనంతరం అబ్బాయిలాగా డ్ర‌స్ చేసుకున్న న‌వ్య పెళ్లికూతురుగా ఎంట‌రైంది. "ఈవిడేనా పాపా?" అన‌డిగాడు సుధీర్‌. "ఫ‌ర్లేదు.. అబ్బాయి బాగానే ఉన్నాడు" అంది న‌వ్య‌. "పెళ్లికొడుకును ఏదైనా అడిగేదుంటే ముందే అడుగు" అని న‌వ్య‌తో చెప్పింది రోహిణి. "అడిగేదేముంది.. కోడిన‌డిగి మ‌సాలా నూర‌తామా" అని న‌వ్య అన‌డంతో ఆది బ్యాచ్ షాకైపోయింది. ఆ త‌ర్వాత‌ సుధీర్ కి, న‌వ్య‌కు పెళ్లి చేసేశారు. న‌వ్య త‌లెత్తుకొని సుధీర్ మెడ‌లో దండ వేస్తే, సుధీర్ త‌ల‌దించుకొని దండ‌ను న‌వ్య చేతికి ఇవ్వ‌గా, ఆమే దాన్ని త‌న మెడ‌లో వేసుకుంది. ప్రస్తుతం ఈ స్కిట్ కు యూట్యూబ్ లో మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.  

వివాదంపై హైపర్ ఆది క్లారిఫికేష‌న్‌!

  'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైపర్ ఆది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచాడని.. క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆది వివాదంలో చిక్కుకున్నాడు. దీనిపై స్పందించిన ఆయన తను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని.. స్క్రిప్ట్ తను రాసింది కాదని.. తను కేవలం ఆర్టిస్ట్ మాత్రమేనని అన్నాడు.  తెలంగాణ ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా భావించే బతుకమ్మ పండగ నేపథ్యంలో ఆది ఇటీవల చేసిన స్కిట్ ఇప్పుడు వివాదాలను తీసుకొచ్చింది. ఆదివారం నాడు జరిగిన ఓ షోలో ఈ స్కిట్ ప్రసారమైంది. అందులో "ఉయ్యాలో ఉయ్యాలో.." అంటూ బతుకమ్మ పాట పాడుతూ కమెడియన్లు అందరూ చుట్టూ తిరిగే దృశ్యం ఉంది. బతుకమ్మ పాట మీద కామెడీ చేస్తూ ఈ సన్నివేశాలను నడిపించారు. ఇది తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్లకు ఆగ్రహం తెప్పించింది. తెలంగాణ గ్రామదేవతల పండుగలను, ఇక్కడి ప్రజల యాస భాషలను కించపరిచేలా ఈ స్కిట్ ఉందని, హైపర్ ఆదితో పాటు ఈ స్కిట్ రైటర్, దీన్ని ప్రొడ్యూస్ చేసిన మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ మీద చర్యలు చేపట్టాలని కోరుతూ హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదైనట్లు తెలియగానే  సదరు ఎపిసోడ్‌ను నిర్వాహకులు యూట్యూబ్‌ నుంచి తొలగించారు. 

''దూరంగా ఉంటూ.. కలలు కనేద్దాం"!

  బుల్లితెరపై యాంకర్ ఝాన్సీ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో తెలిసిందే. అలానే సినిమాల్లో కూడా ఏ పాత్ర చేసినా త‌న‌దైన ముద్ర వేస్తుంటారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అందరిలానే ఝాన్సీ కూడా ఇంటిపట్టునే ఉంటున్నారు. షూటింగులన్నీ ఆగిపోవడంతో చాలా మంది సినీ కార్మికులు రోడ్డున పడుతున్నారు. దీంతో కొందరు సెలబ్రిటీలు ముందుకొచ్చి వారికి సాయం అందిస్తున్నారు.  ఇదిలా ఉండగా.. ఇటీవల కరోనాను విపరీతంగా ద్వేషిస్తున్నానంటూ ఝాన్సీ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా తన బంధువుల పెళ్లికి హాజరు కాలేకపోయానని.. పెళ్లిని కూడా ఆన్లైన్ లో చూసుకోవాల్సి వచ్చిందనీ తెలిపారు. తాజాగా ఆమె మరో పోస్ట్ పెట్టారు. మామూలుగా అయితే సెలబ్రిటీలు షూటింగ్ ల కోసం, అలానే ట్రిప్ ల కోసం వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వెళ్లడం కుదరడం లేదు. దీన్నే సెటైరికల్ గా చెప్పారు ఝాన్సీ.  ''మళ్ళీ త్వరలో ఇలా ట్రావెల్ చేసే రోజులు వస్తే బాగుండు.. అంతా మన చేతుల్లోనే ఉందంట ... తొందరగా వాక్సిన్ వేయించేసుకోండి. అప్పటి వరకు మాస్కేసుకుని... దూరంగా ఉంటూ.. కలలు కనేద్దాం. ( వాటిని ఎవరూ ఆపలేరుగా )'' అంటూ ఇన్స్టాగ్రామ్ లో తన ట్రావెల్ ఫోటోని షేర్ చేసి రాసుకొచ్చారు. ఝాన్సీ చివరిగా 'మన్మథుడు 2' సినిమాలో కనిపించారు. 

యాంకర్‌గా ఛాన్స్ కొట్టేసిన మోనాల్!

  చాలా కాలం క్రితం హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మోనాల్. 'సుడిగాడు', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' వంటి సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. కానీ ఆమెకి సరైన గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసింది. గతేడాది బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ షోతో అమ్మడుకి క్రేజ్ బాగా పెరిగింది. తన గ్లామర్ తో చాలా మందిని ఆకట్టుకుంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు లవ్ ట్రాక్ లతో వార్తల్లో నిలిచింది.  హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలు అంటూ బిజీగా గడుపుతోంది. 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించిన ఈ బ్యూటీ బులితెరపై 'డాన్స్ ప్లస్' షోలో జడ్జిగా కనిపించింది. ఈ షో పూర్తి కావడంతో స్టార్ మా ఛానెల్ మోనాల్ కి మరో ఆఫర్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ ఛానెల్ లో ఓ కామెడీ షోని మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.  ఈ షోకి మోనాల్ ను యాంకర్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పై ఆమె సంతకం కూడా పెట్టేసిందట. ఎంతో గ్రాండ్ గా ఈ షోని డిజైన్ చేస్తున్నారని.. ఇందులో చాలా మంది పేరున్న కమెడియన్లు భాగం కానున్నారని స‌మాచారం. అందుకే మోనాల్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. యాంకర్ గా మోనాల్ గనుక క్లిక్ అయితే ఆమెకి బుల్లితెరపై మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. 

నిద్రలోనే చనిపోతాననుకున్నా.. నా చెల్లెలు వ‌చ్చి సేవ‌లు చేసింది!!

  'జబర్దస్త్' కామెడీ షోతో గత ఎనిమిదేళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్నాడు అదిరే అభి. తన కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేసిన అభి.. ఆ తరువాత యాంకర్ గా కొన్ని షోలు చేశాడు. అతడికి మంచి పేరు రావడంతో సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. కొన్నాళ్లుగా ఆయన బుల్లితెరకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో 'జబర్దస్త్' షోలో తన కామెడీ స్కిట్ లతో ఆకట్టుకుంటున్నాడు. మిగిలిన వారి స్కిట్ లలో బూతులు దొర్లినా.. అదిరే అభి మాత్రం క్లీన్ కామెడీతో మెప్పిస్తుంటాడు.  ఎప్పుడూ నవ్వుతూ కనిపించే కమెడియన్లు కూడా నిజ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఆ విషయాలను బయటపెడుతుంటారు. అభి కూడా తన జీవితంలో ఓ మర్చిపోలేని అనుభవం గురించి ఓ షోలో చెప్పుకొచ్చాడు. సుమ యాంకర్ గా ప్రముఖ ఛానెల్ లో 'క్యాష్' షో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోలోకి సెలబ్రిటీ అన్నా, చెల్లెళ్లను అతిథులుగా తీసుకొచ్చారు.  మహేష్ విట్టా, రోల్ రైడా, అదిరే అభి తమ చెల్లెళ్లతో రాగా.. బిగ్ బాస్ హిమజ తన తమ్ముడిని తీసుకొచ్చింది. వీరందరూ కలిసి షోని చాలా ఎంటర్టైనింగ్ గా మలిచారు. ఇదే సమయంలో అభి తను నిద్రలోనే చనిపోతాననుకున్నానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. తనకు కరోనా సోకిందని.. అప్పుడు చనిపోతాననే భయంతో రాత్రిపూట తన రూమ్ గొళ్లెం పెట్టకుండా పడుకునేవాడ్నని చెప్పుకొచ్చారు. నిద్రలో ఏదైనా జరిగితే తనను చూడ్డం కుదరదని అలా చేసేవాడినని కంటతడి పెట్టుకున్నారు. ఆ సమయంలో తన చెల్లెలు దుబాయ్ నుండి వచ్చి తనకు సేవలు చేసిందని చెప్పుకొచ్చారు.

ఆ సీరియ‌ల్‌కు రాశి రెమ్యూనరేషన్ ఇదే!

  ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన తెలుగ‌మ్మాయి రాశి.. ఒకానొక దశలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోల‌తో వెండితెరపై రొమాన్స్ చేసిన రాశి 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. అగ్ర దర్శకులు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారంటే ఆమె పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.  'నిజం' సినిమాలో ఆమె నెగ‌టివ్ రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే. ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ కు ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదురయ్యాయి. ఆ పాత్ర పోషించినందుకు రాశి ఇప్పటికీ రిగ్రెట్ అవుతుంటుంది. ఇక పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన రాశి.. మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మాటీవీలో ప్రసారమవుతున్న 'జానకి కలగనలేదు' అనే సీరియల్ లో హీరో త‌ల్లి జ్ఞానాంబగా అలరిస్తోంది.  ప్రస్తుతం ఈ సీరియల్ కు మంచి రేటింగులే వస్తున్నాయి. రాశి పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రాశికి అభిమానూలు బ్రహ్మరథం పడుతున్నారు. తన నటనతో అలరిస్తున్న రాశి ఈ సీరియల్ కోసం మంచి రెమ్యూనరేషనే తీసుకుంటోంది. ఆమెకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని వారానికి లక్ష రూపాయల చొప్పున తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇటీవల ఆర్థిక‌ ఇబ్బందుల వలనే రాశి సీరియల్ లో నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ ప్ర‌చారాన్ని రాశి ఖండించింది. 

హైపర్‌ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు

కమెడియన్‌ హైపర్‌ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ టీవీ కార్యక్రమంలో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ భాషను కించపరిచే విధంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్, నిర్మాణ సంస్థ మల్లెమాల ప్రొడక్షన్‌ పై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు.  బుల్లితెరపై తన కామెడి టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది.. డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, హద్దుమీరిన కామెడీతో అప్పుడప్పుడు విమర్శల పాలవుతున్నాడు. గతంలో కూడా ఆదిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు అందాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా టీవీ షోలో ఆది ఓ స్కిట్ చేశారని ఆరోపిస్తూ.. పలువురు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.  ఇప్పుడు తాజాగా ఆది తెలంగాణ భాషను, దేవతలను కించపరిచారు అంటూ ఫిర్యాదు నమోదైంది. మరి దీనిపై ఆది ఏం వివరణ ఇస్తారో చూడాలి.

"ఎంత ప‌నిచేశావ్ డాక్ట‌ర్ బాబు?".. వెన్నెల కిశోర్ కూడా 'కార్తీక‌దీపం' ఫ్యాన్‌!

  'కార్తీకదీపం' సీరియల్ గురించి తెలియని తెలుగు వారుండరు. బుల్లితెరపై ఈ సీరియల్ ఓ సంచలనం. ఇప్పటివరకు ఏ సీరియల్ కూడా దీన్ని బీట్ చేయలేకపోతోంది. టీఆర్పీలో ఈ సీరియల్ ఎప్పుడు టాప్ ప్లేస్ లోనే ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సీరియల్ హాట్ టాపిక్ అవుతుంటుంది. సెలబ్రిటీలు సైతం అప్పుడప్పుడు ఈ సీరియల్ గురించి మాట్లాడుతుంటారు. మొన్నామధ్య లక్ష్మీ మంచు 'కార్తీకదీపం' సీరియల్ ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసింది.  అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కమెడియన్ వెన్నెల కిశోర్ అప్పుడప్పుడు ఈ సీరియల్ మీద సెటైర్లు వేస్తుంటారు. రీసెంట్ గా డాక్టర్ బాబు, వంటలక్క మీద వెన్నెల కిశోర్ వేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. "అంత మంచి డాక్టర్ బాబుకి అంత మంచి వంటలక్క అంటే ఎందుకంత కోపం?" అని ట్వీట్ చేశారు. అది కాస్తా నెట్టింట్లో వెైరల్ అయింది. ఇప్పుడు 'కార్తీకదీపం' సీరియల్ మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. మోనితా కడుపుతో ఉన్నానని.. దానికి కారణం కార్తీక్ అని చెప్పడంతో అందరూ డాక్టర్ బాబునే టార్గెట్ చేస్తున్నారు. దీనిపై రకరకాల మీమ్స్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాటిలో ఒక మీమ్ ను వెన్నెల కిశోర్ పోస్ట్ చేశారు.  "ఎంత పని చేశావ్ డాక్టర్ బాబు?" అంటూ బ్రహ్మానందం స్టైల్లో ఉన్న మీమ్‌ను వెన్నెల కిశోర్ షేర్ చేయగా దాన్ని నిరుపమ్ తన ఇన్ స్టాలో స్టోరీలో పెట్టుకున్నాడు. 

'జాన‌కి క‌ల‌గ‌న‌లేదు' హీరో బ్రేక‌ప్ స్టోరీ!

  'జానకి కలగనలేదు' సీరియల్ లో హీరోగా నటిస్తోన్న అమర్ దీప్ చౌదరి తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు 60 ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అమర్ దీప్. ఈ క్రమంలో తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పి యూత్ కి ఓ మెసేజ్ ఇచ్చాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పిన అమర్ తన లైఫ్ లో కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందని చెప్పాడు.  లవ్ ఫెయిల్యూర్ అంటే ఇద్దరిలోనూ మిస్టేక్ ఉంటుందని... లవ్ ఫెయిల్ అయ్యిందని.. హ్యాండ్ ఇచ్చిందని పగలు కోపాలు పెంచుకోవడం లాంటివి కరెక్ట్ కాదని అన్నాడు. కానీ.. లవ్‌లో ఫేక్ ప్రామిస్‌లు ఉండకూడదని.. వాళ్లలో లేనిపోని ఆశల్ని కలిగించకూడదని చెప్పాడు. అప్పటి వరకు కలిసి ఉండి ఆ తర్వాత హ్యాండ్ ఇస్తే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తట్టుకోలేరని.. వీక్ హార్ట్ అయితే చచ్చిపోతాడు.. లేదంటే చంపేస్తాడని చెప్పుకొచ్చాడు.  ఏడిస్తే అమ్మాయి తిరిగి వస్తుందనుకుంటే.. ఎన్నాళ్లైనా ఏడవవ‌చ్చని, కానీ రాదు అని తెలిసినప్పుడు వదిలేయాల‌నీ అన్నాడు. "అమ్మాయిల్లో ఓ విషయాన్ని గమనించాను.. వాళ్లు వద్దు అనుకుంటే కనీసం వెనక్కి తిరిగి కూడా చూడరు. ఒక్కసారి మనసు విరిగిపోయిందంటే ఏం చేసినా అతుక్కోదు.. మళ్లీ మనవైపు చూడరు.. అలాంటప్పుడు నిన్ను నువ్వు బాధపెట్టుకోవడం.. ఇంట్లో వాళ్లని బాధపెట్టడం.. ప్రేమించిన అమ్మాయిని బాధపెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు." అని చెప్పుకొచ్చాడు. తన జీవితంలో ఇలాంటి అనుభవం ఎదురైంది కాబట్టి చెబుతున్నానని.. త‌న‌ బ్రేకప్ స్టోరీ వెల్ల‌డించాడు.

"దూరం నుంచి చూశాడు కాబట్టి చేయి కోసుకున్నాడు.. దగ్గర నుంచి చూస్తే ఉప్పెనే!"

  'జబర్దస్త్'లో హైపర్ ఆది స్కిట్ లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రత్యేకించి ఆయన కోసమే షోని చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు పంచ్ లతో రెచ్చిపోతుంటాడు ఆది. అయినప్పటికీ అతడి స్కిట్ లకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. తాజాగా వచ్చే వారానికి సంబంధించిన 'జబర్దస్త్' ప్రోమోను విడుదల చేయగా.. ఇందులో హైపర్ ఆది, రామ్ ప్రసాద్ తో క‌లిసి నవ్వించే ప్రయత్నం చేశాడు.  ఒక పేపర్ పట్టుకొని వచ్చి "నువ్వు చ‌దువు" అంటే "నువ్వు చదువు" అనుకుంటూ "ఇద్దరికీ రాదులే" అంటూ చిన్న పంచ్ తో స్కిట్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత తనను తాను వెధవ అని ఒప్పుకుంటూ.. ''నేను నెంబర్ 1 వెధవ..".. రామ్ ప్రసాద్ ను చూపిస్తూ "వీడు నెంబర్ 2 వెధవ" అని కామెంట్ చేశాడు. వెంటనే రామ్ ప్రసాద్ "నన్ను పిలిచి ఇన్సల్ట్ చేస్తావా.. నెంబర్ వన్ నాకే ఇవ్వు" అన్నాడు. ఆది "స‌రే" అన‌గానే అంతా గొల్లున న‌వ్వేశారు. ఇక లేడీ గెటప్ లో ఎంట్రీ ఇచ్చిన శాంతి స్వరూప్.. "మొన్న ఒకడు నన్ను చూసి చేయి కోసుకున్నాడు" అని అన్నాడు. దానికి హైపర్ ఆది.. "దూరం నుంచి చూశాడు కాబట్టి చేయి కోసుకున్నాడు.. దగ్గర నుంచి చూస్తే ఉప్పెనే" అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. 'ఉప్పెన' సినిమాలో క్లైమాక్స్ సీన్ ను ఉద్దేశిస్తూ ఈ పంచ్ వేశాడు. ఈ పంచ్ లకు మ‌నో, రోజా, అనసూయ పడిపడి మరీ నవ్వుకున్నారు. 

ఇంట్లో ఉంటూనే సంపాదించేస్తోన్న సుమ! ఎలా అంటే...

  బుల్లితెరపై స్టార్ యాంకర్ గా దూసుకుపోతోంది సుమ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమెకి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. బుల్లితెరపై టీవీ షోలు, సినిమా ఈవెంట్లు అంటూ సుమ చాలా బిజీగా ఉంటోంది. గ్యాప్ లేకుండా వరుస షోలతో భారీ సంపాదన ఆర్జిస్తోంది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చాలా మంది వర్క్ లేక ఇబ్బంది పడుతున్నారు. సుమ కూడా మొన్నామధ్య ఈ లాక్ డౌన్ కారణంగా సినిమా వాళ్లకు ఉపాధి లేకుండా పోయిందంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది.  ఇదిలా ఉంటే.. సుమ ఇంట్లో ఉంటూనే సంపాదించడం మొదలుపెట్టింది. పలు ప్రొడక్ట్ లను ప్రమోట్ చేస్తూ వాటికి అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. "ఇడ్లీ దినోత్సవం" అంటూ ఈమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మదర్స్ డే, ఫాదర్స్ డే ఇలా ఏదో ఒక డే ఉన్నప్పుడు ఇడ్లీకి ఓ డే ఉండకూడదా? అంటూ వేడి వేడి ఇడ్లీలను తయారు చేసింది.  దాని కోసం ఒక కంపెనీ వారు చేసిన స్పెషల్ పొడులను ప్రమోట్ చేసింది.  పుట్నాల పొడి, కారంపొడి, తనకెంతో ఇష్టమైన చల్ల మిరపకాయల పొడి ఉన్నాయని వారి ఉత్పత్తులను వివరిస్తూ ప్రమోట్ చేసింది. ఈ పొడులు కావాల్సిన వారు వాట్సప్ చేయొచ్చు లేదా వెబ్ సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు అంటూ సుమ తన స్టైల్లో ప్రమోషన్ చేసింది. మొత్తానికి ఇంట్లో ఉంటూ ప్రమోషన్స్ తోనే డబ్బులు సంపాదించేస్తోంది.

వాళ్లు వ‌స్తే రానీ.. వాళ్లతో నాకు పోటీ లేదు!

  బుల్లితెరపై దాదాపు ఇరవై సీరియల్స్ లో నటించిన లహరి ప్రస్తుతం 'గృహాలక్ష్మీ' సీరియల్ లో నటిస్తోంది. ఈ సీరియల్ లో అమాయకంగా కనిపించే లహరి రియల్ లైఫ్ లో మాత్రం తాను ముక్కుసూటిగా ఉండే అమ్మాయినంటూ కొన్ని విషయాలను పంచుకుంది. ఇప్పటివరకు తను చేసిన అన్ని పాత్రలు నచ్చే చేశానని.. ప్రస్తుతం నటిస్తోన్న 'గృహాలక్షీ' సీరియల్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, కాబట్టి తన పాత్రకు  ఢోకా ఉండదని చెప్పింది. పాత్ర విషయానికొస్తే.. అది డైరెక్టర్ చేతిలో ఉంటుందని.. రేటింగ్ బట్టి మారిపోతుంటుందని.. జనాలకు నచ్చి రేటింగ్ వస్తే ఉంచుతారు లేదంటే లేదని చెప్పింది.  రేటింగ్ బట్టి కథ మారిపోతుందని.. సీరియల్ లో ఏదైనా జరగొచ్చని చెప్పింది. ఇప్పటివరకు తను చేసిన పాత్రలతో మంచి పేరొచ్చిందని.. జనాలు గుర్తుపట్టి పలకరిస్తుంటార‌ని.. తనను అభిమానిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక సీరియల్స్ లో కానీ.. రియల్ లైఫ్ లో కానీ చేదు అనుభవాలు లేవని క్లారిటీ ఇచ్చింది. గొడవలకు దూరంగా ఉంటానని.. దేన్నీ సీరియస్ గా తీసుకోనని చెప్పింది. ఎవరైనా గొడవ పెట్టుకోవడానికి వస్తే పక్కకి తప్పుకుంటానని.. అలాంటి వారికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.  ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు తెలుగు సీరియల్స్ లో హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం గురించి మాట్లాడుతూ.. తనకు ఆ విషయంలో ఎలాంటి బాధ, బెంగ లేవని చెప్పింది. పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి చేసేస్తున్నారు.. నాకు రోల్స్ రావనే భయం తనకు లేదని.. ఎవరు వచ్చినా, వెళ్లినా పట్టించుకోనని.. వాళ్లతో తనకు పోటీ లేదని.. తన రోల్స్ తనకు ఉన్నాయని స్పష్టం చేసింది. తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని.. కానీ సీరియల్స్ లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పింది. 

న‌లుగురికి సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్న‌ సొహేల్‌!

  బిగ్ బాస్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు సొహేల్ ర్యాన్‌. హౌస్ లో ఉన్నంత కాలం 'కథ వేరే ఉంటది' అంటూ రచ్చ చేశాడు. అరియనాతో గొడవలు, అఖిల్ తో స్నేహం, టాస్క్ ల కోసం కష్టపడడం లాంటి విషయాలు సొహేల్‌ ని వార్తల్లో నిలిచేలా చేశాయి. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత అత‌డి ఇమేజ్ బాగా పెరిగింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ కి పాతిక లక్షలు వస్తే.. సొహేల్‌ కి మాత్రం నలభై లక్షల వరకు వచ్చింది.  నాగార్జున, చిరంజీవి ఇచ్చిన చెక్కులతో సొహేల్‌ క్రేజ్ బాగా పెరిగింది. అయితే తనకు వచ్చిన ఈ మొత్తంలో ఎక్కువ శాతాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు సొహేల్‌. తాజాగా తన స్వచ్చంద సంస్థ గురించి చెబుతూ సోషల్ మీడియాలో కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. సొహేల్‌ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇప్పటివరకు చాలా సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పాడు. భవిష్యత్తులో కూడా ఇలానే చేస్తామని అన్నాడు.  కొన్ని రోజుల్లో వందమంది జూనియర్ ఆర్టిస్ట్ లకు రేషన్, సరుకులు అందించబోతున్నట్లు తెలిపాడు. తమ చారిటీ సంస్థ ద్వారా నాలుగు ఆపరేషన్స్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చాడు. అందులో ఒకటి న్యూరో సర్జరీ కాగా.. మరో మూడు హార్ట్ ఆపరేషన్స్ అని.. ఇప్పటివరకు రూ. 24 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఛారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించామని వివరించాడు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఉందని.. కష్టాల్లో ఉన్నవారికి తమ వంతుగా సాయం అందిస్తామని చెప్పాడు. 

సుధీర్‌కు కన్నుకొడుతూ.. పెదాలు కొరుక్కుంటూ రెచ్చిపోయిన రష్మీ!

  బుల్లితెర జోడీ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. 'జబర్దస్త్', 'ఢీ' వంటి షోలలో ఈ జంట చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో ఈవెంట్ మేనేజర్స్ కూడా ఈ పెయిర్ తో మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన 'ఢీ 10' ప్రోమోలో వీరిద్దరి రొమాంటిక్ ట్రాక్ హైలైట్ అయింది. అందరూ చూస్తుండగానే సుధీర్‌కు కన్నుకొడుతూ రష్మీ రెచ్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది.  ముందుగా యాంకర్ ప్రదీప్ డల్ గా ఉన్న సుధీర్‌ను స్టేజ్ పైకి పిలిచాడు. అతడితో పాటు హైపర్ ఆది కూడా వచ్చాడు. వీరిద్దరూ ఒకేరకమైన బట్టలు వేసుకొని కనిపించారు. సుధీర్ పర్పుల్ కలర్ వేసుకోవడంతో.. ప్రదీప్ పరుపుల అంటూ సెటైర్ వేశాడు. వెంటనే  జడ్జి ప్రియమణి పరుపుల సుధీర్ అంటూ పరువు తీసేసింది. అనంతరం ప్రోమో చివర్లో రష్మీ-సుధీర్ ల రొమాన్స్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  అందరూ చూస్తుండగానే డైరెక్ట్ గా సుధీర్‌కి కన్నుకొడుతూ పక్కకు పిలిచింది రష్మీ. అంతేకాదు.. అతని వంక చూస్తూ మునిపంటితో పెదాలు కొరుక్కుంది. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ప్రియమణి అయితే నోరెళ్లబెట్టింది. ఇక రష్మీ అలా పిలవడంతో సుధీర్ ప‌ర‌వ‌శంతో మైమ‌ర‌చిపోయాడు. మాటల్లో చెప్పలేనంత ఆనందంతో మురిసిపోయాడు. 

నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు ఎమోష‌న‌ల్ అయిన డాక్టర్ బాబు భార్య! ఆ ప్ర‌శ్నేమిటంటే...

  బుల్లితెర ప్రేక్షకులకు 'కార్తీక దీపం' ఫేమ్ నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన భార్య మంజుల కూడా సీరియల్స్ లో నటిస్తున్నారు. 'చంద్రముఖి' సీరియల్ తో వీరిద్దరి ప్రయాణం మొదలైంది. షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. నిరుపమ్ భార్యగా మంజులకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. వీరిద్దరూ కలిసి ఓ సీరియల్ చేస్తే చూడాలని అభిమానులు ముచ్చట పడుతున్నారు.  'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియల్ తో త్వరలోనే మంజుల ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో మంజుల కన్ఫర్మ్ చేసింది. నిరుపమ్ తో కలిసి ఎప్పుడు నటిస్తారని నెటిజన్ ప్రశ్నించగా.. దానికి మంజుల 'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియల్ తో త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతోన్నట్టు తెలిపింది. తాజాగా మరోసారి ఆమె తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టారు.  ఈ క్రమంలో 'అదా..? ఇదా..?' రెండింటిలో ఏదొకటి సెలెక్ట్ చేసుకోవాలనే ఆట ఆడారు. దీంతో నెటిజన్లు రకరకాల ప్రశాలు అడిగారు. "డాక్టర్ బాబు అంటే ఇష్టమా..? హిట్లర్ అంటే ఇష్టమా..?", "బెంగళూరా..? హైదరాబాదా..?" అంటూ రకరకాల ప్రశ్నలు సంధించారు. తనకు హిట్లర్ అంటే ఇష్టమని, బెంగళూరు అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చింది. మరో నెటిజన్ "భర్తా..? కొడుకా..?" అని అడిగాడు. దానికి ఆమె ఇద్దరినీ వేరు చేయలేనని.. అలా చేసిన రోజు నా ఊపిరి ఆగిపోతుందని ఎమోషనల్ అయింది. 

జ‌బర్ద‌స్త్‌.. నైటీతో వ‌చ్చేసిందంటూ రోజా డ్రెస్సుపై ట్రోల్స్‌!

  అనారోగ్యం కారణంగా 'జబర్దస్త్' షోకి కొంతకాలం పాటు దూరమైనా రోజా.. రీసెంట్ గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె షోకి వేసుకొచ్చిన డ్రెస్సుపై సోషల్ మీడియాలో నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి చాలా మంది ఆడవాళ్లు రోజా ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుందా అని ఈ షోని చూస్తుంటారు. ఆమె వేసుకునే డ్రెస్సులు, చీరల గురించి చర్చించుకుంటారు.  అలాంటిది తాజాగా ఆమె వేసుకొని వ‌చ్చిన‌ డ్రెస్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అచ్చం నైటీలా ఉన్న లాంగ్ డ్రెస్ ను వేసుకొచ్చింది రోజా. ఆ డ్రెస్ వేసుకొని డాన్స్ స్టెప్స్ వేసింది. దీంతో నెటిజన్లు ఆమెని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. ఆలస్యంగా లేవడంతో షోకి లేట్ అయిపోతుందని నైటీతో వచ్చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమెపై మీమ్స్ కూడా క్రియేట్ చేశారు.  "ఏదైతే అది అయిందని జెట్  స్పీడ్ లో వచ్చేసినా" అంటూ 'వకీల్ సాబ్' సినిమాలో సూపర్ విమేన్ డైలాగ్ ను రోజాకి ఆపాదిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ట్రోలింగ్ ని రోజా పెద్దగా పట్టించుకోదు. అందుకే దీనిపై కూడా స్పందించలేదు. ఇటీవలే సోషల్ మీడియాలో రోజా రీఎంట్రీ కారణంగా ఇంద్రజను వెనక్కి పంపడంతో 'రోజా మాకొద్దు' అంటూ ఇంద్రజ అభిమానులు చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. 

ఆ హీరోయిన్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో!

  చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు బాలాదిత్య. 'లిటిల్ సోల్జర్స్', 'హిట్లర్', 'అబ్బాయిగారు', 'హలో బ్రదర్'.. ఇలా చాలా సినిమాల్లో బాలనటుడిగా కనిపించాడు. ఒకప్పటి స్టార్ హీరోలందరి చిన్నప్పటి పాత్రలను కూడా బాలాదిత్యనే పోషించేవాడు. ఆ తరువాత 'చంటిగాడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. కానీ అతడికి అవకాశాలను తీసుకురాలేకపోయింది.  ఇటీవలే బాలాదిత్య నటించిన 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలాదిత్య పలు సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. గతంలో 'చంటిగాడు', 'సుంద‌రానికి తొంద‌రెక్కువ' సినిమాల్లో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సుహాసినిని బాలాదిత్య పెళ్లి చేసుకున్నట్లు గ‌తంలో వార్తలొచ్చాయి. ఆమె కూడా కొన్ని సినిమాల్లో న‌టించి, త‌ర్వాత టీవీ సీరియ‌ల్ తార‌గా స్థిర‌ప‌డిన విష‌యం తెలిసిందే. త‌మ‌ పెళ్లి ప్ర‌చారంపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు బాలాదిత్య.  ఆ వార్తల్లో నిజం లేదని అన్నాడు. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కు వెళ్లినప్పుడు సుహాసినితో కలిసి ఒకే కారులో వెళ్లేవాడినని.. అది చూసి కొందరు తప్పుగా అనుకున్నారని చెప్పుకొచ్చాడు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. ఇద్దరం కలిసి రెండు సినిమాల్లో నటించేసరికి పెళ్లి చేసుకున్నామంటూ వార్తలు రాసేశారని.. నిజానికి త‌మ‌ ఇద్దరికీ అలాంటి అభిప్రాయమే లేదని స్పష్టం చేశాడు. 

నిజ జీవితంలో 'వంట‌ల‌క్క' భ‌ర్త ఏం చేస్తుంటారో తెలుసా?

  రెండు తెలుగు రాష్ట్రాల్లో 'కార్తీకదీపం' సీరియల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది వంటలక్క (ప్రేమి విశ్వనాథ్). మలయాళంలో వచ్చిన 'కరుతముత్తు' అనే సీరియల్ కు రీమేక్ గా దీన్ని రూపొందించారు. ఈ ఒక్క సీరియల్ తో మలయాళీ నటి ప్రేమి విశ్వనాథ్ మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే సీరియల్స్ లో నటించకముందు ఆమె ఏం పని చేసేదో తెలుసా?..  1991 డిసెంబర్ 2న కేరళలో జన్మించిన ప్రేమి విశ్వనాథ్ లా కోర్సు పూర్తి చేసింది. ఆ తరువాత ఓ ప్రైవేట్ సంస్థకు లీగల్ అడ్వైజర్ గా పని చేసింది. ఇక సీరియల్స్ లో నటించడం కంటే ముందు మోడల్ గానూ రాణించింది. అంతేకాకుండా.. 'సాల్మ‌న్‌ 3 డీ' సినిమాలో కూడా నటించింది. ప్రేమి అన్నయ్య శివప్రసాద్ కేరళలో ఫేమస్ ఫోటోగ్రాఫర్. ఆయనకు ఎర్నాకుళంలో రెండు స్టూడియోలు కూడా ఉన్నాయి. తన సోదరుడిలానే ఫోటోగ్రఫీ మీద మక్కువతో కొన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలకు పని చేసిందట ప్రేమి విశ్వనాథ్.  ఇక ప్రేమి విశ్వనాథ్ భర్త వినీత్ భట్ ఆస్ట్రాలజీలో పలు అంతర్జాతీయ అవార్డులను సైతం గెలుచుకున్నారు. ఆయన వద్దకు పలువురు రాజకీయ, సినిమా రంగాలకు చెందిన వాళ్లు వస్తుంటారట. ప్రేమి-వినీత్ లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇక ప్రేమి విశ్వనాథ్ కు తెలుగులో పలు సినీ అవకాశాలు కూడా వస్తున్నాయట. కానీ ప్రస్తుతం ఆమె సీరియల్ మీదే ఫోకస్ పెట్టారు. 

సీరియల్ నుండి తీసేయడంతో భోరుమ‌న్న‌ నటి!

  'నా పేరు మీనాక్షి' సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి.. మధు రెడ్డి. 2015 నుండి 2021 వరకు ఆమె ఈ సీరియల్ లో కంటిన్యూ అవుతూ వచ్చింది. మధ్యలో డెలివెరీ కోసం బ్రేక్ తీసుకున్నప్పటికీ.. తిరిగి అదే సీరియల్ లో రీఎంట్రీ ఇచ్చింది. అయితే కొన్నాళ్లుగా ఆమె సీరియల్ లో కనిపించడం లేదు. దీంతో ఆమె అభిమానులు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆమెని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆమె వివరణ ఇస్తూ బోరున ఏడ్చేసింది.  చాలా సీరియల్స్ లో నటించినప్పటికీ 'నా పేరు మీనాక్షి' సీరియల్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. అయితే కొన్నాళ్లుగా ఈ సీరియల్ డేట్స్ కోసం ఒకటి రెండు రోజులు మాత్రమే తనను అడుగుతున్నారని తెలిపింది. దానికోసం పదిహేను నుండి ముప్పై రోజులు బ్లాక్ చేస్తుండడంతో వేరే సీరియల్స్ చేయలేకపోతున్నానని దర్శకనిర్మాతలకు చెప్పిన విషయాన్ని బయటపెట్టింది. నెలలో రెండు రోజుల కోసం నెలంతా గడపాలంటే కష్టమని చెప్పింది.  అయినప్పటికీ 'నా పేరు మీనాక్షి'తో మంచి పేరు రావడంతో సీరియల్ ను వదల్లేకపోయానని తెలిపింది. అయితే తను దర్శకనిర్మాతలను అడగడంలో తప్పు ఉందో ఏమో తెలియదు కానీ తనను మొత్తానికి సీరియల్ నుండి తప్పించినట్లు వివరించింది మధు రెడ్డి. పిలుస్తారులే అని చాలా రోజులు చూశానని.. కానీ అలా జరగలేదని ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది.