మండలిని రద్దు చేయాలంటే ప్రక్రియ ఏమిటి?

శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా... శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మండలిలో చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది. అయితే, మండలిని రద్దు చేయాలంటే మొదటగా శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. శాసనసభలో ఎలాగూ జగన్ ప్రభుత్వానిదే మెజారిటీ కనుక తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే. అయితే, శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్లో చర్చించి లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ కి విచక్షణాధికారాలు ఉన్నాయి. దాంతో, కేంద్రానికి ఇష్టంలేకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా వెనక్కి పంపే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించకుండా తిప్పిపంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, మూడు రాజధానులను జనసేన వ్యతిరేకిస్తుండటం... అదే సమయంలో ఏపీ బీజేపీ కూడా అమరావతే... ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేసిన నేపథ్యంలో...  మండలి రద్దు అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. అయితే, శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదని, దీనిపై కేంద్రానికి ఎలాంటి హక్కూ ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దుకు శాసనసభ తీర్మానంచేసి పంపితే, దాన్ని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించి తీరుతుందని అంటున్నారు. ఇందులో రాజకీయాలు ఏమీ ఉండవని చెబుతున్నారు. అందుకు, ఎన్టీఆర్ హయాం నాటి ఘటనను గుర్తుచేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే... కేంద్రం చేయక తప్పదని అంటున్నారు.

ఒకే రోజు రెండు సమావేశాలు.. ఏపీ సర్కార్ ఊహించని అడుగులు!!

మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొంది. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కాగా 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా రెండూ ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ఏపీ సర్కార్. దీని ప్రకారం 20 ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు.11:30 నిమిషాలకు అసెంబ్లీ భేటీ జరుగుతుండగా రాజధానితో పాటు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ విషయంలో చట్ట పరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆలోచనల్లో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేయడమే కాక రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించే పనిలో పడింది ఏపీ సర్కార్. ఏపీ డిజిటలైజేషన్ అంటూ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఓల్డ్ రీజన్స్ బెల్ ట్వంటీ ట్వంటీ పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సూచనలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల్లో వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతి జోన్ కు ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకు ఒకరు చైర్మన్ గా వ్యవహరిస్తారు, అలాగే వైస్ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ బోర్డులో సభ్యులుగా 1 ఎంపి, 2 ఎమ్మెల్యేలు, మరో 4 ప్రతి నిధులు వుండేలా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సదరు ప్రాంతీయ బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏఏ జోన్లలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి,ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను, కర్ణాటక మోడల్ తరహాలో బిల్లును రూపొందిస్తున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.

ఇంటికి ఒక్కరు చాలు.. అమరావతిని రాజధానిగా నిలుపుకునేందుకు బాబు పిలుపు

రాజధాని అమరావతి కోసం ప్రతి ఇల్లు ఉద్యమించాలని.. ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు రావాలని.. అందరూ సంఘటిత శక్తిగా మారాలని.. టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి లోనే ఉంచాలి అంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో  తొలిసారిగా మచిలీపట్నం, విజయవాడలో జరిగిన జేఏసీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా రాజధానిని రక్షించేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చామని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటే సీఎం జగన్ భయపడుతున్నారని..అందుకే బస్సు యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి చివర్లో రూట్ పర్మిషన్ లేదంటూ పోలీసులను ఉసిగొలిపి అడ్డుకున్నారని దుయ్యబట్టారు.  ముందుగా ప్రజావేదికను కూల్చేశారన్నారు. అమరావతికి ముంపు భయం లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పినా కూడా మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాను అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నానని ప్రచారం చేశారన్నారు. హై కోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలంటే వెనుకడుగువేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతిలో చదరపు గజం రూ 30,000 పలికింది. తాను మళ్లీ వచ్చి ఉంటే లక్ష పలికేదని.. ఆ డబ్బుతోనే అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించవచ్చని ఎద్దేవా చేశారు. ఇది ప్రజా రాజధాని దేవుళ్ల మొదలు ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి. దానిని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజా రాజధానిని రక్షించుకునేందుకు ఇంటికో వ్యక్తి బయటికి వస్తే.. మనమందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తే జగన్ తోక ముడుస్తారని అన్నారు. ఆయన తీరుతో బయటి రాష్ట్రాల్లో మన పరువు పోతుందన్నారు. ఆంధ్ర ప్రజల బతుకు మూడుముక్కలాటయిందని ఇతర రాష్ర్టాల ప్రజలు నవ్వుతున్నారు. అమరావతి కోసం ఉద్యమించే వారిపై తన పత్రిక ద్వారా బురద చల్లుతున్నారని తెలియజేశారు. రాజధానిపై రెఫరెండం పెట్టి.. దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. అప్పుడు మీ ఇష్టం వచ్చిన చోట రాజధానులు పెట్టుకోవాలి అన్నారు.  మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని సంబోధిస్తున్నారు. మరీ ఆయనేమన్నా నాని రెడ్డా పవన్ స్వశక్తితో ఎదిగిన వాడు. ఆయన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారు. ఉన్న ఊరి నుంచి రాజధాని తరలిపోతుంటే ఎవరైనా పోరాడతారని అన్నారు. కానీ మంత్రి పేర్ని నానికి ఇక్కడ రాజధాని ఉండటం ఇష్టం లేనట్లే ఉంది.. అందుకే సిగ్గులేకుండా హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తాను ఒక పిలుపు ఇస్తే అమరావతి రైతులు 33,000 ల ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు.  విశాఖ నీతి నిజాయితీ ఉండేవాళ్ల నగరం.. అక్కడ అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు బయలుదేరారు అని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ ముందు హుద్ హుద్ తర్వాత విశాఖ ఎలా ఉందో అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. దానిని టెక్నాలజీ హబ్ గా, ఫార్మా హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభకు అధికారులు అవంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. సభకు వచ్చిన వారందరు తమ సెల్ ఫోన్లలో ఉన్న లైట్ ను వెలిగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం వద్ద సెల్ ఫోన్ లైట్ల వెలుగుతో నిండిపోయింది.

చిరంజీవే ఎందుకు టార్గెట్ అయ్యారు? రాజశేఖర్ గతం మర్చిపోలేదా?

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ‘మా‘ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. చిరంజీవి మాట్లాడుతుండగా పలుమార్లు అడ్డుపడ్డ రాజశేఖర్... పరుచూరి గోపాలకృష్ణ చేతిలో నుంచి మైక్ లాక్కుని... మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో విభేదాలను బయటపెట్టాడు. వేదికపైనున్న అందరి కాళ్లు మొక్కుతూ రాజశేఖర్ వింతగా ప్రవర్తించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కారణంగా తన ఫ్యామిలీలో గొడవులు జరుగుతున్నాయని, తన కారు ప్రమాదానికి కూడా ‘మా‘ గొడవలే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిప్పు ఉన్నప్పుడు... దాన్ని కప్పిపుచ్చేందుకు ఎంత ప్రయత్నించినా పొగ రాకుండా ఆపలేమన్నారు. అయితే, వేదికపైనున్న మోహన్ బాబు, చిరంజీవి, కృష్ణంరాజు, జయసుధ తదితరులు ఆపేందుకు ప్రయత్నించినా తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు రాజశేఖర్. అయితే, హీరో రాజశేఖర్ తీరుపై మెగాస్టార్ చిరంజీవి మండిపడ్డారు. మంచిని మైకులో చెబుదాం... చెడుని చెవిలో చెప్పుకుందామని తాను విజ్ఞప్తి చేసినా... రాజశేఖర్ పట్టించుకోలేదని సీరియస్ అయ్యారు. వేదికపైనున్న పెద్దలను రాజశేఖర్ అవమానించారని మండిపడ్డారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో క్రమశిక్షణాసంఘం ఉంటే... రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని చిరంజీవి సూచించారు. రాజశేఖర్ ప్రవర్తన, వ్యాఖ్యలపై జీవిత క్షమాపణలు చెప్పారు. రాజశేఖర్ ది చంటి పిల్లాడి మనస్తత్వమని, ఆయన ఏదీ దాచుకోడని, మనసుకి ఏదనిపిస్తే అదే మాట్లాడతాడంటూ వాతావరణాన్ని కూల్ చేసేందుకు జీవిత ప్రయత్నించారు. అయితే, చిరంజీవి మాట్లాడుతున్నప్పుడే రాజశేఖర్ అడ్డుపడటం చర్చనీయాంశమైంది. ఎందుకంటే, చిరంజీవి పీఆర్పీని ఏర్పాటు చేసినప్పుడు రాజశేఖర్ కారుపై మెగా ఫ్యాన్స్ రాళ్ల దాడి చేయడంతో ఇరువురి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి-రాజశేఖర్ మళ్లీ కలిసినా.... ఇప్పుడు ‘మా‘ డైరీ ఆవిష్కరణలో చిరంజీవిని మళ్లీ టార్గెట్ చేయడం వెనుక ఏదో గొడవ ఉందంటున్నారు.

2019 పొలిటికల్ రిపోర్ట్.. లీడర్ ఆఫ్ ది ఇయర్ ఏపీ సీఎం జగన్

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ఏప్రిల్ 11 వ తేదీన ఎన్నికలు జరిగాయి. మే 23 వ తేదీన వచ్చిన ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి మోగించింది. గతంలో ఏ పార్టీకీ సాధ్యం కాని విధంగా అసెంబ్లీలో వైసీపీ 86 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను 151 సీట్లలో గెలిచి రికార్డు సృష్టించింది. పోలైన మొత్తం ఓట్లలో 49.9 శాతం సాధించింది. ఇక అధికారం కోల్పోయిన తెలుగుదేశం 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 30.96 శాతం ఓట్లతో ప్రతిపక్షస్థానంలో కూర్చవలసి వచ్చింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కేవలం ఒక్కచోట మాత్రమే గెలిచింది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి, మొత్తం 25 స్థానాలకు గాను, 22 చోట్ల వైసిపి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది.  ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్న జగన్ కల 2019 లో నెరవేరింది. ఇందు కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. 2019 ఎన్నికల్లో గెలవాలన్న తపనతో అంతకు రెండేళ్ల ముందే 2017 నవంబర్ 6 న ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. సుమారు 3648 కిలోమీటర్ల పాద యాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది జనవరి 9 వ తేదీ న ప్రజా సంకల్ప యాత్రను ముగించారు. ఆ తర్వాత పూర్తిగా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. చివరకు ఘన విజయాన్ని అందుకో గలిగారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహనరెడ్డి మే 30 వ తేదీ న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణం చేయించారు, ప్రమాణ స్వీకారం రోజు ఆయన వృద్ధాప్య పెన్షన్ల పెంపు ఫైలుపై తొలి సంతకం చేశారు. జూన్ 8 వ తేదీ న సీఎం జగన్మోహనరెడ్డి సెక్రటేరియట్ లో తొలిసారి అడుగు పెట్టారు. ఆ సమయంలో ఆశా వర్కర్ల జీతాల పెంపుపై సీఎం జగన్ తన తొలి సంతకం చేశారు. అనంతపురం, అమరావతి ఎక్స్ ప్రెస్ హైవేకి కేంద్ర అనుమతి కోరుతూ రెండవ సంతకం చేశారు. జర్నలిస్టు హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేస్తూ మూడవ సంతకం చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళ పాటు పాలించారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఘోర ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం ఈ సారి ఒంటరిగా బరిలోకి దిగింది. కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. చంద్రబాబు చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలేవి ఆయన్ను గట్టెక్కించలేక పోయాయి. గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమికి మద్దతిచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సారి కమ్యునిస్టు పార్టీలతో కలిసి బరిలోకి దిగారు. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీ తరపున రాపాక వర ప్రసాద్ మాత్రమే గెలిచారు. జనసేన పార్టీకి కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్, బిజెపి, లెఫ్ట్ పార్టీలు ఈ సారి ఖాతా కూడా తెరవలేకపోయాయి. 2014 లో టిడిపితో కలిసి నాలుగు సీట్లు గెలిచిన బీజేపీకి ఈ సారి ఒక్కటి కూడా దక్కలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచేందుకు ఎంతో ప్రయత్నించింది, కానీ ఉపయోగం లేకుండా పోయింది. జనసేనతో కలిసి పోటీ చేసిన కమ్యునిస్టు పార్టీల పరిస్థితి కూడా అంతే. ఇక అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత  టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యలు పార్టీ ఫిరాయించారు. టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి పోయారు. మెజారిటీ సభ్యులు అటు వెళ్లడంతో రాజ్యసభలో టిడిపికి ఒక సభ్యుడు మాత్రమే మిగిలారు. ఓవరాల్ గా ఈ ఏడాది ఎన్నికలు వైసీపీకి తప్ప మిగిలిన పార్టీలన్నింటికీ చేదు అనుభవాన్నే మిగిల్చాయి.

విజయసాయి మాటలకు విలువ లేదా.. నెంబర్ 2 పొజిషన్ పోయిందా?

ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ విశాఖ అంటూ వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. "28న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలుకుదాం. విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో థాంక్యూ జగనన్నా అంటూ జననేతకు ధన్యవాదాలు చెబుదాం." అని జగన్ విశాఖ పర్యటనను విజయవంతం చేయండి అంటూ ట్విట్టర్ లో పెద్ద పోస్టే పెట్టారు. విజయ సాయి వ్యాఖ్యలు ట్వీట్లు చూసి ఇంకేముంది వైసీపీ నెంబర్ 2 నే విశాఖను రాజధాని అన్నారంటే ఇక కంఫర్మ్ అయిపోయినట్టే... కేబినెట్ భేటీ తరువాత ప్రకటన తరువాత ప్రకటన రావడమే ఆలస్యం అనుకున్నారంతా. కానీ కట్ చేస్తే.. టోటల్ రివర్స్ అయింది. జీఎన్‌రావు, బీసీజీ కమిటీ నివేదికలను అధ్యయనం చేసి.. హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఆ కమిటీ చెబితే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కేబినెట్ మీటింగ్ ముగిసింది కానీ రాజధానిపై సస్పెన్స్ కి మాత్రం ఎండ్ కార్డు పడలేదు. మరి ఈ మాత్రం విజయ సాయి ఇంత హడావుడి ఎందుకు చేసారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి విజయసాయి ఏం సమాధానం చెప్తారో తెలియదు కానీ.. మంత్రి పేర్ని నాని మాత్రం విజయసాయివి రాజకీయ వ్యాఖ్యలని సింపుల్ గా తేల్చేశారు. కేబినెట్ మీటింగ్ తర్వాత మాట్లాడిన ఆయన.. విజయసాయి ప్రకటనతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. విశాఖ వైసీపీ ఇన్‌చార్జ్‌గా విజయసాయిరెడ్డి మాట్లాడి ఉండవచ్చని.. ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్ని నాని తెలిపారు. దీనిని బట్టి చూస్తే తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టుగా.. విజయ సాయి కంగారుపడి వ్యాఖ్యలు చేసారా లేక ప్రస్తుతం పార్టీలో విజయసాయికి తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రేసులో అజయ్ అండ్ సోమేష్... కేసీఆర్ మొగ్గు ఎవరివైపో...

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి డిసెంబర్ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. దాంతో, తెలంగాణ కొత్త సీఎస్ ఎంపికపై కసరత్తు మొదలైంది. సీనియారిటీ, సమర్ధత, వైఖరిని పరిగణనలోకి తీసుకుని సీఎస్ ఎంపికపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, సీఎస్ కేసులో ముఖ్యంగా ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పేరు వినిపిస్తోంది. ఆ తర్వాత రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరు ప్రముఖంగా తెరపైకి వస్తోంది. అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తుందోనని, వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు సీఎస్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. సీనియారిటీపరంగా చూస్తే 1983 బ్యాచ్ నుంచి బీపీ ఆచార్య, బినయ్ కుమార్... అలాగే 1984 బ్యాచ్ నుంచి అజయ్ మిశ్రా.... 1985 బ్యాచ్ నుంచి పుష్పా సుబ్రమణ్యం... 1986 బ్యాచ్ నుంచి సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారీ.... 1987 బ్యాచ్ నుంచి రాజీవ్ రంజన్, వసుధా మిశ్రా... 1988 బ్యాచ్ నుంచి శాలిని మిశ్రా, ఆధర్ సిన్హా.... ఇక, సీఎస్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోన్న సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.... అయితే, ఇంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ... 1984 బ్యాచ్ అజయ్ మిశ్రా... అలాగే 1989 బ్యాచ్ సోమేష్ కుమార్ వైపు మాత్రమే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఒకవేళ అజయ్ మిశ్రాకి అవకాశమిస్తే కేవలం ఆరు నెలలు మాత్రమే అంటే 2020 జూన్ వరకు మాత్రమే సీఎస్ గా కొనసాగనున్నారు. అదే, సోమేష్ ను ఎంపిక చేస్తే మాత్రం 2023 డిసెంబర్ చివరి వరకు సీఎస్ గా పనిచేసే అవకాశముంటుంది. 2023 డిసెంబర్ నెలాఖరులో సోమేష్ కుమార్ ఉద్యోగ విరమణ ఉండటంతో... ఆయన నాలుగేళ్లపాటు సీఎస్ పదవిలో ఉంటారు. మరి, సీఎం కేసీఆర్.... అజయ్ మిశ్రా వైపు మొగ్గుచూపుతారో... లేక దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సోమేష్ కి అవకాశమిస్తారో చూడాలి. అయితే, తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా... సీఎస్ గా రావడానికి పలువురు సీనియర్లు అస్సలు ఇష్టపడటం లేదనే మాట కూడా వినిపిస్తోంది.

ఇంటిని గ్రంథాలయానికి ఇవ్వలేని చిరుకి రైతుల త్యాగం విలువేం తెలుస్తుంది!!

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోనని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనను.. మెగాస్టార్ చిరంజీవి స్వాగతించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో మెగా అభిమానుల్లో గందరగోళం నెలకొంది. జగన్ నిర్ణయాన్ని చిరంజీవి సమర్ధించడం పట్ల ఎలా స్పందించాలో తెలియక మెగా అభిమానులు తలలుపట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే అమరావతి ప్రాంత రైతులు మాత్రం చిరంజీవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సాక్షిగానే రైతులు చిరంజీవి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ‘చిరంజీవి ఏ రోజూ ప్రజా సమస్యలపై స్పందించింది లేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి మూడు రాజధానులను ఎలా సమర్థిస్తారు?. మీ సినిమాలు చూడటానికి.. ఆడించుకోవటానికి జగన్‌ ని కలిశారు కానీ.. ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు’ అని ఓ రైతు వ్యాఖ్యానించాడు. ‘చిరంజీవికి వైజాగ్‌లో చాలా ఆస్తులున్నాయి. అందుకే మూడు రాజధానులు స్వాగతించారు.' అని ఓ రైతు ఆరోపించాడు. 'రైతుల గురించి మీకు తెలుసు కాబట్టి.. రైతులు పెట్టే అన్నమే మీరు తింటున్నారు కాబట్టి మాకు మద్దతివ్వండి. అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే.. ఏపీలో మీ సినిమాలు కూడా రిలీజ్ చేయనివ్వం.’ అని మరో రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా చిరంజీవిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైజాగ్‌లో స్టూడియో కోసమే చిరంజీవి మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంకా కొందరైతే పాత విషయాలను తవ్వితీసి మరీ.. చిరంజీవి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి సొంత ఊళ్ళో నిరుపయోగంగా ఉన్న ఇంటిని గ్రంథాలయానికి ఇవ్వాలని ఆ ఊరి ప్రజలు కోరగా.. అప్పుడు చిరంజీవి ఇవ్వకుండా ఆ ఇంటిని డబ్బులకి అమ్ముకున్నారని అంటున్నారు. ప్రజాదరణతో సినిమాల్లో కోట్లు సంపాదించారు కానీ ఓ చిన్న ఇంటిని ఊరికోసం ఇవ్వలేకపోయారు. కానీ అమరావతి ప్రాంత రైతులు రాజధాని కోసం వేల ఎకరాల భూములు త్యాగం చేశారు. అలాంటి వారికి అండగా నిలవాల్సింది పోయి.. వారికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అండగా నిలబడతారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.  

జగన్ ప్రభుత్వానికి మరో షాకిచ్చిన కేంద్రం..!

జగన్ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో షాకులిచ్చిన కేంద్రం... తాజాగా మరో ఝలక్ ఇచ్చింది. ఏపీకి కొత్తగా మెడికల్ కాలేజీలు కేటాయించబోమని... అవసరమనుకుంటే మీరే కట్టుకోవాలంటూ తేల్చిచెప్పింది. అయితే, కేంద్రమే ముందుగా ప్రతిపాదనలు కోరి, ఇఫ్పుడు మీరే కట్టుకోమంటూ కేంద్రం చేతులెత్తేయడంపై రాష్ట్ర ప్రభుత్వం, అలాగే వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు కంగుతిన్నారు. కేంద్రంపై ఆశలు పెట్టుకునే తాము మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ముందడుగు చేస్తే, ఇప్పుడు నిధులు ఇవ్వమంటే ఎలా అంటున్నారు. ప్రతి జిల్లాలో కచ్చితంగా ఒక మెడికల్ కాలేజీ ఉండేలా అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రం ప్రతిపాదనలు కోరింది. దాంతో, ఆయా రాష్ట్రాలు తమ అవసరాలను తెలుపుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. అయితే, వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం... కొన్ని రాష్ట్రాలకు మాత్రమే కొత్త మెడికల్ కాలేజీలను కేటాయించింది. అయితే, ఏపీ... మూడింటికి ప్రతిపాదనలు పంపగా... ఒక్కటి కూడా ఇవ్వలేదు. అందుకు కేంద్రం అనేక కారణాలను చూపినప్పటికీ, ముఖ్యంగా ఏపీలోని 13 జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని... పశ్చిమగోదావరి, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని... ఈ రెండు జిల్లాల్లో కూడా ప్రైవేట్ కాలేజీలు ఉన్నందున... ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిధులు కేటాయించలేమని స్పష్టంచేసింది. అయితే, ఏపీ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఏలూరు, పాడేరు, విజయనగరంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సహకరించాలని... ఒక్కో కాలేజీకి 340కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని మళ్లీ కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే ఏలూరు మెడికల్ కాలేజీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, అలాగే... మిగతా రెండు కాలేజీలకూ ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు రెడీ అవుతున్నందున నిధులు ఇవ్వాలని కేంద్ర పెద్దలను కోరనున్నారు. అంతేకాదు, సరికొత్త లెక్కలతో కేంద్రం ముందు మళ్లీ ప్రతిపాదనలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. తమిళనాడులో 25 జిల్లాలు ఉన్నప్పటికీ... ప్రతి జిల్లాలో 20లక్షల మంది జనాభా మాత్రమే ఉన్నారని... అయితే, ఏపీలోని 13 జిల్లాల్లో ప్రతి చోటా 40లక్షల మంది జనాభా ఉన్నారని... అందువల్ల జనాభా ప్రాతిపదికన ఏపీకి కొత్త మెడికల్ కాలేజీలు కేటాయించాలని కోరనున్నారు. అయితే, కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఏలూరు, పాడేరు, విజయనగరంతోపాటు పులివెందుల, మచిలీపట్నం, గురజాల, మార్కాపురంలో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, కేంద్రం షాక్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఒకవేళ రెండోసారి కూడా రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరిస్తే మాత్రం... ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి దాదాపు 2500కోట్ల రూపాయల భారం రాష్ట్రంపై పడనుంది. ఇప్పటికే, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఏపీ... అంత పెద్ద మొత్తాన్ని భరించగలిగే పరిస్థితిలో లేదంటున్నారు అధికారులు.

తెలుగు యువత అధ్యక్షుడిగా పరిటాల శ్రీరామ్!!

మొన్న జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత టీడీపీకి వరసన ఎదురుదెబ్బలు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీకి బలమనుకున్న నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు ఇప్పటికే పార్టీని కూడా వీడారు. వారి స్థానంలో మరొకరిని నియమించటం ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి వాటిలో ఒకటి తెలుగు యువత అధ్యక్ష స్థానం. మొన్నటి వరకు ఈ స్థానంలో దేవినేని అవినాష్ ఉండేవారు. విజయవాడలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్, విభజనకు ముందు కాంగ్రెస్ లో కొనసాగారు. 2014 లో కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి టిడిపిలో చేరారు. నెహ్రూ మరణంతో అవినాష్ కు చంద్రబాబు ధైర్యం చెప్పి తెలుగు యువత బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో గుడివాడ నియోజక వర్గం టికెట్ కూడా కేటాయించారు కానీ ఈయన కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా కనిపించారు. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమోగానీ తమకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేదంటూ వైసీపీలోకి మొగ్గు చూపారు. దీంతో పార్టీలో తెలుగు యువత అధ్యక్ష స్థానం ఖాళీ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో పరిటాల శ్రీరామ్ పేరు గట్టిగా వినిపిస్తోంది .  అనంతపురం జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన పేరు పరిటాల, ఒకప్పుడు పెత్తందారులకు వ్యతిరేకంగా నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్న పరిటాల రవీంద్ర, ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. భూస్వాములకూ, పెత్తందారులకు, నియంతలకు ఎదురు తిరిగిన రవి తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఆ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయ్యారు. ఆయనకి అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులున్నారు. పరిటాల రవి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాక ఆయన స్థానంలో ఆయన సతీమణి సునీత వచ్చారు. ఆమెను కూడా అభిమానులు కార్యకర్తలు గుండెల్లో పెట్టుకున్నారు. వైయస్ లాంటి బలమైన నేతల ప్రభావంతో కాంగ్రెస్ విజయం సాధించిన కాలంలో కూడా వరుసగా 3 సార్లు గెలిచి అయిదేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో రవి వారసుడిగా రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే రవి ఆధిపత్యం మొదలైన నాటి నుంచి తొలిసారి ఈ ఎన్నికల్లో ఓటమి చూసింది పరిటాల ఫ్యామిలీ. రాష్ట్రమంతా వైసిపి గాలి వీయడంతో ఇక్కడ కూడా ఓటమి తప్పలేదు. దీంతో ఒకింత నైరాశ్యంలో ఉండిపోయారు పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్. ఈ క్రమంలో పరిటాల కుటుంబం పార్టీ మారుతుందన్న పుకార్లు  కూడా వినిపిస్తున్నాయి. దీనికి స్పందిస్తూ తాము ఏ పార్టీకి మారడం లేదని క్లారిటీ కూడా ఇచ్చింది ఆ కుటుంబం. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న శ్రీరామ్ కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నారన్న వార్తలొచ్చాయి. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈ న్యూస్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.మరి ఈ కష్ట కాలం నుంచి యువతను పార్టీ నుంచి జారిపోకుండా బాబు ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.

తెలంగాణ సీఎంగా కేటీఆర్... పట్టాభిషేకానికి సర్వం సిద్ధం!!

టీఆర్ఎస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై గులాబీ నేతలను ఊరిస్తూ వస్తోంది. ఈ సారి తమకు అవకాశం వస్తుందని ఆశావహులు కొండంత ఆశతో ఉన్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పదవుల్లో ఉన్న నేతలు మరోసారి తమ రెన్యువల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక పార్టీలో ఉద్యమ నేతలు వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలు ఎప్పుడెప్పుడు తమకు పదవులు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కార్పొరేషన్ పదవులను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకే ఎక్కువ మొత్తంలో ఇస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఆశావహులు కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ కోసం తాము చేసిన సేవలని గుర్తు చేస్తూ తమ పొలిటికల్ ప్రొఫైల్ అందిస్తున్నారు. అయితే కేటీఆర్ ఆశీస్సులు ఉన్న వారికే పదవులు వస్తాయనే చర్చ టీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. ఇక మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతలు కీలకమైన కార్పొరేషన్ పదవులు లేదా పార్లమెంటరీ సెక్రెటరీ పదవులు వస్తాయన్న ఆశతో ఉన్నారు. లాబీయింగ్ ను ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు నేతలకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ వారిలో కొద్దిమందికి విప్ పదవులు ఇచ్చి సరిపెట్టారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టులతో పాటు దేవాలయ పాలక మండలి చైర్మన్ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. వచ్చే ఏప్రిల్లో టీఆర్ఎస్ ప్లీనరీ జరగబోతోంది. ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ప్లీనరీకి ముందే పదవులన్నింటినీ భర్తీ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం, వేములవాడ, యాదాద్రి వంటి ముఖ్య దేవాలయాలకు పాలక మండలి ఛైర్మన్ లను నియమించాల్సి ఉంది. పార్టీలోని సీనియర్ నేతల తోనే ఈ పదవులు భర్తీ చేస్తారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా లాభదాయక పదవి విషయంలో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇబ్బంది లేకుండా చేసింది. గతంలో ఆరుగుర్ని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన న్యాయ చిక్కుల కారణంగా కొన్నాళ్లకే వారు పదవుల్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలాంటి చిక్కులకు ఆస్కారం లేకుండా ఆర్డినెన్స్ తీసుకురావడంతో పదవులకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.  మరోవైపు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయనకు బలమైన అనుచరగణాన్ని ఇప్పటి నుంచే కేసీఆర్ తయారు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు నేతలంతా ఇప్పటికే కేటీఆర్ తో సంబంధాలు కొనసాగిస్తున్నారు. కేటీఆర్ తమ బాస్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కార్పొరేషన్ పదవులు అందుకున్న వాళ్ళంతా కేటీఆర్ కు అత్యంత సన్నిహితులే. మంత్రి వర్గ కూర్పులను కేటీఆర్ సూచనలనూ కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నారు. దీంతో కేటీఆర్ కాబోయే సీఎం అంటూ నేతలు అభివర్ణిస్తున్నారు. ఏప్రిల్ నాటికి పదవుల భర్తీకి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రతి ప్లీనరీలో సంచలన ప్రకటన చేసే కేసీఆర్ ఈ సారి ప్లీనరీ లోనూ కీలక ప్రకటన చేయబోతున్నారనే వాదన వినిపిస్తోంది. ప్లీనరీ వేదికగా కేటీఆర్ కు పట్టాభిషేకానికి రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే మరో రెండు మూడు సార్లు తానే సీఎంనంటూ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేశారు. దీంతో త్వరలో కేటీఆర్ సీఎం అవుతారంటూ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం చర్చ నీయాంశంగా మారుతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ద్వారా కేటీఆరే వారసుడు అని కెసిఆర్ దాదాపుగా ప్రకటించేశారు. కేంద్రంలో టీఆర్ఎస్ చక్రం తిప్పే అవకాశముంటే ఢిల్లీకి కేసీఆర్ ఇక్కడ కేటీఆర్ సీఎం అని దాదాపుగా పార్టీ ముఖ్యులకు చెప్పేశారు.అయితే అవేమీ జరగక పోవటం, కొన్ని ప్రభుత్వ పథకాలు ట్రాక్ లో పడాల్సి రావడం, స్థానిక సంస్థలుమ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో కేటీఆర్ పట్టాభిషేకాన్ని కొన్నాళ్లు పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాలకు పెద్దగా ప్రభావం చూపడం లేదనే భావన ఉన్నందున ఏడాది లోపే కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి లేదా అంతకంటే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

పవన్ పై రాపాక సంచలన వ్యాఖ్యలు.. డౌట్ లేదు.. వైసీపీలో చేరడం ఖాయం!!

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలిచిందే ఒక్క ఎమ్మెల్యే సీటు అంటే... అసలు గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే తమ వైపు ఉన్నాడో లేడో అర్థంగాక అటు జనసేనాని పవన్ కళ్యాణ్, ఇటు జన సైనికులు తలలు పట్టుకుంటున్నారు. జనసేన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తీరు ఆ పార్టీని కలవరపెడుతోంది. ఎమ్మెల్యే రాపాక పేరుకి జనసేనలో ఉన్నా... ఆయన వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా అధికార పార్టీ వైసీపీకి లాభం చేకూర్చేలా ఉంటున్నాయి. ఒకసారి అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్ ని దేవుడు అని ఆకాశానికెత్తారు. మరోసారెమో జగన్ ఫోటోకి పాలాభిషేకం చేసారు. ఈ చర్యలతో రాపాక పార్టీ మారతారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే రాపాక పార్టీ మారలేదు, ఆయన తీరూ మార్చుకోలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పెడితే ఓకే.. కానీ తెలుగు మీడియంని పూర్తిగా తొలగించడం ఏంటని పవన్ మండిపడుతున్నారు. తెలుగు బాషని కాపాడాలంటూ.. పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే రాపాక మాత్రం.. అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ  సందర్భంగా.. జగన్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా పవన్ కి మద్దతు ఇవ్వట్లేదంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇక తాజాగా రాపాక చేసిన కామెంట్స్ మరింత హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ తాజాగా రైతుల కోసం దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే.. అసెంబ్లీ సమావేశాల కారణంగా పవన్ సభకు హాజరు కాలేదని గతంలో చెప్పిన రాపాక.. తాజాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ.. ఇతర కారణాల వల్ల పవన్‌ సభకు వెళ్లలేదని చెప్పారు. అంతేకాదు, పవన్‌ ఏ కార్యక్రమం చేసినా.. పదిమంది మాత్రమే వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న విషయానికి ధర్నాలు, సభలు పెట్టడం సరికాదని రాపాక సూచించారు. ముందుముందు పవన్‌ సభలకు ఇంకా ఆదరణ తగ్గిపోతుందని షాకింగ్ కామెంట్స్ చేసారు. మొత్తానికి రాపాక తీరు చూస్తుంటే జనసేనకి మరింత దూరం జరుగుతున్నారని అర్థమవుతోంది. వైసీపీలో చేరేందుకు ఆయన ఉత్సాహంగా ఉన్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. మరి రాపాక పార్టీ మారతారో లేక తన తీరుని మార్చుకుంటారో చూడాలి.

మంత్రుల పీఆర్వోల గోస... జగన్ కు వినబడటం లేదా?

సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే... చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలు నిజమేననిపిస్తున్నాయి. మాట తప్పం... మడమ తిప్పమని చెప్పుకునే జగన్... అధికారంలోకి వచ్చాక అనేక హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నేను విన్నాను... నేను ఉన్నానంటూ చెప్పే సీఎం జగన్... కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గోస మాత్రం వినడం లేదంటున్నారు. ముఖ్యంగా మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మంత్రుల దగ్గర పీఆర్వోలుగా చేరి ఆర్నెళ్లు అవుతున్నా ఇఫ్పటివరకు జీతం ఇవ్వలేదని, కనీసం అపాయింట్ మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదని మాజీ జర్నలిస్టులు ఆవేదనకు గురవుతున్నారు. మంత్రులు తమకు నచ్చినవాళ్లను పీఆర్వోలుగా ఏర్పాటు చేసుకున్నాక అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని జీఏడీకి లేఖలు రాశారు. అలాగే నెలకు 30వేలు వేతనం ఇవ్వాలని సూచించారు. అయితే, 30వేలు సరిపోవని, కనీసం 50వేలు ఇవ్వాలంటూ మరో లేఖ రాశారు. మంత్రుల లేఖలు ఆర్ధికశాఖకు వెళ్లాయి. అయితే, పీఆర్వోలకు 30వేలు సరిపోతాయని ఆర్ధికశాఖ మెలిక పెట్టడంతో ఆ ఫైల్ ఎటూ కదలకుండా అక్కడే ఆగిపోయింది. ఇది జరిగి దాదాపు ఆర్నెళ్లు కావొస్తున్నా, పీఆర్వోలు మాత్రం మంత్రుల దగ్గర గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఇవాళోరేపో అపాయింట్ మెంట్ ఆర్డర్స్ వస్తాయని, జీతాలు కూడా వస్తాయన్న ఆశతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, ఆర్నెళ్లు దాటినా ఇంకా అపాయింట్ మెంట్లు, జీతాలు రాకపోవడంతో పీఆర్వోలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కనీసం టీ తాగేందుకు కూడా డబ్బుల్లేక... తమ పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమలిపోతున్నారు. అయితే, మంత్రుల పీఆర్వోలకు సంబంధించిన ఫైలు ఇప్పటివరకు సమాచారశాఖకు అందలేదని అంటున్నారు. అక్కడ్నుంచి ఫైలు ముందుకు కదిలితే తప్ప పీఆర్వోలకు జీతాలు వచ్చే అవకాశమే లేదంటున్నారు.  తమ పాలనలో ఉద్యోగులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానంటూ గొప్పుగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి... ఆచరణలో మాత్రం చూపెట్టడం లేదని అంటున్నారు. కనీసం మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోలకే జీతాలు ఇవ్వకపోతే, ఇక మిగతా ఉద్యోగుల బాధలు ఎలా అర్ధమవుతాయని అంటున్నారు. నేను విన్నాను... నేను ఉన్నాననే జగన్మోహన్ రెడ్డికి... సచివాలయంలో మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోల దుస్థితి వినిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. మరి, మంత్రుల పీఆర్వోల గోస... జగన్ కు ఎప్పుడు వినబడుతుందో... వాళ్ల కష్టాలు ఎప్పుడు తీరతాయో... ఆ దేవుడికే తెలియాలి.

బ్రతకండి..మీ సంస్థను బ్రతికించుకోండి.. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ హితవు

  తీవ్ర నిరాశా నిస్పృహలు.. ఆవేదన.. కూడకట్టుకున్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. భేషరతుగా ఉద్యోగాల్లో చేరొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్ కోర్టుకు పంపగలదని అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడిపోతాయి కాబట్టి తాము అలా చేయటం లేదని ఊరటనిచ్చారు. ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ.100 కోట్ల రూపాయల ఇస్తున్నారని కూడా ప్రకటించారు. సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ పేరిట చార్జీలనూ కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచేశారు. డిసెంబర్ 2 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. సమ్మె కాలంలో తాత్కాలికంగా పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు బెదిరించినా.. అవమానించినా.. భరిస్తూ కష్టకాలంలో పని చేశారని భవిష్యత్తులో తప్పకుండా వారి గురుంచి ప్రభుత్వం ఆలోచిస్తుందని హామీ ఇచ్చారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.  ప్రభుత్వం ఎన్నో సంస్థలను కాపాడింది.. ఎంతో మందికి అన్నం పెట్టింది.. అలాంటిది ఆర్టీసీ కార్మికులను బజారున పడేస్తే ప్రభుత్వానికి వచ్చేది ఏముందని..చివరిగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని కేబినెట్ చర్చల్లో మంత్రులు తెలిపినట్లుగా కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున.. ఆర్టీసీ సంస్థ తరుపున.. సదరు కార్మికుడికి చెబుతున్నా.. " ఇక ఇప్పటికైనా మీరు తెలుసుకోండి.. అందరి మాటలు నమ్మి మీరు మోసపోకండి.. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాను వెళ్లి ఉద్యోగాల్లో చేరి మంచిగ బ్రతకండి.. మీ సంస్థను బ్రతికించుకోండి " అని పిలుపునిచ్చారు కేసీఆర్. మీరు మా బిడ్డలని ఎన్నడో చెప్పాము అలానే చూసుకుంటాము. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల పొట్టనింపామే కానీ పొట్టలు కొట్టిన దాఖలాలు లేవని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆశా వర్కర్లకు,హోమ్ గార్డులకు ఇలా చాలా మందికి ఎక్కువ వేతనం ఇస్తుంది కేవలం తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు 30% శాతం రిస్క్ అలవెన్సు ఇస్తున్నామని.. ఇండియాలో తెలంగాణ ఒక్కటే దీనిని ఇస్తోందన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వారికి పింఛను ఇవ్వట్లేదని, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇవ్వడం లేదని వివరించారు. యూనియన్ల మాటలు నమ్మి కార్మికులు పెడదారి పట్టారని సంస్థను దెబ్బతీస్తున్నారని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు.

అక్టోబర్ 21 నుంచి నవంబర్ 26 వరకు... మహారాష్ట్రలో ఏ రోజు ఏం జరిగిందంటే...!

# (అక్టోబర్‌ 21)న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా... బీజేపీ-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్-ఎన్సీపీ మరో కూటమిగా బరిలోకి దిగాయి. # (అక్టోబర్‌ 24)న మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 288 స్థానాలకు బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే, కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ-శివసేనకు కలిపి 161 స్థానాలు రావడంతో... ఎప్పటిలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంతా భావించారు.  # (అక్టోబర్‌ 25)న బీజేపీ, శివసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన... ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం మేరకు ము‌ఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనంటూ పట్టుబట్టింది. అయితే, శివసేన డిమాండ్‌ను బీజేపీ తిరస్కరించడంతో మహా డ్రామా మొదలైంది. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శివసేన... ఎన్సీపీ అండ్ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపింది. మరోవైపు, శివసేనను చీల్చి, ఇండిపెండెంట్ల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదిపింది. ఇలా అక్టోబర్ 25నుంచి నవంబర్ 9వరకు మహారాష్ట్రలో నెంబర్ గేమ్ సాగింది. # (నవంబర్ 9) మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియడంతో, ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు.  # (నవంబర్ 10) తగినంత సంఖ్యాబలం లేనందున తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ తేల్చిచెప్పడంతో, సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన శివసేనను ఆహ్వానిస్తూ, 24గంటల గడువిచ్చారు. # (నవంబర్ 11) అయితే, ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికొచ్చిన శివసేన... చర్చల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు 3రోజులు గడువు ఇవ్వాలని గవర్నర్‌ను కోరింది. శివసేన విజ్ఞప్తిని తిరస్కరించిన గవర్నర్... మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన ‎ఎన్సీపీకి ఆహ్వానం పలికారు.  # (నవంబర్ 12) అయితే, ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే, రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడంతో... కేంద్రం, రాష్ట్రపతి ఆమోదంతో ఆగమేఘాల మీద, ప్రెసిడెంట్‌ రూల్ విధించారు. # (నవంబర్ 13) గవర్నర్‌ నిర్ణయంపై మండిపడ్డ శివసేన... ప్రభుత్వ ఏర్పాటుకు తాము గడువు కోరినా, ఇవ్వలేదంటూ, సుప్రీంను ఆశ్రయించింది. # (నవంబర్ 13-21) ఒకవైపు సుప్రీంలో కేసు నడుస్తుండగానే... మరోవైపు కాంగ్రెస్‌, ఎన్సీపీలతో శివసేన సంప్రదింపులు సాగించింది. అయితే, శరద్ పవార్‌‌ను మోడీ ప్రశంసించడం... వెంటనే ప్రధానితో పవార్ సమావేశం కావడంతో... బీజేపీ-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయేమోనంటూ ప్రచారం జరిగింది. # (నవంబర్ 22) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య చర్చలు కొలిక్కిరావడంతో, ఉద్ధవ్‌కు మద్దతిచ్చేందుకు సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహారాష్ట్ర వికాస్ అఘాడీ పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు. # (నవంబర్ 23) అయితే, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవడంతో... బీజేపీ రాత్రికి రాత్రే వేగంగా పావులు కదిపింది. ఎవరూ ఊహించనివిధంగా ఉదయం 5:47కి రాష్ట్రపతి పాలన ఎత్తేయగా, ఆ కొద్దిసేపటికే ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా... ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో, దేశం మొత్తం నివ్వెరపోయింది. ఇక, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ అయితే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాయి. ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంతో... ఎన్సీపీలో చీలిక వచ్చిందేమోనని భావించారు. అయితే, అజిత్ వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని శరద్ పవార్ ప్రకటించడంతో మహా డ్రామా మరో కొత్త మలుపు తిరిగింది. అదే సమయంలో, గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సుప్రీంను ఆశ్రయించాయి.  # (నవంబర్ 24) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పిటిషన్లపై అత్యవసర విచారణ జరిపిన సుప్రీం... గవర్నర్‌కు బీజేపీ సమర్పించిన మద్దతు లేఖలను తమ ముందు పెట్టాలని ఆదేశించింది. # (నవంబర్ 25) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌లు బల ప్రదర్శనకు దిగాయి. 162మంది ఎమ్మెల్యేలతో మహా పరేడ్ నిర్వహించాయి.  # (నవంబర్ 26) మహారాష్ట్ర వివాదంపై తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.... బలనిరూపణ చేసుకోవాలంటూ ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఒక్కరోజు టైమిచ్చింది. అయితే, సుప్రీం తీర్పు తర్వాత మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే, బలపరీక్షకు ముందే చేతులెత్తేసిన ఫడ్నవిస్‌... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  # (నవంబర్ 26-27) బలపరీక్షకు ముందే బీజేపీ చేతులెత్తేయడంతో... ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ముందడుగు వేసింది. మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి నేతగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను అందజేశారు. దాంతో, డిసెంబర్ ఒకటిన శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే‌.... డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్... కాంగ్రెస్ లీడర్‌ బాలా సాహెబ్‌ థోరాట్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కేసీఆర్ గెలవలేదు... కార్మికులు ఓడిపోలేదు... అశ్వద్ధామ వింత ప్రకటన...

ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పోరుబాట పట్టిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ పోరాటానికి ముగింపు పలికారు. డిమాండ్ల సాధన కోసం 52రోజులుగా చేస్తోన్న సమ్మెను విరమించారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్... విధులకు హాజరవుతామని ప్రకటించింది. ఒకవైపు హైకోర్టులో ఆశించిన న్యాయం జరగకపోవడం... మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో... విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు ముగింపు పలికారు. అయితే, లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని అశ్వద్ధామరెడ్డి వ్యక్తంచేశారు. ప్రభుత్వం గెలవలేదు... కార్మికులు ఓడిపోలేదంటోన్న అశ్వద్ధామరెడ్డి.... ఆర్టీసీని కాపాడుకునేందుకే సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. కార్మికులెవరూ నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటివరకు చరిత్రలో లేనివిధంగా 52రోజులపాటు పోరాటంచేసి కార్మికులు నైతిక విజయం సాధించారని అన్నారు. ఇక, సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండంగా ఉంటుందని, అన్నివిధాలా ఆదుకుంటుందని ప్రకటించారు. అయితే, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపట్నుంచి విధులకు రావొద్దని కోరిన అశ్వద్ధామరెడ్డి... కార్మికులను అడ్డుకోవద్దని ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. అయితే, నాలుగైదు రోజులుగా తిరిగి విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నిస్తున్నా... అధికారులు మాత్రం తిప్పిపంపుతున్నారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దాంతో పలు డిపోల దగ్గర ఆర్టీసీ కార్మికులు పడిగాపులు పడుతున్నారు. అయితే, సమ్మె విరమించి విధుల్లోకి చేరతామని ప్రకటించినందున... కార్మికులను అడ్డుకోవద్దని ఆర్టీసీ యాజమాన్యానికి అశ్వద్ధామరెడ్డి విజ్ఞప్తి చేశారు. కానీ, ఇప్పటికిప్పుడు విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది.

ఫ్లైఓవర్సా? మృత్యు మార్గాలా?

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్స్ ...మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఫ్లైఓవర్లు నెత్తుటితో తడుస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రతి ఫ్లైఓవర్‌పైనా నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. దాంతో, ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక, గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్లైఓవర్‌పై... జరిగిన ప్రమాదమైతే.... హైదరాబాదీల్లో వణుకు పుట్టిస్తోంది. అయితే, బయోడైవర్సిటీ ప్లైఓవర్ ను ప్రారంభించిన 20రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరగడం... ముగ్గురు మృత్యువాతపడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బయోడైవర్సిటీ ప్లైఓవరే కాదు.... బేగంపేట్ - పంజగుట్ట ఫ్లైఓవర్ పై కూడా పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఇక, నల్గొండ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ పైనే తరుచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మలక్ పేట్‌ రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి సైదాబాద్ వెళ్లే ఫ్లైఓవర్ పైనా కర్వ్ ఉండటంతో నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది. అయితే, హైదరాబాద్ లో బయోడైవర్సిటీ ప్లైఓవరే అత్యంత డేంజర్ అంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. హైదరాబాద్‌లో నిర్మించిన ఫ్లైఓవర్లలో అత్యంత ఎత్తైనది గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్లైఓవర్. నల్గొండ క్రాస్‌రోడ్‌ ఫ్లైఓవర్‌ రేడియస్‌ 40 మీటర్లు ఉంటే, పంజగుట్టది 60 నుంచి 65 మీటర్లు ఉంటుంది. ఇక, బయోడైవర్సిటీ రేడియస్ మాత్రం 80 నుంచి 120 మీటర్లుగా ఉంది. ఈ ఫ్లైఓవర్‌పై గంటకు ప్రయాణ వేగం  40 కిలోమీటర్లతోనే వెళ్లాలి.. కానీ బోల్తాపడ్డ కారు ప్రమాద సమయంలో 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ...సూపర్‌ ఎలివేషన్‌తో క్రాష్‌ బారియర్స్‌ ఉన్నా ...పైకెగిరి కిందపడింది. 80 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టినా తట్టుకునేలా క్రాష్‌ బారియర్స్‌ ఏర్పాటు చేశారు. సాధారణంగా క్రాష్‌ బారియర్స్‌ను ఢీకొంటే.. వాహనం తిరిగి వెనక్కి వస్తుంది. కానీ నియంత్రించలేని అతి వేగం వల్ల క్రాస్‌బారియర్స్‌ ను దాటుకుని పైకెగిరి మరీ కారు కింద పడినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. అయితే, రాయదుర్గం నుంచి హైటెక్ సిటీ, ఇనార్బిట్ మాల్‌ వైపు వెళ్లేందుకు ఎలాంటి ఆటంకాల్లేకపోవడంతో బయోడైవర్సిటీ ప్లైఓవర్ పైనుంచి అతివేగంతో దూసుకుపోతున్నారు. అయితే, వంతెన మధ్య భాగంతో దాదాపు 150 మీటర్ల మేర కర్వ ఉండటంతో... వేగాన్ని నియంత్రించాలని ప్రయత్నించినా సాధ్యంకాకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణంగా డిజైన్ లోపం ఒకటైతే.... జాగ్రత్తలు తీసుకోకపోవడం మరో రీజన్.  బయోడైవర్సిటీ ప్లైఓవర్ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. ముఖ్యంగా బయోడైవర్సిటీ ప్లైఓవర్‌ ను ప్రారంభించిన 20రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరగడం ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పౌరుల్లో మార్పు రాకపోతే, ఇలాంటి ప్రమాదాలను అరికట్టలేమంటున్నారు మరికొందరు. ఇదిలా ఉంటే, వాహనదారులు ట్రాఫిక్స్ రూల్స్ తోపాటు స్వీయ క్రమశిక్షణ పాటించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. బయోడైవర్సిటీ ప్లైఓవర్‌పై గరిష్ట వేగం 40 కిలోమీటర్లు మించరాదని, అలాగే, రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వెళ్లేవాళ్లు ఫ్లైఓవర్ ఎక్కొద్దని, మలుపులు దగ్గర ఓవర్ టేక్ చేయొద్దని సూచిస్తున్నారు. బయోడైవర్సిటీ ప్లైఓవర్‌‌పై సీపీ కెమెరాలు ఉన్నాయంటోన్న పోలీసులు... గరిష్ట వేగం 40 కిలోమీటర్లు మించితే, కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో 12వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం

పాఠశాలల సంఖ్యను కుదించేందుకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక పాఠశాలకు మరో పాఠశాలకు మధ్య అయిదు కిలోమీటర్ల దూరం వుండేలా చర్యలు తీసుకునున్నట్లు సమాచారం. సర్కారు విద్యా చట్టం సవరణ చేయటంతో పది నుంచి పన్నెండు వేల పాఠశాలలు మూతపడనున్నాయి.కనీస స్థాయిలో విద్యార్థులు లేని సర్కారీ పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవరోధంగా నిలిచిన విద్యా హక్కు చట్టానికి కీలక సవరణలు తలపెట్టింది. ఇందులో భాగంగానే ఊరికి.. పాఠశాలకు మధ్య అనుమతించదగ్గ గరిష్ఠ దూరాన్ని ఐదు కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీని పై పరిశీలనకు ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీలో హైదరాబాద్ ఆర్జేడీ,డీఈవో రంగారెడ్డి డీఈవో, రెండు జిల్లాల నుంచి ఒక డిప్యూటీ ఈవో, ఎంఈవోతో పాటు సమగ్ర శిక్షణ ఏఎస్పీడి సభ్యులుగా ఉన్నారు. విద్యా హక్కు చట్టం సవరణల పై పరిశీలన చేయాలని విద్యా శాఖ ఈ కమిటీని ఆదేశించింది.దీని పై ఈ నెల ( నవంబర్ 22న) సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక కిలో మీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల మూడు కిలో మీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రాధమిక ఉన్నత పాఠశాల ఉండాలి. ఈ నిబంధనను మార్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చిన నిబంధనల ప్రకారం ఏ పాఠశాల అయినా సరే ఐదు కిలో మీటర్ల పరిధిలో ఒకటి ఉంటే సరిపోతుంది. దీనివల్ల రాష్ట్రంలో భారీ సంఖ్యలో పాఠశాలలు మూతపడే అవకాశముంది. ఇప్పటికే సుమారు నాలుగు వేల స్కూళ్ల వరకు మూసివేతకు రంగం సిద్ధం చేసిన అధికారులు ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో మరిన్ని స్కూళ్లు మూసివేసే అవకాశం ఉంది. దీని పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.నిర్ణయం అమలైతే తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్య కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారుగా 10,000 నుంచి 12,000 వేల పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని ఓ ఉపాధ్యాయుడు అంచనా వేశారు.ఇందులో మెజారిటీ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలే కావడం గమనార్హం. ఈ పాఠశాలలే కిలో మీటరుకు ఒకటి ఉండటమే ఇందుకు కారణం.  గతంలోనే 15 మంది విద్యార్ధుల లోపు ఉన్న పాఠశాలను దగ్గర లోని పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించారు. దీంతో 3000 బడులు మూతబడతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో మొత్తం  26,050 ప్రభుత్వ పంచాయతీ రాజ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 18,230 ప్రాథమిక 3,179 ప్రాథమిక ఉన్నత, 4641  యొక్క ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 916 పాఠశాలల్లొ జీరో అడ్మిషన్ లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.విద్యా శాఖ నిర్ణయం అమలయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు దాదాపుగా 70% శాతం మూతపడే ప్రమాదముంది. స్కూళ్ల మధ్య దూరాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమం తప్పదని ఈ నిర్ణయం వల్ల భారీగా సర్కారీ బడులు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయని అంటున్నారు. దీంతో గ్రామీణ తండాల్లోని విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఎంఎంటీఎస్ చరిత్రలో తొలి ప్రమాదం... భయాందోళనలకు గురవుతోన్న ప్రయాణికులు...

  టీడీపీ అధినేత, అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో ఎంఎంటీఎస్ పురుడు పోసుకుంది. పెరుగుతున్న జనాభా, తీవ్రమవుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఈ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు రూపకల్పన చేశారు చంద్రబాబు. కొత్తగా ఎలాంటి రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టకుండానే... ఉన్న వాటిని వినియోగించుకుంటూ... అద్భుతమైన, సౌకర్యవంతమైన ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ కు మొదట్లో ఆశించినంత ఆదరణ లభించకపోయినా, అనంతరం ఎవరూ ఊహించనిస్థాయిలో పుంజుకుంది. ఒక్కో ట్రైన్ లో కోచ్ ల సంఖ్య 12కి పెరగడంతోపాటు అత్యాధునిక టెలిస్కోపిక్ బోగీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో 25వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో మొదలైన ఎంఎంటీఎస్ సేవలు అంచెలంచెలుగా పెరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ చేరుకునేవారంతా... తమ చివరి గమ్యస్థానాలకు చేరడానికి ఎంఎంటీఎస్ నే ఆశ్రయించేస్థాయికి చేరింది. ఇక, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతోపాటు ఐటీ ఎంప్లాయిస్ పెద్దఎత్తున ఈ ఎంఎంటీఎస్ ను వినియోగిస్తున్నారు. దాంతో, ప్రతిరోజూ సుమారు రెండు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది ఈ ఎంఎంటీఎస్. హైదరాబాదీల బిజీ జీవితంలో ఎంఎంటీఎస్ ఒక భాగమైపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంఎంటీఎస్ సర్వీసులను....రాత్రి 11గంటల వరకు మొత్తం 121 ట్రిప్పులు నడిపిస్తున్నారు. ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్‌–లింగంపల్లి మధ్య ఈ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే, పదహారేళ్ల ఎంఎంటీఎస్ చరిత్రలో మొదటిసారి ప్రమాదం చోటు చేసుకోవడంతో హైదరాబాదీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కర్నూలు ఎక్స్ ప్రెస్ ను ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టడంతో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే, ప్రమాదం జరిగే సమయంలో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. ఏ కొంచెం వేగం ఉన్నా... ఊహించని ప్రాణనష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు అంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులకు సెపరేట్ ట్రాక్ లేకపోయినప్పటికీ, ఇఫ్పటివరకు ఎలాంటి ప్రమాదాలు చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఎంఎంటీఎస్ చరిత్రలో తొలిసారి ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.