మేఘా వెనుక కేవీపీ.! కాళేశ్వరం, పోలవరం కాంట్రాక్టులు అందుకే దక్కాయా?

కేవీపీ రామచంద్రరావు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి ఆత్మ... ఇప్పుడదే ఆత్మ రెండు రాష్ట్రాల్లోనూ, తెర వెనకుండి నడిపిస్తోందన్న వాదన, రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌‌గా సాగుతోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలో కేవీపీ మాటే చెల్లుబాటు అవుతోందని అంటున్నారు. తెలంగాణ కాళేశ్వరం... ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుల కాంట్రాక్టులను మేఘా సంస్థ దక్కించుకోవడం వెనుక కేవీపీనే ఉన్నారనే మాట వినిపిస్తోంది. అంతేకాదు, కేసీఆర్-జగన్ ఫ్రెండ్షిప్ వెనుకా కేవీపీయే ఉన్నారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోంది మేఘా సంస్థే... అయితే, మేఘాకి ఈ ప్రాజెక్టు దక్కడం వెనుక కేవీపీ కీలక పాత్ర పోషించారన్న వాదన ఉంది. ఎందుకంటే, ప్రత్యక్షంగా కనిపించకపోయినా, కేసీఆర్‌కు కేవీపీకి మంచి సంబంధాలున్నాయని అంటున్నారు. ఇద్దరి సామాజికవర్గం కూడా ఒక్కటే కావడమూ కారణమంటున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోన్న కంపెనీయే ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లో పోలవరం కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే, మేఘా సంస్థ... పోలవరం కాంట్రాక్టు దక్కించుకోవడం వెనుక కూడా కేవీపీయే ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. వందల కోట్ల రూపాయల నష్టం వస్తుందని తెలిసినప్పటికీ, 12.6 శాతం తక్కువకు కోట్ చేస్తూ, మేఘా సంస్థ బిడ్ దాఖలు చేయడం వెనుక కేవీపీ వ్యూహం ఉందని మాట్లాడుకుంటున్నారు. మేఘా కంపెనీ ఇంత తక్కువకు బిడ్ దాఖలు చేయడం వెనుక, కేవీపీతోపాటు జగన్ కూడా ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే, మేఘాకి పోలవరం కాంట్రాక్టు దక్కడంతో వైసీపీ నేతలు ఖుషీ అవుతున్నారట. మరోవైపు, మేఘా సంస్థలో కేవీపీకి భారీగా షేర్లు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అందుకే మేఘా కంపెనీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కాంట్రాక్టులు దక్కేలా చేస్తున్నారని అంటున్నారు.

నేను, నా తమ్ముడు చేసిన తప్పు.. ర‌జ‌నీ, కమల్ చేయొద్దు: చిరంజీవి

  జీవితంలో అనుభవం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన అనుభవంతో మిగతా స్టార్ హీరోలకు పాఠాలు చెబుతున్నారు. ఆ పాఠాలు సినిమాలకు సంబంధించినవి అనుకుంటే పొరపాటే, రాజకీయాలకు సంబంధించినవి. చిరంజీవి సినిమాల్లో మెగాస్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైంలో 2008 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 2009 ఎన్నికల్లో బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో చిరంజీవి ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన చిరంజీవి.. తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోయారు. ఇక పార్టీ కూడా 18 స్థానాలతో సరిపెట్టుకుంది. తర్వాత కొందరి సలహాతో 2011 లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. రాజ్యసభకు ఎంపికై కేంద్ర కేబినెట్ లో పనిచేసారు. ఓ రకంగా చిరంజీవి రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదనే చెప్పాలి. దీంతో చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు. ఇక చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 2014 లో జనసేన పార్టీని స్థాపించారు. అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్ష పోరుకి దిగారు. కానీ చిరంజీవి కంటే దారుణమైన ఫలితాన్ని చవిచూశారు. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. పార్టీ కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకుంది. అయినా పవన్ తన పోరాటం ఆగదంటున్నారు. అయితే చిరంజీవి మాత్రం ప్రజారాజ్యం, జనసేన పార్టీలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, మరియు రాజకీయాల్లో తనకున్న ప్రత్యక్ష అనుభవంతో.. సినిమా స్టార్లు రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా త‌మిళ మేగ‌జైన్ ఆనంద విక‌ట‌న్‌కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చిరంజీవి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేసారు. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లను రాజ‌కీయాల్లోకి రావ‌ద్దంటూ స‌ల‌హా ఇచ్చారు.  "నేను సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్ స్టార్‌గా రాణిస్తున్న స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. అయితే ప్ర‌త్య‌ర్థులు కోట్లు కుమ్మ‌రించ‌డంతో సొంత నియోజ‌క వ‌ర్గంలోనే ఓడిపోయాను. నా సోద‌రుడు ప‌వ‌న్‌ కళ్యాణ్ విష‌యంలోనూ అదే జ‌రిగింది" అని అన్నారు. ప్ర‌స్తుతం రాజకీయాలు పూర్తిగా డ‌బ్బుమ‌య‌మైయ్యాయ‌ని, సౌమ్యుల‌కు రాజ‌కీయాలు అంత సుల‌భ‌మైతే కాదని, నిజాయ‌తీగా ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌నుకున్నా ఏమీ చేయ‌లేర‌ని ఆయ‌న తెలిపారు. న‌న్న‌డిగితే ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లు రాజ‌కీయాల్లోకి రావొద్ద‌నే స‌ల‌హా ఇస్తాను అని చిరంజీవి స్పష్టం చేసారు. మొత్తానికి చిరంజీవికి అనుభవంతో తత్త్వం బోధ పడింది. రాజకీయాలకు దూరం పాటించాలని సలహాలు ఇస్తున్నారు. మరి ఇప్ప‌టికే మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీతో క‌మ‌ల్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసారు. ర‌జ‌నీ కూడా త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. మరి వీరిద్దరూ చిరంజీవి సలహాతో ఆలోచనలో పడతారో, లేక అనుభవమే పాఠాలు నేర్పుతుంది అంటూ ముందుకి సాగుతారో చూడాలి.

ముప్పై చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేసిన జైషే మహమ్మద్...

  భారత్ లో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి కుట్ర పన్నారు, దేశ వ్యాప్తంగా ముప్పై చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చేసిన ఈ కుట్రను ఇంటెలిజెన్స్ బ్యూరో పసిగట్టింది. జైషే మహమ్మద్ విడుదల చేసిన లేఖను ఐబీ కనిపెట్టింది. పాక్ భూభాగం లోని బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలు మళ్లీ వెలిశాయని, మరోసారి దాడులకు సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ ప్రకటించిన రెండు రోజుల్లోనే జైషే మహమ్మద్ కుట్ర బయటకు రావడంతో అందరూ అలర్ట్ అయ్యారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ తీవ్రమైన కడుపు మంటతో ఉంది. భారత్ ని నేరుగా ఎదుర్కోలేకపోతున్న పాక్ ముష్కరులుని రెచ్చగొట్టి విధ్వంసాలకు కుట్ర చేస్తుందని సమాచారం. భారత్ లో భారీ విధ్వంసాలకు పాల్పడటమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ని కూడా హిట్ లిస్ట్ లో పెట్టుకున్నామని, వారిని హత్య చేస్తామని జైషే మహమ్మద్ విడుదల చేసిన లేఖతో బయటపడింది. జైషే మహమ్మద్ చేస్తున్న ఈ కుట్రకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ సహకారం అందిస్తున్నట్టు ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో కనిపెట్టింది. ఆర్టికల్స్ 370 రద్దుతో కాశ్మీర్ లో పాకిస్తాన్ పప్పులుడికేలా పరిస్థితి కనిపించకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉగ్రమూకల్ని రెచ్చగొడుతోంది. ఇప్పుడు జైషే మహమ్మద్ చేసిన కుట్ర కూడా కాశ్మీర్ పై ఉన్న కడుపుమంటే అని తెలుస్తుంది. ఐబీ కనిపెట్టిన జైషే మహమ్మద్ లేఖలో అనేక ఉగ్ర కుట్రకు సంబంధించిన లింక్స్ ఉన్నాయి. దేశంలో ముప్పై చోట్ల పేలుళ్లకు వేసిన ప్లాన్ లో గాంధీనగర్, కాన్పూర్, లక్నో ఎయిర్ పోర్ట్ లు కూడా ఉన్నాయి. ఈ మూడు ఎయిర్ పోర్ట్ లను పేల్చేయాలని పన్నాగం పన్నింది పాకిస్తాన్. దీంతో ఇండియన్ ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా సెక్యూరిటీని అలర్ట్ చేసింది. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినా పాకిస్థాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన తరువాత మసూద్ అజర్ ని అదుపులోకి తీసుకుని జైలులో పెట్టిన పాకిస్తాన్, సరిగ్గా నెల రోజుల క్రితం అతన్ని వదిలేసింది. మసూద్ అజర్ బయటకు రాగానే బాలాకోట్ లో మళ్లీ ఉగ్రక్యాంప్ లు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన భారత ఆర్మీ రెండు రోజుల క్రితమే పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చింది. బాలాకోట్ లో జరుగుతున్న ఉగ్రవాద శిక్షిణా శిబిరాలపై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించింది.

కేసీఆర్ దాచిన రెండు సీక్రెట్ పథకాలు...

తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా రెండు స్కీములు ఉన్నాయని, అవి పెడితే మీ పని ఖతమేనని, అవి అమలైతే గతంలో చెప్పినట్లుగా రెండు మూడు సార్లు గెలుస్తాం అంటూ ధీమాతో కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు ఆయన దాచిన ఆ రెండు అద్భుత పథకాలు ఏంటి, వాటిని అమలు చేస్తే కేసీఆర్ కు అధికారం మళ్లీ వస్తుందా, ఇంతకీ కేసీఆర్ దాచిన పథకాలు ఏంటని తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ విమర్శల వర్షం గుప్పించారు. అమావాస్య, పౌర్ణానికి వచ్చి లొల్లిచేసే బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవన్నారు. కాంగ్రెస్ అసలు తమకు పోటీనే కాదంటూ గడిచిన ఎన్నికలకు, ఈ ఎన్నికలకు ఎవరి బలం తగ్గిందో తెలుసుకోండని లెక్కలు చెప్పారు. కేసీఆర్ అంత ధీమాగా ఆ రెండు పథకాల గురించి చెప్పడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేసీఆర్ అమ్ముల పొదలోని అస్త్రాలు తెలంగాణ అంతటా ఉచిత వైద్యం, యువతకు ఉద్యోగాల కల్పన అనే చర్చ గులాబీ ముఖ్యుల వర్గాల్లో సాగుతోందని సమాచారం. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 3.5 కోట్ల మంది మొత్తం జనాభాకు అందరికీ ఉచిత వైద్యం అందిస్తే ఎంత లెక్క అవుతుందని కె.సి.ఆర్ ఆరా తీశారట. పేదలకు ఉచితంగా ఉన్నత వర్గాలకు కొంత మొత్తం వసూలు చేసి హెల్త్ కార్డులు ఇచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉచిత వైద్యం అందించేందుకు కేసీఆర్ ఇప్పటికే దీనిపై నివేదికలు, అంచనాలూ, ఖర్చు లెక్కను తెప్పించుకున్నారట. వచ్చే 2024 ఎన్నికల ముందర ఈ అద్భుత పథకాన్ని ప్రవేశ పెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చే స్కెచ్ గీసినట్టు తెలిసింది. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన, తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల లెక్కలు తీసి పరిశ్రమలతో కలిసి ప్రభుత్వం నడిపించే అన్నిట్లోనూ, ప్రైవేటు పరిశ్రమల్లోనూ ప్రభుత్వమే రిక్రూట్ చేసే కొత్త పథకాన్ని కేసీఆర్ రూపొందించారట. వైన్ షాపులు, రేషన్ షాపులు ఇతర ప్రభుత్వ సేవలన్నింటినీ యువతకు అప్పగించేందుకు ప్లాన్ చేశారట. ఖాళీగా ఉండే వారికి నెలకు నిరుద్యోగ భృతి ఇస్తారట. ఈ రెండు పథకాలకు బడ్జెట్ కొరతతో కేసీఆర్ ప్రస్తుతానికి పక్కన పెట్టినప్పటికీ భవిష్యత్లో అధికారంలోకి రావటానికి ఇవే సోపానాలని భావిస్తున్నారట. కేసీఆర్ దాచిన రెండు సీక్రెట్ పథకాలు ఇవేనంటూ ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అమీర్ పేట మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన విషాదానికి కారణాలు ఇవేనా..?

  అమీర్ పేట మెట్రో స్టేషన్ దగ్గర నిన్నరాత్రి విషాదం చోటు చేసుకుంది. అమీర్ పేట మెట్రో స్టేషన్ దగ్గర జోరుగా వర్షం కురుస్తుండటంతో, అప్పుడే తన సోదరితో కలిసి మెట్రో రైలు దిగిన ఓ యువతి తడవకుండా ఉండేందుకు మెట్రో పిల్లర్ కిందకు వెళ్లింది. కొద్ది సేపటికే పైనుంచి పెచ్చులు ఊడి నేరుగా ఆమె తలపై పడ్డాయి, అంతెత్తు నుంచి పడ్డ పెచ్చుల ధాటికి ఆమె తల పగిలిపోయింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.  వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద చోటు చేసుకున్న ఈ ఘటన హైదరాబాదీలను భయపెడుతోంది. మృతురాలిని కూకట్ పల్లిలో నివాసముంటున్న మౌనికగా గుర్తించారు. మౌనికా స్వస్థలం మంచిర్యాల జిల్లా శ్రీరాం పూర్, భర్త కంతాల హరికాంత్ రెడ్డి, ఏడాది క్రితమే వీరికి వివాహమైంది. హరికాంత్ కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగం రావటంతో ఆరు నెలల క్రితమే ఈ దంపతులు నగరానికొచ్చి కూకట్ పల్లి ఫేస్ త్రి ఎస్సార్ హోమ్స్ లో నివాసముంటున్నారు. తన చిన్నాన్న కూతురు నికితను అమీర్ పేటలో ని ఓ ప్రైవేట్ హాస్టల్లో చేర్పించేందుకు మౌనిక ఆదివారం మధ్యాహ్నం కూకట్ పల్లిలో మెట్రో రైలు ఎక్కింది. ఇద్దరూ కలిసి అమీర్ పేటలో దిగారు, వర్షం కురుస్తుండటంతో సారధీ స్టూడియో వైపు ఉన్న మెట్ల ద్వారా కిందకు దిగారు. ఇద్దరు ఏ 1053 మెట్రో పిల్లర్ కింద నిలుచున్నారు, అనుకోకుండా మూడో అంతస్థులోని గోడకు చెందిన పెచ్చులు ఒక్క సారిగా ఊడి మౌనిక తలపై పడ్డాయి. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి పెచ్చులు పడటంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమె సోదరి, స్థానికుల్లో కొందరు కలిసి బాధితురాల్ని ఓ ఆటోలో హుటాహుటిన దగ్గర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మౌనిక మృతి చెందినట్టు నిర్ధారించారు. సోదరిని హాస్టల్లో చేర్పించి గంటలో తిరిగి వస్తారని తనతో చెప్పి వెళ్లిన భార్య కొద్ది సేపటికే తిరిగి రాని లోకాలకు వెళ్లిందని తెలిసి మౌనిక భర్త హరికాంత్ రెడ్డి షాక్ కు గురయ్యాడు, మృతదేహం వద్ద బోరున విలపించాడు. పెళ్లైన సంవత్సరానికే తనను వీడి వెళ్లిపోయావా అంటూ అతడు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. సర్ఫేస్ వాల్ నుంచి చిన్న ప్లాస్టర్ ముక్క పడిందనీ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి పడటంతో ఆమె తీవ్రంగా గాయపడి చనిపోయిందని చెప్పారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు, మౌనిక కుటుంబానికి పరిహారమివ్వాలని ఎల్ అండ్ టీ మెట్రో సంస్థకు ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ కే తలమానికంగా ఉన్న మెట్రో రైలుకు సంబంధించి జరిగిన ఈ దుర్ఘటన నగర వాసులను భయపెడుతోంది. హైదరాబాదీల జీవితంలో భాగమైన మెట్రో రైల్లో ప్రమాదం జరగటం ప్రజలల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మెట్రో నిర్మాణంలో లోపాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. హడావుడిగా మెట్రో నిర్మాణాన్ని ముగించటం, ప్రీ కాస్ట్ విధానంలో నిర్మించిన పిల్లర్లు, వాటిపైన ఏర్పాటు చేపట్టిన వడయాక్ట్ సిగ్మెంట్ల మధ్య ఖాళీ ప్రదేశాన్ని పటిష్ఠంగా మూసివేయకపోవడం, ఇప్పటికీ రవాణా కొనసాగుతున్న స్టేషన్ల దగ్గర ఇంకా నిర్మాణ పనులు కొనసాగిస్తూనే ఉండడం, మెట్రో రైళ్లు పరిగెత్తే సమయంలో పిల్లర్ల వణకడం, ప్రీ కాస్ట్ కాంక్రీటు నిర్మాణానికి దానిపైన చేసిన సిమెంట్ బాండింగ్ కి మధ్య పటిష్టంగా లేకపోవడం ఈ పెచ్చులూడటానికి కారణంగా తెలుస్తోంది.

వారం రోజుల్లో బాబు బయటకి.. వైసీపీ పంతం నెగ్గినట్టే!!

  వైసీపీ అధికారంలోకి రాగానే అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం అంటూ శంఖారావం మోగించింది. అందులో భాగంగా ఏకంగా 'ప్రజావేదిక' నే కూల్చి వేసింది. ప్రజాధనాన్ని వృథా చేసిందని విమర్శలు కూడా ఎదుర్కొంది అది వేరే విషయం. ఆ కూల్చివేత ప్రజావేదిక తో ఆగిపోలేదు. పలువురు ప్రతిపక్ష టీడీపీ నేతలకు నోటీసులు వచ్చాయి. కొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుకోవాలి. ఉండవల్లిలో నివాసం ఉంటున్న ఇంటికి ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంటిని ఖాళీ చేయాలనీ చెప్పారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఆ ఇల్లు అక్రమ నిర్మాణం, దాన్ని కూల్చివేయాల్సిందే అని చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నట్టుండి మళ్లీ తెరమీదకు వచ్చింది. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయన ఇంటి గోడకు అధికారులు నోటీసులు అంటించారు. లింగమనేని రమేష్‌ పేరుతో సీఆర్డీఏ నోటీసులు అంటించింది. వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులనూ ప్రస్తుత నోటీసులో సీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన సీఆర్డీఏ నోటీసులకు ఇంటి యజమాని రమేష్ వివరణ ఇచ్చారు. అయితే రమేష్‌ వివరణ సంతృప్తికరంగా లేదని సీఆర్డీఏ నోటీసులో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ లను నిర్మించారని తెలిపారు. కాగా, ఈ నోటీసుల వ్యవహారంపై లింగమనేని రమేష్ స్పందించారు. ఇంటి నిర్మాణ సమయానికి సీఆర్డీఏ లేదని పేర్కొన్నారు. ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించామని తెలిపారు. స్విమ్మింగ్‌పూల్‌కి రివర్‌ కన్సర్వేటర్‌ అనుమతి ఉందని రమేష్‌ వెల్లడించారు. మరి ఈ నోటీసుపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు.. గతంలో రమేష్ వివరణతో సంతృప్తి చెందని అధికారులు.. ఈసారి మాత్రం సంతృప్తి చెబుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు వారం రోజుల్లో ఇంటిని ఖాళీ చేయక తప్పేలా లేదు. అదే జరిగితే అధికార పార్టీ పంతం నెగ్గినట్టే. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ.. చంద్రబాబుని ఆ ఇంటి నుండి ఖాళీ చేయించాలని పట్టుదలతో ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

టార్గెట్ రేవంత్.... టీకాంగ్రెస్ లో ఏకమైన సీనియర్లు

    హుజూర్‌నగర్ ఉపఎన్నిక... ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలను ఏకంచేసింది. హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక అభ్యర్ధిత్వంపై తలెత్తిన వివాదంతో నల్గొండ కాంగ్రెస్‌ నేతలంతా ఏకమయ్యారు. హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్ధిగా తన భార్య పద్మావతిని ఉత్తమ్ ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించడంతో సీనియర్లంతా ఏకమవుతున్నారు. అసలు నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో వేలు పెట్టడానికి రేవంత్ ఎవరంటూ ఏకతాటిపైకి వస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ ఉప్పూనిప్పులా ఉండే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య స్నేహం చిగురించింది. పార్టీలో రేవంత్ ఆధిపత్యం, ప్రాబల్యం పెరుగుతోందని భావిస్తోన్న సీనియర్లు ఏకమవుతున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ తోపాటు  నల్గొండ కాంగ్రెస్‌ నేతలంతా రేవంత్‌‌పై మండిపడుతున్నారు. తాను రాజీనామాచేసిన తన సొంత నియోజకవర్గంలో నా భార్యను అభ్యర్ధిగా ప్రకటిస్తే తప్పేటంటూ ఉత్తమ్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అసలు మా జిల్లాలో వేలు పెట్టడానికి రేవంత్ ఎవరంటూ నల్గొండ కాంగ్రెస్ లీడర్లు ఫైరవుతున్నారు. తమ జిల్లా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం తమకుందని, ఇతరులు... తమ జిల్లా రాజకీయాల్లో వేలుపెడితే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. అయితే, ఎప్పుడూ ఉత్తమ్ పై విమర్శలుచేసే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.... హుజూర్‌నగర్ ఉపఎన్నికలో పద్మావతిని గెలిపించుకుని తీరతామని ప్రకటించడంతో... ఉత్తమ్-కోమటిరెడ్డి మధ్య స్నేహం చిగురించింది. ఇన్ని రోజులూ పక్కలో బల్లెంలా ఉన్న కోమటిరెడ్డి... మద్దతివ్వడంతో ఊపిరిపీల్చుకున్న ఉత్తమ్‌.... మిగతా నేతలతో కలిసి రేవంత్‌ను టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారు. ఇక కోమటిరెడ్డి అయితే, రేవంత్ పై సెటైర్లు వేశారు. కొత్తగా వచ్చినోళ్ల సలహాలు తమకు అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో విభేదాలున్నా, తాను, ఉత్తమ్, జానారెడ్డి ఒక్కటిగా పనిచేస్తున్నామంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు పీసీసీ రేసులో తాను ఒక్కడిని మాత్రమే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి రేవంత్‌రెడ్డి మూలంగా నల్గొండ కాంగ్రెస్‌లో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇప్పటివరకు తిట్టుకున్న లీడర్ల మధ్య సరికొత్త స్నేహం చిగురించేలా చేసింది. ఒకరు ఔనంటే... మరొకరు కాదనే నేతలు ఇప్పుడు... తమ అందరిదీ ఒకే మాట అంటున్నారు. మరి ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.

తలదించని వ్యక్తిత్వం... తలవంచని మనస్తత్వం... కోడెలది సున్నిత మనస్తత్వం

  గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో 1947 మే 2న జన్మించిన కోడెల... గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్.. వారణాసిలో ఎంస్ పూర్తి చేశారు. అసలు ఆరోజుల్లో వైద్య విద్యను అభ్యసించడమే గొప్ప అయితే, ఎంఎస్ పూర్తి చేయడం మరో సంచలనం. అంతేకాదు నర్సరావుపేటలో సొంతంగా ఆస్పత్రిని నెలకొల్పి రూపాయికే వైద్యం అందించడంతో పల్నాడులో కోడెల పేరు మోరుమోగిపోయింది. రూపాయి డాక్టర్ గా పేరు తెచ్చుకున్న కోడెలను ప్రజలు ఎంతో అభిమానించేవారు. అందుకే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కోడెలను రాజకీయాల్లోకి రావాలని స్వయంగా కోరారు. ఎన్టీఆర్ స్వయంగా కోరడంతోనే అతి చిన్న వయసులో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు కోడెల. అయితే, రాజకీయాల్లో వచ్చినా, ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రిగా పనిచేసినప్పటికీ, కొద్దిరోజులు ప్రజలకు వైద్యసేవలు అందించారు. అందుకే కోడెల అంటే పల్నాడు ప్రజలకు అంత అభిమానం. కోడెలపై పల్నాడు ప్రజలకున్న అభిమానమే ఆయన్ను వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసింది. 1983లో మొదటిసారి నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివప్రసాద్... అప్పట్నుంచి 1999వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి పల్నాడు ప్రాంతంలో తిరుగులేని, ఎదురులేని నేతగా ఎదిగారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1987-88 మధ్య హోంమంత్రిగా, అలాగే, భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, 2004, 2019 ఎన్నికల్లో కోడెల ఓటమి చెందారు. 2014లో మళ్లీ సత్తెనపల్లి నుంచి విజయం సాధించి నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్ గా సేవలందించారు. అయితే, కోడెలది తలదించని వ్యక్తిత్వం.... తలవంచని మనస్తత్వం... అంతేకాదు అత్యంత సున్నిత మనస్కుడు... స్నేహశీలి... పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి... అదే ఇప్పుడు ఆయన ప్రాణాలను బలిగొంది. చిన్న ఆరోపణను కూడా తట్టుకోలేని మనస్తత్వం కోడెలది... అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే  ఒక్క కోడెలపైనే 19 కేసులు పెట్టింది. ఇక ఆయన కుమారుడు, కూతురుపై పెట్టిన కేసులకు లెక్కే లేదు. పైగా కోడెలపై దొంగతనం కేసు మోపడం... ఆ కేసుల్లో జీవితఖైదు పడే సెక్షన్లను పెట్టడం ఆయనకు తీవ్ర మనస్తాపం కలిగించింది. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వంద రోజుల్లో వంద రకాలుగా వేధించడంతో కోడెల తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. రాజకీయాల్లో రాటుతేలిన నేత అయినప్పటికీ, చివరి రోజుల్లో అలాంటి అపనిందలను తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా తనపై మోపిన అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం అభియోగం నుంచి బయటపడేందుకు కోడెల తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో తన తప్పేమీ లేదని నిరూపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ముందుగా అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు... ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్, ప్రభుత్వానికి లేఖ రాశారు... తనను మానసికంగా క్షోభపెట్టొద్దంటూ వేడుకున్నారు... అసెంబ్లీ ఫర్నిచల్ తరలింపులో తన తప్పులేదని, హైదరాబాద్ నుంచి ఫర్నిచర్ ను తీసుకొచ్చే క్రమంలో అధికారులే తన క్యాంప్ కార్యాలయానికి తెచ్చిపెట్టారని, తన పదవీ కాలం పూర్తయిన తర్వాత  వెంటనే ఫర్నిచర్ ను తీసుకెళ్లమని కోరానని, లేదా వెల కడితే డబ్బు చెల్లిస్తానని జూన్ ఏడునే లేఖ రాశానని, కానీ అధికారులు స్పందించలేదని, ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ కి లేఖలు రాశానని, అయినా స్పందించకుండా, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కోడెల ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, ఇప్పటికే తన కార్యాలయం నుంచి ఫర్నిచర్ ను తీసుకెళ్లారని, ఇంకా ఏమైనా ఉంటే తీసుకెళ్లొచ్చని, కానీ తనను ఇబ్బంది పెట్టొద్దంటూ ప్రభుత్వానికి కోడెల విజ్ఞప్తి చేశారు. 37ఏళ్లుగా నిబద్ధతతో రాజకీయాల్లో ఉన్నానని, అనవసరంగా తనపై తప్పుడు ఆరోపణలుచేస్తూ, దొంగతనం కేసు మోపి, తనను మానసిక క్షోభకు గురిచేయవద్దని కోరారు. కానీ జగన్ ప్రభుత్వం కనికరించలేదు... కోడెలపై వేధింపులకు పాల్పడింది. 90రోజుల్లో 19 కేసులు పెట్టి క్షోభకు గురిచేసింది. కోడెలకున్న మంచి పేరును చెడగొట్టేందుకు కుట్ర చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో వైసీపీ నాయకులు, వైసీపీ మీడియా చేసిన రచ్చను కోడెల తట్టుకోలేకపోయారు. చివరి ఆ మనోవేదనతోనే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.

కోడెల ఆత్మహత్యకు కారణమేంటి?.. తప్పెవరిది?

  'బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి' అనడానికి కోడెల జీవితాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో. గుంటూరు జిల్లాలో ప్రజలకు సుపరిచితుడైన వైద్యుడిగా ముద్ర వేసుకున్న కోడెల.. రాజకీయాల్లోకి ప్రవేశించి చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి సీనియర్ నేతగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా విశేష సేవలందించారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. గత కొంత కాలంగా వరుస ఆరోపణలతో సతమతమవుతున్న కోడెల.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచారు. 2014 లో టీడీపీ విజయం తరువాత స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన కోడెల.. 2019 ఎన్నికలకు ముందు వరకు తన బాధ్యతను నిర్వర్తించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమితో ఆయనను సమస్యలు చుట్టుముట్టాయి. వరుస ఆరోపణలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కోడెల ఫ్యామిలీ సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల టాక్స్ పేరుతో.. ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కోడెల కుమారుడు, కూతురిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇద్దరు పలువురి వద్ద డబ్బులు వసూలు చేసారని, కొందరికి డబ్బులు ఎగ్గొట్టారని ఇలా రకరకాలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కోడెల కుటుంబం మీద ఇంకా ఆరోపణలు వచ్చాయి. కోడెల అసెంబ్లీ ఫర్నీచర్ మాయం చేసారని అధికార పార్టీ ఆరోపించింది. అయితే కోడెల మాత్రం తాను చెప్పే ఫర్నీచర్ తీసుకెళ్లానని, తిరిగి అప్పగించడానికి లేఖలు కూడా రాసానని చెప్పుకొచ్చారు. ఈ అసెంబ్లీ ఫర్నీచర్ అంశంలో కోడెల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వీటికితోడు ఆయన అద్దె పేరుతో ప్రభుత్వ సొమ్ముని దోచేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన గుంటూరులోని తన భవనాన్ని, వైద్య శాఖకు అద్దెకిచ్చి.. సరైన వసతులు లేకపోయినా అధికమొత్తంలో అద్దె వసూలు చేసారని వార్తలొచ్చాయి. అంతేకాదు ఆసుపత్రులకు సరఫరా చేసే దూది విషయంలో కూడా కోడెల కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వినిపించాయి. ఆసుప్రతులకు దూది సరఫరా చేసే కాంట్రాక్టు తీసుకున్న కోడెల ఫ్యామిలీ.. నాసిరకం దూదిని తెప్పించి సరఫరా చేసారని ప్రచారం జరిగింది.   వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోడెల మీద ఇలా వరుస ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదంతా కక్ష సాధింపేనని కోడెల పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఉన్న సమయంలో తన బాధ్యతను నిర్వర్తిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసానని.. కానీ వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత దాన్ని మనసులో పెట్టుకొని తనను రాజకీయ వేధింపులకు గురి చేస్తుందని కోడెల ఫీలయ్యారు. అంతేకాదు ఈ వరుస ఆరోపణలతో కోడెల గుండెపోటుతో ఆసుపత్రిలో కూడా చేరారు. అయినా ఆయన మీద ఆరోపణలు ఆగలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకుని లోకాన్ని విడిచారు. తెలుగు రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న కోడెల.. ఆరోపణలు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం నిజంగా దురదృష్టకరం.

జగన్ 100 రోజుల పాలన.. పవన్ కి అస్సలు నచ్చలేదు

  ఏపీ సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ, బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించగా.. తాజాగా జనసేన నివేదికను విడుదల చేసింది. 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వైసీపీ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని నివేదికలో పేర్కొంది. వైసీపీ 100రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని.. డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణలో ప్రభుత్వంలో సన్నద్ధత లోపించిందని చెప్పుకొచ్చింది. వరదల సమయంలో ప్రభుత్వం.. పునరావాస చర్యలు కూడా వేగంగా చేపట్టలేదని జనసేన తన నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ 100 రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని విమర్శించారు. పాలనలో దార్శనికత, పారదర్శకత లోపించిందని అన్నారు. ఎన్నికల్లో 150కి పైగా సీట్లను గెలుచుకున్న వైసీపీ పాలనపై కనీసం ఒక సంవత్సరం వరకు తాము మాట్లాడాల్సిన అవసరం ఉండదని అనుకున్నామని.. కానీ, మూడు వారాల్లోపే వారు తీసుకున్న ఆందోళనకర నిర్ణయాలు ప్రజలు ఆక్షేపించేలా ఉన్నాయని విమర్శించారు. ‘సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడం విఫలం చెందింది. ఇసుక విధానాన్ని ఇంతవరకు ప్రకటించకపోవడం చేతగానితనం. ఇసుక పాలసీని ప్రకటించకపోవడం పట్ల ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇసుక విధానం ప్రకటించకపోవడం వల్ల లక్షమంది నష్టపోయారు. ఇది పూడ్చుకోలేని నష్టం’ అని పవన్ చెప్పుకొచ్చారు.   ‘ఏపీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. వైసీపీ జనరంజక పథకాలు అమలు చేయాలంటే రూ.50వేల కోట్లు అవసరం, ఎక్కడ నుంచి తెస్తారు?. టీడీపీ హయాంలో అవకతవకలు జరిగితే సరిచేయండి. వైసీపీ తీరు వల్ల పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు.. కొత్త పరిశ్రమలు రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాల కోసం నడపొద్దు. ప్రభుత్వ విధానాలు రాజధాని భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఏషియా పల్స్ అండ్ పేపర్ మిల్స్ పరిశ్రమ రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలో ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు.. రాష్ట్రంలో పరిస్థితులను చూసి ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలిపోయిందని పవన్ గుర్తు చేశారు. రాష్ట్రానికి రూ. 2.58 లక్షల కోట్ల అప్పులున్నాయని.. దీనికి తోడు జగన్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.50 వేల కోట్లు కావాలని పవన్ తెలిపారు. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ మళ్లీ కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని పవన్ ప్రశ్నించారు. ‘ఏపీ ప్రజలకు పోలవరం జీవనాడి. పోలవరంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలి. పోలవరం ఆపేస్తే రైతాంగానికి, విశాఖ తాగునీటికి ఇబ్బంది. కృష్ణా వరదల సమయంలో సీఎం జగన్‌ అమెరికాలో ఉన్నారు. ఇక్కడున్న వైసీపీ పెద్దలు బిజీగా ఉండి వరదల నిర్వహణను పట్టించుకోలేదు. వరదల సమయంలో వైసీపీ మంత్రులు సరిగా నడుచుకోలేదు. వైసీపీ తీరు వల్ల వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. రాయలసీమకు వరద నీటిని తీసుకెళ్లలేకపోయారు.కృష్ణా వరదలతో ఓ ప్రాంతంలోని ఇళ్లు మునిగిపోతుంటే.. మంత్రులంతా మాజీ సీఎం ఇంటి ముంపుపై దృష్టిపెట్టారు’ అని పవన్ విమర్శించారు.

ఇసుక ముంచేస్తుంది...జాగ్రత్త..! అధికారులకు జగన్ వార్నింగ్

మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశాన్ని నిలువునా ముంచేసిన వాటిలో ఇసుకదే అతిపెద్ద పాత్ర. ఇసుక మాఫియాతో కలిసి సామాన్య ప్రజలకు టీడీపీ నేతలు చుక్కలు చూపించడంతో, ఆ ఎఫెక్ట్ పార్టీపై తీవ్రంగా పడింది. అందుకే, ఎవ్వరూ ఊహించనివిధంగా టీడీపీ నెంబర్ 23కి పడిపోయింది. ఇదే మాట చెబుతూ జనసేనాని పవన్ కల్యాణ్... వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీని ముంచేసింది ఇసుకేనని.... ఇప్పుడు అదే ఇసుకతో జగన్ సర్కారు గేమ్స్ ఆడుతోందని, ఇలాగైతే, టీడీపీకి పట్టిన గతే... వైసీపీకి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. పవన్ విశ్లేషణలో నిజంగా వాస్తవముంది. టీడీపీని ముంచేసిన వాటిలో ఇసుకది అతిపెద్ద పాత్రేనని అంగీకరించాల్సి ఉంటుంది. గల్లీ లీడర్ నుంచి చోటామోట నేత వరకు దొరికినకాడికి దొరికినట్లు ఇసుకను దోచేసి... అధిక ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించారు. పేరుకు ఉచితం అంటూ బాబు ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కాకపోవడంతో చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే జగన్ కు ఎదురవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేసి వైసీపీ ప్రభుత్వం... ఇటీవలే కొత్త పాలసీని ప్రకటించి, ఇసుక సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తేచాలు చౌకధరకే ఇంటికి ఇసుక సరఫరా చేస్తామంటూ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, శాండ్ పాలసీ ప్రకటించి, ఇసుక సప్లైకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, జగన్ ప్రభుత్వంపై మాత్రం ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక కొరతపై ఆరోపణలు వస్తున్నాయి. డిమాండ్ కి తగినట్టుగా ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన సీఎం జగన్.... ఇసుక పాలసీ అమలు జరుగుతున్న తీరు... ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఎక్కడికక్కడ ఇసుక రీచ్ లు, అలాగే స్టాక్ యార్డులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇసుక కొరత ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా, మాఫియాను, అవినీతిని అరికట్టడానికి చెక్ పోస్టుల దగ్గర సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 25 రీచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, భారీ వర్షాలు వరదల కారణంగా కొత్త రీచ్ లను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు అధికారులు వివరించారు. అయితే, ఇసుక విషయంలో రాళ్లేయడానికి చాలామంది చూస్తున్నారన్న జగన్మోహన్‌రెడ్డి.... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

బాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన పోలీసులు.. ఎందుకింత భయం?

  'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదన్న చంద్రబాబు.. అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయనను అడ్డుకునేందకు ఉండవల్లిలోని ఆయన ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు కారుని బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా గేట్లు వేసి.. గేటు తెరిచేందుకు వీలు లేకుండా బయట నుంచి లావైన తాళ్లతో కట్టారు. గేటు బయట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు లోపల కారులో కూర్చొని బయటకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు.. పోలీసులకు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తనను ఇంట్లో పెట్టి ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఆపలేరని అన్నారు. మరికాసేపట్లో ఛలో ఆత్మకూరుకు బయల్దేరుతామని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదన్నారు. ఎన్నిరోజులు తనను హౌస్ అరెస్ట్ చేస్తారు? అంటూ ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ అణిచివేత వైఖరిని ప్రజా సంఘాలు, మేధావులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీని అణిచేయాలని చూస్తున్నారన్నారు. ఆత్మకూరు బాధితులను తానే గ్రామానికి తీసుకెళ్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబుతో సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ సర్కార్ భయంతోనే అరెస్ట్ లు చేసి 'ఛలో ఆత్మకూరు' ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ దౌర్జన్యాలు బయటపడతాయని భయంతోనే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్‌లో అసలేం జరుగుతోంది? అగ్నిపర్వతం బద్దలుకాబోతుందా?

  గులాబీ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ లో అసంతృప్తి రాజుకుంటోంది. ఎన్నడూ నోరెత్తని నేతలు తమ గొంతులు సమరించుకుంటున్నారు. ఎన్నడూ గీత దాటని నాయకులు, ధిక్కారగళంతో కళ్లెర్రజేస్తున్నారు. అధిష్టానానికి అతిదగ్గరగా ఉన్న నేతలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కేసీఆర్ గీసిన గీతను దాటని నేతలు, ఒకరి తర్వాత మరొకరు నోరు తెరుస్తున్నారు. ఈటల బాటలోనే ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. తమలో గూడకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పూర్తిస్థాయి కేబినెట్ కూర్పుతో, ఇక మంత్రి పదవి రాదని డిసైడైన నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈటల, రసమయి మాటల మంటలు చల్లారకముందే, మరో రెండు గొంతులు ధిక్కార స్వరం వినిపించాయి. కేసీఆర్‌కు ఎంతో సన్నిహితుడిగా పేరున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ తమ ఇంటి పెద్ద అయితే... తామంతా ఓనర్లమేనంటూ ఈటల మాదిరిగానే కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కిరాయిదార్లు ఎంతకాలం ఉంటారో చూద్దామంటూ సెటైర్లు వేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి, కేసీఆర్ మాట తప్పారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, కౌన్సిల్‌లో ఉండు... మంత్రి పదవి ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారని, అయితే, ఇప్పుడు తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారంటూ ఊహాగానాలు వినిస్తున్నాయని, కానీ ఆ పదవి తనకు వద్దే వద్దన్నారు...... ఇక మాజీ డిప్యూటీ సీఎం, ఘన్ పూర్ ఎమ్మెల్యే, తాటికొండ రాజయ్య కూడా ఇదే తరహాలో కేసీఆర్ పై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలంగాణలో 12శాతమున్న మాదిగలకు కేబినెట్‌లో చోటు దక్కలేదని, మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే, విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తారని, రాజయ్య కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. మరో సీనియర్‌ నేత పద్మారావు కూడా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మొదటి నుంచీ, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న పద్మారావుకు, డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టినా.. ఆ పదవిపై అయిష్టంగానే ఉన్నట్లు ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న తమకు, ప్రాధాన్యత ఇవ్వటం లేదనే భావనలో పద్మారావు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సీనియర్ నేతలంతా, ఈటల తరహాలోనే ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదనే చర్చ పార్టీలో జరుగుతోంది. మొత్తానికి ఈటల రేపిన మంటల స్ఫూర్తిగా ఒకరి తర్వాత మరొకరు అసంతృప్తిగళం వినిపిస్తుండటం... గులాబీ పార్టీలో అగ్గి రాజేస్తోంది. ముఖ్యంగా ఈటల పార్టీపరంగా మాట్లాడితే, రసమయి మరో అడుగు ముందుకేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీ బోర్డు పోయి టీఎస్ వచ్చింది తప్పా... ఏమీ మారలేదంటూ చేసిన కామెంట్స్... అటు పార్టీని... ఇటు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. మొత్తానికి ఇంతకాలం కేసీఆర్ మాటను జవదాటని నేతలు, ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో టీఆర్ఎస్‌లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి ఒక్కటే కారణంగా తెలుస్తోంది. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లను అందలమెక్కిస్తున్నారనే అసంతృప్తి రోజురోజుకీ పెరిగిపోతుందని, ఇది ఏదోఒక రోజు అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఛాన్సుందని అంటున్నారు.

రేషన్ బియ్యంపై టీడీపీ తప్పుడు ప్రచారం.. అసలేం జరిగిందంటే?

  ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామని చెప్పింది. అయితే నాణ్యం మాట దేవుడెరుగు, గతంలో కంటే నాసిరకమైన బియ్యం పంపిణీ చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని నిర్ణయించి, ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో జిల్లాలో పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇలా పంపిణీ అయిన బియ్యం సంచుల్లో ముక్కిపోయిన బియ్యం వెలుగులోకి రావడంతో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలాయి. ముఖ్యంగా ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. "సంచి ఘనం, బియ్యం దారుణం".. "సంచి డిజైన్ మీద పెట్టిన శ్రద్ధతో సగం బియ్యం మీద పెట్టుంటే బాగుండేది" అంటూ ఇలా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవేనా మీరు ఇస్తానన్న నాణ్యమైన బియ్యం అంటూ మండిపడుతున్నారు.     ఈ విషయంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. వైసీపీ వైఫల్యాలకు వారు పంపిణీ చేసిన బియ్యమే రుజువు అని అన్నారు. ముందు ‘సన్నబియ్యం’ అని చెప్పి తరువాత నాణ్యమైన బియ్యం అని మాట మార్చి చివరకి ‘బియ్యం చెక్కలు’ ఇచ్చారని ఎద్దేవాచేశారు. శ్రీకాకుళం జిల్లా 8 మండలాల్లో ‘చెక్క బియ్యం’ సరఫరా చేశారని, బియ్యం చెక్కలు తీసుకున్న పేదల వ్యాఖ్యలే ప్రత్యక్ష రుజువని యనమల చెప్పారు. మీ ముడుపుల కోసం బియ్యం చెక్కలు పేదలకు పంపిణి చేస్తారా? అని వైసీపీ సర్కార్ పై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని అంటున్నారు. ఈ విషయంపై ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. రేషన్ బియ్యం పంపిణీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత నాలుగైదు రోజులగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయని.. అన్ని ఇబ్బందులను అధిగమించి నాణ్యమైన బియ్యాన్ని రవాణా చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కారణంగా 30 బియ్యం సంచులు తడిసిపోయాయని.. వాటి స్ధానంలో కొత్తవాటిని తిరిగి పంపిణీ చేశామన్నారు. పేదవాళ్లకు ఇంత మంచి జరుగుతుంటే.. తినగలిగే బియ్యాన్నే పంపిణీ చేస్తుంటే.. టీడీపీ ఓర్వలేకపోతోందని మంత్రి మండిపడ్డారు. నాణ్యమైన బియ్యం ఇవ్వడం లేదని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.

నిజం ఒప్పుకున్న కేసీఆర్..! సమస్య పరిష్కారం కోసం ఏపీకి రిక్వెస్ట్

    మంత్రులు... తెలంగాణలో అసలు యూరియా కొరతే లేదన్నారు. విపక్షాలే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఎదురుదాడికి దిగారు. ఏదో యాక్సిడెంటల్ గా ఒక రైతు గుండెపోటుతో మరణిస్తే, యూరియా కోసం పడిగాపులుపడి ఆ మనోవేదనతో కుప్పకూలి చనిపోయాడని అంటారా? అంటూ సంబంధిత మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగితే, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సాగింది. తన ఆదేశాల ద్వారా తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు నానా కష్టాలు పడుతున్నారని తేలింది. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. యూరియా సరఫరాపై తీవ్ర విమర్శలు రావడం... రైతులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగడం... ఏకంగా తన సొంత జిల్లాలోనే... క్యూలైన్లో ఓ రైతు మరణించడంతో... అప్రమత్తమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టారు. పరిస్థితి చేయిదాటుతుందని గుర్తించిన కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి యూరియా సరఫరా కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు.  ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్‌.... యూరియా సరఫరా వాస్తవ పరిస్థితిపై ఆరా తీశారు. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో యూరియా కొరత ఎందుకొచ్చిందంటూ వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. రైతులకు సరిపడినంత యూరియాను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి మూడు నాలుగు రోజుల్లోనే పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. రైళ్లు, లారీలు... ఏది దొరికితే దాంట్లో యూరియాను తీసుకొచ్చి, నేరుగా గ్రామాలకే తరలించాలని ఆర్డర్స్ జారీ చేశారు. అయితే, దాదాపు లక్షా15వేల టన్నుల యూరియా... ఇప్పటికే విశాఖ, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు చేరడంతో ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అప్పటికప్పుడు ఏపీ మంత్రి పేర్నినానితో స్వయంగా మాట్లాడిన కేసీఆర్‌... పోర్టులకు అవసరమైన లారీలను పంపాలని కోరారు. ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 3వేల లారీలను వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, 25 గూడ్స్ రైళ్లు కేటాయించాలని కోరడంతో రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. దాంతో ఏపీ పోర్టుల నుంచి రైళ్లు, లారీల్లో యుద్ధ ప్రాతిపదికన యూరియాను తరలించేందుకు, వ్యవసాయాధికారులను ఆంధ్రప్రదేశ్ కు పంపాలని నిర్ణయించారు.   తెలంగాణలో యూరియా కొరత అనే మాట వినిపించొద్దన్న కేసీఆర్‌... సమస్య పరిష్కారమయ్యేవరకు విశ్రమించొద్దని అధికారులకు సూచించారు. అలాగే, ప్రతి రైతుకూ యూరియా అందేవరకు నిరంతర పర్యవేక్షణ చేయాలని మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏదిఏమైనాసరే మూడు నాలుగు రోజుల్లోనే రైతులందరికీ యూరియాను ఎట్టిపరిస్థితుల్లోనే అందించాలని కేసీఆర్ హుకుం జారీ చేశారు.

తెలంగాణలో యూరియా మంటలు... కేసీఆర్ సర్కారుపై రైతన్నల ఆగ్రహం

యూరియా కొరత తెలంగాణ రైతాంగం ఉసురు తీస్తోంది. పంటకు బలాన్ని ఇవ్వాల్సిన ఎరువులు... అన్నదాతల ప్రాణాలు తీసేస్తున్నాయి. ఎరువులు కోసం పడిగాపులు పడీపడి ప్రాణాలు కోల్పోతున్నారు. యూరియా కోసం తెలంగాణవ్యాప్తంగా అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పెళ్లాం-పిల్లలు, ఇళ్లు, పొలాలను వదిలిపెట్టి, తిండీ తిప్పల్లేకుండా యూరియా సరఫరా కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. అయితే, రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా, గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డా... ఎరువులు దొరక్కపోవడంతో... ఆ నిరాశతో కొందరు ఆస్పత్రుల పాలవుతుండగా, మరికొందరు క్యూలైన్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. మెదక్ జిల్లా దుబ్బాకలో యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడిన రైతు ఎల్లయ్య... క్యూలైన్లో నిలబడీనిలబడి అలసిపోయాడు. ఎలాగైనా యూరియా తీసుకెళ్లి పంటను కాపాడుకుందామనుకున్న ఎల్లయ్య గుండె క్యూలైన్లోనే ఆగిపోయింది. తన వంతు రాకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తోన్న ఎల్లయ్య... యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడుతున్నాడు. అయినా, యూరియా దొరక్కపోవడంతో.... ఈసారి ఎలాగైనాసరే దక్కించుకోవాలని.... భార్య లక్ష్మితో కలిసి క్యూలైన్లో నిలబడ్డాడు. కానీ, అప్పటికే పడిగాపులు-పడీపడి అలసిపోయిన ఎల్లయ్య క్యూలైన్లో కుప్పకూలాడు. హుటిహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. దాంతో, ఎల్లయ్య మృతికి ప్రభుత్వమే కారణమంటూ రైతులు ఆందోళనకు దిగారు. మరోవైపు యూరియా సమస్య రాజకీయ వివాదంగా మారుతోంది. యూరియా కొరతపై విపక్షాలు.... ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే, అసలు కొరతే లేదంటోంది కేసీఆర్ సర్కారు. రైతుల అవస్థలకు ఎల్లయ్య మృతి అద్దం పడుతోందని టీఆర్ఎస్ గవర్నమెంట్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికైనా కేంద్రంతో మాట్లాడి, అవసరమైన యూరియాను తీసుకొచ్చి రైతుల కష్టాలు తీర్చాలని సూచిస్తున్నారు. అలాగే దుబ్బాకలో మరణించిన రైతుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటోన్న విపక్షాలు... ఎల్లయ్య కుటుంబానికి 20లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మూడ్రోజుల్లో యూరియా కొరత తీర్చకపోతే, తీవ్ర పరిణామాలు తప్పవని రైతులు హెచ్చరిస్తున్నారు.

కేసీఆర్ ను ఇరకాటంలో పడేసిన జగన్ నిర్ణయం... తెలంగాణలో మోగిన సమ్మె సైరన్

  ప్రగతి రథ చక్రాలు... ఇకపై ప్రభుత్వ రథ చక్రాలుగా మారనున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దశాబ్దాల కల నెరవేరబోతోంది. దాంతో ఆర్టీసీ ఎంప్లాయిస్‌... త్వరలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం... కేసీఆర్ ను చిక్కుల్లో పడేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి... అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైర్డ్‌ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన నిపుణుల కమిటీ వేశారు. వివిధ కోణాల్లో అధ్యయనం జరిపిన కమిటీ... ముఖ్యమంత్రి జగన్ కు మధ్యంతర నివేదికను అందజేసింది. దాంతో సంబంధిత మంత్రులు, రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన జగన్మోహన్ రెడ్డి.... ఆర్టీసీ విలీనానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. నిపుణుల కమిటీ సూచించిన మేరకు ఆర్టీసీ ఎంప్లాయిస్‌ ను ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నారు. అయితే, ఆర్టీసీ విలీనం ద్వారా ప్రభుత్వంపై ఏటా 3వేల 500కోట్ల రూపాయల భారం పడనుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. అలాగే, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కానుండటంతో, కొత్తగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలిన విధివిధానాలన్నీ త్వరలో ఖరారవుతాయన్న పేర్ని నాని... ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు కృషి చేస్తామన్నారు. అయితే, ఆర్టీసీ విలీనానికి సాంకేతిక సమస్యలు ఉన్నట్లు నిపుణుల కమిటీ ప్రభుత్వానికి తెలిపింది. ఆర్టీసీ విభజన పూర్తిస్థాయిలో జరగకపోవడం, అలాగే ఆస్తుల విభజన పూర్తికాకపోవడం, తెలంగాణతో సమస్యలు ఉండటంతో,  ఇప్పటికిప్పుడు విలీనం సాధ్యంకాదని చెప్పింది. ఈ సమస్యలన్నీ కొలిక్కిరావడానికి కొంత సమయం పడుతుందని, అలాగే కేంద్రం వాటాను తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని కమిటీ నివేదిక ఇఛ్చింది. దాంతో, ఆర్టీసీ కార్పొరేషన్ ను కొనసాగిస్తూనే, ఉద్యోగులను మాత్రం ప్రభుత్వంలోకి తీసుకోవాలని సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది.  మొత్తానికి, జగన్ సర్కారు నిర్ణయంపై ఆంధ్రా ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఏపీలో చేసినట్లే... ఇక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ ఆర్టీసీలో కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఇప్పటికే యాజమాన్యానికి నోటీసులిచ్చిన ఎంప్లాయిస్ యూనియన్... సెప్టెంబర్ 17 తర్వాత ఏక్షణమైనా సమ్మెకు వెళ్తామంటూ హెచ్చరించింది. దాంతో జగన్ నిర్ణయం ఇక్కడ కేసీఆర్ ను చిక్కుల్లో పడేసినట్లయ్యింది.  

సెప్టెంబర్ 7 అర్ధరాత్రి.. ఆ 15 నిమిషాలే కీలకం.. చంద్రయాన్-2లో చివరి ఘట్టం

  చందమామ రహస్యాలను అన్వేషించేందుకు ప్రయోగించిన చంద్రయాన్-2లో అసలుసిసలు కథ ఇప్పుడే ఆరంభమైంది. దాదాపు అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసుకున్న చంద్రయాన్-2 అత్యంత కీలకమైన చివరి ఘట్టానికి చేరుకుంది. జాబిల్లిపై ల్యాండర్ దిగడమే మిగిలి ఉంది. ల్యాండర్ ల్యాండింగ్ కి ముందు జరగాల్సిన అత్యంత ముఖ్యమైన దశ ముగిసింది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ సక్సెస్ ఫుల్ గా వేరవడంతో.... ల్యాండర్లోని ప్రజ్ఞాన్‌ రోవర్‌... చంద్రమామ వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. జులై 22న ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగం అప్రతిహాతంగా దూసుకుపోతోంది. ఆగస్ట్ 20న చంద్రుడి వలయంలోకి ప్రవేశించిన చంద్రయాన్-2 కక్ష్యను ఇప్పటివరకు ఐదుసార్లు విజయవంతంగా తగ్గించారు. స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికే పలు దఫాలుగా చంద్రుడి ఫొటోలను ఇస్రోకు పంపించింది. ప్రస్తుతం చంద్రుడికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయింది. సోమవారం మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల నుంచి ఒంటి గంటా 15 నిమిషాల మధ్య ఈ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయింది. దాంతో చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో ఆతృతగా ఎదురుచూస్తోంది. అయితే, చంద్రయాన్-2లో అత్యంత ముఖ్యమై చివరిదైన కీలక ఘట్టం సెప్టెంబర్ 7న ప్రారంభంకానుంది. ఏడున అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల మధ్య చందమామ దక్షిణ ధృవంపై నిర్దేశించిన ప్రాంతంలో ల్యాండర్ దిగనుంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటికి వస్తుంది. పవర్ డీసెంట్ గా పిలిచే ఈ దశ 15 నిమిషాలపాటు సాగనుంది. ఈ 15 నిమిషాలనే ఇస్రో.... అత్యంత ఉత్కంఠభరిత క్షణాలుగా అభివర్ణిస్తోంది. ఈ సమయంలోనే చంద్రుడి రహస్యాలను రోవర్ ఇస్రోకు పంపుతుంది. దాంతో సెప్టెంబర్ ఏడున ఆవిష్కృతం కాబోయే అద్భుత ఘట్టం కోసం ఇస్రో ఆతృతగా ఎదురుచూస్తోంది.  అయితే, చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ల్యాండర్ నిర్దేశిత వేగాన్ని మించి ప్రయాణించకుండా చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ నిర్దేశిత వేగాన్ని మించి ప్రయాణిస్తే క్రాష్ ల్యాండింగ్ జరిగే అవకాశముందని, అయితే చంద్రయాన్-2లో ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకపోవడంతో... అంతా సవ్యంగానే జరుగుతుందని ఇస్రో ప్రకటించింది.

టీఆర్ఎస్ సర్కార్ సంచలన నిర్ణయం.. రైతుబంధు పథకానికి కోత!!

  తెలంగాణలో రైతుబంధు పథకానికి సంబంధించి కోత పెడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రైతుబంధు పథకానికి పది ఎకరాల సీలింగ్ పెట్టటం ద్వారా.. ఖర్చును కాస్త తగ్గించుకోవచ్చన్న ఆలోచనలో టీఆర్ఎస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. 2018లో రైతుబంధు పథకం ప్రారంభించినపుడు సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇచ్చారు. 2019లో దాన్ని రూ.5 వేలకు పెంచారు. అంటే.. ఖరీఫ్‌, రబీకి కలిపి ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాల్సి వస్తోంది. రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించటం ద్వారా.. వ్యవసాయం చేసే రైతు సమస్యలకు అసరాగా ఉండేలా ఈ పథకాన్ని ప్లాన్ చేశారు. అయితే ఎంత భూమి అంటే అంత మొత్తానికి పథకాన్ని అమలయ్యేలా చేశారు. ఈ పథకం బడ్జెట్ భారీగా ఉండటంతో ఇతర సంక్షేమ పథకాలకు.. ఇతరత్రా పథకాలకు నిధుల సమస్య ఇబ్బందిగా మారింది.  ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.14,500 కోట్లు రైతుబంధుకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు సమకూర్చాల్సి ఉంది. దాంతో రైతుబంధు పథకానికి కోత పెట్టి, కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దాంతో రైతుబంధుకు సీజన్‌కు రూ.50 వేల గరిష్ఠ పరిమితితో అధికారులు ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఫైలు సీఎం కేసీఆర్‌ వరకు వెళ్లిందని, ఆయన ఆమోదిస్తే రబీ నుంచే కోత అమల్లోకి వస్తుందని అంటున్నారు. అయితే సీఎం ఇందులో మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు.   అధికారుల ప్రతిపాదనల ప్రకారం రైతుకు 10 ఎకరాలకు మించి భూమి ఉన్నా.. 10 ఎకరాలకు మాత్రమే లబ్ధి కలుగుతుంది. పదెకరాలకు మించిన భూమి లక్షా రెండు వేల మంది రైతులకు ఉన్నట్లు సమాచారం. వారిచేతిలో 15.25 లక్షల ఎకరాల భూమి ఉంది. అంటే, దాదాపు ఐదు లక్షల ఎకరాల భూమికి ఇవ్వాల్సిన రూ.500 కోట్ల రైతు బంధు సాయం మిగులుతుందన్నమాట. తాజా నిర్ణయం ప్రభుత్వానికి అంతో ఇంతో ఉపశమనం కలిగేలా చేస్తుందంటున్నారు. మరి ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.