1882 నుంచి 2019 వరకు... 197ఏళ్ల అయోధ్య వివాదానికి ముగింపు

  అయోధ్య వివాదం 1822లో మొదలైంది. ఫైజాబాద్ కోర్టు అధికారి హఫీజుల్లా... ఓ కేసు సందర్భంగా దీన్ని వివాదంగా పేర్కొన్నారు. కానీ, 1957లో తొలి వ్యాజ్యం పడింది. బాబ్రీ మసీదులో పనిచేసే మౌల్వీ మహ్మద్ అస్ఘర్ ఈ వ్యాజ్యం వేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంతాన్ని హనుమాన్ గఢీ మహంత్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. దాంతో, హనుమాన్ గఢీ మహంత్ లో ఉండే వైష్ణవ బైరాగులు ప్రతి కేసు దాఖలు చేశారు. బాబ్రీ మసీదు స్థలం... రాముడు పుట్టిన చోటు అంటూ వైష్ణవ బైరాగులకు చెందిన నిర్మోహీ అఖాడా 1857లో కోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం... వివాదాస్పద స్థలంలో అడ్డుగోడ కట్టించి, హిందువులంతా తూర్పువైపు నుంచి.... ముస్లింలు ఉత్తరం వైపు నుంచి వెళ్లాలని ఆదేశించింది. ఇక, 1860-84 మధ్య అయోధ్య స్థలంపై అనేక కేసులు దాఖలు అయ్యాయి. కానీ అతిముఖ్యమైన కేసు 1885లో పడింది. వివాదాస్పద స్థలానికి(రామజన్మస్థానం) తానే మహంత్ నని, అక్కడ రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ ధార్మిక నేత రఘువర్ దాస్ పిటిషన్ వేశారు. అయితే, దాన్ని 1986లో కోర్టు కొట్టివేసింది. అయితే, వివాదాస్పద ప్రాంతాన్ని హిందువులు రామజన్మభూమి అని బలంగా నమ్మడానికి దోహడపడింది. దాంతో అప్పట్నుంచి 1923వరకు అనేక వ్యాఖ్యాలు నమోదయ్యాయి.  అయితే, 1949లో అయోధ్య బాబ్రీ మసీదు లోపల... కొందరు బలవంతంగా సీతారామలక్ష్మణుల విగ్రహాలు పెట్టడంతో... దేశ చరిత్రలోనే అతిపెద్ద వివాదంగా రూపుదాల్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే ఈ వివాదం పురుడు పోసుకుంది. అయితే, 1949 డిసెంబర్ 29న బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద ప్రాంతంలో యథాతధ స్థితిని కొనసాగించాలని ఫైజాబాద్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాంతో, ఆ ప్రాంతాన్ని మూసివేసి, ముస్లింలకు అనుమతి నిరాకరించారు. అయితే హిందూ పూజల నిమిత్తం నలుగురు పూజారులకు మాత్రం అనుమతి ఇచ్చారు. అనంతరం 1950 జనవరి 16న హిందూమహాసభ కార్యకర్త గోపాల్ సింగ్ విశారద్ కేసు వేశారు. వివాదాస్పద ప్రాంతంలో ఉన్న హిందూ విగ్రహాలను ఎప్పటికీ తొలగించరాదని, పూజలు చేసుకోనివ్వాలని కోరారు. ఇక, 1959లో నిర్మోహీ అఖాడా మరో పిటిషన్ వేసింది. అది రాముడు పుట్టిన చోటని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరింది. దాంతో, 1961 డిసెంబర్ 18న సున్నీ వక్ఫ్ బోర్డు కౌంటర్ పిటిసన్ వేసింది. అక్కడున్న బాబ్రీ మసీదును బాబర్ కట్టించాడని, ఆ ప్రాంతం తమకే చెందుతుందని, దాన్ని తమకు అప్పగించాలని కోరింది. ఇక, 1990ల్లో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. 1992 డిసెంబర్ 6న లక్షల మంది కరసేవకులు బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు. ఈ ఘటన వివాదాన్ని మరో మలుపు తిప్పింది.  అనంతరం, ఈ వివాదంపై 1992 నుంచి 2002వరకు అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, 2010 జులై 26న తీర్పు ప్రకటించిన అలహాబాద్ హైకోర్టు... వివాదాస్పద ప్రాంతాన్ని మూడు పక్షాలకు సమానంగా పంచుతూ నిర్ణయం ప్రకటించింది. అయితే, అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఇక, 2019 ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16వరకు ఏకధాటిగా 40రోజులపాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు... 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకు అప్పగిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన నిర్ణయం ప్రకటించింది.

విజయారెడ్డి మర్డర్ దేనికి సంకేతం..! రెవెన్యూ ఉద్యోగులకు ఇది హెచ్చరికా?

తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు భూవివాదమే కారణమని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్‌... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, లంచం కోసం వేధించినందుకే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సర్వే నెంబర్ 90, 101లో గల 20 ఎకరాలకు సంబంధించిన భూవివాదమే విజయారెడ్డి హత్యకు కారణంగా తెలుస్తోంది. తన వ్యవసాయ భూమిని ఓ రియల్టర్‌కు కట్టబెట్టేలా రిపోర్ట్ ఇవ్వడంతో... కొద్దిరోజులుగా సురేష్‌....  అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అన్యాయంగా తన భూమిని రియల్టర్‌కు కట్టబెట్టేలా వ్యవహరించినందుకే... మనోవేదనకు గురై... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌... ల్యాండ్ మ్యుటేషన్ కోసం తహశీల్దార్ విజయారెడ్డికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఎంతకీ తన పని కాకపోవడంతో.... విజయారెడ్డిపై కోపం పెంచుకున్న సురేష్‌.... ఈ హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇక, నిందితుడు సురేష్‌కి కూడా తీవ్ర గాయాలు కావడంతో... కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై ప్రాథమిక సమాచారంతో కేసు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అసలు, విజయారెడ్డి కార్యాలయంలోకి దుండగుడిని ఎవరు అనుమతించారు... హత్యకు అసలు కారణమేంటనే సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, భూవివాదంలో... విజయారెడ్డి మర్డర్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్న సీపీ.... దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ సిబ్బంది ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు.... పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

జనసైనికులా మజాకా.. రెడ్డిగారు ఇరుకున పడ్డారు!!

  ప్రస్తుతం మనం జనాలకి పెద్దగా తెలియదు కదా అని నోటికి ఏదొస్తే అది వాగకూడదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉద్దరించాలి అనుకునేవారైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొందరు.. అబ్బే, ఇప్పుడు మనం పెద్దగా ఎవ్వరికి తెలీదు కదా అని రెచ్చిపోయి.. వారి కులపోళ్ళని పొగుడుతూ ఓ నాలుగు ట్వీట్లు.. మిగతా వ్యక్తుల్ని, మిగతా కులాల్ని నీచంగా కించపరుస్తూ మరో నాలుగు ట్వీట్లు చేస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత ఓ రాజకీయ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో ఉంటారు. ఎవరైనా.. అయ్యా అప్పట్లో మీరు ఇలా వాగారంటూ సాక్ష్యాలతో సహా బయటపడితే.. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థంగాక ఆకులు పట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి ఇదే.     ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరతపై విపక్షాలు ఉద్యమిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చారు. ఈ మార్చ్ కి టీడీపీ, బీజేపీ మద్దతు కూడా కోరారు. పవన్ తలపెట్టిన ఈ మార్చ్ కి ఇరు పార్టీల అధినేతలు సానుకూలంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సానుకూలంగా స్పందించడం.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అస్సలు నచ్చలేదంట. ఇంకేముంది పవన్ తలపెట్టిన ఆందోళనలో కన్నా పాల్గొనాల్సిన అవసరంలేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో విష్ణు పేరుకి బీజేపీలో ఉన్నా.. ఆయన కులానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి పార్టీకి మద్దతుగా మాట్లాడతారని, ఆయనకు కులపిచ్చి అని విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇవేవో సాధారణ రాజకీయ విమర్శలు కాదు. జనసైనికులు ఎంతో శ్రమించి దాదాపు పదేళ్ల క్రితం నాటి సాక్ష్యాలను వెలికి తీసి.. విష్ణుకి కులపిచ్చి ఉందని రుజువుచేసారు.     దాదాపు పదేళ్ల క్రితం.. విష్ణువర్ధన్ రెడ్డి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అయితే అప్పట్లో ఆయన చేసిన ట్వీట్లు చూస్తే తెలియకపోవడమే మంచిది అనుకుంటారు. ఆయన ట్వీట్లు చూస్తే ఆయనకు ఎంత కులపిచ్చి ఉందో అర్ధమవుతుంది. ఆయన కులానికి చెందిన వారిని పేరుపేరునా పొగుడుతూ ట్వీట్ చేయడం. మిగతా కులాల్ని కించపరచడం. అంతేకాదు ఆడవారి అందాల గురించి సంస్కారం లేకుండా మాట్లాడటం. ఇలా ఆయన పదేళ్ల క్రితం చేసిన ఏ ట్వీట్ చూసినా చండాలమే. ఛీ ఛీ ఈయన ఓ జాతీయ పార్టీ నాయకుడా అనుకునేలా ఉన్నాయి ఆయన ట్వీట్స్. రాజకీయ నాయకుడు కులాలు, మతాలతో సంబంధం లేకుండా.. అందర్నీ కలుపుకొని పోతూ ప్రజలకి మంచి చేయాలి. కానీ ఈయన నరనరాల్లో కులపిచ్చి నింపుకొని ప్రజాసేవ అర్థాన్నే మార్చేశారు. దీంతో ప్రస్తుతం విష్ణుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.     కాగా, పదేళ్ల క్రితం ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవ్వడం, విమర్శలు రావడంతో.. విష్ణు మొదట ఆ ట్వీట్లను డిలీట్ చేసే ప్రయత్నం చేసారు. ఆ ట్వీట్లు వందల్లో ఉండటంతో ఇక చేసేది లేక అకౌంట్ నే తీసేసారు. అయినా స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుండటంతో.. ఇక చేసేదేమి లేక.. అబ్బే ఆ ట్వీట్లకు నాకేం సంబంధం లేదు, అప్పట్లో ఆ అకౌంట్ ని థర్డ్ పార్టీ చూసేది అంటూ ఏదో చెప్పుకొచ్చారు. కానీ అవి నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే.. ఒకవేళ నిజంగానే ఆయనకు ఆ ట్వీట్లకు సంబంధం లేకపోతే.. విమర్శలు రాగానే కొన్ని ట్వీట్లు ఎలా డిలీట్ అయ్యాయి? తర్వాత ఏకంగా అకౌంటే ఎందుకు డిలీట్ అయింది?. అందుకే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు.. ముందే చేతులు కాలకుండా చూసుకోవాలి అని. మరి ఇప్పటి ప్రభుత్వాలు.. ఎవరైనా సామాన్యులు చిన్న ట్వీట్ చేస్తే చాలు.. కేసులు, అరెస్ట్ లు అంటున్నాయి.. మరి ఈయన గారు కులాల్ని కించపరుస్తూ చేసిన ట్వీట్లపై ఎలా స్పందిస్తాయి?. వీటిపై విచారణ చేసి, చర్యలు తీసుకునే సాహసం చేస్తాయా? చూడాలి.

వేడెక్కిన 'ఉండి' వైసీపీ రాజకీయం.. ఏం జరుగుతోంది?

  అధికారం చేతిలో ఉంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయటం తేలిక. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా, వారి పార్టీ అధికారంలో ఉందనుకోండి ఆయా నేతలు తమ తమ నియోజక వర్గాల్లో అనధికార ఎమ్మెల్యేలుగా కూడా చలామణి కావచ్చు. బదిలీలు, పోస్టింగ్లు అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోవటాలు ఇలా ఒక్కటని కాదు ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. అయితే ఇలాంటి వారికి అన్నివేళల్లో కాలం కలిసి వస్తోందని లేదు ఒక్కోసారి స్వపక్షం లోనే చెక్ పెట్టే వారుండొచ్చు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. పశ్చిమలో ఉండి నియోజకవర్గానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎప్పట్నుంచో జరుగుతోంది. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోట. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు, మొన్నటి ఎన్నికల్లో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచినపుడు కూడా ఇక్కడి ఓటర్లు టిడిపికే పట్టం కట్టారంటే ఆ పార్టీ పట్ల స్థానికులకు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం అలా ఉంచితే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు ఓడిపోయారు కానీ, రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన అనధికార ఎమ్మెల్యేగా చలామణి కావడం మొదలు పెట్టారు. అధికారులు అసలు ఎమ్మెల్యే కంటే కొసరు ఎమ్మెల్యేకి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అధికార కార్యక్రమాల్లోనూ పీవీఎల్ హవా చలాయిస్తున్నారు అంటే ఆ సార్ కు అధికార యంత్రాంగం ఏ స్థాయిలో గౌరవిస్తుందో గ్రహించవచ్చు. అటువంటి పీవీఎల్ నరసింహరాజుకి ఇప్పుడు సొంత పార్టీలోనే ఎదురు గాలి మొదలైంది. కొందరు నేతలకు ఆయన వైఖరి రుచించడం లేదు, దీంతో సదరు అనధికార ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వేరు కుంపటి పెట్టారు. దీనికి ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును పెద్దతలకాయగా పెట్టుకున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విముఖత చూపిన సర్రాజు తమ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం యాక్టివ్ రోల్ పోషించడం మొదలు పెట్టారు. ఇదే చివరకు పీవీఎల్ నరసింహరాజు, సర్రాజు మధ్య ఆధిపత్య పోరుగా పరిణమించింది. ఉండిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. మొదట్లో ఈ నియోజక వర్గం ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వ్యవహరించేవారు. గత ఎన్నికలకు ముందు ఆయన పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తనైన పీవీఎల్ నరసింహరాజును తెరపైకి తెచ్చారు. ఆయనకే ఉండి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ తర్వాతి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ను కూడా ఇచ్చారు. కానీ నాటి ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు, అంతటితో ఆయన హుందాగా ఊరుకుంటే బావుండేదేమో కానీ, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన రూటు మార్చి నియోజక వర్గాల్లో జరిగే అధికార, అనధికార కార్యక్రమాలన్నింటి లోనూ తలదూర్చడం మొదలుపెట్టారు. అన్నింటా తనదే పైచేయిగా ఉండేలా చక్రం తిప్పుతున్నారు, ఆ  మధ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నాకు పార్టీలోకి రావడం ఇష్టం లేదు వైయస్ జగన్ పిలిచి మరీ టికెట్ ఇవ్వడంతో పోటీ చేశాను, పార్టీ అభ్యర్ధులకు ఎన్నికల్లో పది కోట్లు, ఎనిమిది కోట్ల చొప్పున ఖర్చుల కోసం ఇచ్చారు నేను మాత్రం ఆ సొమ్ము తీసుకోలేదు అంటూ పీవీఎల్ నరసింహరాజు చెప్పుకొచ్చారు. ఆయన అలా మాట్లాడినా కూడా పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నారు, దీంతో ఆయన తనకు ఇక తిరుగులేదనుకున్నారేమో మరింత స్పీడు పెంచినట్టు భోగట్టా. ఈ దశలో పీవీఎల్ వ్యవహార శైలి కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రుచించలేదు. క్రమేపీ వారిలో అసంతృప్తి రాజుకోవడం మొదలైంది, అది కాస్త వర్గపోరుకు దారి తీసింది. మరో వర్గం నేత మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తెరపైకి తెచ్చారు అసంతృప్తివాదులు. కొన్ని రోజుల క్రితం వారంత పీవీఎల్ తీరుపై బహిరంగం గానే ఆక్రోశం వెళ్లగక్కారు. ఉండి నియోజక వర్గ ఇన్ చార్జిగా ఆయన్ని తప్పించి పాతపాటి సర్రాజుకు ఆ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. అంతేగాకుండా పీవీఎల్ వైఖరి గురించి అమరావతి వెళ్లి పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారట. ఉండి వ్యవహారం ఒక్కసారిగా రోడ్డెక్కడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలర్టైంది. పీవీఎల్ ని, సర్రాజుని కూర్చోబెట్టి విషయాన్ని సెటిల్ చేయాలని పార్టీలో మరో ముఖ్యనేత కొత్తపల్లి సుబ్బరాయుడికి బాధ్యతలు అప్పగించింది. ఆ ఇద్దరినీ అమరావతికి పిలిచిన సుబ్బరాయుడు విషయాన్ని ఇప్పటికైతే సెటిల్ చెయ్యగలిగారు. నియోజకర్గ ఇన్ చార్జిగా పీవీఎల్ కొనసాగుతారు, అదే సమయంలో మిగతా వ్యవహారాలు మీరు చూసుకోండి అంటూ పాతపాటి సర్రాజుకు సూచించారు. ఈ ఒడంబడికకు ఇద్దరు నేతలు అంగీకరించడంతో తాత్కాలికంగా ఉండి వివాదం సద్దుమణిగినట్టయింది. అంతేకాదు అప్పట్నుంచీ ఇద్దరు నేతలు అన్ని కార్యక్రమాలకు కలిసే హాజరవుతున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఇరు వర్గాల్లోనూ అసంతృప్తి మాత్రం చల్లారలేదని అది ఎప్పుడో ఒకప్పుడు బట్టబయలవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు, చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.

నలుగురు స్నేహితుల మధ్య చిచ్చుపెట్టిన గన్నవరం... ఇరకాటంలో పడిన యార్లగడ్డ పొలిటికల్ కెరియర్

  కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... ఈ ముగ్గురూ మంచి స్నేహితులంటారు... ఈ ముగ్గురూ పార్టీలో ఉన్నా... పార్టీలకతీతంగా వీరి స్నేహం కొనసాగుతుందని చెప్పుకుంటారు. అయితే, ఇప్పుడో కొత్త సంగతి బయటికొచ్చింది. గన్నవరంలో వైసీపీ తరపున పోటీచేసి వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా... ఈ ముగ్గురికీ చిరకాల మిత్రుడని తెలిసింది. ఈ నలుగురూ మంచి స్నేహితులని, తరచూ కలిసికుని మాట్లాడుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... స్నేహితులని అందరికీ తెలిసినా... యార్లగడ్డ సంగతే కొత్తగా ఉంది. అయితే, తన స్నేహితుడైన వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు పోటీకి దిగడానికి కొడాలి నానేయే కారణమనే మాట వినిపిస్తోంది. ప్రవాస భారతీయుడుగా ఉన్న యార్లగడ్డను కొడాలి నానినే... ఆంధ్రాకి రప్పించి... జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లడమే కాకుండా.... వల్లభనేని వంశీపై పోటీకి దింపారని అంటున్నారు. ఈ మాట... వల్లభనేని వంశీ కూడా చాలాసార్లు తన సన్నిహితులతో చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎవరు ఎత్తులు వాళ్లు వేసుకున్నా... వీళ్ల మధ్య మాత్రం స్నేహం... మాత్రం కంటిన్యూ అవుతోంది. అయితే, గన్నవరంలో ముఖాముఖిగా తలపడిన వంశీ, యార్లగడ్డ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఇక, రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. సరిగ్గా ఇప్పుడదే జరిగింది.   తొలుత వల్లభనేని వంశీ, కొడాలి నాని... ఇద్దరూ తెలుగుదేశంలోనే ఉన్నా... ఆ తర్వాత కొడాలి... వైసీపీలో చేరారు. వంశీ మాత్రం టీడీపీలో కొనసాగారు. వంగవీటి రాధా కూడా కొన్నాళ్లూ వైసీపీలోనే ఉన్నారు. ఈ ముగ్గురూ వేర్వేరు పార్టీల్లోనే ఉన్నా... వీళ్ల మధ్య స్నేహం మాత్రం కొనసాగింది. అయితే, మొన్నటివరకు అమెరికాలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు సరిగ్గా ఎన్నికల ముందు ఏపీకి ఎంట్రీ ఇచ్చి... గన్నవరం నుంచి బరిలోకి దిగి ఏకంగా స్నేహితుడైన వంశీనే ఢీకొట్టారు. అయితే స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక ఎన్నికల టైమ్ లో ఈ ఇద్దరికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అది వ్యక్తిగత వైరంగానూ మారింది. అయితే, గెలిచిన తర్వాత కూడా వల్లభనేని వంశీని ఆర్ధిక సమస్యలు, కేసులు చుట్టుముట్టడంతో... తన స్నేహితుడైన కొడాలి నానితో పంచుకున్నట్లు తెలుస్తోంది. దాంతో కొడాలి... వల్లభనేని వంశీని జగన్ దగ్గరికి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు. ఇదిలాఉంటే, 2014 ఎన్నికల సందర్భంగా బెజవాడ బెంజ్ సర్కిల్ లో జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడంతో... వీళ్లిదరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే చర్చ జరిగింది. అంతేకాదు వంశీ వైసీపీలో చేరతానే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఈ నలుగురు చిరకాల స్నేహితుల్లో వంగవీటి రాధాకృష్ణ... మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండగా... కొడాలి నాని సూపర్ విక్టరీ కొట్టి జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు... ఇక వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఎన్నికల ముందు స్నేహితుడినే ఢీకొట్టి వ్యక్తిగత వైరం తెచ్చుకున్న యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితే ఇరకాటంలో పడిందని మాట్లాడుకుంటున్నారు. మరి, నలుగురి స్నేహితుల రాజకీయ అడుగులు ఎప్పుడు ఎటువైపు వెళ్తాయోనన్న చర్చ కృష్ణాజిల్లాలో జరుగుతోంది.  

బోటులో మరికొన్ని ఎముకలు, అవయవాలు... అందరూ దొరికినట్లే...కానీ డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే

కచ్చులూరు బోటు ప్రమాద బాధిత కుటుంబాల వేదన హృదయవిదారంగా ఉంది. ప్రమాదం జరిగాక దఫాదఫాలుగా 39 మృతదేహాలను వెలికితీసి బంధువులకు అప్పగించిన అధికారులు.... ఇంకా 13మంది ఆచూకీ కోసం 39రోజులు ఆగాల్సి వచ్చింది. 38రోజుల తర్వాత ఎట్టకేలకు బోటును బయటికి తీయడంతో తమవాళ్ల మృతదేహాలు దొరుకుతాయని ఆశపడ్డ బాధిత కుటుంబాల్లో కొందరికి నిరాశే ఎదురైంది. తమవారిని కనీసం చివరి చూపు అయినా చూసుకోవచ్చని ఆశపడ్డ ఆత్మీయులు ఆశలు గల్లంతయ్యాయి. బోటు నుంచి 8మృతదేహాలు వెలికితీయగా... ఐదుగురిని మాత్రమే గుర్తించారు. అయితే, బోటు నుంచి వెలికితీసిన మృతదేహాలన్నీ కుళ్లిపోయి ఛిద్రమై ఉండటంతో గుర్తించడం కష్టతరంగా మారింది. అయితే, వాళ్లు ధరించిన బట్టలు, జేబుల్లో ఉన్న గుర్తింపు కార్డులు ఆధారంగా ఐదుగురిని గుర్తించగలిగారు. ఇంకా మూడు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. అయితే, రాయల్ వశిష్ట బోటును శుభ్రం చేయడంతో మరికొన్ని ఎముకులు, అవయవాలు, వస్త్రాలు దొరికాయి. దాంతో వాటిని కూడా మూటలుగా కట్టి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాంతో మొత్తం మృతదేహాలు దొరికినట్లేనని అంటున్నారు. అయితే, పలువురి మృతదేహాలు ఛిద్రమైపోవడం... అలాగే అవయవాలు తెగిపోయి కొన్ని భాగాలు మాత్రమే దొరకడంతో వాళ్లను గుర్తుపట్టడం కష్టంగా మారిందని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అంటున్నారు. మృతదేహాలన్నీ మట్టితో నిండిపోయి ఉండటం... అలాగే కొన్ని డెడ్ బాడీస్ కు కాళ్లూచేతులు తెగిపోయి ఉండటం... మరికొన్ని మృతదేహాలైతే కేవలం ఎముకలు, మాంసపు ముద్దలు మాత్రం దొరకడంతో... డీఎన్‌ఏ పరీక్షల కోసం శాంపిల్స్ ను హైదరాబాద్ పంపుతున్నట్లు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. రాయల్ వశిష్ట బోటు డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని అతని కుమారుడు గుర్తించాడు. టీషర్ట్ ఆధారంగా గుర్తించినట్లు తెలిపాడు. అలాగే, వరంగల్ వాసులైన కొమ్ముల రవీంద్ర, ధర్మరాజు మృతదేహాలను వాళ్ల జేబుల్లో దొరికిన ఐడీ కార్డుల ఆధారంగా మృతదేహాన్ని ఐడెంటిఫై చేశారు. ఇక, మంచిర్యాల వాసి రమ్యశ్రీ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. అయితే, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో మిగిలిన మూడు మృతదేహాల్లో... ఆ తర్వాత బోటు నుంచి తీసుకొచ్చిన ఎముకలు, మాంసపు ముద్దల్లో రమ్యశ్రీ డెడ్‌బాడీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృతదేహం ఇంకా దొరక్కపోవడంతో రమ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మంచిర్యాల నుంచి వచ్చిన రమ్యశ్రీ తల్లిదండ్రులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి దగ్గర పడిగాపులు పడుతున్నారు. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపిన రాయల్ వశిష్ట బోటు బయటికొచ్చినా... బాధిత కుటుంబాల్లో కొందరికి మాత్రమే కొంతలో కొంత ఊరట లభించలేదు. కనీసం చివరి చూపు చూసుకునే అవకాశం లభించింది. అయితే, మిగతా మృతదేహాలన్నీ ఏ రకంగానూ గుర్తుపట్టలేనివిధంగా ఉండటంతో ఆయా బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణణాతీతంగా ఉంది. ఇక, ఆచూకీ దొరకాల్సిన, గుర్తించాల్సిన ఆరేడు మంది వివరాలు డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే తేలే అవకాశం కనిపిస్తోంది.

ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ దే ముందడుగు...

  మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం తన సత్తా నిరూపించుకుందని జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం గతంతో కంటే తగ్గినా ఇక్కడి ఓటర్లు మాత్రం మరోసారి అధికార పార్టీకే అనుకూలంగా ఓటు వేసినట్టు ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి మరోసారి ఓటర్లు అవకాశమిచ్చినట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నూట అరవై నాలుగు, శివసేన నూట ఇరవై ఆరు సీట్లలో పోటీ చేశాయి.  వివిధ జాతీయ సంస్థల అంచనాలు చూస్తే.. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం బీజేపీ, శివసేన కూటమి రెండు వందల ముప్పై స్థానాలు గెలుచుకుంటోంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నలభై ఎనిమిది, ఇతరులు పది స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తారు. న్యూస్ సర్వే ప్రకారం బీజేపీ నూట నలభై ఒకటి, శివసేన నూట రెండు, కాంగ్రెస్ పదిహెడు, ఎన్సీపీ ఇరవై రెండు, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారు. యాక్సిస్ మై ఇండియా సంస్థతో కలిసి ఓటరు నాడి పట్టిన ఇండియా టుడే సంస్థ మహారాష్ట్రలో బీజేపీకే నూట తొమ్మిది నుంచి నూట ఇరవై నాలుగు, శివసేనకు యాభై ఏడు నుంచి డెబ్బై, కాంగ్రెస్ కు ముప్పై రెండు నుంచి నలభై, ఎన్సిపికి నలభై నుంచి యాభై, ఇతరులు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. ఇక ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీ శివసేన కూటమి రెండు వందల నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అరవై తొమ్మిది సీట్లలో ఇతరులు పదిహేను సీట్లను గెలుచుకుంటారు. న్యూస్ఎక్స్ చేసిన సర్వేలో బీజేపీకి నూట నలభై నాలుగు నుంచి నూట యాభై, శివసేనకు నలభై నాలుగు నుంచి ఎనభై, కాంగ్రెస్ నలభై నుంచి యాభై, ఎన్సీపీ ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది, ఇతరులు ఆరు నుంచి పది సీట్లు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హర్యానాలోనూ మరోసారి బీజేపీకే జై కొట్టారు అక్కడి ఓటర్లు. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం హర్యానాలో బీజేపీ డెబ్బై ఒకటి, కాంగ్రెస్ పదకొండు, ఇతరులు తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశముంది. బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాలు కైవసం చేసుకొంటుందని ఇండియన్ న్యూస్ ఛానల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు తొమ్మిది నుంచి పన్నెండు, అకాలీ కూటమి ఒకటి, ఇతరులు ఒకటి నుంచి మూడు స్థానాలూ గెలుచుకోవచ్చు. న్యూస్ఎక్స్ సర్వే ప్రకారం బిజెపి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాల్లో, కాంగ్రెస్ తొమ్మిది నుంచి పన్నెండు సీట్లు, ఐఎన్ఎల్డీ అకాడమీ కూటమి ఒక సీటు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఏబీపీసీ ఓటర్ అంచనాల ప్రకారం బీజేపీ డెబ్బై రెండు, కాంగ్రెస్ కి ఎనిమిది, ఇతరులు పది స్థానాలనూ గెలుచుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ పై వ్యతిరేకత కనిపించకపోగా ఓటర్లల్లో మద్దతు పెరిగినట్లు ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి అర్ధమౌతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన కాంగ్రెస్ మహారాష్ట్ర, హర్యానా లోనూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది.ఇక ఈ సర్వే లెక్కలు నిజమౌతాయే లేదో అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.

ఎన్నికలు, ఉపఎన్నికల హోరహోరీ పోరుతో వేడెక్కుతున్న రాష్ట్రాలు...

  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోని ఓటర్లు నేడు తీర్పునివ్వనున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలలోని యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు, రెండు లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, శివసేన కూటమిగా బరిలో దిగుతుండగా అటు ఎన్సీపీ, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి, కమలనాథులకు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ కూటమి ఎన్నికల సమరంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి ఓటరు తీర్పు ఏమిటన్నది గురువారం తేలిపోనుంది.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 3,239 మంది అభ్యర్థులున్నారు. ఇందులో ఒక్క నాందేడ్ దక్షిణ నియోజక వర్గం నుంచే 38 అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఇక చిప్లున్ నియోజక వర్గం నుంచి అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల బరిలో బిజెపి 152 స్థానాల్లో పోటీ చేస్తోండగా, శివసేన 124 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఓర్లీ నియోజక వర్గం నుంచి ఠాక్రే వారుసుడు ఆదిత్య ఠాక్రే పోటీకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ 145 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ 123 స్థానాల్లో పోటీకి దిగింది. వీటితో పాటు ఇతర పార్టీలు కూడా పోటీకి దిగాయి. రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఏకంగా 103 స్థానాల్లో పోటీకి దిగి ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఎంఐఎం కూడా ఎన్నికల బరిలో దిగి సవాల్ విసురుతోంది. ఎంఐఎం నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. హర్యానాల్లోనూ పోటీ వేడిని పెంచుతోంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా..1,169 తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా హన్సీ నియోజక వర్గం నుంచి 25 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా అత్యల్పంగా షహబాద్ నియోజకవర్గల్లో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బిజెపి 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కూడా పొత్తు లేకుండా 90 స్థానాల్లో బరిలో నిలిచింది. ఇక బీఎస్పీ 87 ఐఎన్ఎల్డీ 81 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.  మహారాష్ట్ర, హర్యానాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల్లో ఆయా నేతల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు చెప్పబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల తలరాతను మార్చబోతున్నాయి. అందుకే ఈ ఎన్నికలపైనా నిఘా పెరిగింది. దాదాపు పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు కీలకం కాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లోని నాయకుల పరిపాలనకు మార్కులు వేయబోతున్నారు ఓటర్లు. యూపీలో ఏకంగా 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగికి ఇది కఠిన పరీక్షే. యూపీలో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. బీహార్ లోని 5 స్థానాలు కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బైపోల్స్ కూడా బిజెపి, జేడీయూ స్నేహానికి కీలకంగా మారబోతున్నాయి. మరో ఏడాదిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీలు కర్టనరైజర్ గా చూస్తున్నాయి.  మధ్యప్రదేశ్ లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లు ఉంది. బిజెపి కాంగ్రెస్ ల మధ్య బలం దోబూచులాడుతోంది. స్వతంత్రులు బీఎస్పీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ గట్టెక్కిన, కర్ణాటక పరిణామాలు కమలనాధ్ సర్కారుకు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో మధ్యప్రదేశ్ లోని ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఉప ఎన్నిక అటు బిజెపి  ఇటు కాంగ్రెస్ కు చాలా కీలకం. ఇప్పటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను ఓ బీఎస్పీను లాగి కాంగ్రెస్ వ్యూహం ప్రదర్శించిన ఎప్పటికైనా బిజెపి నుంచి ముప్పు తప్పదన్న భావనలో ఉంది.అందుకే ఈ ఒక్క స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే బీజేపీ కూడా ఈ స్థానంపై కన్నేసింది. ఇది గెలిస్తే ప్రజాభిప్రాయం తమకే ఉందంటూ కర్నాటక ఫార్ములా ప్రయోగించిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.  కేరళలో 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఐదింటినీ చేజిక్కించుకోవాలని లెఫ్ట్ ఫ్రంట్ చూస్తూంటే పాగా వేయాలని బిజెపి అనుకుంటోది. అటు కాంగ్రెస్ కూటమి కూడా గెలుపుపై నమ్మకం పెట్టుకుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరుగుతున్నాయి. అందుకే తాజా ఉప పోరును సెమీ సమరంగా చెబుతున్నారు.  తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో రెండు స్థానాలపై డీఎంకే కన్నేసింది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అదరగొడుతోంది. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని ధీమాతో ఉన్న స్టాలిన్ పార్టీ ఇప్పుడు రెండు స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. అటు అన్నా డీఎంకే నేతలు మాత్రం అసెంబ్లీలో తమ నెంబర్ పెరుగుతుందని చెబుతున్నారు.  తెలంగాణలోని హుజూర్ నగర్ పై అందరి దృష్టీ నెలకొంది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చింది. గుజరాత్, పంజాబ్, ఒడిషా రాష్ట్రాల్లోను ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ లో ఇప్పటికే బిజెపి ప్రభుత్వం బలంగా మారింది. ఇప్పుడు అక్కడ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోవు. పంజాబ్ లోనూ కెప్టెన్ సర్కార్ కు ఎన్ని మార్కులు పడతాయి అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్య అధికారంలోకి వచ్చిన నవీన్ పట్నాయక్ కు ఒక్క స్థానంతో ఎలాంటి మార్పు ఉండదు. కానీ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు మరింత కీలకంగా మారాయి ,ఎందుకంటే వీటితోనే జాతకాలు తేలిపోనున్నాయి. అధికార పార్టీల పాలనపై జనం మాటేంటో ఫలితాల ద్వారా బయటకు రానుంది, మరి ప్రజాధరణ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

కేసీఆర్ సర్కారుకు షాకిచ్చిన క్యాబ్ డ్రైవర్లు... దాదాపు స్తంభించిన హైదరాబాద్ రవాణా...

  మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తయారైంది హైదరాబాదీయుల పరిస్థితి. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలకు మరో షాక్ తగిలింది. బస్సుల బంద్ తో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు క్యాబ్ డ్రైవర్లు ఝలక్ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. దాంతో ఒకవైపు తెలంగాణ బంద్... మరోవైపు క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో... రాష్ట్రం మొత్తం స్తంభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 50వేలకు పైగా క్యాబ్ లు నిలిచిపోనుండటంతో నగరంలో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు ఆగిపోనుంది. క్యాబ్ సంస్థలు పెద్దఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దాంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. దాంతో అప్పులు చెల్లించలేక క్యాబ్ డ్రైవర్లు రోడ్డునపడుతున్నారు. అందుకే, ప్రతి డ్రైవర్ కు కనీస బిజినెస్ గ్యారంటీ ఇవ్వాలంటూ ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీస్ సంస్థలను కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తమ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు సమ్మెను ఆపేది లేదని క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ తెగేసి చెప్పింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ కు క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు... ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టడంతో... కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఎందుకంటే ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా నగరవాసులు... ఎక్కువగా క్యాబ్ లనే ఆశ్రయిస్తుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలన్నా... అక్కడ్నుంచి రావాలన్నా... క్యాబ్ లే ఆధారం. ఇక ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువగా క్యాబ్ లపైనే ఆధారపడుతుంటారు. దాంతో క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ లో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించినట్లవుతుంది. అయితే, ఆటో డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టే అవకాశముండటంతో.... కేవలం మెట్రో అండ్ ఎంఎంటీఎస్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

వైఎస్ తో నెహ్రూ... జగన్ తో అవినాష్... మళ్లీ పార్టీ మారతారంటూ ప్రచారం

  తెలుగుదేశానికి కృష్ణాజిల్లాలో మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ టీడీపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితమే ఈ మాట వినిపించినప్పటికీ, ఈ మధ్య చంద్రబాబు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు ఆందోళనలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొనడంతో... పార్టీ మారే ఆలోచనను దేవినేని అవినాష్ విరమించుకున్నారేమోనన్న టాక్ వినిపించింది. అయితే, దేవినేని అవినాష్ పార్టీ మారతారంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. తాజాగా దేవినేని అవినాష్.... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. దాంతో త్వరలోనే అవినాష్ వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. అవినాష్ తండ్రి దివంగత దేవినేని నెహ్రూకి కృష్ణాజిల్లాలో రాజకీయంగా పట్టుంది. జిల్లావ్యాప్తంగా దేవినేని కుటుంబానికి అభిమానులు, అనుచరులు ఉన్నారు. దేవినేని నెహ్రూ కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అవినాష్ ... అతి తక్కువ సమయంలోనే యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి వార్తల్లో నిలిచారు. ఇక, 2019లో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన అవినాష్.... ప్రస్తుత మంత్రి కొడాలి నానికి గట్టిపోటీనిచ్చారు. నువ్వానేనా అన్న స్థాయిలో దడ పుట్టించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయంతో అవినాష్ చూపు వైసీపీ వైపు మళ్లింది. అసలు ఎన్నికలకు ముందు అవినాష్ ... వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇక, కొడాలి నానికి దీటైన అభ్యర్ధిగా అవినాష్ ను భావించిన చంద్రబాబు... గుడివాడ నుంచి బరిలోకి దింపారు. అయితే, వైసీపీలో హోరుగాలిలో అవినాష్ ఓటమి పాలైనా... యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.   ఇక, దేవినేని నెహ్రూ కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని నెహ్రూ... ఆ తర్వాత ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దేవినేని నెహ్రూ... వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే కావడమే కాకుండా ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. అయితే, 1995 ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ లో చేరి, వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. అలాగే, వైఎస్ ఫ్యామిలీతో దేవినేని నెహ్రూ కుటుంబానికి సత్సంబంధాలు ఉండటంతో... అవినాష్ వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ దేవినేని అవినాష్... వైసీపీలో చేరితే అది టీడీపీ నష్టమేనని చెప్పాలి. ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున అనుచరులు, అభిమానులు ఉన్నారు. వాళ్లంతా అవినాష్ వెంట నడిచే అవకాశముంది.

సీఎంఆర్ఎఫ్ నిదుల వైఫల్యంతో వైద్యం చేయమని నిరాకరిస్తున్న వైద్యులు...

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది ఏపీలో సీఎం ఆర్ఎఫ్ బాధితుల పరిస్థితి. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండర్ల తో సొమ్ము ఆదా చేసినట్టు ప్రజల ఆరోగ్య విషయంలోనూ అదే చేస్తున్నట్టు కనిపిస్తుంది. పాత వారికి డబ్బులు జమ చేయకుండా కొత్త వారికి దరఖాస్తులు చూడకుండా ప్రభుత్వం వారితో ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటినా ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి నామ మాత్రం గానే బాధితులకు సొమ్ము విడుదల చేస్తోంది. ఇతర ప్రాజెక్టుల మాదిరిగా ఇక్కడ కూడా రివర్స్ పద్ధతిని పాటిస్తున్నట్లు కనబడుతుంది. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులను మళ్లీ తనిఖీ చేస్తున్నామంటూ కాలయాపన చేస్తోంది. దీంతో రిలీఫ్ పండ్ సెక్షన్ లో సుమారు ముప్పై మూడు వేల దరఖాస్తులు నూట యాభై కోట్ల బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. గత ప్రభుత్వం తన మన అని చూడకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్వోసీలోని ఉదారంగా అందించింది. కొత్త ప్రభుత్వం అంత కంటే ఎక్కువే చేస్తుందని ప్రజలు ఆశించారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి నాలుగు నెలలుగా ప్రతి రోజూ మూడు వందల నుంచి నాలుగు వందల దరఖాస్తుల సీఎంఆర్ఎఫ్ వస్తున్నాయి. అధికారులు వాటి అన్నింటినీ పక్కన పడేస్తున్నారు. జూన్ ఒకటి నుంచి అక్టోబర్ వరకు పదమూడు వేల సీఎం ఆర్ కు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటి విలువ సుమారు డెబ్బై కోట్లని అంచనా. ఇవి కాకుండా టీడీపీ ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వచ్చిన పద్దెనిమిది వేల దరఖాస్తులను కొత్త ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది. వీటి విలువ కూడా అరవై ఐదు కోట్ల పైనే ఉంటుంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు వెయ్యి దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేస్తుంది.వీటిలో ఐదు వందల నుంచి ఆరు వందల దరఖాస్తులకు మాత్రమే చెక్కులు అందించింది.ఆ చెక్కులు కూడా బాధితుల అకౌంట్ లలో జమ కాలేదని తెలుస్తోంది. దరఖాస్తులను ఇంకా వాయిదాలో ఉండటంతో  బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది జిల్లాల్లో ఎమ్మెల్యేల కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. దీంతో ఎమ్మెల్యే లు సీఎం కార్యాలయం పై ఒత్తిడి తెస్తున్నారు ఫలితంగా నియోజకవర్గాని కి యాభై దరఖాస్తుల చొప్పున క్లియర్ చేసేందుకు అధికారులు ఆమోదం తెలిపారు. అయితే ఎమ్మెల్యేలు పేద ప్రజలను వదిలేసి తమ బంధువుల అనుంగు సహచరులు దరఖాస్తులు మాత్రమే నిశ్చితం చేయించుకుంటున్నారు. డబ్బుల్లేక నిధులు విడుదల చేయడం లేదా అంటే ప్రస్తుతం సుమారు ఎనభై కోట్ల నిధులు ఉన్నట్లు సమాచారం. వీటిని విడుదల చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఐదు వేల మందికి ఇచ్చిన చెక్కు లను కూడా ఇప్పటి వరకు క్లియిర్ చేయకుండా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. చెక్కులు చేతికి వచ్చిన బ్యాంకుల్లో డబ్బు లు జమ కాకపోవడం తో కొంత మంది బాధితులు ఆశలు వదిలేసుకున్నారు. ప్రస్తుత వాతావరణం చూసి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యా లు భయపడుతున్నాయి. సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళన చెందుతున్నాయి. అందుకే రోగులకు లెటర్ లు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం చాలా ఆస్పత్రుల్లో ముప్పై నుంచి అరవై లక్షల వరకు ఎల్ వోసీలు బకాయిలున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టుకొని కొత్తగా రోగుల కు ఎల్ వోసీ నుంచి తాము అప్పులపాలు కాలేమని ప్రైవేటు ఆసుపత్రుల చేతులెత్తేస్తున్నాయి. ఇదే విషయాన్ని రోగులకు స్పష్టంగా వివరిస్తున్నాయి డబ్బులుంటే బిల్లు కట్టే వైద్యం చేయించుకోండి లేదంటే వెళ్లిపొమ్మని కటువుగా చెప్పేస్తున్నారు విధిలేక కొందరు రోగులు లక్షల్లో అప్పు లు చేసి వైద్యం చేయించుకుంటున్నారు ఇంకొంతమంది అనారోగ్యం తో యుద్ధం చేస్తున్నారు.ఇక జగర్ సర్కార్ ఏమి చేయ్యబోతోందో వేచి చూడాలి.

అందుకోసమే జగన్ ను చిరంజీవి కలిసారా?

  జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ దారుణ పరాజయంతో చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లి పోయారు. అందుకే సోదరుడు పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీ పెట్టినా దానికి దూరంగానే ఉన్నారు. జనసేన వైసీపీకి పూర్తి వ్యతిరేక పార్టీ, మొన్నటి ఎన్నికల్లో వైసిపిని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. తమ్ముడు పవన్ ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకం కనుకనే జగన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందినా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు చిరంజీవి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళిన చిరంజీవి దంపతులు తాడేపల్లి లోని ముఖ్యమత్రి జగన్ క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. సమావేశం తరువాత జగన్ తన నివాసంలో చిరంజీవి దంపతులకు విందు ఇవ్వబోతున్నారు. జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్ కు దూరంగా జరిగి తమ్ముడు స్థాపించిన జనసేనకు దూరంగా ఉంటున్న చిరంజీవి కేవలం తాను ఇటీవల సైరా సినిమా గురించి మాట్లాడతారా లేక రాజకీయాలు కూడా చర్చిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.  తెలుగు నాట తొలి స్వాతంత్య్ర సమరయోధుడు రేనాటి ప్రాంత వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అడగ్గానే అదనపు షోలు వేసుకోవడానికి అనుమతించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పడానికే చిరంజీవి దంపతులు తాడేపల్లి వెళ్లారని సమాచారం. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరగా సోమవారం రావాల్సిందిగా సీఎం కార్యాలయం ఆహ్వానించింది. జగన్ కు కృతజ్ఞతలు చెప్పి సైరా నరసింహా రెడ్డి సినిమా చూడాలని ఆహ్వానించనున్నట్లు సమాచారం. విజయవాడలో సినిమా చూడటానికి జగన్ అంగీకరించినట్లు కూడా సమాచారం. తమ్ముడు పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఇబ్బంది కలుగుతోందని ఆలోచనతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆహ్వానం అందినప్పటికీ చిరంజీవి హాజరు కాలేదు. వైసిపి అధినేత జగన్ కు చిరంజీవి సోదరుడు పవన్ రాజకీయంగా బద్ధ వ్యతిరేకి అనే విషయం తెలిసిందే. ఇప్పుడు విజయవంతం గా ఆడుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించింది చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్. ఈ సినిమా ప్రదర్శన విషయంలో జగన్ సహకారానికి కుమారుడు తరుపున చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ను ఏపీకి ముఖ్యంగా విశాఖకు తరలి రావటానికి గల అవకాశాలపై ఇటు జగన్, చిరంజీవి చర్చిస్తారని తెలుస్తోంది. విశాఖలో స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు సమాచారం. ఇందుకు స్థలం కేటాయించడంతో పాటు సహకారం అందించాలని చిరంజీవి కోరే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ సమాచారం.

మోదీ, జిన్ పింగ్ ల భేటీకి మహాబలిపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు..?

  చైనా భారత్ ద్వైపాక్షిక చర్చలకు మహాబలిపురం వేదికగా మారడంతో ఈ పేరు బాగా ప్రముఖంగా మారింది. మోదీ, జిన్ పింగ్ ల భేటీకి మహాబలిపురాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు, ఈ ప్రాంత ప్రత్యేకత ఏంటి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. 2014 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల్లో దిగారు మోదీ. ప్రచారం ఆద్యంతం సహజత్వానికి భిన్నంగా సాగింది. ఈ క్రమం లోనే మోదీ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. తాను ప్రధానిగా ఎన్నికైతే విదేశాలతో సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఇందు కోసం దేశీయంగా పర్యాటక ప్రదేశాలను వినియోగిస్తానని చెప్పారు మోదీ. సమావేశాలు, కీలక భేటీల నిర్వహణకు ప్రాముఖ్యత పర్యాటక ప్రదేశాలను ఉపయోగించుకుంటామని, తద్వారా ఆ ప్రాంతాలకు మరింత వన్నె తీసుకొస్తామని ప్రకటించారు. మోదీ ప్రధాని అయిన తరువాత చెప్పిన మాట ప్రకారం విదేశీ సంబంధాల పునరుద్ధరణకు ఆయన దేశంలోని పర్యాటక ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. 2017లో కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. పశ్చిమబెంగాల్ తో బంగ్లాదేశ్ సంబంధం విడదీయరానిది. చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ భేటీకి మోదీ కోల్ కతాను ఎంచుకున్నారు. 2017 లో సబర్మతీ నదీ తీరం వేదికగా ఇండియా చైనా శిఖరాగ్ర సమావేశం జరిగింది. సబర్మతీ విశిష్టతా, మహాత్మా గాంధీ ఆశ్రమం ప్రత్యేకతలు ప్రపంచానికి తెలిపేందుకే ఈ భేటీ ఉపయోగపడింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మహాబలిపురం వేదికగా మరోసారి భారత్, చైనా చర్చలు జరపబోతున్నాయి. ఉప్పు, నిప్పులా ఉండే భారత్, చైనా సంబంధాల బలోపేతానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడూ పాక్ కు వంతపాడే చైనాతో చర్చలంటే సహజంగానే ప్రతి ఒక్కరికీ ఆసక్తి. ఈ నేపధ్యంలో భారత ప్రధాని మోదీ జిన్ పింగ్ భేటీకి మహాబలిపురం వేదిక కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మహాబలిపురం విశిష్టతపై చర్చసాగుతోంది. మహాబలిపురంలో ఆకట్టుకునే శిల్పాలూ, ప్రసిద్ధ శిల్పులకు పెట్టింది పేరు, ఇక్కడ అడుగడుగునా శిల్పకళ ఉట్టిపడుతుంది. మహాబలిపురాన్ని ఏడవ శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మ నిర్మించాడు, ఇది చెన్నై మహానగరానికి సరిగ్గా యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పల్లవ రాజు నరసింహ వర్మన్ ఇక్కడ ఓడరేవును సైతం నిర్మించాడు. తద్వారా విదేశాలతో వ్యాపారానికి మార్గం సులభతరమైంది. యుద్ధ విద్యలో ఆరితేరిన నరసింహవర్మన్ ను మమల్లన్ గా పిలిచేవారు, అతడి పేరుపైనే ఇక్కడ ఓడరేవుకు మమల్లపురంగా పేరు పెట్టారు. పల్లవరాజులు చైనాతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. తమ రాయబారులను వారు చైనాకు పంపేవారు, రెండో నరసింహవర్మన్ అరబ్స్, టిబెటియన్ల విషయంలో చైనాకు సాయమందించారు. ముఖ్యంగా చైనా, తమిళనాడు మధ్య సిల్క్ వ్యాపారానికీ మహాబలిపురం ఓడరేవు బాగా ఉపయోగపడింది. ఒకటో నరసింహవర్మన్ పాలనను ప్రత్యక్షంగా చూసిన చైనా పర్యాటకుడు హ్యున్ సంగ్ ఇక్కడి అభివృద్ధిని కొనియాడారు. ప్రజలు సుఖ సంతోషాలతో పాటు జీవిస్తున్నారనీ విద్యారంగం బాగుంటుందంటూ కితాబు ఇచ్చారు. ఇలా మహాబలిపురం, చైనా మధ్య చారిత్రక సంబంధాలున్నాయి.

కడప మాదిరిగా యురేనియం తవ్వకాలకు బలికాబోయిన ఆళ్లగడ్డ...

కర్నూ లు జిల్లా రైతుల కన్నుగప్పి పచ్చని పొలాలపై కాలకూటం విరజిమ్మే కుట్ర  జరుగుతోంది. గత నెలలో ఓ కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు బోర్ల పేరుతో గుట్టుగా తవ్వకాలు జరిపారు. యురేనియం కోసమేనని రైతు లు పసిగట్టి వ్యతిరేకించే వారికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అండగా నిలిచింది. దీంతో యురేనియం డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి.' సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపైన్ తో అఖిలప్రియ ప్రభుత్వం పై మరింత ఒత్తి డి తెచ్చారు. కడపులో మాదిరిగా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరపనున్నామని అఖిల పక్షం నేతలు తేల్చి చెప్పారు.నల్లమల్ల ప్రకృతి అందాలు పచ్చని పైర్లు అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు శిల్ప సంపదకు ఆళ్లగడ్డ నిలయం. అలాంటి ఆళ్లగడ్డ ను సర్వనాశనం చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామ పొలిమేరల్లో ఓ కాంట్రాక్టు సంస్థ అడుగుపెట్టింది. గలగల పారే వాగుల పచ్చని పొలాల మధ్య యంత్రాలనూ దింపింది. సంస్థ ప్రతి నిధులు యంత్రా లతో బోర్లు వేస్తునట్టు నటించి యురేనియం తవ్వకాల సర్వే పనులు మొదలు పెట్టారు. ఆరు వందల అడుగుల లోతు వరకు యురేనియం కోసం అన్వేషణ సాగించారు. బోర్లు వేస్తున్నామంటూ చుట్టు పక్కల రైతు లకు సంస్థ ప్రతి నిధులు చెప్పి బోల్తా కొట్టించారు. భూగర్భం లోంచి తీసి ల్యాబ్ కు పంపిన రాళ్ల ను చూసి రైతు లకు అనుమానం వచ్చింది.ఇప్పటికే కడప జిల్లా ప్రజల బతుకుల్లో యురేనియం విషం చిమ్ముతోంది. ఇంతలోనే మరో రాయలసీమ జిల్లా ను కూడా ఈ ముప్పు తాకనుందని రైతులు ఆందోళన చెందారు. సర్వే తవ్వకాల కు వ్యతిరేకంగా రైతు లు రోడ్డెక్కారు.మాజీ మంత్రి భూమా అఖిలప్రియ యురేనియం సర్వే తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి వచ్చి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులను వివరా లు అడిగి తెలుసుకున్నారు. యురేనియం సర్వే తవ్వకాల అనుమతులపై సంస్థ ప్రతి నిధులు రెవెన్యూ అధికారుల పొంతన లేని సమాధానమిచ్చారు. రైతుల పర్మిషన్ లేకుండా సర్వే తవ్వకాలు ఎలా జరుపుతారని భూమా అఖిలప్రియ సంస్థ ప్రతి నిధులను నిలదీశారు. దీంతో కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు యురేనియం సర్వే తవ్వకాల పనులు తాత్కాలికం గా నిలిపివేశారు. సర్వే పనులకు అనుమతి ఇవ్వా లని ఆళ్లగడ్డ తహసీల్దార్ కు లేఖ పంపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం లో దాదాపు ఇరవై గ్రామాల్లో పదిహే ను చోట్ల మళ్లీ యురేనియం సర్వే పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం యురేనియం సర్వే పనులు ఆపెయ్యాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ ను కాపాడేందుకు 'సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపెయిన్ ను ఉధృతం చేశారు.సంస్థ ప్రతి నిధులు డ్రిల్లింగ్ పనులు చేసే యంత్రాలను అక్కడి నుంచి తీసుకెళ్లారు .ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి యురేనియం తవ్వకాల సర్వేపై స్పందించారు. యురేనియం తవ్వకాలకు తాము వ్యతిరేకమన్నారు. రెండు వేల పధ్ధెనిమిది లో చంద్రబాబు యురేనియం తవ్వకాల కు అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణల యురేనియం తవ్వకాల ను సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని విపక్షా లు ప్రయత్నిస్తున్నాయి. యురేనియం తవ్వకాల కు వ్యతిరేకం గా అఖిల పక్ష బృందం కడప జిల్లాలో యురేనియం తవ్వకాల ప్రాంతాల్లో పర్యటించింది.ఆళ్లగడ్డ లో అఖిల పక్ష సమావేశం లో పాల్గొన్నారు. రాయలసీమ లో యురేనియం తవ్వకాల పై అఖిల పక్ష నేతలు ముక్త కంఠంతో వ్యతిరే కించారు. పులివెందుల ప్రజలు నరకం చూస్తున్న పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కడప జిల్లా మాదిరి గా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరగనివ్వమని హెచ్చరించారు. యురేనియం తవ్వకాల పై సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ సీరియస్ అయ్యారు. సీఎం జగన్ కడప జిల్లా లో యురేనియం బాధిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. యురేనియం తవ్వకాలు జరపకముందే మేల్కొన్న ఆళ్లగడ్డ ప్రజల ను రామకృష్ణ అభినందించారు. యురేనియం సర్వే తవ్వకాల వల్ల తమ భూముల రేట్లు పడిపోతున్నాయి అని ఆళ్లగడ్డ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కుట్ర లు చేసినా సర్వే పనులను అడ్డు కుంటామన్నారు. రైతు లు ప్రజా సంఘాలు అన్ని విపక్ష పార్టీ లు ఏకం కావడం తో జగన్ సర్కార్ కు యురేనియం సెగ తగిలింది ఇక జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

కేసీఆర్ కు ఆ అధికారం లేదు.. గతంలో జయలలితకు షాకిచ్చిన సుప్రీం కోర్టు!!

  తెలంగాణ ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. డెడ్ లైన్ విధించి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించి. అయినా ఆర్టీసీ ఉద్యోగులు వెనకడుగు వేయకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగారు. ఆర్టీసీలో ఇక మిగిలింది 12 వందల మంది ఉద్యోగులే అని చెప్పిన కేసీఆర్‌.. సమ్మెలో ఉన్న సుమారు 48 వేల మందిని తొలగిస్తున్నామని పరోక్షంగా హెచ్చరించారు. దీంతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను మూకుమ్మడిగా తొలగించవచ్చా? అన్ని వేల మందిని ఒకేసారి డిస్మిస్‌ చేయడాన్ని చట్టాలు సమర్థిస్థాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అధికారంలో ఉన్న సమయంలో మూకుమ్మడిగా దాదాపు 2 లక్షల మందిని తొలగించారు. 2003 లో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు దిగగా.. మొత్తం 1.70 లక్షల మందిని తొలిగిస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది ఉద్యోగులను జయలలిత తొలగిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. వాళ్లను తిరిగి తీసుకోవాలని చెబుతూనే, బేషరతుగా క్షమాపణ చెబుతూ.. భవిష్యత్‌లో సమ్మెలు చేయబోమంటూ ప్రమాణపత్రం ఇవ్వాలని ఉద్యోగులకు సుప్రీం నిర్దేశించింది.  ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన కూడా న్యాయసమీక్షకు నిలబడదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తొలగిస్తే.. వారు కోర్టుకి వెళ్లే అవకాశముంది. అప్పుడు తమిళనాడు ఉద్యోగుల అంశంలో వెలువడిన తీర్పే మళ్లీ వెలువడే అవకాశముందని అంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి ఉద్యోగులను తొలగించే అధికారం లేవంటున్నాయి. ‘‘మేము చట్టబద్ధంగా సమ్మె నోటీసులిచ్చాం. మంత్రి ఉన్నా.. చర్చల్లో పాల్గొనలేదు. మాకు న్యాయం చేయడానికి కోర్టులున్నాయి. చట్టాలు మూకుమ్మడి తొలగింపులను అనుమతించవు.’’ అని అంటున్నారు.

ప్రభుత్వ బకాయిలు చెల్లింపు పై చంద్రబాబు తీవ్ర విమర్శలు...

  హామీలు ఎన్నోఇస్తుంటారు కానీ రాను రాను వాటి బకాయిలు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోంది. ఉపాధి హామీ పథకం బకాయిల క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా వాటిని కూలీలకు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందని టిడిపి అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు గురువారం ఆయన లేఖ రాశారు.  కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు విడతలుగా పధ్ధెనిమిది వందల నలభై ఐదు కోట్లు రాష్ట్రానికి పంపింది. ఈ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కలిపి మూడు రోజుల్లోగా రాష్ట్ర ఉపాధి హామీ నిధుల బదిలీ చేయాలి. ఇలా చేయకపోతే తదుపరి నిధులు విడుదల నిలిపివేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. అలాగే జాప్యం చేసిన కాలానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు శాతం వడ్డీ కూడా చెల్లించాలి. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ఈ నిధులు వినియోగించాలని పాత పెండింగ్ బిల్లులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేంద్రం తన ఆదేశాల్లో సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించాల్సిన బిల్లులను చెల్లించలేదు. ఈ నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించిందనే ఆరోపణలు వస్తున్నాయని అందులో పేర్కొన్నారు. నెలల తరబడి బిల్లులూ పేరుకుపోవడంతో అవి రావలసిన వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కొన్ని చోట్ల ఈ పరిణామం ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఉపాధి హామీ పథకానికి చెడ్డ పేరు తెస్తుందని బిల్లులు పేరుకుపోవడంతో ఈ పథకంతో జత కలిపి పనులు చేయటానికి ప్రభుత్వ విభాగాలు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు.  ఉపాధి హామీ పథకం గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఈ పరిస్థితి పై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలిచ్చారని గవర్నర్ ను కూడా కలిసి వివరించారని తెలిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనుసాగితే అతి త్వరలోనే ప్రజలు ఈ పథకం పై విశ్వాసం కోల్పోతారని ఫలితంగా గ్రామీణాభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతోందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందంటున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ గత ఐదేళ్లలో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. ఈ పథకం నిధులతో రాష్ట్రంలో ఇరవై ఆరు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, ఆరు వేల అంగన వాడీ భవనాలు, రెండు వేల రెండు వందల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, పదివేల సాలిడ్ వేస్ట్ కేంద్రాలూ, ఏడు లక్షల పంటకుంటలు నిర్మించామని చంద్రబాబు పేర్కొన్నారు. పన్నెండు వేల కిలోమీటర్ల మేర గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఎనభై మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో ముప్పై మూడు ఈ రాష్ట్రం నుంచే ఉన్నాయి. మొదటి పది లో ఏడు కూడా ఈ రాష్ట్రానికి చెందినవే అని తెలియజేశారు. దీనిని పరిశీలించి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో ఉపాధి హామీ పథకం మాత్రమే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్రం నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బకాయిలు చెల్లింపు పై చంద్రబాబు తన దృష్టని పెట్టారని స్పష్టంగా వెల్లడవుతోంది. 

ఒక్కరోజు గ్యాప్ లో ఇద్దరు సీఎంలు... ఆసక్తిరేపుతోన్న కేసీఆర్, జగన్ ఢిల్లీ టూర్

  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పట్టారు. కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్ అండ్ జగన్ హస్తినకు వెళ్తున్నారు. ఒకట్రెండు ఇష్యూస్ మినహా ఇద్దరి అజెండాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇద్దరూ కూడా ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులను కలిసి తమతమ రాష్ట్రాల సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే విభజన సమస్యలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. అయితే, ఎన్నికలకు ముందు మోడీని తిట్టిన తిట్టకుండా ఒంటికాలిపై లేచిన కేసీఆర్... నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక తొలిసారి సమావేశంకాబోతున్నారు. మరోవైపు తెలంగాణలో పొలిటికల్ వార్ ... టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారుతోన్న క్రమంలో.... కేసీఆర్... మోడీని కలవబోతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. అయితే, రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే మోడీతో కేసీఆర్ చర్చించనున్నారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తక్షణమే గ్రాంట్లను రిలీజ్ చేయాలని కోరనున్నారు. అలాగే, ఆయుష్మాన్-భవ పథకం నిధులను ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయాలని, అదేవిధంగా జలశక్తి కేటాయింపులకు మిషన్ భగీరథకు ఇవ్వాలని విజప్తి చేయనున్నారు. ఇక, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, జోనల్ వ్యవస్థ సవరణ, రిజర్వేషన్ల పెంపు, యురేనియం తవ్వకాల నిలిపివేత, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం... ఇలా పలు డిమాండ్లను ప్రధాని ముందు పెట్టనున్నారు.  ఇక, ఒక్క రోజు గ్యాప్ తో ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా... రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరనున్నారు. రెవెన్యూ లోటు, ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో... ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాలంటూ మెమొరాండం ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు. అయితే, అక్టోబర్ 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న రైతు భరోసా పథకం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా రావాలని మోడీని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అయితే, ఇటీవల ప్రగతి భవన్లో సమావేశమైన కేసీఆర్-జగన్... కేంద్ర ప్రభుత్వ తీరుపైనా, మోడీ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారంటూ పత్రికల్లో కథనాలు రావడం సంచలనం సృష్టించింది. ఇక, ఇఫ్పుడు ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్, జగన్ లు ఢిల్లీ వెళ్తుండటం... అదే సమయంలో ఇద్దరికీ మోడీ అపాయింట్ మెంట్లు ఇవ్వడం ఆసక్తిరేపుతోంది.

నాలుగు నెలల వ్యవధిలోనే సచివాలయ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఏపీ సర్కార్...

  గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏపీ సర్కార్ ప్రారంభించింది. తూర్పుగోదారి కరపలో జగన్ గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిచోటా పది నుండి పన్నెండు మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది. దాదాపు ప్రతి ఊరిలో ఒక గ్రామ సచివాలయం, జనాభా అత్యధికంగా ఉన్న గ్రామంలో ఆరు నుంచి ఏడు సచివాలయాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డ్ సచివాలయాలు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో రానున్నాయి. ఈ సచివాలయాల్లో పని చెయ్యటానికి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే విడతలో లక్షా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పధ్ధెనిమిది లక్షల ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. పింఛన్ లు, రేషన్ కార్డులు ఇంటి పట్టా వంటి వాటి కోసం పేదల మండల ఆఫీసులు, కలెక్టరేట్ రాజధానిలో ఉండే శాఖాధిపతుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారు. ప్రస్తుతం గ్రామ స్థాయిలో కేవలం 19 రకాల సేవలు పంచాయతీల ద్వారా అందజేసే అధికారముంది, ఈ పరిస్థితిని మార్చేస్తూ 500 రకాల ప్రభుత్వ సేవలను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2 వ తేదీ నుంచి ప్రతీ నెల కొన్ని సేవల చొప్పున గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందజేస్తారు. జనవరి 1వ తేదీ కల్లా 500 రకాల సేవలను ప్రజలు పూర్తిగా గ్రామ సచివాలయాల్లోనే పొందేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సేవలు అందజేసే విషయంలో నిర్దిష్ట కాల పరిమితి విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఆయా శాఖల పరిధిలో జరిగే పనులను గ్రామ సచివాలయం అనుమతితో చేపట్టే అవకాశముందని అధికార వర్గాలు చెప్తున్నాయి. గ్రామ సచివాలయాల పరిధిలో జరిగే ప్రతి అభివృద్ధి పని, ప్రతి సంక్షేమ పథకంలో లబ్ధిదారుల పేర్లను అక్కడి ప్రజలందరి సమక్షంలో చేర్పించి నిర్ణయించాలనీ, ఏడాదిలో తప్పని సరిగా ఎనిమిది సార్లు గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల్లో అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా అర్హులకే వాటిని అందించటానికి సన్నాహాలు చేస్తోంది. ప్రతి పథకం లబ్ధిదారుల జాబితాలో అందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీస్ బోర్డులో ఉంచుతారు. ఏ శాఖ ద్వారా ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారన్న వివరాలను సైతం సచివాలయంలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు.

పయ్యావుల కేశవ్ సొంతూరులో అలజడి... గ్రామాన్ని విడగొట్టేందుకు ప్రయత్నాలు...

  ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో అలజడి రేగింది. రాజకీయ కారణాలతో గ్రామాన్ని రెండుగా విడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలో పెద్ద కౌకుంట్ల, చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, రాసిపల్లి, మైలారంపల్లి గ్రామాలు ఉన్నాయి. దాదాపు 5వేలకు పైగా జనాభా ఉన్న పెద్ద కౌకుంట్ల మొదట్నుంచీ మేజర్ పంచాయతీగా కొనసాగుతోంది. అయితే, జగన్మోహన్ ‌‌రెడ్డి అధికారంలోకి వచ్చాక, రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా చేయాలంటూ వైసీపీ వర్గాలు డిమాండ్ రావడంతో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే, గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయారు. పెద్ద కౌకుంట్ల... ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్వగ్రామం కావడం... ముందునుంచీ టీడీపీకి పట్టు ఉండటంతో... తెలుగుదేశం వర్గీయులు.... మేజర్ పంచాయతీగానే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వైసీపీ వర్గీయులు మాత్రం వై.రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. దాంతో గ్రామస్తులు...పార్టీల వారీగా విడిపోయి రగడకు దిగారు. అయితే, పెద్ద కౌకుంట్ల... టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ సొంత గ్రామం కావడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ప్రజాభిప్రాయసేకరణకు రావడంతో పెద్ద కౌకుంట్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వయంగా రంగంలోకి దిగి, తెలుగుదేశం శ్రేణులకు అండగా నిలిచారు. అయితే, గ్రామస్తులు... పార్టీల వైజ్‌... రెండు వర్గాలుగా విడిపోయి... వాదోపవాదాలకు దిగడంతో... ఉద్రిక్తత మధ్యే అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో... మొత్తం 1672మంది పాల్గొంటే, వై.రాంపురం గ్రామాన్ని... పెద్ద కౌకుంట్ల పంచాయతీలోనే కొనసాగించాలని 1522మంది కోరగా, కేవలం 150మంది మాత్రమే ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. దాంతో, గ్రామస్తుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఉరవకొండ ఎంపీడీవో తెలిపారు. ఇదిలాఉంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక, పచ్చని గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి పనిగట్టుకుని... తమ గ్రామాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.