గ్రేటర్‌లో జోష్.. దుబ్బాకపై సైలెంట్! కేటీఆర్ కథ పెద్దదే!
posted on Oct 13, 2020 @ 3:57PM
తెలంగాణలో వరుస ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 3న జరగనున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ లోపే బల్దియా కొత్త పాలకమండలి ఏర్పాటయ్యేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వచ్చే మార్చి-ఏప్రిల్ లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు మంత్రి కేటీఆర్. అయితే ఆయన ఫోకసంతా గ్రేటర్ , మండలి ఎన్నికలపైనే పెడుతున్నట్లు కనిపిస్తోంది. డిసెంబర్ లో జరుగుతాయని భావిస్తున్న జీహెచ్ఎంసీ, మరో ఆరు నెలల తర్వాత జరగనున్న మండలి ఎన్నికలపై వరుస సమీక్షలు చేస్తున్న కేటీఆర్.. దుబ్బాక ఉప ఎన్నికను మాత్రం పట్టించుకోలేదు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నిజానికి మరికొన్ని రోజుల్లోనే జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎక్కువ దృష్టి సారించాలి. కాని కేటీఆర్ మాత్ర దుబ్బాక ఎన్నిక గురించి అసలు మాట్లాడటమే లేదు. దుబ్బాక నేతలతో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కనీసం వారితో వీడియో కాన్ఫరెన్స్ లోనూ మాట్లాడలేదు కేటీఆర్. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా గ్రేటర్ ,మండలి ఎన్నికల్లో తామే గెలుస్తామని చెబుతున్న కేటీఆర్.. దుబ్బాకపై మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. కేటీఆర్ వైఖరిపై టీఆర్ఎస్ లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. దుబ్బాకలో పార్టీ పరిస్థితి బాగాలేదని గ్రహించడం వల్లే కేటీఆర్ దానిపై ఫోకస్ చేయడం లేదని చెబుతున్నారు. పార్టీ సర్వేలోనూ అదే తేలిందంటున్నారు. అందుకే దుబ్బాకలో పార్టీ ఓడిపోయినా తన ఇమేజ్ డ్యామేజీ కాకుండా ఉండేలా కేటీఆర్ జాగ్రత పడుతున్నారనే ప్రచారం కూడా ఉంది.
గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం మళ్లీ కైవసం చేసుకుంటామనే భావనలో కేటీఆర్ ఉన్నారట. అందుకు కారణం కూడా ఉందంటున్నారు. గ్రేటర్ లో ఇప్పటికే 30కి పైగా ఎక్స్ అఫిషియో సభ్యులు టీఆర్ఎస్ కు ఉన్నారు. ఓల్డ్ సిటీలో ఎలాగూ ఎంఐఎం దాదాపు 50 వరకు డివిజన్లు గెలుచుకుంటుంది. దీంతో గతం కంటే చాలా సీట్లు తగ్గినా.. మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న పతంగి పార్టీతో కలిసి గ్రేటర్ లో మళ్లీ పవర్ దక్కించుకునే అవకాశం అధికార పార్టీకి ఉంది. అందుకే గ్రేటర్ పై కేటీఆర్ ధీమాగా ఉన్నారని చెబుతున్నారు. మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేక ఫలితాలు వచ్చినా కేటీఆర్ కు పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గతంలోనూ మండలి ఎన్నికల్లో గులాబీ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి. కాబట్టి ఈసారి అలాంటి ఫలితాలే వచ్చినా అది కేటీఆర్ కు అంత ఇబ్బందిగా ఉండదని చెబుతున్నారు. అందుకే తనకు మైనస్ కాకుండా ఉన్న గ్రేటర్ హైదరాబాద్, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలపైనే ఫోకస్ చేస్తూ.. ఇబ్బందిగా ఉందని భావిస్తున్న దుబ్బాకను కేటీఆర్ పట్టించుకోవడం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
దుబ్బాక ఉపఎన్నికతో మంత్రి హరీష్ రావుపై మెడపై కత్తి పెట్టారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం దుబ్బాక బాధ్యతలన్ని హరీష్ రావే చూస్తున్నారు. అక్కడ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ వ్యతిరేక ఫలితం వస్తే.. ఆ నెపమంతా హరీష్ రావుకు అంటగట్టే కుట్ర జరుగుతుందనే వాదనలు కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో మొదటి నుంచి హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయనకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఎన్నికల్లోనూ సక్సెస్ చేసి చూపించారని చెబుతారు. అలాంటి ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ కలిగేలా టీఆర్ఎస్ లోని ఓ వర్గం ప్లాన్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. అందుకే పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలుస్తున్నా.. దుబ్బాకకు కేటీఆర్ ఎందుకు వెళ్లడం లేదని కొందరుచెబుతున్నారు. హరీష్ రావును ఇరికించే ప్రయత్న దుబ్బాక ఉప ఎన్నిక సాక్షిగా జరుగుతుందని బలంగా వాదిస్తున్నారు. అయితే తమ నేతపై కుట్రలు జరుగుతున్నాయని అనుమానిస్తూనే... దుబ్బాక పరీక్షలో హరీష్ రావే గెలుస్తారని ఆయన అభిమానులు నమ్మకంగా చెబుతున్నారట.