రియా చాలా చెప్పింది.. ఆ త‌ర్వాత‌..?

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ మ‌ర‌ణం ఎన్నెన్ని సంచ‌ల‌నాలకు సాక్షీభూత‌మైంది! ఎన్నెన్ని మ‌లుపులు తిరుగుతున్న‌ది! ఎంతెంత మందిని బైటికి తీస్తున్న‌ది! ఇదంతా ఒక క్ర‌యిమ్ థ్రిల్ల‌ర్ బాలీవుడ్ సినిమాను త‌ల‌పిస్తున్న‌ది. ప్ర‌ధానంగా రియా చ‌క్ర‌వ‌ర్తి తెర‌మీదికొచ్చింది. ఆమె సుశాంత్ ప్రియురాలిగా ముద్ర‌ప‌డి అనుమానాస్ప‌ద స్వార్ధ‌పూరిత చ‌ర్య‌ల‌తో సుశాంత్ మ‌ర‌ణానికి కార‌ణ‌మైంద‌న్న అభియోగాన్ని ఎదుర్కొంటున్న‌ది. ఇదంతా స‌రే. రోజువారీ ప‌రిణామాలు తెలుస్తూనే ఉన్నాయి. సుశాంత్ మ‌ర‌ణం హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? అన్న‌ది తేల్చేందుకు మొద‌లైన ఈ కేసు ద‌ర్యాప్తు బీహార్‌, మ‌హ‌రాష్ట్ర పోలీసుల మ‌ధ్య భేదాభిప్రాయాల‌తో ఇంకొన్ని మ‌లుపులు తిరిగి చివ‌రికి డ్రగ్స్ బాట ప‌ట్టింది. సుశాంత్ మ‌ర‌ణంతో బాలీవుడ్ లోని కొంద‌రు ప్ర‌ముఖుల పేర్లు గాలిలో ఊగిస‌లాడాయి. కొంద‌రు తెగువ క‌లిగిన వారైతే కొన్ని పేర్లు బ‌య‌ట పెట్టారు కూడా. అందులోని నిజానిజాలు నిర్ధార‌ణ కావాల్సి ఉంది. అలాగే డ్ర‌గ్స్ కేసులోనూ చాలా పేర్లు తెర‌మీదికొస్తున్నాయి. రియా చ‌క్ర‌వ‌ర్తి చెబుతున్న జాబితాలో ప్ర‌ముఖంగా తెలుగు హీరోయిన్ రకుల్ పేరు వ‌చ్చింది. వాళ్లిద్ద‌రూ ముంబాయ్ లో క‌లిసి దిగిన ఫోటోలు కూడా బ‌హిరంగ‌మ‌య్యాయి.    సుశాంత్ కు చెందిన ఒక ఫామ్ హౌజ్‌లో బాలీవుడ్, తాలీవుడ్ ప్ర‌ముఖులు త‌ర‌చూ క‌లిసి పార్టీలు చేసుకుంటుంటార‌ని రియా చెప్పింది. ఆ పార్టీల్లో మాద‌క‌ద్ర‌వ్యాల‌ను తీసుకుంటార‌ని కూడా చెప్పింది. ఇదేదో రియా ఇప్పుడు ఒక అండ‌పిండ బ్ర‌హ్మాండాన్ని బ‌ద్ద‌లు చేసింద‌ని భావించ‌న‌క్క‌ర్లేదు. ఇది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. సినీన‌టులు, ఇంకా చెప్పాలంటే ఈనాటి టీవీ న‌టులు య‌థేచ్చ‌గా మాద‌క ద్ర‌వ్యాల‌ను వాడుతున్నారు. త‌మ గ్లామ‌ర్ పెంచుకోవ‌డానికి అవి వాడ‌క త‌ప్ప‌ద‌ని కొంద‌రు బాహాటంగానే ప్ర‌క‌ట‌న‌లిచ్చారు. కొద్దిపాటి మోతాదులో వాటిని తీసుకోవ‌డం నేరం కాద‌ని కూడా వారు త‌మ చ‌ర్య‌ల్ని స‌మ‌ర్ధించుకుంటున్నారు. ఇదంతా ప‌క్క‌న బెడితే రియా చ‌క్ర‌వ‌ర్తి చెబుతున్న పేర్ల మీద మాద‌క‌ద్రవ్యాల నిరోధ‌క శాఖ అధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌నేది ఇక్క‌డ ముఖ్యాంశం. నిన్న‌టికి నిన్న ఈ కేసు విచారిస్తున్న సంబంధిత శాఖాధికారి త‌మ జాబితాలో బాలీవుడ్ ప్ర‌ముఖుల పేర్లేవీ లేవ‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చారు. తాము కేవ‌లం మ‌త్తు ప‌దార్ధాల ఏజెంట్ల‌ను, త‌యీరీదార్ల‌ను, స‌ర‌ఫ‌రాదార్ల‌ను మాత్ర‌మే ప‌ట్టుకుంటున్నామ‌ని, వారిమీదే నిఘా ఉంచామ‌ని వెల్ల‌డించారు. ఇది చాలా కీల‌క ప్ర‌కట‌న‌. మ‌రి రియా చెప్పే పేర్ల సంగ‌తేమిటి? సుశాంత్ మ‌ర‌ణం కేసుని దాని ప‌రిధిని దాటించి మ‌త్తుప‌దార్ధాల వైపుకి మ‌ళ్లించారు. పోనీ మ‌త్తుప‌దార్ధాలు సేవిస్తున్న వారి ఆట క‌ట్టిస్తారా అంటే తాము చేయాల్సింది అది కాద‌ని అధికారులే చెబుతున్నారు.    2017లో  తెలంగాణా రాష్ట్రంలోనూ తెలుగు సినీ న‌టులు మాద‌క ద్ర‌వ్యాలు వాడుతున్నార‌న్న కేసు కొద్ది వారాల పాటు హ‌ల్ చ‌ల్ చేసింది. పూరీ జ‌గ‌న్నాధ్‌, ఛార్మి, న‌వ‌దీప్‌, త‌రుణ్‌, సుబ్బ‌రాజు, సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె.నాయుడు త‌దిత‌రుల్ని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు టీమ్ విచారించింది. అప్ప‌ట్లో అది పెద్ద సంచ‌ల‌నం. ఏరోజుకారోజు ద‌ర్యాప్తుకి పిలిచిన వారిని అరెస్టు చేస్తార‌న్న ఉత్కంఠ‌. కాని అది అతి తేలిగ్గా అట‌కెక్కింది. మాద‌క‌ద్రవ్యాలు తీసుకునే వారు నేర‌స్ధులు కార‌న్న సిద్దాంతాన్ని తెర‌మీదికి తెచ్చారు. కేవలం వీరికి స‌రఫ‌రా చేసిన‌వారిని క‌నుగొనేందుకే వారిని పిలిచి ప్ర‌శ్నించిన‌ట్టు తేల్చేశారు.    ఇప్పుడు రియా డ్ర‌గ్స్ కేసు ఎటు వెళ్ల‌బోతోంది? ఆమెని అరెస్టు చేశారు. ఆమె సుశాంత్‌కి మాద‌క ద్ర‌వ్యాలు ఇచ్చింద‌న్న‌ది అభియోగం. ఒక‌వంక స్వ‌ల్ప మోతాదులో అది తీసుకోవ‌డం నేరం కాదంటున్నారు. మ‌రి ఆమె అత‌డికి స్వ‌ల్ప మోతాదులోనే తెప్పించి ఇచ్చానంటున్న‌ది. దానివ‌ల్లే సుశాంత్ మ‌ర‌ణించాడ‌ని ద‌ర్యాప్తు సంస్ధ‌లు తేలుస్తాయా? సుశాంత్‌ని మాన‌సికంగా వ‌త్తిడికి గురిచేసి, అత‌డికి సినిమా అవ‌కాశాలు రాకుండా చేశార‌న్న ఒక ప్రధాన అభియోగం ఎటు పోయిన‌ట్టు? అది వ‌దిలేసి, సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రియా మీద నిఘా పెట్టారు. సుశాంత్ మ‌ర‌ణించాక అత‌ని బ్యాంకు అకౌంట్ నుంచి కొన్ని కోట్లు మాయ‌మ‌య్యాయి. ఇది రియా ప‌నేన‌ని సుశాంత్ తండ్రి అభియోగం. ఆ ప్ర‌కారం పోలీసులు ఆమె మీద నిఘా పెట్టారు. చివ‌రికి అది మాద‌క ద్ర‌వ్యాల వైపు మ‌ళ్లింది. అంటే ఇప్ప‌టికి రెండు మ‌లుపులు తిరిగిన‌ట్టు. ఇంకా ఎన్ని మ‌లుపులు తిరుగుతంది?  మాద‌క ద్ర‌వ్యాలు తీసుకునే ప్ర‌ముఖ హీరోలు, ద‌ర్శ‌క‌లు పేర్లు సోష‌ల్ మీడియాలో వ‌చ్చేస్తున్నాయి. కంగ‌నా ర‌నౌత్ ప‌రోక్ష ప్రస్తావ‌న‌లో కొన్ని పేర్లు తెర‌మీదికి తెచ్చింది. కాని వారికి ఏమీ కాదు. కేవ‌లం రియాకు మాత్ర‌మే ఇది నేరంగా వ‌ర్తిస్తుంది. మ‌న చ‌ట్టాల్లోని లొసుగులు క్ర‌మ‌క్ర‌మంగా ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌వుతున్నాయ్‌! -రాజా రామ్మోహ‌న్ రాయ్‌

అందరికి టెస్ట్‌ చేయ‌డం ఆచరణ సాద్యం కాదు!

ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.

ఆదాయమైన వదులుకుంటా, జనం ప్రాణాలు నాకు ముఖ్యం

* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.

చంద్రబాబు సైకాలజీ పై సైంటిస్ట్ పేర్ని నాని రిపోర్ట్

* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.

ప్రెస్ రిలీజుల్లో మాత్రమే నిప్పులు చెరిగే యనమలపై టీడీపీ లో చర్చ!

* క్వారంటైన్ ను ఎప్పటి నుంచో జీవన విధానంగా మలుచుకున్న యనమల కన్నా, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నలే బెటరని నేతల్లో అభిప్రాయం  * చంద్రబాబు నాయుడు 24X 7 ప్రజా క్షేత్రంలో ఉన్నా, యనమల మాత్రం పత్రికా ప్రకటనలకే  పరిమితం కావటం పై ఆక్షేపణ  ఎసెట్స్, లయబిలిటీస్ అని మనం చదువుకుంటూ ఉంటాం. ఆంధ్ర ప్రదేశ్ లో, ఆ మాట కొస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ కి లయబిలిటీ గా మారిన చాలామంది నేతల్లో మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు అనే భావన చాల మంది నాయకుల్లో బలంగా ఉంది.  పలుకే బంగారమాయెరా పద్ధతిలో ఆయన తనను తాను  ప్రెస్ నోట్స్ కు మాత్రమే పరిమితం చేసుకుని, సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోవటం ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నించీ చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన చాలా సీనియర్ మోస్ట్ కావటం వల్లనూ, పార్టీ లో ఆయనకు చంద్రబాబు నాయుడు అత్యంత ప్రయారిటీ ఇవ్వటం కారణం గానూ, ఎన్ఠీఆర్ ను పదవీచ్యుతుని చేసిన సమయం లో ఆయన అద్భుతమైన 'శ్రమదానం' చేసినందువల్లనూ --ఇప్పటికీ తెలుగు దేశం నాయకులు ఆయన్ను అరమోడ్పు కన్నులతో, ఆరాధ్య పూరిత దృక్కులతో చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అలా, తనదైన శైలిలో- పార్టీ లో 'సరిలేరు నాకెవ్వరు' టైటిల్ పెట్టుకుని మహరాజులా వెలిగిపోతున్న యనమల రామకృష్ణుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మీద ప్రెస్ రిలీజ్ లో చెడా మడా నిప్పులు చెరిగేశారు. అలా చెరిగిన నిప్పులలో-కొన్ని నిప్పురవ్వలను మీ కోసం ప్రత్యేకంగా అందచేస్తున్నాం.  రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో వైసిపి ప్రభుత్వ వైఫల్యం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల, ఉపశమన చర్యలు శరవేగంగా చేపట్టాలని, ఒక ప్రకటనలో  డిమాండ్ చేశారు. "విపత్తుల్లో ప్రజలను కాపాడేవాడే పాలకుడు. ఆపదల్లో అండగా ఉండటం నాయకత్వ లక్షణం. అలాంటిది ప్రజలను కష్టాల్లో వదిలేయడం రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే.  రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతం. పాలకుల ఉదాసీనత వల్లే  రాష్ట్రంలో కరోనా విస్తృతం. వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించిన రూ 11,399కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు..? రూ 11,399కోట్ల బడ్జెట్ పెట్టి, కరోనా మాస్క్ లకు రూ 30కోట్లే ఇస్తారా," అంటూ ఆవేశంగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను నిలదీశారు.  ఇదేనా మీరు చెప్పిన ‘‘నాడు-నేడు’’..? నాడు సీఎంగా చంద్రబాబు ఇలాగే చేశారా..? నేడు సీఎంగా మీరెలా చేస్తున్నారో ప్రజలే చూస్తున్నారంటూ కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను కడిగి పారేశారు. విపత్తుల్లో చంద్రబాబు పనితీరుకు, మీ పనితీరుకు ప్రజలే బేరీజు వేస్తున్నారంటూ కూడా హెచ్చరించారు. " టిడిపి ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ పెట్టకపోతే ఇప్పుడు పరిస్థితి ఏమిటి..? డాక్లర్లు, వైద్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు ఉండేవేనా..? మెడ్ టెక్ జోన్ పై చేసిన ఆరోపణలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గత ఏడాది రూ 2,27,975కోట్ల బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారు. తొలి 6నెలల్లో 35%కూడా ఖర్చు చేయలేదు. రెవిన్యూ వ్యయమే తప్ప కేపిటల్ వ్యయం శూన్యం. 65% నిధులు మీవద్దే ఉంటే ఉద్యోగుల జీతాల్లో కోతలు ఎందుకు," అంటూ యనమల ఆ పత్రికాప్రకటనలోనే ఆగ్రహం తో ఊగిపోయారు.  కరోనా నిరోధానికి నిధులు ఎందుకివ్వరు..? డాక్టర్లు, సిబ్బందికి మాస్క్ లు, రక్షణ ఉపకరణాలు ఎందుకు కొనరు..?పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల పనులు నిలిపేశారు. అమరావతి సహా అభివృద్ది పనులన్నీ నిలిపేశారు.  విపత్తు నిర్వహణకు, నరేగా కు, 14వ ఆర్ధిక సంఘ నిధులు, డివల్యూషన్ నిధులు, కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఏం చేశారు..? 11నెలల్లో అభివృద్ది శూన్యం, పేదల సంక్షేమం నిల్.. కరోనా ఉపశమన చర్యలు కూడా మొక్కుబడిగానే.. డిసెంబర్ లోనే విదేశాల్లో కరోనా ప్రభావం ప్రారంభం. జనవరి 3వ వారంలో మనదేశంపై కరోనా ప్రభావం. నాలుగో క్వార్టర్ పై కరోనా ప్రభావం చూపింది. మరి మొదటి 3క్వార్టర్లలో మీరు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏమిటి..? కరోనా రాకముందు ఏం చేయలేదు, కరోనా వచ్చాక చేసిందేమీ లేదని కూడా జగన్ మోహన్ రెడ్డి లెక్క తేల్చేశారు.  కరోనాపై కేంద్ర మార్గదర్శకాలు గాలికొదిలేశారు. లాక్ డౌన్ కు వైసిపి నేతలే తూట్లు పొడుస్తున్నారు. కరోనా వ్యాప్తి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సాహమా..? ఈ విపత్తులోనూ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తారా..?కరోనాలోనూ మీ అవినీతి,అక్రమాలు మానుకోరా, అంటూ నిప్పులు చెరిగారు. లోడింగ్ కార్మికులకు కరోనా సోకితే బాధ్యత ఎవరిది..? లాక్ డౌన్ పీరియడ్ లో వందల లారీల్లో ఇసుక తరలింపులా..? ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి తరలిస్తుంటే ఏం చేస్తున్నారు..? మద్యం అక్రమ విక్రయాలను ప్రోత్సహిస్తారా, అని కూడా తన ప్రెస్ రిలీజ్ లో ఆయన ప్రశ్నించారు.  ఏడాది గడుస్తున్నా పరిపాలనపై సీఎంకు అవగాహన లేదు. సంబంధిత శాఖలపై ఏ ఒక్కమంత్రికి పట్టు దొరకలేదు. స్వప్రయోజనాలే తప్ప ప్రజారోగ్యంపై వైసిపి నేతలకు శ్రద్ద లేదు. టిడిపి హయాంలో ఏ అభివృద్ది పని ఆగలేదు. ఏ సంక్షేమ పథకం రద్దు చేయలేదు. పైగా అనేక కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించాం. అనేక అభివృద్ది ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. విపత్తుల్లో బాధిత ప్రజానీకాన్ని ఆదుకున్నాం. హుద్ హుద్ లో, తిత్లి తుపాన్ లో ఎలా ఆదుకున్నామో ప్రజలకు తెలుసునని కూడా యనమల గుర్తు చేశారు.  విపత్తులంటే సీఎం జగన్ కు భయం. ఎప్పుడు విపత్తులు వచ్చినా పత్తా ఉండరు. తిత్లి తుపాన్ లో, మొన్న గోదావరి, కృష్ణా వరదల్లో ఎక్కడ ఉన్నారో ప్రజలు మరిచిపోలేదు. పాలకుల నిర్లక్ష్యం  ప్రజలకు శాపం కారాదు. ఇప్పటికైనా కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేయాలి. ఫ్రంట్ లైన్ వారియర్లకు రక్షణ ఉపకరణాలు అందజేయాలి. వైద్య ఆరోగ్య శాఖకు నిధులు విడుదల చేయాలి. రైతుల వద్ద పంట ఉత్పత్తులు వెంటనే కొనుగోలు చేయాలి. ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇలా ఆయన ప్రెస్ రిలీజ్ సాంతం ఆయన జగన్ మోహన్ రెడ్డి ని కడిగేసి, నిప్పులు చెరిగి చంద్రబాబు నాయకత్వం పట్ల తన విధేయతను ను ఎప్పటిలాగానే-కాగితం రూపేణా తీర్చుకున్నారు. "జగన్ మోహన్ రెడ్డి ఈ ఎనిమిది నెలల నుంచే క్వారంటైన్ లో ఉన్నారు. మా యనమల వారు రాజ్యం చేసినంత కాలం ఎక్కువ సమయం క్వారంటైన్ లో గడిపిన సన్నివేశాలను, సందర్భాలను ఇప్పుడో సరి మేము గుర్తు చేసుకుంటున్నాం, ఎలాగూ కరోనా కారణంగా కాస్తంత వీలు చిక్కింది," అంటూ టీ డీ పీ నాయకులు నిట్టూరుస్తున్నారు.

ఆంధ్ర ప్రాంతానికి డొక్కల కరువు పొంచి ఉందా?

  * మూడు శతాబ్దాలలో మూడు కరువుల ను ఎదుర్కున్న ఆంధ్ర ప్రదేశ్ * 1791-95, 1832-1833, 1929-39 మధ్య ఎదుర్కున్న కరువుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి * రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు శాసనాల్లో-ఇలాంటి కరువును ఎలా ఎదుర్కోవాలో స్పష్టం గా రాసి ఉంది * వెంకటాద్రి నాయుడు వంటి జనహిత పాలకుల విధానాలే ఇప్పుడు మనకి శ్రీరామ రక్ష మరో రెండు నెలలు కరోనా తన కోరలను, పంజాను ఇలాగే విసిరితే, ఆంద్ర ప్రాంతం లోనే కాదు, దేశం లోనే చాలా ప్రాంతం లో మూడు శతాబ్దాల నాటి డొక్కల కరువు పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన అతి పెద్ద కరువులలో ఒకటైన పుర్రెల కరువులో (1791-95) ఒకటిన్నర కోటి మంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెప్తాయి. డొక్కల కరువుగా కూడా పేరు గడించిన ఈ కరువులో ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే యాభైలక్షల మంది బలయ్యారు. కరువు వల్ల ప్రాణ నష్టమే కాదు పశువులు, విత్తనాలూ నష్టమయ్యేవి. రైతులు, కూలీలు వలస పోవటం వల్ల గ్రామాలు నిర్మానుష్యమై మరలా కోలుకొనేందుకు చాలాకాలం పట్టేది. ఖననం చేయకుండా వదిలేసిన మనుషుల, జంతువుల కళేబరాల వల్ల కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. తరచూ కరువు కాటకాల వల్ల మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతాల నుండి వేల కొలదీ సన్నకారు రైతులు, కూలీలు సుదూరమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు వలసపోయారు. 1832-1833లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును డొక్కల కరువు, నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. 1831లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు బీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు.     కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు (ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు. పలువురు మహనీయులు డొక్కల కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు తమవంతు కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారు. వారిలో కొందరి పేర్లు:   సర్ సి.పి.బ్రౌన్ గా ఆంద్ర ప్రజానీకానికి సుపరిచితుడైన ఆంగ్ల అధికారి, 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు చేసిన సేవలు, పలువురు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. అలాగే, ఏనుగుల వీరాస్వామయ్య అనే యాత్రాచరిత్రకారుడు, పుస్తకప్రియుడు కూడా పేదలకు ఆ సమయం లో అండగా నిలిచాడు వృత్తి రీత్యా చెన్నపట్టణం సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రిటర్ అయిన వీరాస్వామయ్య నందన కరువులో చాలామంది పేదలకు అన్నవస్త్రాలిచ్చి ఆదుకున్నారు.     కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై గా చెన్నై ప్రాంతం లో పేరున్న సంపన్నుడు, విద్యాదాత, సంస్కరణాభిలాషి అయిన తన దాతృత్వంతో ఈ కరువు నుంచి కొందరిని కాపాడి చరిత్రలో నిలిచారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో, 1929-39 సంవత్సరాల మధ్య వచ్చిన మరో కరువు ను కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి. దీనివల్ల, గుంటూరు జిల్లా లోనూ , ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన కరువు వల్ల , దాదాపు 50 వేల అధికారిక మరణాలు నమోదైనట్టు ఆ సమయం లో గుంటూరు జిల్లాలో తహసీల్దార్ గా పని చేసిన పత్రి లక్ష్మీ నరసింహారావు రాసుకున్న డైరీ లో లభ్యమైన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆయన అప్పట్లో బ్రిటీష్ యంత్రాంగానికి రాసిన లేఖలు, తర్వాత అప్పటి బ్రిటీష్ అధికారులు తీసుకున్న నష్ట నివారణ చర్యల ప్రస్తావన కూడా ఆయన డైరీ లో ప్రముఖంగా ఉంది. అంటే, గడిచిన మూడు శతాబ్దాల కాలం లో ఆంధ్ర ప్రాంతం మూడు రకాల కరువును ఎదుర్కొని, చరిత్రలో నిలిచిపోయే విషాదాలను నమోదు చేసుకుంది. ఇప్పుడు , కరోనా సన్నద్ధత చర్యల విషయం లో వెనుకంజ వేస్తె, ఎకానమీ రివర్సల్ జరుగుతుందని, దానివల్ల సంభవించే విపరిణామాలు వల్ల ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై, తిండి గింజలకు వెతుక్కునే పరిస్థితి వస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అనుకున్న దొక్కటి.... అయిందొక్కటి

సుప్రీంకోర్టు లో రాష్ట్ర  ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ నిర్ణయం మరియు ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయాలని ఆదేశాలు. ఎన్నికల వాయిదాని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఆరు వారాల తర్వాత కూడా పరిస్తితిపై సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఈసి కి అప్పగించిన సుప్రీంకోర్టు. దీంతో పాలక వై ఎస్ ఆర్ సీ పీ నిరాశకు గురైంది.  ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టులో విచారణ విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం, స్థానిక ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం వాదనలు విన్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన తెలిసిందే. ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్న ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ పిటిషన్ లో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి . రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తో సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఎన్నికలకు నిర్వహణ కు సంబంధించి ఇది సుప్రీం తీర్పుకు విరుద్దం. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిదులు అవసరం. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం. ఈ వ్యవహారం పై చీఫ్ సెక్రటరీ కి, ఎన్నికల కమిషనర్ కు మధ్య లేఖల యుద్ధం కూడా నడిచింది. హైకోర్ట్ ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారి సంప్రదించకుండా ఆపడం తగునా, అని కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాల నీ కూడా కోరింది. పంతాని కి పోయినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రంకోర్టు లో చుక్కెదురైంది.

ప్రజల నడ్డి విరిచే అంకెల గారడీ బ‌డ్జెట్‌!

  బంగారు తెలంగాణ భ్రమల్లో జనాన్ని ముంచెత్తి రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చేయడం మినహా రాష్ట్ర ఆర్థిక స్థితిని సరిదిద్దడానికీ, వనరుల సక్రమ వినియోగానికీ, పేదల దీనస్థితిని తొలగించడానికి చేపట్టిన చర్యలేమీ ఈ బ‌డ్జెట్‌లో లేవు. అవధులు లేని హామీలతో ప్రజలను నిరంతరం మభ్యపెట్టే కేసీఆర్‌ సర్కారు ఎత్తుగడలో భాగంగానే అంకెల గారడీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను తీర్చిదిద్దారు. రాష్ట్రం ఏర్పడితే.. అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుం దనీ, సంపదను పెంచడమే కాదు, పంచడమూ జరుగుతుందనీ ఎంతగానో ఆశించిన ప్రజలకు ఈ బడ్జెట్లన్నీ నిరాశనే మిగిల్చాయి. ప్రణాళికలు, పథకాలు, ప్రకటనలు, నిధులు, వ్యూహాలు.. అన్నీ కాగితాలకూ, అంచనాలకూ, అంకెలకే పరిమితమ వుతున్నాయి తప్ప కార్యాచరణకు నోచుకోవడంలేదు. ప్రజలపై పన్నుపోటు ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనమంతా పరివర్తనా సూత్రాన్ని అంగీకరించా లంటూ ఎడ్మండ్‌ బర్క్‌ను ఆర్థికమంత్రి ఉటంకించారు. నిజమే ఈ పరివర్తన ఏమిటి? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమా? వ్యవసా యాన్ని నీరుగార్చి రైతులను ఆత్మహత్యలకు గురిచేయడమా? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, కుల వృత్తులను పరిరక్షించడం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ రూపకల్పన జరిగినట్లు చెప్పిన మాటలు వినసొంపు గానే ఉన్నాయి. పల్లెల పరిపుష్టతకు ప్రాణాధారమైన వ్యవసాయం గాలిలో దీపంగా మారింది. రైతు జీవితం తెగిన గాలిపటమైంది. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది దేశంలోనే రెండో స్థానం. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2750మంది రైతులు ఆత్మహత్య చేసుకొంటే సర్కారు మాత్రం 340 ఆత్మహత్యలే జరిగినట్లు చెబుతూ కేవలం 40మందికే పరిహారం ఇచ్చింది. అసలు రైతుల బతుకులపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.5,942.97కోట్లు కేటాయించినా.. ఖర్చుచేసేది ఎంత అన్న ప్రశ్న తలెత్తుతున్నది. గత బడ్జెట్లలో నీటి ప్రాజెక్టులకు 25వేలకోట్లు కేటాయించి, 10వేలకోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టుల కన్నా ప్రచారానికే ఎక్కువ నిష్ఫత్తిలో దుర్వినియోగం చేస్తున్న ఘనత ఈ సర్కార్‌ది. అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టును నిర్దిష్టంగా పూర్తిచేయలేదు. 2013-14లో 49,23,003 హెక్టార్లలో సాగు ఉండగా, 2015-16లో 41,74,532 హెక్టార్లలోనే సాగైనట్లు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. సాగు ఎందుకు తగ్గింది? ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో 2013-14లో వచ్చిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు 6,844 కాగా, 2015-16లో కేవలం 3,779 మాత్రమే వచ్చాయి. పెట్టుబడులు రాక కూడా మూడువేల కోట్ల నుంచి పదిహేను వందల కోట్లకు తగ్గింది. పారిశ్రామికాభివృద్ధిరేటు గ్రాఫ్‌ పడిపోయిన విషయం సర్వే స్పష్టంగా వెల్లడించింది. ఈ ఏడాది టీఎస్‌ ఐపాస్‌ కింద 3,325 పరిశ్రమలకు అనుమతులిచ్చారు. కాబట్టి అవన్నీ వచ్చినట్లుగా భావించాలంటున్నారు. రూ.51,358 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా ఊహించుకొంటూ రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ అంచనాలు మాత్రమేనని ఆర్థిక సర్వే చెప్పింది. మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు అయ్యే ఖర్చును బడ్జెట్‌లో చూపించలేదు. రైతుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం చూపలేదు. ప్రయివేటు అప్పులు, పెట్టుబడి ఖర్చులు, విత్తన సమస్యలు, మద్దతు ధర వంటి సమస్యలే అన్నదాతల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఈ అంశాలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టిపెట్టిన సంకేతాలేవీ ఈ బడ్జెట్‌లో కనిపించడంలేదు. రాష్ట్రంలో అత్యధిక మందికి అత్యవసర మైన ఈ అంశాలను బడ్జెట్‌ పూర్తిగా విస్మరించింది. పారిశ్రామిక సంక్షోభం నేపథ్యంలో ఉపాధి సమస్య వేధిస్తోంది. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నాయి. మద్యం మహమ్మారి పేదల ప్రాణాలను ఆబగా హరిస్తోంది. వీటిని పరిష్కరించే యోచన లేకుండా కలగూరగంపగా తయారుచేసిన ఈ బడ్డెట్‌తో ముందుముందు అప్పులు, పన్నులు, విద్యుత్‌ భారాలు ప్రజల నడ్డి విరిచేస్తాయని చెప్పకతప్పదు.

విరాట్ కోహ్లీ.. ఇదేం ఆట?.. బ్యాటింగ్‌లో నీకంటే షమీ నయం!

ఇండియన్ క్రికెట్‌లోనే కాకుండా వరల్డ్ క్రికెట్‌లోనే నంబర్ వన్ క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటూ వస్తున్న విరాట్ కోహ్లీ తాజా న్యూజిలాండ్ పర్యటనలో బ్యాట్స్‌మన్‌గా దారుణంగా విఫలమవడం ఇండియన్ క్రికెట్ ప్రేమికుల్నే కాకుండా అతని అభిమానుల్నీ తీవ్రంగా నిరాశపరచింది. టెస్టులు, వన్డేలు, టీ20లు అనే తేడా లేకుండా మూడు ఫార్మట్లలోనూ బ్యాట్స్‌మన్‌గా అతను విఫలమవడం విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరచింది. మూడు ఫార్మట్లలో కలిపి 11 ఇనింగ్స్ ఆడిన విరాట్ చేసిన మొత్తం పరుగులు కేవలం 218.  న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు టెస్ట్ ప్లేయర్‌గా నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న విరాట్, సిరీస్ ముగిసే సరికి రెండో ర్యాంకుకు దిగజారాడు. విరాట్ పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మళ్లీ నంబర్ వన్ ర్యాంకును అందుకున్నాడు. టెస్టుల్లో ఓవరాల్‌గా 53.62 యావరేజ్ కలిగిన విరాట్, న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్ ఆడి సాధించిన యావరేజ్ ఎంతో తెలుసా? కేవలం 9.5.  ఈ నాలుగు ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ సాధించడం మాట అటుంచి ఏ ఇన్నింగ్స్‌లోనూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఈ సిరీస్‌లో అత్యని హయ్యెస్ట్ స్కోర్ 19 రన్స్. ఫస్ట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అతను ఈ స్కోర్ చేశాడు. అతను ఈ టెస్ట్ సిరీస్‌లో చేసిన పరుగులు వరుసగా.. 2, 19, 3, 14. మొత్తం రన్స్ 38. అతనికంటే ఎక్కువగా 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి 44 పరుగులు చేయడం గమనార్హం. టెస్టుల్లో 2011లో అరంగేట్రం చేసిన విరాట్ ఇంత ఘోరంగా ఆడటం ఇది రెండోసారి మాత్రమే. ఇదివరకు 2016-17లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 9.2 యావరేజ్‌తో 46 పరుగులు చేశాడు. అతని కెరీర్ మొత్తమ్మీద అదే అతని పూరెస్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌తో దాని దగ్గరకు వచ్చాడు. ఇక రెండో టెస్ట్ సందర్భంగా మైదానంలో కోహ్లీ ప్రవర్తన అతనికి చెడ్డపేరు తీసుకొచ్చింది. కెప్టెన్‌గానూ అతను టెస్ట్, వన్డే సిరీస్‌లో విఫలమయ్యాడు. మొదట వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన అతడు ఇప్పుడు 0-2 తేడాతో టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్‌కు సమర్పించుకున్నాడు. గుడ్డిలో మెల్లగా మొదటగా జరిగిన టీ20 సిరీస్‌ను మాత్రం 5-0తో వైట్ వాష్ చేయగలిగాడు. అయితే అందులోనూ బ్యాట్స్‌మన్‌గా అతను వైఫల్యం చెందాడు. అంతర్జాతీయంగా 82 టీ20 మ్యాచ్‌లు ఆడిన విరాట్ యావరేజ్ 50.80. కానీ ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతని సగటు 26.25 మాత్రమే. అతడి హయ్యెస్ట్ స్కోర్ 45. మిగతా మూడు మ్యాచ్‌లలో వరుసగా 11, 38, 11 స్కోర్లు చేశాడు. రోహిత్ శర్మ, కె.ఎల్. రాహుల్ పరుగుల వర్షం కురిపించడం వల్లే టీ20ల్లో భారత జట్టు విజేతగా నిలవగలిగింది. గాయం కారణంగా వన్డే, టెస్ట్ సిరీస్‌లలో రోహిత్ లేని లోటు సుస్పష్టంగా కనిపించింది. ఫాంలో ఉన్న కె.ఎల్. రాహుల్‌ను టెస్టుల్లోకి తీసుకోకుండా విరాట్ తీవ్ర తప్పిదం చేశాడని విశ్లేషకులంతా ముక్త కంఠంతో విమర్శిస్తున్నారు. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ యావరేజ్ 25 మాత్రమే. టూర్ మొత్తం మీద అతడు హాఫ్ సెంచరీ చేసింది ఈ వన్డే సిరీస్‌లోనే. అది మొదటి వన్డేలో 51 పరుగులు చేశాడు. మూడు రకాల ఫార్మట్లలో ఒక ఇన్నింగ్స్‌లో అతడి హయ్యెస్ట్ స్కోర్ ఇది. ఆ తర్వాత రెండు వన్డేల్లో అతడు చేసిన రన్స్ వరుసగా 15, 9. ఇప్పటివరకూ 248 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్ టోటల్ యావరేజ్ 59.33 కావడం గమనార్హం. ఈ గణాంకాలే న్యూజిలాండ్ టూర్‌లో అతడు ఏ స్థాయిలో వైఫల్యం చెందాడో తెలియజేస్తున్నాయి. బౌలర్ నుంచి వచ్చే బంతిని అతని కన్ను నిశితంగా గమనిస్తుందనీ, దాని గమనాన్ని కచ్చితంగా అంచనా వేసి, చాలా వేగంగా స్పందించి షాట్ కొడతాడనీ కోహ్లీని విశ్లేషకులతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అయితే అతని చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందని, అందుకే అలవోకగా ఫోర్లు కొడతాడని అంటుంటారు. ఫ్రంట్ ఫుట్ ఆడటంలో విరాట్‌ని మించిన వాడు లేడని కూడా వాళ్లు కితాబునిస్తుంటారు. అంటే అనేకమంది ఇతర బ్యాట్స్‌మెన్ కంటే అతడు ఎక్కువగా కవర్ డ్రైవ్స్ ఆడతాడు. చాలామంది స్క్వేర్ కట్ కొట్టే బంతుల్ని అతడు కవర్ డ్రైవ్ కొడతాడు. అంతేకాదు, చాలామంది దూరంగా పోతుందని వదిలేసే బంతుల్ని కూడా విరాట్ కవర్ డ్రైవ్స్ ఆడతాడు. అంత లాఘవంగా ఆ షాట్లను ఆడతాడని అతను పేరుపొందాడు. అలాంటివాడు రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ అతడు ఎల్బీడబ్ల్యూ అయిన తీరు నిర్ఘాంతపరచింది. అయితే తన బ్యాటింగ్‌లో ఎలాంటి లోపమూ లేదని అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ క్యాచ్ అవుట్ అయ్యాక, న్యూజిలాండ్ టూర్‌లో తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి అడిగినప్పుడు "నా బ్యాటింగ్ బాగానే ఉంది" అని జవాబిచ్చాడు విరాట్. కొన్నేసి సార్లు స్కోర్లు బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రతిబింబించవనీ, బంతిని సరిగా ఎగ్జిక్యూట్ చెయ్యకపోవడం వల్ల అవుటవ్వాల్సి వస్తుందనీ అతను చెప్పాడు. జట్టు గెలిస్తే.. 40 పరుగులు చేసినా గొప్పగానే ఉంటుందనీ, జట్టు ఓడితే.. సెంచరీ చేసినా వేస్టయిపోతుందనీ అతను వాదించాడు. కానీ న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ బాడీ లాంగ్వేజ్‌లోనే తేడా కనిపించిందనీ, బ్యాటింగ్ చేసేటప్పుడు మునుపటి ఈజ్ అతనిలో లోపించిందనీ క్రికెట్ అనలిస్టులు చెప్తున్న మాట. తదుపరి సిరీస్‌కైనా మనం మునుపటి గ్రేట్ బ్యాటింగ్ పర్ఫార్మర్‌ను విరాట్‌లో చూడగలమా? వెయిట్ చేద్దాం.

ఒకటి కవితకు... రెండోది పొంగులేటికి... గిది ఫైనల్ అంతే..!  

తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్ సభలో గట్టిగా తెలంగాణ వాణి వినిపించి పేరు తెచ్చుకున్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్లో ఓటమిపాలు కావడంతో... రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే రాజ్యసభకు కాదు ఏకంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారంటూ కథనాలు వచ్చాయి. అయితే, కవితను రాజ్యసభకు పంపడం ఖాయమైనట్లు తెలుస్తోంది.  టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు కలిగివుండటం... వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం.... తెలంగాణ సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన కలిగివున్న కవితను, రాజ్యసభకు పంపితే... హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కూతురుగా ఉండే ఇమేజ్ ఎలాగూ ఉండనుంది. ఇలా, అన్నీ కవితకు కలిసొస్తున్నందున రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక, మిగిలిన మరో సీటుపైనే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదైనా, చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప, కవిత అండ్ పొంగులేటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.

రాజీనామా బాటలో ముగ్గురు ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీలు!!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు. ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది.  వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...

ప్రజాబంధు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతర శ్రామికుడు. అలుపెరుగని పోరాట యోధుడు. ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా ప్రజానురంజకంగా పాలన సాగించే ఓ మేధావి. గొప్ప రాజకీయ వేత్త. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా ఎదిగాడు కేసీఆర్. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను.. తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజలతో హ్యాట్సాప్ అనిపించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం అలుపెరుగని కృషి చేశారుడ. తెలంగాణ ఏర్పాటుతో తిరిగులేని నేతగా ప్రజల హృదయాలను గెలిచాడు. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజానురంజకంగా పాలన చేస్తున్నాడు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి. రోల్ మోడల్ సీఎం కేసీఆర్ ను తీసుకొని ఇతర రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. తెలంగాణ చెరువులకు జలకళ తెచ్చాడు. అందుకోసం మిషన్ కాకతీయ.. ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ఎన్నో గొప్ప పథకాలతో దూసుకుపోతున్నారు. ముందు చూపున్న నేతగా కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అపర భగీరథుడుగా మారారు కేసీఆర్. అంతేకాకుండా సంక్షేమం విషయంలో కేసీఆర్ తనదైన శైలిని ఎంచుకున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు వంటి  పథకాలు పేదలకు భరోసాని కల్పించాయి. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకమైతే.. కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే.. కేసీఆర్ సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అంతకు మించి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కీలకంగా చెప్పవచ్చు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుంది. మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ సర్కారు అందిస్తోన్న సుస్థిర పాలన వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక. ఎవరికీ కష్టం వచ్చినా.. వారికి తెలిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసి ఆరా తీస్తాడు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడతాడు. స్థానిక ప్రజలను నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అది కేసీఆర్ కే సాధ్యం... కాదు కాదు.. ఆయన స్పీచ్ కు సాధ్యం. ప్రజల్లో ఊరమాస్ లెక్క ఉండే ఆయన స్పీచ్ లకు జనాలు దాసోహమౌతారు.  అక్షరం ముక్క రానోడి కూడా ఆయన మాటలకు పడిపోతాడు. అలాంటి కట్టిపడేసే నైజం కేసీఆర్ మాటకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కేసీఆర్ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. కాగా ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి మా తెలుగుఒన్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

జగన్ ఢిల్లీ టూర్ కి PKయే కారణమట? మోడీ-షానే పిలిచారని ప్రచారం

ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో హస్తం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే, బీహార్లో జేడీయూ... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ... ఢిల్లీలో ఆప్ కోసం పనిచేసి ఆ పార్టీల ఘన విజయానికి కారణమయ్యాడు. అయితే, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.... మోడీ అండ్ నితీష్ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముఖ్యంగా, తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే, ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.  అయితే, జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ ఓకే చెప్పొచ్చు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారు. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ అండ్ షాకి తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని కోరాడని, అదే ఇప్పుడు కమలంలో అలజడి కారణమైందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ పై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని అంటన్నారు. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని సూచించిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతోందని అంటున్నారు. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించబోతోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. అంతేకాదు, ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయినందున, మరో బలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. విజయసాయిరెడ్డితోపాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామమని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీటన్నింటిపైనా చర్చించేందుకే, జగన్ ఒక్కరోజు గ్యాప్ లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.

తనకు మీడియాబలం లేదని చెప్పుకొచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి...!

ముఖ్యమంత్రిగా తొలిసారి పరిమిత మీడియాతో జగన్ మాటా మంతి.. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం: జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.                                          ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది: సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి మనముందున్న లక్ష్యం విశాఖను  టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే: జగన్ మోహన్ రెడ్డి .మొత్తానికి సి ఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పరిమిత మీడియా తో అయినా, అపరిమితమైన అంశాలను షేర్ చేసుకున్నారు. పెన్షన్ల దగ్గర నుంచి పోలవరం దాకా, ఇంగ్లిష్ మీడియం నుంచి రాజధాని నిర్మాణం దాకా....అనేకానేక విషయాలను స్పృశించిన జగన్ మోహన్ రెడ్డి , తన మనసులో మాటలను, ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు. పెన్షన్లగురించి మాట్లాడుతూ.. ఒకరికి  ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ... అన్యాయం జరిగిందనే భావన వారికి ఉంటుందాని చెప్పుకొచ్చారు. ప్రజల ముందే లబ్ధిదారుల జాబితా పెడుతున్నామనీ, సామాజిక తనిఖీకోసం గ్రామ ప్రజలముందే, గ్రామ సచివాలయంలో పెడుతున్నామనీ, ఎవరుకూడా తప్పులు చేసే అవకాశం లేకుండా చేస్తున్నామనీ చెప్పుకొచ్చారు సి.ఎం. ప్రతి పథకంకూడా సంతృప్తస్థాయిలో, పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చిన సి.ఎం, పెన్షన్‌ ఇంతకుముందు కావాలంటే మూడు నెలల పెన్షన్‌ డబ్బు లంచంగా ఇవ్వాల్సి వచ్చేదన్న విషయాన్ని గుర్తు చేశారు. పధకాల గురించి మాట్లాడుతూ, మేం ఏంచెప్పామో అదే చేస్తున్నామన్నారాయన. మేం ప్రతి పథకాన్నీ పెడుతున్నామంటే.. మేం చెప్తున్నదాన్ని అమలుచేస్తున్నామని కదా? ప్రతి ఏటా రెవిన్యూ ఎంతోకొంత పెరుగుతుంది. నంబర్లలో కాస్త అటూ ఇటూ ఉండొచ్చుకాని, పెరుగుదలైతే ఉంటుందని కూడాభరోసాఇచ్చారు... ఇంగ్లిషు మీడియంపైన మాట్లాడుతూ, "న్యూట్రల్‌ మనిషిని ఎవరైనా అడగండి...కచ్చితంగా మా విధానాలను బలపరుస్తారు, మద్దతిస్తారు. ఇవాళ ఇంగ్లిషు మీడియం పెడితేనే... 20ఏళ్లలో మార్పులు వస్తాయి.ఇవాళ ఫస్ట్‌క్లాస్‌ చదవే వ్యక్తి.. 20 ఏళ్ల తర్వాత డిగ్రీ పూర్తిచేస్తారు. ఇవాళ ఫోన్‌ఆన్‌  చేస్తే..కమ్యూనికేషన్‌ అంతా ఇంగ్లిషే. కంప్యూటర్లు.. ఇంటర్నెట్‌అంతా ఇంగ్లిష్‌లోనే. డ్రైవర్‌లెస్‌కార్లు వస్తున్నాయన్నది రియాల్టీ. ఇవాళ మనం మార్పు చేసుకుంటేనే.. భవిష్యత్‌తరాలకు మంచి జరుగుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి," అని హితవు కూడా చెప్పారు.  అన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యాకమిటీలు పూర్తిగా ఇంగ్లిషు మీడియం పెట్టాలని వారంతా తీర్మానాలు చేసి పంపారని, ఎవర్ని అడిగినా ఇంగ్లిషుమీడియం కావాలనే చెప్తారని కూడా సి.ఎం. చెప్పుకొచ్చారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై  మాట్లాడుతూ... "రాజధానిపై నేను చెప్పాల్సింది అంతా అసెంబ్లీలోనే చెప్పాను. రాజధానిని ఎంచుకున్న ప్రాంతాన్ని చూడండి. అటు విజయవాడా కాదు, ఇటు గుంటూరూ కాదు... రాజధాని ప్రాంతం ఎక్కడ వస్తుందీ ముందే తనవారికి, తన అనుచరులకీ చెప్పి.. వేలాది ఎకరాలు కొనుగోలుచేయడం, క్యాబినెట్‌ సబ్‌కమిటీ ప్రాథమిక పరిశీలనలోనే 4వేలకుపైగా ఎకరాలు బటయపడ్డం.. అదంతా వేరే కథ.మరికొన్ని కీలక అంశాలను చూస్తే.. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే ఇవ్వాళ్టికీ మనం సింగిల్‌ రోడ్డుమీదే వెళ్లాలి. కరకట్టమీదున్న సింగిల్‌ రోడ్డుమీదనుంచే పోవాలి. నేనేమీ అబద్ధాలు చెప్పడంలేదు. మీడియా ప్రతినిధులుగా మీరుకూడా అదే దారివెంబడి వెళ్లాలి. సమీకరించిన భూమిని డెవలప్‌ చేయడానికి, కరెంటు, రోడ్లు, పైపులైన్‌తో నీరు ఇవ్వడానికి ఎకరాకు కనీసం రూ.2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని గత ప్రభుత్వం వాళ్లే చెప్పారు. రూ. 1,09,000 కోట్ల అంచనా వేశారు. కాని అదే ప్రభుత్వం ఐదేళ్లకాలంలో రూ.5600 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. మరో రూ.2–3 వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించమని మాకు అప్పగించి వెళ్లిపోయారు. ఇందులోనూ రూ.500 కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లించాల్సిన పరిస్థితి," అని గణాంకాలతో సహా వివరించారు జగన్ మోహన్ రెడ్డి. . ప్రతి ఏటా రూ.6 నుంచి 7 వేల కోట్లరూపాయలు రాజధాని మీద పెడితే.. అది సముద్రంలో వేసిన నీటిబొట్టే అవుతుంది. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు ఉండదు. ఇక్కడి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కోసం వేసిన అంచనాలో 10శాతం డబ్బును విశాఖపట్నంలో పెడితే కచ్చితంగా మార్పు వస్తుంది. ఇవాళ కాకపోయినా 10 ఏళ్లకైనా మనం హైదరాబాద్‌తోగాని, చెన్నైతోగాని, బెంగుళూరుతోగాని పోటీపడే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉంటుంది. అయినా సరే.. ఇక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని లెజిస్లేచర్‌ క్యాపిటల్‌గా కొనసాగిస్తామని చెప్పాం. మహారాష్ట్రలోని నాగపూర్, కర్ణాటకలోని బెల్గాంల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది. సీఎం అక్కడనుంచి పనిచేయాలి? ఇక్కడ నుంచి పనిచేయాలి? అని ఎవ్వరూ చుప్పలేరు. మంత్రివర్గానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు, మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలను పాలనాయంత్రాంగం అమలు చేస్తుంది. విశాఖలో నీటికి కొరత ఉందనేది వాస్తవం కాదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ.. పోలవరం నుంచి మరింత నీటిని అందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. తుపాన్ల సమస్య రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాలకూ ఉందని చెప్పిన సి.ఎం., ఇదే కృష్ణాజిల్లాలోని దివిసీమలో ఉప్పెన వచ్చిన ఘటనలూ ఉన్నాయన్నారు. విజయవాడకు కేవలం 60 కి.మీ దూరంలో సముద్రం కూడా ఉంది. అలాగే కరవు పీడిత ప్రాంతాలూ ఉన్నాయి. వీటన్నింటికీ మించి మనం చూడాల్సిన అంశం మరొకటి ఉంది. విశాఖపట్నం అనేది రాష్ట్రంలో నంబర్‌ ఒన్‌ సిటీ. దేశవ్యాప్తంగా టైర్‌ –2 సిటీల్లో అగ్ర స్థానంలో ఉంది. ఇప్పుడు మనముందున్న లక్ష్యం దీన్ని టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం. దేవుడు మనకు ఈస్థానం ఇచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే అదికూడా తప్పే అవుతుంది. దానికి ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.మనం విశాఖపట్నం వెళ్లకూడదు, ఇక్కడా అభివృద్ధికాదు. దీనివల్ల నష్టం మన పిల్లలకే. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణకు బిల్లులు పెట్టాల్సిన అవసరంలేదు. సీఆర్డీఏను ఏఎంఆర్‌డీఏగా మార్పుడానికే బిల్లు పెడితే సరిపోతుంది. కాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఒక సంకేతం ఇవ్వడానికే ఈ బిల్లులు పెట్టం.ఇక్కడ వారికీ న్యాయం చేస్తున్నాం, దీంతోపాటు మిగిలిన ప్రాంతాలకూ న్యాయం చేస్తున్నామని, అందరికీ మంచి చేస్తున్నామని చెప్పడానికే బిల్లులు పెట్టాం. ఒక్క ఏఎంఆర్‌డీఏ చట్టంకోసమే బిల్లు పెడితే ప్రస్తతు రాజధాని ప్రాంతం వారికి తప్పుడు సంకేతం పోతుందని చెప్పాం. ఈ బిల్లులను ఎవ్వరూ ఆపలేరు. 3 నెలలు ఆలస్యం చేయగలరు తప్ప.. ఎవ్వరూ అడ్డుకోలేరు. స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టే బిల్లునుకూడా ఇలాగే మండలిలో అడ్డుకున్నారు. ఆగిపోయిందా? అలాగే ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు బిల్లును కూడా అడ్డుకున్నారు.. ఆగిపోయిందా?, అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కాని, ప్రజలకు మంచిచేసే బిల్లులను ఆమాత్రం ఆలస్యం కూడా ఎందుకు చేయాలి? ప్రజలకు మంచి చేయాలని లేనప్పుడు మండలి ఎందుకు?ప్రజలకు మంచి చేసే బిల్లులను ఆలస్యం చేయాలన్నదేవారి ఉద్దేశం అయినప్పుడు, నిబంధనలను కూడా ఉల్లంఘించి వాళ్లు బిల్లులను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నప్పుడు మండలి అవసరం ఎందుకు? కేవలం మండలిలో ఒక పార్టీకి మెజార్టీ సభ్యులు ఉన్నారని రాజకీయపరమైన ఆలోచనలు చేశారు.  అసలు మండలిని అసెంబ్లీ సృష్టిస్తుంది, అసెంబ్లీకి సహాయపడుతుంది. మండలి అనేది అసెంబ్లీకి సలహా ఇచ్చే ఒక సభ. ఈ పనిని విడిచిపెట్టి రాజకీయంగా ఆలోచించి ప్రజలు ఇచ్చిన తీర్పును పరిహాసం చేస్తామంటే.. ఎలా? ఒక్క మండలి నిర్వహణ కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చుచేస్తున్నాం. ఏడాదిపోతే..., శాసనమండలిలో మాక్కూడా మెజార్టీ వస్తుంది. కాని, ఈ ఏడాది సమయాన్నికూడా ఎందుకు వదులుకోవాలి? ప్రజలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల వచ్చే మంచిచేరాలి. ఇంగ్లిషు మీడియం బిల్లును ఆమోదిస్తే ఎవరికి లాభం?ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఉంటే ఎవ్వరికి లాభం? రాజధానికార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల ఎవ్వరికి లాభం? విశాఖను అభివృద్ధి చేస్తే ఎవ్వరికి లాభం? ఇవన్నీ కూడా మన పిల్లలకి లాభం కదా? మన ప్రజలకు లాభం కాదా? అన్నది ఆలోచించాలి. అమరావతి రైతుల నుద్దేశించి ప్రశ్నలపై మాట్లాడుతూ, అమరావతి రైతులకు ఏం చేయదలుచుకున్నామో అసెంబ్లీలోనే చెప్పాం. ఎవ్వరికీ అన్యాయం చేయం. రైతులికిచ్చే యాన్యునిటీని పదేళ్ల నుంచి పదిహేనేళ్లకు పెంచాం. అలాగే భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇచ్చే జీవనభృతిని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచాం. అసైన్డ్‌దారులకు పట్టాదారులతో సమానంగా ప్లాట్ల కేటాయింపులు చేస్తాం. మేం గత ప్రభుత్వం మాదిరిగా బాహుబలి సినిమా గ్రాఫిక్స్‌ చూపించడంలేదు.  వాస్తవాలను ముందు పెడుతున్నాం. అమరావతి లెజిస్లేచర్‌ కేపిటల్‌గా కొనసాగుతుందని చెప్పామన్నారు ముఖ్యమంత్ర బీజేపీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ, 2019లో బీజేపీ మేనిఫెస్టో ఏంచెప్పిందో ఒక్కసారి చూడండి.రాజధాని భూముల్లో అవినీతి జరిగింది... వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. కాని రాష్ట్రంలోని బీజేపీ నాయకులు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. అదే పార్టీకి చెందిన జాతీయ స్థాయి ప్రతినిధులు ఉన్న విషయాలు చెప్తున్నారన్నారు సి.ఎం. ప్రత్యేక హాదా గురించి మాట్లాడిన సి.ఎం., ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం కాదన్నారు.  ముగిసిపోయిన అధ్యాయం అనే పదం వాడ్డం సరికాదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న మా ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతాయి. ప్రతిసారి మేం కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. ఎప్పుడో ఒకసారి మా అవసరం వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం.  కేంద్రానికి అవసరమైన రోజున మన ఎంపీల పాత్ర కీలకం అవుతుంది. ఆ సమయంలో మనకున్న డిమాండ్‌ ప్రత్యేక హోదా మాత్రమే. కియా.. వ్యవహారంపై మాట్లాడుతూ, కియా తరలిపోతుందంటూ తప్పుడు వార్త ఇచ్చారు. అనైతికమైన రిపోర్టింగ్‌ చేశారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తా కథనం ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన కథనం ఇది. తాము ఎక్కడికీ వెళ్లడంలేదంటూ కియా వరుసగా ఖండనలు ఇస్తున్నా... వాళ్లు వాస్తవాలు పట్టించుకోవడంలేదు. రాజకీయాలకోసం వ్యవస్థలను మేనేజ్‌చేసి ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి చూస్తున్నాం. నామీద బురదజల్లడం, నిందలు వేయడం ఇప్పడు మొదలుపెట్టింది కాదు. ఇవన్నీ నాకు అలవాటే. నిజాలతో పనిలేకుండా ఒక మనిషికి చెడ్డపేరును ఆపాదించాలని ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కచ్చితంగా మాకు తోడుగా ఉంటాడు.  గతంలో మా పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను  కొనుగోలుచేశారు. ఎన్నికల తర్వాత వారికి వచ్చిన సీట్లు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే. దేవుడు రాసిన గొప్ప స్క్రిప్టు ఇది. వాళ్లు చేసే కొద్దీ దేవుడు అయ్యో పాపం అంటూ.. మన పక్కనే ఉంటాడు. 2014 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలకు రాయితీల రూపంలో చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించలేదు.  ఈ రాయితీలు ఇవ్వకుండా చంద్రబాబు దావోస్‌ వెళ్లాడు, మార్కెటింగ్‌కోసం కోట్లు ఖర్చుచేశాడు. రాష్ట్రంలో నడుస్తున్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా మనం అదిచేస్తాం, ఇది చేస్తాం అని ప్రకటనలు చేసీ ఏం లాభం. మా  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు వేల కోట్ల రూపాయలను చెల్లిస్తున్నాం. పరిశ్రమలకు కావాల్సింది ప్రధానంగా సరసమైన ధరలకు భూములు, నీళ్లు, కరెంటు. అవినీతిలేని పాలన, సానుకూల దృక్పథం ఉన్న ప్రభుత్వం, విధానాల్లో పారదర్శకత. ఇవన్నీ ఉన్న ప్రభుత్వం మాది. పైగా అబద్ధాలు చెప్పే అలవాటు మా ప్రభుత్వానికి లేదు. పరిశ్రమలకు ఇవన్నీ సానుకూల అంశాలు. మిగిలినవన్నీ సహజంగానే వస్తాయి.  విషయాలన్నింటికీ ఎప్పటికప్పుడు మేం చెప్తూనే ఉన్నాం. కాకపోతే మాకు మీడియా బలం తక్కువన్నారు సి.ఎం. . సీఎంగా అతి పెద్ద సవాల్‌ ఏమి ఉంటుందన్న ప్రశ్నకు,ప్రతిరోజూ సవాలే. మంచి సమర్థతతో ఆ సవాలను అధిగమించాలి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, హౌసింగ్‌... వీటిని ప్రాధాన్యతలుగా పెట్టుకున్నాం. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? నాడు– నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లను బాగా అభివృద్దిచేస్తున్నాం? ఇది అభివృద్దికాదా? ఇంగ్లిషు ల్యాబ్‌ సహా 9 రకాల సదుపాయాలను ప్రతిస్కూళ్లలో కల్పిస్తున్నాం. ప్రతి స్కూళ్లో ఇంగ్లిషు మీడియం పెడుతున్నాం.మధ్యాహ్న భోజనంలో నాణ్యత బాగా పెంచాం.  గ్రీన్‌ఛానళ్లో పెట్టి బిల్లులు పెండింగులో లేకుండా చూస్తున్నాం.ఆయాల జీతాలు రూ.వేయి నుంచి రూ.3వేలకు పెంచాం. అమ్మ ఒడి అమలు చేశాం.ఫీజు రియంబర్స్‌మంట్‌ పూర్తిగా ఇస్తున్నాం. పాఠ్యప్రణాళికలో పూర్తిగా మార్పులు తీసుకు వస్తున్నాం. డిగ్రీ విద్యార్థులకు ఏడాదిపాటు అదనంగా అప్రెంటిస్‌ ఇప్పిస్తున్నాం.ఇది అభివృద్ది కాదా, అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ పోలవరం మీద ఎంతో «ధ్యాసపెడుతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం ప్రాజెక్టును మిస్‌ హ్యాండిల్‌ చేసిందని, త ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణలో విజన్‌ లోపించిందని చెప్పారు. "స్పిల్‌వే పూర్తికాకుండానే కాపర్‌ డ్యాం నిర్మాణం చేపట్టింది. దీనివల్ల వరదనీరు అటు స్పిల్‌వేగుండా పోవడంవల్ల పనులు చేయలేని పరిస్థితి. నవంబర్‌ వరకూ పనులు నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2021 జూన్‌ నాటికి పనులు పూర్తవుతాయి," అని వివరించారు.  

తరలిపోతున్న ఐటీ కంపెనీలు.! జగన్ సర్కారు నిర్ణయంతో 18వేల ఉద్యోగాలు మటాష్.! 

కొత్త ఉద్యోగాలేమో గానీ, ఉన్న ఉద్యోగాలను ఊడబీకే విధంగా జగన్ ప్రభుత్వ విధానాలు కనిపిస్తున్నాయి. అసలే ఏపీకి కొత్త కంపెనీలు రావడానికి భయపడుతున్నాయని ప్రచారం జరుగుతుంటే... ప్రభుత్వ నిర్ణయాలతో ఉన్న కంపెనీలూ వెళ్లేపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే, కియా మోటర్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనుందంటూ ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుండగా... ఇఫ్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వం... సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం మిలీనియం టవర్స్ ను ఎంపిక చేసుకుంది. దాంతో, మిలీనియం టవర్స్ లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మార్చి 30లోపు మిలీనియం టవర్స్ ను ఖాళీ చేయాలంటూ ఆ నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, 5వేల మందికి ఉద్యోగాల కల్పన కోసం 300 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ మిలీనియం టవర్స్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కాండ్యుయేట్ కంపెనీ.... ప్రభుత్వ నోటీసులతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొత్తం ఆపరేషన్సే షట్ డౌన్ చేయాలని కాండ్యుయేట్ కంపెనీ బోర్డు డెసిషన్ తీసుకుందని అంటున్నారు. తమ కార్యకలాపాల కోసం కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్న కాండ్యుయేట్ కంపెనీ.... హైదరాబాద్ లేదా కొచ్చిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిలీనియం టవర్స్ లో పనిచేస్తున్న 2400మందిని హైదరాబాద్ లేదా కొచ్చి తరలించాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  ఇక, మిలీనియం టవర్స్ లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఎల్ అండ్ టీ కూడా మార్చి 30 తర్వాత ఆ బిల్డింగ్ ను ఖాళీ చేయనున్నాయి. దాంతో, మిలీనియం టవర్స్ నుంచి దాదాపు 18వేల మంది ఉద్యోగులు తరలిపోనున్నారని చెబుతున్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ కంపెనీల కోసం ఆనాడు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన కాండ్యుయెంట్‌ సంస్థను విశాఖ తీసుకురావటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కష్టపడింది. కానీ, ఇఫ్పుడు సచివాలయం పేరుతో భవనాన్నే ఖాళీ చేయమంటూ జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో.... మొత్తం ఏపీనే వదిలివెళ్లిపోవాలని ఆయా ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఎంతోకష్టపడి తీసుకొచ్చిన ఐటీ కంపెనీలను ఇలా తరిమేయడం రాష్ట్రానికి మంచిది కాదని విపక్షాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.  

మేడారం జాతర... ఎప్పుడు? ఎందుకు? ఎలా మొదలైందో తెలుసా?

సమ్మక్క సారాలమ్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆదివాసీలకు కాకతీయ రాజులకు మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలోనే ఈ గాథలన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొన్ని కథల్లో సమ్మక్క మరణించినట్లు ఉంటే... మరికొన్ని కథల్లో నెత్తురోడుతూ చిలుకల గుట్టవైపు వెళ్లిపోయిందని చెబుతున్నాయి. ఇంకొన్ని గాథల్లో సమ్మక్క సహగమనం చేసినట్లు ఉంటుంది. కొన్ని కథల్లో ఆదివాసీలకు... కాకతీయ ప్రభువులకు మధ్య ఘర్షణ జరిగి... కప్పం కట్టకపోవడం కారణంగా చెప్పగా... మరికొన్ని కథల్లో సహజ వనరుల పంపకాల్లో వివాదం వచ్చినట్లు ఉంది. అయితే, ఆదివాసీల నుంచి కాకతీయ రాజులు కప్పం వసూలు చేసిన దాఖలాల్లేవని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ... ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న కథలు మాత్రం కప్పమే యుద్ధానికి కారణమని చెబుతున్నాయి. అయితే, అందరి నోళ్లలో ప్రసిద్ధి చెందిన కథ ఇలా ఉంది. ఏడో శతాబ్దంలో తమ నివాస స్థలమైన మేడారం నుంచి కోయ దొరలు వేట కోసం అడవికి వెళ్లగా, ఓ చోట పెద్ద పులులు కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఓ పసిపాప కనిపించిందని, ఆ పాపను కోయదొరలు తమ గూడేనికి తీసుకెళ్లి పెంచి పెద్దచేశారని, అయితే... ఆ పసిపాప వచ్చినప్పట్నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే తమకు పాప రూపంలో సాక్షాత్కరించిందని నమ్మి ఆ చిన్నారికి సమ్మక్కగా పేరు పెట్టారని చెబుతారు. అలా, పెరిగి పెద్దయిన సమ్మక్కను కోయ చక్రవర్తి అయిన మేడరాజు... కరీంనగర్ ప్రాంతాన్ని ఏలుతున్న తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి జరిపించాడని చెబుతారు. పగిడిద్ద రాజు, సమ్మక్కకు సారాలమ్మ, నాగులమ్మతోపాటు జంపన్న జన్మించారు. అయితే, మేడారం ప్రాంతాన్ని పాలించే కోయరోజులు... ఓరుగల్లు రాజులకు సామంతులుగా ఉండేవారు. కరువు కాటకాలతో ఒక సంవత్సరం కోయరాజుల... కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించలేకపోయారు. దాంతో, కాకరాజు రాజు ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని గిరిజనులపైకి యుద్ధానికి పంపాడు. అయితే, కాకతీయ సేనల ముందు గిరిజనులు నిలువలేకపోయారు. ఈ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజుతోపాటు వారి కుమార్తెలు సారాలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు వీరణమరణం పొందుతారు. ఈ పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న... మేడారం సమీపంలోని వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు. అయితే, సంపెంగ వాగు సమీపంలో జంపన్నను కాకతీయ సేనలు హతమార్చాయని మరో కథ ప్రచారంలో ఉంది. జంపన్న వీరమరణం పొందిన వాగు కావడంతో దాన్ని అప్పట్నుంచీ జంపన్న వాగుగా పిలుస్తారు. అయితే, భర్త పిల్లల మరణవార్త తెలుసుకున్న సమ్మక్క మహోద్రురాలిగా మారి కాకతీయ సేనలపై విరుచుకుపడిందని, కానీ... ఓ సైనికుడు దొంగచాటుగా బల్లెంతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క నెత్తురోడుతూనే ఈశాన్య వైపునున్న చిలుకలగుట్టపైకి వెళ్లి అదృశ్యమైందని చెబుతారు. సమ్మక్కను కొందరు కోయలు అనుసరించినప్పటికీ జాడ తెలియలేదని, అయితే చిలుకలగుట్టపైనున్న నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణె కనిపించడంతో, సమ్మక్కే అలా మారిందనే నమ్మకంతో అప్పట్నుంచి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ముత్తయిదువల పండగ జరుపుకోవడం మొదలుపెట్టారని, ఇదే కాలక్రమేణా జాతరగా రూపొంతరం చెంది, సమ్మక్క సారాలమ్మ మేడారం మహా జాతరగా మారింది. అయితే, కోయవీరులు మరణించారంటే ఆదివాసీలు అంగీకరించరు. వాళ్లింకా బతికే ఉన్నారని... సమ్మక్క భరిణె రూపంలో రెండేళ్లకోసారి సాక్షాత్కరిస్తుందనేది వాళ్ల విశ్వాసం. అందుకే, ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఈ మేడారం నిర్వహిస్తున్నామని చెబుతారు. అలా, ఆదివాసీల్లో వీరవనితగా పేరుగాంచిన సమ్మక్క... కుంకుమభరిణె రూపంలో వెలిసి... భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోందని పురాణగాథలు చెబుతున్నాయి.

తగ్గనున్న పన్ను భారం.. బడ్జెట్ పై కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలు

2020-21 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు ముందుకు రానుంది. ప్రపంచ దేశాలను మాంద్యం చుట్టుముడుతున్న వేళ దేశం పై ఆర్థిక మందగమన ప్రభావం పడకుండా ఆర్థిక మంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని సామన్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తగ్గుతున్న పొదుపుతో దిగాలుగా ఉన్న సగటు వేతన జీవి ఈసారైన ఆదాయపు పన్ను పై ఆర్థిక మంత్రి తీపికబురు అందిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఆరేళ్లలో ఆదాయపు పన్నుకు సంబంధించి మోదీ సర్కారు తీసుకున్న చర్యలు ఈ సారి ఎలాంటి మార్పులు చేసే అవకాశాలున్నాయో చూడాలి.  2014 బడ్జెట్ లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ లకు మినహాయింపు 2.5 లక్షల నుంచి మూడు లక్షలకు మార్చారు. 2015 బడ్జెట్ లో పన్ను శ్లాబుల జోలికి వెళ్లకుండా ఆరోగ్య భీమపై డిటెక్షన్ ను రూ.15,000 నుంచి రూ.25,000 రూపాయలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.20,000 నుంచి రూ.30,000 లుగా మార్చారు. సంపద పన్ను తొలగించి సంపన్నుల పన్ను ఆదాయం కోటి దాటితే రెండు శాతం సర్ చార్జ్ విధించేలా నిబంధనలు పెట్టారు. 2016 బడ్జెట్ లో సెక్షన్ 87 కింద ఐదు లక్షల ఆదాయం మించని వారికి పన్ను రిబేట్ ను రూ.2000 నుంచి రూ.5000 లకు పెంచారు. సెక్షన్ 80 జీజీ కింద అద్దెకు సంబంధించిన డిడక్షన్ ను రూ.24,000 నుంచి రూ.60,000 లకు పెంచారు. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్ చార్జిని 12 నుంచి 15 శాతానికి పెంచారు. 2017 బడ్జెట్ లో 2.5 లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయం ఉన్న వారికి పన్నును ఐదు శాతం చేశారు. వార్షికాదాయం 3.5 లక్షలు ఉన్న వారికి పన్ను రిబేట్ ను రూ.5000 నుంచి రూ.2,500 చేశారు. 50 లక్షల నుంచి కోటి ఆదాయం పై 10 శాతం సర్ చార్జిని వేధించడం మొదలు పెట్టారు. 2018 లో మెడికల్ రీయంబర్స్ మెంట్ ట్రాన్స్ పోర్టు అలవెన్సుల స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని రూ.40,000 పెంచారు. ఆదాయపు పన్ను కార్పొరేట్ పన్ను పై ఉన్న మూడు శాతం విద్యాసెస్సు స్థానంలో 4 శాతం విద్య, ఆరోగ్య సెస్ విధించారు. 2019 లో పీయూష్ గోయల్ ప్రవేశపెట్టినా తాత్కాలిక బడ్జెట్ లో ఐదు లక్షల వరకు ఆదాయానికి పన్ను రిబేట్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000 నుంచి రూ.50,000 లకు పెంచారు. మోదీ ప్రభుత్వం రెండోసారి బాధ్యతలు చేపట్టాక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్నుకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కొత్త పన్ను శ్లాబులను తీసుకొచ్చి అంచనాలున్నాయి. చాలా ఏళ్లుగా వ్యక్తిగత పన్ను శ్లాబులలో సవరణలు పరిమితుల పెంపు లేదు. రిబేట్ల లాంటి ప్రత్యామ్నాయాలు కాకుండా 5,10,20,30,35 శాతం శ్లాబులు తేవాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని అయిదు శ్లాబులుగా విభజిస్తే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం రూ.2,50,000 ఉన్న ఆదాయ పరిమితిని ఐదు లక్షలకు పెంచితే ఎంతో మందికి పన్ను భారం తగ్గుతుంది

చీకటి ఒప్పందం.. మూడు రాజధానుల నివేదిక ఇచ్చిన బోస్టన్ గ్రూప్ తో రూ. 6 కోట్ల డీల్!

మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి కమిటీలు , నివేదికలతోనే కాలం గడిచిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండటం మంచిదని జగన్ చెప్పిన విధంగానే నివేదిక కూడా వెల్లడించింది. అలా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు రూ.5 కోట్ల 95 లక్షల ఫీజు చెల్లించింది ప్రభుత్వం. ఎటువంటి జీవో లేకుండా బోస్టన్‌కు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన కంపెనీతో రహస్య లావాదేవీలు జరిపింది వైసీపీ ప్రభుత్వం. మొత్తం వ్యవహారాలు ఈమెయిల్స్ ద్వారానే నడిపింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర ప్రణాకా విభాగం ద్వారా చేసింది. రాజధాని కేసులపై వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న లాయర్ ముకుల్ రోహత్గీకి కూడా ప్రణాళికా విభాగం ద్వారానే రూ. 5 కోట్లు మంజూరు చేశారు. అది కాకుండా బోస్టన్ గ్రూప్‌కి కూడా దాదాపుగా రూ.6 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఆ మొత్తాన్ని కూడా ఈ ప్రణాళికా విభాగం ద్వారానే విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.  బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన లేఖల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ కంపెనీని సంప్రదించింది. మూడు రాజధానులపై అధ్యయనం చేసేందుకు 2019 , నవంబర్‌ 27వ తేదీన బోస్టన్ కమిటీని ఎంపిక చేసినట్లుగా అధికారులు ఈమెయిల్ పంపారు. ఆ తర్వాత జనవరి 3వ తేదీన బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా నెల రోజుల్లోనే బోస్టన్ కమిటీ నివేదిక సమర్పించింది. అసలు ఆ కమిటీ ఏపీలో ఉండే ఎటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక వెల్లడించిందో తెలియయటం లేదు. బోస్టన్ నివేదికలో కూడా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన బ్లూప్రింట్‌లోని అంశాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మూడు రాజధానుల అంశం కూడా ఉంది. అంటే ముందస్తుగా ఒక రిపోర్టును ప్రభుత్వమే సిద్ధం చేసి.. దానికి బోస్టన్ గ్రూప్ అనే ట్యాగ్ వేసి ఇచ్చేందుకు రూ. 6 కోట్లను సమర్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా బోస్టన్ నివేదిక గురుంచి గూగుల్ లో చాలా మంది వెతికినా దొరకలేదు.. అలానే ప్రభుత్వం కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో ప్రభుత్వం నేరుగా జీవో ద్వారా కాకుండా.. మరో విధంగా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వ చీకటి వ్యవహారాలు అంచనా వేయలేని విధంగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి.

ఏపీ పోలీసులపై నమ్మకం లేదని... ఇఫ్పుడు సిట్ ఎందుకు వేశారు? జగన్ కు చెల్లెలు సూటి ప్రశ్న

తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు హైకోర్టు తెలిపారు. తాము, హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లేలోపే వైఎస్ వివేకా బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకల్ని శుభ్రం చేసేశారని సునీత హైకోర్టుకు తెలిపారు. అదే రోజు సిట్ ఏర్పాటు చేశారని... కానీ, తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అయితే, వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక... 2019 జూన్ 13న కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్... కొత్త అధికారులతో మళ్లీ సిట్ ఏర్పాటు చేశారని వివేకా కుమార్తె హైకోర్టుకు తెలియజేశారు. ఈ సిట్ 1300మందిని విచారించి సాక్ష్యాలను సేకరించిందని... కానీ కడప ఎస్పీగా అన్బురాజన్ నియమితులయ్యాక దర్యాప్తు నత్తనడకన సాగుతోందని సునీత ఆరోపించారు.  ఇక, సీబీఐ దర్యాప్తు కోరుతూ తన తల్లి సౌభాగ్యమ్మ... అలాగే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పైగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని కోరిన తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతున్నా ఇఫ్పటివరకు సీబీఐ దర్యాప్తు కోరలేదని ప్రశ్నించారు. అంతేకాదు... ప్రతిపక్షంలో ఉండగా ఏపీ పోలీసులపై విశ్వాసం లేదన్న జగన్.... తాను అధికారంలోకి వచ్చాక మళ్లీ సిట్ ను ఏర్పాటు చేసి ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉన్నంతకాలం సీబీఐ దర్యాప్తు కోసం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నట్లుగా భావించాలని సునీత అన్నారు. ఇక, తమ పిటిషన్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు సునీత. ఇదిలాఉంటే, వైఎస్ వివేకా కుమార్తు సునీత ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపారు. అందులో ఎక్కువగా వైఎస్ కుటుంబ సభ్యులే ఉండగా, మిగతా అనుమానితులు కూడా వైఎస్ కుటుంబ సభ్యులకు సన్నిహితులే ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో మొదట వాచ్ మన్ రంగయ్య(1)(వివేకా ఇంటి కాపలాదారు) పేరు ఉంది.ఆ తర్వాత యర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)... 3.ఉదయ్ కుమార్ రెడ్డి (ఎంపీ వైఎస్ అవినాష్ కి అత్యంత సన్నిహితుడు).... 4.డి.శివశంకర్ రెడ్డి (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి) (అలాగే, వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు)... 5.పరమేశ్వర్ రెడ్డి... 6.శ్రీనివాస్ రెడ్డి... 7.వైఎస్ భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి)... 8.వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న)... 9.వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ).... 10.శంకరయ్య (సీఐ)... 11.రామకృష్ణారెడ్డి (ఏఎస్సై).... 12. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి.... 13. ఆదినారాయణరెడ్డి (మాజీ మంత్రి).... 14. బీటెక్ రవి అలియాస్ ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (టీడీపీ ఎమ్మెల్సీ)... 15. సురేందర్ రెడ్డి (పరమేశ్వర్ రెడ్డి బావమరిది)... ఇలా, ప్రధానంగా 15మందిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న వైఎస్ వివేకా కుమార్తె... ఎందుకో కారణాలను కూడా హైకోర్టుకు వివరించారు.