ఇప్పటికీ తీరని వలస కార్మికుల వెతలు
posted on Oct 8, 2020 @ 11:21AM
వలస కార్మికులు ఎంత మంది? కోటి. కాదు నాలుగు కోట్లు. కాదు ఎనిమిది కోట్లట. ఒక దేశంలో ఈ ఎనిమిది కోట్ల మందిని అమాంతం మరిచిపోగలమా? మనం మరిచిపోయాం. వాళ్లకు రెండు పూటలా తిండి దొరుకుతోందా లేదా? మనకు తెలియదు. వారికి ఏదైనా పని దొరికిందో లేదో కూదా మనకు తెలియదు. వారు ఆకలికి ఎలా అలమటిస్తున్నారో కూడా మనకు తెలియదు. వాళ్లు రేషన్ షాపుకు వెళ్లి ఆహార ధాన్యాలు తెచ్చుకుంటున్నారో లేదో కూడా తెలియదు.
అంతే కాదు వారిలో ఎంత మంది మరణించారో ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారో కూడా తెలియదు. వాళ్లు ఎవరు? ఎక్కడికి వెళ్లారు? కేవలం ఆరునెలల వ్యవహారమే ఇది. ఈ అంశంపై దేశం దృష్టే కాదు, ప్రపంచమంతటి దృష్టి ఉండింది. ఎందుకంటే ప్రపంచ చరిత్రలోనే ఇంతమంది వలస కార్మికులు తరలి వెళ్లడం ఇదే మొదటి సారి. భారత్ లో జరిగిన ఈ వలస కార్మికుల యాత్ర భయంగొల్పేది. వీరి సమస్యను ఎదుర్కోవడానికి కావలసిన మౌలిక సదుపాయాలు లేవు. ఆరు నెలల కిందట ఈ అంశం గురించి అందరూ చర్చించుకునేవారు.
ఈ ఆరు నెలల కాలంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. జనం వీటివెంట పరుగెత్తడం మొదలుపెట్టారు. మీడియా ఈ అంశం వెంట పరిగెత్తడం మొదలు పెట్టింది. అధికారపక్షం దీనిపై రాజకీయాలు చేయడం ఆరంభించింది. అనేక పక్షాలు ఈ అంశంపై తమ తమ స్వార్థ ప్రయోజనాలు అన్వేషించడం మొదలు పెట్టాయి. ఈ అంశంవల్ల ప్రభావితమైన వివిధ వర్గాల వారు వలస కార్మికుల సమస్య పెద్దదా, తమ సమస్యలు పెద్దవా అని ఆలోచించేడం మొదలు పెట్టారు. ఇది విచిత్రమైన దేశం. ఇక్కడ ప్రతి క్షణం ఒక కొత్త సమస్య ఉద్భవిస్తూ ఉంటుంది. దీనివల్ల మునుపటి సమస్యలను గుర్తుంచుకోవాలా? మరిచిపోవాలా అన్న సంశయం ఎదురవుతూ ఉంటుంది.
ఆరు నెలల కిందటి ఆ వలస కార్మికుల పరిస్థితిని పరిశీలిద్దాం. దానిలో వాస్తవం ఏమిటో చూద్దాం. ఆ సత్యం కనువిప్పు కలిగించేది అయి ఉంటుంది. అది చాలా దు:ఖ దాయకంగా ఉంటుంది. అయినా ఆ సత్యమేమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న వారు పదే పదే మనల్ని తప్పు దోవపట్టిస్తారు. మీడియా అదే పని చేస్తుంది. రంగురంగుల పరిస్థితిలో మనల్ని ముంచేయాలని చూస్తుంది మీడియా. మీడియా సాధారణంగా అనుగామి వార్తలు రాస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు దేశమంతటి దృష్టిలో ఉన్న అంశాల మీద ఇవాళ దృష్టే లేకుండా పోయింది. అంతా నిశ్శబ్దం, నైరాశ్యం ఆవహించి ఉంది. పార్లమెంటు వేదిక మీంచి నాలుగు కోట్ల మంది వివిధ నగరాల నుంచి తమ సొంత రాష్ట్రాలకు తరలి వెళ్లారని చెప్పారు. ఒక కాబినెట్ మంత్రి నాలుగు కోట్ల వలస కార్మికు సొంతూళ్లకు వెళ్లారని చెప్తే మరో కాబినెట్ మంత్రి కాదు ఎనిమిది కోట్ల మంది వలస కార్మికులు తరలి వెళ్లారని చెప్పారు. కానీ దేశంలోని వివిధ ప్రాంతాల సమాచారాన్ని కలిపితే కనీసం పదకొండు కోట్ల మంది తరలి వెళ్లినట్టు తేలుతోంది. కానీ ప్రభుత్వం చెప్పిన లెక్కలనే అంగీకరిద్దాం.
ఆరు నెలలకింద ఈ వలస కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరాయా? ఒక్కొక్కరికి అయిదు కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తామన్న వాగ్దానం ఎంత మేరకు నెరవేరింది? రేషన్ కార్డులు ఇస్తామన్నారు. అవి అందుబాటులోకి వచ్చాయా? వలస కార్మికుల్లో ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారు? ఈ అంశంపై ఎవరూ దృష్టి సారించనే లేదు. రైళ్లల్లో వెళ్లిన వారిలో ఎంత మంది మరణించారు. రైళ్లల్లో వెళ్తూ మరణించినవారి సంఖ్య 110 కన్నా ఎక్కువ ఉంటుందంటున్నారు. నడిచి వెళ్తూ రోడ్డు మీద మరణించిన వారు, రైలు పట్టాల మీద ప్రాణాలు అర్పించిన వారు కూడా 200 కన్నా ఎక్కువే మంది. అయితే మాత్రం తేడా ఏముంటుంది? ఆ రెండుమూడు వందల కుటుంబాల్లో విషాదం అలముకుని ఉండి ఉంటుంది. అయినా దాని ప్రభావం ఏముంటుంది గనక?
గత ఆరు నెలల కాలంలో దేశంలో పేదల సంఖ్య కోటి ఇరవై లక్షలు పెరిగింది. తేడా ఏం ఉంటుంది. ఈ దేశంలో దారిద్ర్య రేఖకు దిగువ్న ఉన్న వారి అంటే బి.పి.ఎల్. కింద ఉన్న వారి సంఖ్య మూడున్నర కోట్లు పెరిగిపోయింది. ఈ దేశంలో ప్యాకేజీ రూపంలో 50, 000 కోట్ల రూపాయలు కేటాయించారు. జన ధన్ యోజన కింద నగదు బదిలీ కాలేదు. తేడా ఏముంటుంది? కిసాన్ సమ్మాన్ నిధి మొత్తం కూడా అందలేదు. ఏం తేడా ఉంటుంది? వేర్వేరు సంస్థలు ఈ అంశంపై సర్వే చేశాయి. ఎన్. జి ఓ..లు సర్వే చేశాయి. ఈ సమయంలోనే ప్రభుత్వ గణాంకాలు కూడా వెలువడ్డాయి. కృత్రిమ మేధస్సు ప్రకారం ఈ లెక్కలన్ని కలిపి సగటు చూస్తే అదే సత్యం అవుతందని అంటారు. ఆ సత్యమే భయపెడ్తోంది. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎల్.ఓ నివేదికల్లో భారత్ లో పేదల సంఖ్య మరో కోటి 20 పెరుగుతుందని అంచనా వేశారు. అలాగే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల 30 లక్షల మంది పేదలై పోయారు. అందులో అత్యధిక సంఖ్యాకులు అంటే 27 శాతం మంది భారతీయులే.
కరోనా మహమ్మారి సోకక ముందు మొత్తం ప్రపంచంలో 13 లక్షల 50 వేల మంది పేదలు ఉండే వారు. వీరి సంఖ్య ఇప్పుడు 26.5 లక్షలకు పెరిగింది. భారత్ లో ఆహార భద్రత లేని వారి సంఖ్య ఇంతవరకు మూడున్నర కోట్లు ఉండేది. ఇప్పుడు అది పెరిగింది. అయినా తేడా ఏముంది? ఇప్పుడు అది ఏడు కోట్లు దాటింది. ఇదేం పరిస్థితి? కార్మిక, ఉపాధి శాఖల సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ 2011నాటి గణాంకాల ప్రకారం దేశంలో నాలుగు కోట్ల మంది వలస కార్మికులు ఉంటే అందులో కోటి మందికి పైగా తమ సొంత ఊళ్లకు వెల్లి పోయారని చెప్పారు. అందులో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్ వారే. వీరి సంఖ్య 32 లక్షల మంది. బిహార్ కు తిరిగొచ్చిన వారి సంఖ్య 15 లక్షలు అయితే, బెంగాల్ కు తిరిగి వచ్చిన వలస కార్మికుల సంఖ్య 13 లక్షలు. 7.94 లక్షల మంది మధ్య ప్రదేశ్ కు తిరిగి వచ్చారు. పార్లమెంటులో లిఖిత రూపంలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చినప్పుడు అందులో ఒరిస్సా, చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, గోవా, కర్నాటక, దిల్లీ, గోవా, జార్ఖండుకు తిరిగివచ్చిన వారి ప్రస్తావన లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన దాని ప్రకారం మొత్తం ఎనిమిది కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం వలస కార్మికులకు సంబంధించి అనేక గణాంకాలు వెల్లడించింది. వారి మరణాలపై ఎక్కువ దృష్టి ఉండేది. వాస్తవం ఏమిటంటే పార్లమెంటులో రైతులకు సంబంధించిన మూడు అత్యవసరాదేశాలను, బిల్లులను ఆమోదిస్తున్న సందర్భంలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు. ఇందులో పంజాబ్ లో ఆత్మ హత్య చేసుకున్న రైతుల సంఖ్యే ఎక్కువ. పంజాబ్ లో 24 జూన్ నుంచి సెప్టెంబర్ ఒకటి దాకా 65 మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు. వివిధ గణాంకాల ఆధారంగా లెక్కలు తీసినప్పుడు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఒక్క పంజాబ్ లోనే 165 మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు. మొత్తం దేశంలో చూస్తే 6, 500 మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు. ఈ ఆత్మ హత్యలన్ని రైతులకు సంబంధించిన బిల్లులను లోక సభలో చర్చించక ముందు జరిగినవే. ఈ ఆత్మ హత్యలు ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ ఒకటి మధ్య జరిగినవే. ఈ రైతులు ఎవరు? వీరు ఎలాంటి వారు? ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగున్నర లక్షల మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు. ఈ రైతులకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని దొరికిందంటున్నారు. దీనిలో నిజమేమిటో చూద్దాం.
ఎక్కువ మంది వలస కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు అని చూస్తే దిల్లీలోని ఎన్.సి.ఆర్. ప్రాంతం, మహారాష్ట్రలోని ముంబై ప్రాంతం, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఉత్తర ప్రదేశ్, బిహార్, బెంగాల్, మధ్య ప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ ప్రాంతాలనుంచి సొంతూళ్లకు వలస వెళ్లిన కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వీరు పొలాల్లో, పరిశ్రమల్లో, ఇళ్లల్లో పని చేసే వారు. సెక్యురిటీ గర్డులుగా పని చేసే వారు. కొందరు భవన నిర్మాణ రంగంలో ఉండే వారు. కొందరు డ్రైవర్లుగా పని చేసే వారు. తిరిగి వెళ్లిన వీరిలో 82 శాతం మందికి పని లేదు. ఈ 82 మందిలో మళ్లీ 70 శాతం మందికి సొంతూరు వెళ్లిన తరవాత రెండు పూటలా తిండి దొరకడం లేదు. ఈ విషయం తెలిసీ మనం కళ్లు మూసుకున్నాం. ఇది ఎందుకు భాయనకమైన పరిస్థితి అంటే పంజాబ్ లో అనేక మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారని అనుకున్నాం. కాని విదర్భలో ఎక్కువ మంది ఆత్మ హత్య చేసుకున్నారు. మరాఠ్వాడాలో. పశ్చిమ మహారాష్ట్రలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అమరావతి డివిజన్ లో అయిదు జిల్లాలు ఉంటాయి. వాషిం, యవత్మల్, అమరావతి, బుల్ధానా, కోలా జిల్లాలు ఉన్నాయి. ఈ గణాంకాలను చూసినప్పుడు వీరు ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. వీళ్లు అప్పుల బాధవల్ల ఆత్మహత్య చేసుకున్నారా? లాక్ డౌన్ సమయంలో ఉపాధి దొరకక ఆత్మ హత్య చేసుకున్నారా?
సొంతూళ్లకు తిరిగి వెళ్లే కార్మికుల కోసం రూ. 50,000 కోట్ల సహాయక పథకం అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 116 జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తామన్నారు. ఈ 116 జిల్లాల్లో పరిస్థితి చూస్తే కేవలం 25,000 కార్మికులకు మాత్రమే ప్రయోజనం కల్గింది. అంటే సగటున ఒక్కో జిల్లాలో 215 మంది కార్మికులకే మేలు జరిగింది. సొంతూళ్లకు తిరిగొచ్చిన కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఎన్ని లక్షల మంది? తమ ఊరికి తిరిగి వచ్చిన వారు ఎంతమంది? సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారు ఎంత మంది? ఇందులో చాలా మంది దగ్గర రేషన్ కార్డే లేదు. రేషన్ కార్డు లేని వారికి ఆహార పదార్థాలు అందజేస్తామన్నారు. మహారాష్ట్రలో 20 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. కాని రేషన్ కార్డులు లేని వారి సంఖ్య 10 లక్షల 83 వేలు ఉంది. తిరిగొచ్చిన వీరు ఏం చేయాలి? ఎక్కడికెళ్లాలి? ఉత్తర ప్రదేశ్ లో 12 లక్షల మందికి రేషన్ కార్డులు వచ్చాయి. కానీ తిరిగొచ్చిన 32 లక్షల మంది దగ్గర రేషన్ కార్డులు లేవు. బిహార్ లో 24 లక్షల మందికి రేషన్ కార్డులు దక్కాయి. ఇందులో బి.పి.ఎల్. కార్డులూ ఉన్నాయి. ఎ.పి.ఎల్. కార్డులూ ఉన్నాయి. కానీ బిహార్ వెళ్లిన వారి సంఖ్య 70 లక్షలు. పశ్చిమ బెంగాల్ లో 66 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. కాని అక్కడి వివిధ జిల్లాలకు తిరిగొచ్చిన వలస కార్మిలు సంఖ్య కోటి ఇరవై లక్షలు. వారి పరిస్థితి దయనీయంగా ఉంది. సగటున ఎంతమందికి రేషన్ కార్డులు తయారయ్యాయో అంతకు అయిదు నుంచి ఎనిమిది రెట్ల మందికి ఆహారం అందడం లాదు. ఎవరికి ఆహార పదార్థాలు అందుతున్నాయో, ఎవరికి అందడం లేదో గణాంకాలు తయారయ్యాయి. ముందే రేషన్ కార్డులున్నవారిలో కూడా 71 శాతం మందికే ఆహార పదార్థాలు అందాయి. అంటే 29 శాతం మందికి అందనే లేదు. కానీ అందరికీ ఆహార పదార్థాలు అందజేశామని ప్రభుత్వం చెప్తోంది. ఈ దేశంలో 23 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. ఇందులో 16 లక్షల మందికి ఆహార పదార్థాలు అందాయి. మిగతా ఏడు లక్షల మందికి అందలేదు. రేషన్ కార్డులు లేని కుటుంబాలు దాదాపు అయిదు కోట్లు ఉన్నాయి. రేషన్ కార్డులు లేని వారికి కూడా తలా అయిదు కిలోల ఆహార ధాన్యాలు అందజేసినట్టు ప్రభుత్వం చెప్తోంది. వీరిలో ఒక కోటి 35 లక్షల మందికి ఆహార పదార్థాలు అందాయి. మూడు కోట్ల పై చిలుకు మందికి అందలేదు. అయినా బెంగ లేదు. పంజాబ్ లో 74 శాతం మందికి రేషన్ కార్డులున్నా ఆహార పదార్థాలు అందలేదు. హిమాచల్ లో 51 శాతం మందికి, మధ్య ప్రదేశ్ లో 47 శాతం మందికి, హర్యానాలో 46 శాతం, ఒరిస్సాలో 41 శాతం మందికి, బిహార్ లో 25 నుంచి 27 శాతం మందికి, బెంగాల్ లో 35 శాతం మందికి, రాజస్థాన్ లో 23 శాతం మందికి, జార్ఖండ్ లో 24 శాతం మందికి ఆహార ధాన్యాలు అందలేదు. రేషన్ కార్డులు లేని వారి పరిస్థితి ఘోరంగా తయారైంది. వీరికి రేషన్ కార్డులు లేకపోయినా ఆహార ధాన్యాలు అందవలసి ఉన్నా అవీ అందలేదు.
ఉపాధి కల్పన పరిస్థితీ అలాగే ఉంది. 50,000 కోట్ల రూపాయలతో 116 జిల్లాల్లో ఉపాధి కల్పనకు పథకం రూపొందించామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ వీరిలోనూ బిహార్ లో 32 శాతానికి, ఉత్తర ప్రదేశ్ లో 31 శాతానికి, రాజస్థాన్ లో 22 శాతానికి, మధ్య ప్రదేశ్ లో 24 శాతానికి, ఒరిస్సాలో నాలుగు శాతానికి, జార్ఖండ్ లో 2 శాతానికి ఉపాధి అందనే లేదు. 36 శాతం మందికి బ్యాంకు ఖాతాలున్నా నగదు బదిలీ కాలేదు. 64 శాతం మంది తమకు అందాల్సిన మొత్తం నగదు బదిలీ కాలేదని, కొంతే అయిందని చెప్పారు. 18 శాతం మంది ఒక్క పైసా అందలేదన్నారు. డబ్బు అందలేదన్న 65 శాతం మందిలో ఒరిస్సా, కేరళ, హిమాచల్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలవారు ఉన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి 51 శాతం మందికే అందుబాటులోకి వచ్చింది. 49 శాతం మందికి ఎలాంటి సహాయమూ అందలేదు. 14 శాతం మందికి ఇప్పటికీ జనధన్ అకౌంట్లే లేవు.
గ్రామాల్లో కూడా కూరగాయల ధరలు మండి పోతున్నాయి. కూరగాయల ఉత్పత్తి గత ఐదారేళ్లకన్నా ఎక్కువే ఉన్నా గ్రామాల్లో కూరగాయల ధరలు మాత్రం అధికంగానే ఉన్నాయి. భారీ ఎత్తున చిల్లర వ్యాపారం చేసే బడా కంపెనీలు గ్రామీణుల దగ్గర ధాన్యం, కూరగాయాలు కొని భవిష్యత్తులో ధర పెంచి అమ్ముకోవడం కోసం నిలవ చేసి ఉంచుకుంటున్నాయి. అందువల్ల ధరలు తగ్గడం లేదు. తాజాగా పార్లమెంటు ఆమోదించన రైతు బిల్లుల్లో ఒకటి సరకు నిలవ చేయడానికి బాహాటంగానే అనుమతిస్తోంది. అంటే యదేచ్ఛగా చీకటి వ్యాపారం కొనసాగించవచ్చు. అందువల్ల ఇక ముందూ ధరలు తగ్గే అవకాశం లేదు. మొత్తం మీద ఎనిమిది కోట్ల మంది వలస కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉంది. జి.ఎస్.టి. కింద వసూలమైన మొత్తం కేంద్రం ఖాతాలో చేరుతుంది. కేంద్రం రాష్ట్రాలకు అందులోంచి వాటా ఇవ్వాలి. కాని కాళ్లీడుస్తోంది. అందువల్ల ప్రజలను ఆదుకోవాలన్న సంకల్పం ఉన్న రాష్ట్రాలు సైతం నిస్సహాయంగా ఉండిపోవలసి వస్తోంది. అనేక రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్నవే కనక ఆ రాష్ట్రాలు జి.ఎస్.టి.లో తమకు రావలసిన వాటా కోసం ఒత్తిడి చేయడం లేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల వాదనను కేంద్రం వినిపించుకోవడం లేదు. వలస కార్మికులు నిరుపేదలు. ఇంతకు ముందు రైతులు అప్పుల బాధకు ఆత్మ హత్య చేసుకునే వారు. ఇప్పుడు జరుగుతున్న వలస కార్మికుల ఆత్మ హత్యలు అప్పుల బాధతో కాదు. అసలు ఉపాధే లేకపోవడంవల్లే. ఇది రాజ్య వ్యవస్థ వైఫల్యానికి కారణం.
-ఆర్వీ రామారావ్
సీనియర్ జర్నలిస్ట్