మోడీ నాయకత్వ లక్షణాలకు కాంగ్రెస్ సలాం
posted on Nov 15, 2014 @ 11:04AM
ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న కొన్ని కార్యక్రమాలు ప్రతిపక్షాలకి, ముఖ్యంగా ఆయనను తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీకి పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటంలా మారుతున్నాయి. ఇటీవల ఆయన ప్రవేశ పెట్టిన ‘స్వచ్చ భారత్’ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ఆయన పిలుపు మేరకు అంభానీ, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, సానియా మిర్జా వంటి పలువురు ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొంటూ వారు మరో తొమ్మిది మందికి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా పిలుపునిస్తుండటంతో, దేశవ్యాప్తంగా అదొక మహాయజ్ఞంలా సాగిపోతోందిపుడు. దేశంలో అనేక రాజకీయపార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ కార్యక్రమంలో పాల్గొంటే, మోడీని సమర్ధించినట్లవుతుందని దూరంగా ఉంటోంది. కానీ అదొక మంచి కార్యక్రమమని దేశ ప్రజలందరూ భావిస్తూ ఉత్సాహంగా పాల్గొంటున్నపుడు కాంగ్రెస్ మాత్రమే ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటమ వలన ప్రజల దృష్టిలో మరింత చులకన అవుతాననే బెంగ భయం కూడా ఉంది. కానీ ఆ సంగతి పైకి చెప్పుకోలేదు గాబట్టి, మోడీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం గాంధీ నెహ్రుల కాలం నుండే తమ పార్టీ అమలు చేస్తూ వచ్చిందని, దానినే పేరు మార్చి మోడీ తన పధకంగా గొప్పలు చెప్పుకొంటున్నారని, మోడీకి కేవలం ప్రచారార్భాటమే తప్ప చిత్తశుద్ధితో దానిని అమలు చేయాలనే తపన ఏ కోశాన్న లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తూ ప్రజలు తమను తప్పుపట్టకుండా జాగ్రత్తపడుతున్నారు.
ఆ స్వచ్చమయిన గండం ఎలాగో గట్టెక్కామని సంతోషిస్తున్న కాంగ్రెస్ నేతల నెత్తిన మోడీ బండరాయి పెట్టారు. ఆయన కొత్తగా ప్రవేశపెట్టిన ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షగా మారింది.
ఆ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు అందరూ తమకు నచ్చిన ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని, కేంద్రప్రభుత్వం వారికి కేటాయించిన యంపీ లాడ్స్ (లోకల్ డెవలప్మెంట్ ఫండ్స్) నిధి నుండి, వాటిని అభివృద్ధి చేయవలసి ఉంటుంది. మోడీ స్వయంగా వారణాసి వద్దగల జయ పూర్ అనే గ్రామాన్ని దత్తత తీసుకొని మిగిలిన వారికి ఆదర్శంగా నిలిచారు. ఆయన స్పూర్తితో అనేకమంది యంపీలు కేంద్రమంత్రులు కూడా అనేక గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు.
కేంద్రప్రభుత్వం యంపీలకు అందించిన నిధులతోనే గ్రామాలను అభివృద్ధి చేయవచ్చును కనుక పార్టీలకు అతీతంగా చాలా మంది యంపీలు తమకు నచ్చిన గ్రామాలను దత్తత తీసుకొని అబివృద్ధి చేస్తున్నారు. స్వచ్చ భారత్ కార్యక్రమంలో చీపురు పట్టి రోడ్లు ఊడవకపోయినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ కేంద్రప్రభుత్వం నిధులు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేయమని అడుగుతున్నప్పుడు కూడా చొరవ చూపకపోతే తప్పకుండా ప్రజలు నిలదీసే అవకాశం ఉంది. కనుక తప్పనిసరిగా ఈ సారి కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనవలసివస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీని, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన బీజేపీ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు కూడా ఈసారి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోక తప్పనిసరి పరిస్థితి కలగడం విశేషం. సోనియా గాంధీ తన రాయ్ బరేలీ నియోజకవర్గంలో గల ఉద్వా అనే గ్రామాన్ని దత్తత తీసుకొంటే, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ తన అమేధీ నియోజకవర్గంలో గల డేహ్ అనే గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. అయితే అంత మాత్రాన్న తామేమీ మోడీ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నట్లు కాదని చెప్పడం కొసమెరుపు. మోడీ ఈవిధంగా తన రాజకీయ ప్రత్యర్ధులను కూడా తన మార్గంలో నడిచేలా చేయడం ఆయనలో ణాయకత్వ లక్షణాలకు ఒక చక్కటి నిదర్శనంగా చెప్పవచ్చును.