ప్రభుత్వం విజయవాడకు వస్తేనే సమస్యల పరిష్కారం సాధ్యం
posted on Nov 17, 2014 8:22AM
ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు వద్దగల ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయంలో నిర్వహించబోవడం చాలా తెలివయిన నిర్ణయమేనని చెప్పవచ్చును. దానిని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఇదివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తొలి మంత్రి వర్గ సమావేశాన్ని విశాఖలోని ఆంద్రవిశ్వవిద్యాలయంలో నిర్వహించినప్పుడు ప్రజల నుండి ఇదే రకమయిన సానుకూల స్పందన వచ్చింది. ఆ తరువాత ఆయన విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించి, త్వరలోనే ప్రభుత్వం అక్కడికి తరలివచ్చి పనిచేయడం మొదలుపెడుతుందని చెప్పినపుడు కూడా యావత్ రాష్ట్ర ప్రజలు చాలా సంతోషించారు. కానీ అందరికీ తెలిసిన అనేక కారణాల వలన ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలవకపోవడంతో నేటికీ హైదరాబాద్ నుండే పరిపాలన సాగించవలసి వస్తోంది.
కానీ ముఖ్యమంత్రితో సహా మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందరూ హైదరాబాద్ లో కూర్చొని తూళ్ళూరులో రాజధాని నిర్మిస్తామని చెపుతూ రైతుల నుండి భూసేకరణకు పూనుకొంటున్నందున రైతులలో అనేక అనుమానాలు, ప్రభుత్వం ఇస్తున్న హామీలపట్ల ఒక అపనమ్మకం ఏర్పడటం సహజం. వారి అనుమానాలకు చాలా బలమయిన కారణాలే ఉన్నాయి. తీవ్ర ఆర్దికలోటు, నిధుల కొరతతో సతమతమవుతున్న ప్రభుత్వం విజయవాడకు తరలిరాకుండా హైదరాబాద్ నుండే పాలన సాగిస్తుండటం వలన వారు చెపుతున్నట్లుగా ఐదేళ్ళలో రాజధాని నిర్మించగలరా లేదా? ఉన్న కొద్దిపాటి భూములు ప్రభుత్వానికి అప్పగించేసాక, ఇప్పుడు విజయవాడకు తరలివచ్చేందుకే జంకుతున్న ప్రభుత్వం ఏ కారణాల చేతయినా రాజధాని నిర్మించలేకపోతే అప్పుడు తమ పరిస్థితి ఏమిటి? వంటి అనేక సందేహాలు రైతులలో కలగడం సహజం.
ప్రభుత్వం విజయవాడకు తరలిరాకుండా హైదరాబాద్ లో ఉండటం ప్రతిపక్షాలకు కూడా బాగా కలిసిరావడంతో అవి రైతులలో నెలకొన్న ఈ అనుమానాలను, భయాందోళనలను మరింత పెంచిపోషించే అవకాశం చేజిక్కించుకోగలుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయంలో నిర్వహించబోవడం తెలివయిన నిర్ణయమేనని చెప్పవచ్చును. తద్వారా ప్రభుత్వంపై రైతులకు కూడా నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది.
అందువలన ప్రభుత్వం తక్షణమే విజయవాడకు తరలిరాలేకపోయినా, సమావేశాలు ముగిసిన తరువాత అంచెలంచెలుగా ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడకు తరలించడం మంచిది. రైతులకు జీవనోపాధి కల్పిస్తున్న పంట భూములను త్యాగం చేయమని ప్రభుత్వం కోరుతోంది. అటువంటప్పుడు వివిధ కారణాలతో హైదరాబాద్ విడిచిపెట్టేందుకు ససేమిరా అంటున్న ప్రభుత్వోద్యోగులను, ఉన్నతాధికారులను కూడా చిన్నచిన్న త్యాగాలు చేయమని గట్టిగా చెప్పవచ్చును.
విజయవాడకు తరలిరావడం కష్టమని ఉద్యోగులు, వారు లేకుండా విజయవాడకు తరలివచ్చి తానొక్కడు ఏమిచేయగలనని ముఖ్యమంత్రి, ఆయన రాకుండా మేము మాత్రం ఏమి చేయగలమని ఇతర మంత్రులు అందరూ హైదరాబాద్ లోనే కొనసాగుతున్నారు. అటువంటప్పుడు వారు రాజధాని గురించి చెపుతున్న మాటలను భూములిస్తున్న రైతులు విశ్వసించడం కష్టం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఆరు నెలల పుణ్యకాలం పూర్తవబోతోంది. ప్రభుత్వం ఇంకా హైదరాబాద్ నే అంటిపెట్టుకొని అక్కడి నుండే రాజధానికి సంబందించిన నిర్ణయాలు తీసుకొంటూ, అక్కడి నుండే విధివిధానాల గురించి మాట్లాడుతున్నంత కాలం ఈ సమస్యలను పరిష్కరించడం అసాధ్యమేనని చెప్పవచ్చును. తద్వారా రాజధాని నిర్మాణం మరింత ఆలశ్యం జరగవచ్చును. ఆలశ్యం జరుగుతున్న కొద్దీ ప్రజలలో, రైతులలో అనుమానాలు పెరుగడం సహజం. అప్పుడు ఎవరూ ఊహించలేని కొత్త సమస్యలు పుట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదు.
అందువలన రాజధాని నిర్మాణాన్ని సవాలుగా స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దానిని నెరవేర్చుకోవాలంటే అంతకంటే ముందుగా తన ప్రభుత్వాన్ని విజయవాడకు తరలించి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా భూములు ఇస్తున్న రైతులకు అందుబాటులో ఉంటే, చాలా సమస్యలు పరిష్కరింపబడవచ్చును. ఇటీవల హూద్ హూద్ తుఫాను సమయంలో ఆయన స్వయంగా విశాఖలో వారం రోజులు మకాం పెట్టి సహాయ, పునరావాస చర్యలు స్వయంగా పర్యవేక్షించడం ద్వారా తుఫాను దెబ్బ తిన్న ప్రజలలో ఒక గొప్ప ఆత్మస్థయిర్యం, ప్రభుత్వం తమకు అండగా ఉండనే భరోసా, భావన కలిగించగలిగారు. ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వాన్ని విజయవాడకు తరలించి తూళ్ళూరు, గన్నవరం మండలాలలో రైతులకు అటువంటి ఆత్మస్థయిర్యం, భరోసానే కల్పించవలసిన అవసరం ఉంది. అప్పుడే ఆయన అనుకొన్న పని నిర్విఘ్నంగా సాధించగలుగుతారు.