మూడేళ్ల మోదీ : భారతీయ రాజకీయ బాహుబలేనా?

  నెహ్రు, ఇందిరా, రాజీవ్… వీళ్లకు భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రత్యేక స్థానం వుంది. తొలి ప్రధాని కావటంతో నెహ్రుకి, బలమైన ప్రజాకర్షణ వుండటంతో ఇందిరకి, ఆమె కొడుకుగా జనంలో వున్న ఇమేజ్ తో రాజీవ్ కి బోలెడు ఓట్లు పోలయ్యేవి. అందుకే, నెహ్రు, ఇందిరా, రాజీవ్ లకు వచ్చినంత మెజార్టీ మరెవ్వరికీ రాలేదు పార్లమెంట్ చరిత్రలో. కాని, సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజున మోదీ కూడా ఆ లిస్ట్ లో చేరారు! స్వంత మెజార్టీతో దిల్లీ పీఠం కైవసం చేసుకున్నారు. అంతకంటే ముఖ్యంగా సంపూర్ణ మెజార్టీతో ప్రధాని పదవి సంపాదించిన తొలి కాంగ్రేసతర పీఎంగా చరిత్ర సృష్టించారు! మరి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పుట్టిన ఈ అసలు సిసలు భారతీయ ఆత్మవిశ్వాసపు సంకేతం మూడేళ్లలో ఏం చేశారు? నమోపైన దేశంపైన మూడ్ ఎలా వుంది?   అయిదేళ్ల పదవి కాలంలో మూడేళ్లు పూర్తయ్యాయంటే… కౌంట్ డౌన్ మొదలైపోయినట్టే. జనం వేచి చూసే ధోరణి నుంచి ఆశించే స్థితికి వస్తారు. ఫలితాలు అనుభవంలోకి రావాలనుకుంటారు. హామీలు అమలు కావాలని కోరుకుంటారు. రాబోయే ఎన్నికల్లో తమ ఓటు ఎవరికో ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ వుంటారు! అయితే, అనేక సర్వేలు చెబుతోన్న సారం … మోదీపై ప్రయోగించేందుకు జనం తమ ఓట్లనేం సానబెట్టటం లేదట! ఆయనకు అనుకూలంగానే ఇంకా 60శాతానికి పైగా జనం వున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ సర్వేల్నే కాదు… అతి పెద్ద యూపీ సహా అతి చిన్న గోవా వరకూ దేశం నలుమూలల్లో బీజేపి బలపడుతుండటం… మోదీ మ్యానియాని నమ్మేలాగే చేస్తోంది! డెమోక్రసీలో ఈవీఎంల వద్ద సత్తా చాటడమే అంతిమ విజయం కదా…   మోదీ వచ్చాక అరవై ఏళ్ల కాంగ్రెస్ మార్కు పాలనకి భిన్నమైన వాతావరణం వస్తుందని అంతా ఆశించారు. అయితే, కొందరు నమో వ్యతిరేకులు ఇప్పటికీ అసంతృప్తులుగానే వున్నా మొత్తం మీద మాత్రం కాంగ్రెస్ తరహా పాలన ఇప్పుడు లేదని భావిస్తున్నారు. అందుకే, అవినీతి, కుంభకోణాల మాట లేని మోదీ సర్కార్ జనంలో క్రేజ్ తగ్గకుండా సాగుతోంది. డీమానిటైజేషన్ లాంటి ఇబ్బందిని కూడా మోదీ మీద నమ్మకంతో, ఆయన నిజాయితీ పట్ల విశ్వాసంతో జనం భరించారు. నోట్ల రద్దు కష్టాల సమయంలో ప్రజల వైపు వున్నామని భ్రమించిన ప్రతిపక్షాలకే వరుస ఎన్నికల్లో బుద్ది చెబుతున్నారు. ఇదే తంతు విదేశాంగ విధానంలో కూడా మోదీ విషయంలో జరుగుతోంది. ఆయన భారత్ లో కంటే ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా వుంటున్నాడని గోల చేసిన పార్టీలు, నేతలు, మీడియాలు… అన్నిట్ని, అందర్నీ లైట్ తీసుకున్నారు ఇండియన్స్! సరదాగా ఎంజాయ్ చేసి రావటానికి మోదీ విదేశాలకు వెళ్లడని నమ్మారు. పాక్ విషయంలో ఇప్పుడు అది నిజమైంది కూడా. పదే పదే మనల్ని కవ్వించి జవాన్లను బలి తీసుకుంటున్నా పాక్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకి అయింది. మోదీ చాణక్యంతో ఇరాన్ మొదలు అమెరికా వరకూ చాలా దేశాలు పాకిస్తాన్ కు వ్యతిరేకమైపోయాయి!   ప్రపంచం అంతా ఆర్దిక మందగమనంతో బాధపడుతోంటే కూడా ఇండియాలో పెట్టుబడల ప్రవాహం ఆగలేదు. భారీగా ఉద్యోగాలు ఊడి ఇండియన్స్ రోడ్డున పడలేదు. ఇది సాధారణ విషయం కాదు. అయితే, మోదీ వస్తే భారత్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది అని, గుజరాత్ మోడల్ అమలు అవుతుందని ఆశించిన వారు డిజపాయింట్ అవ్వొచ్చు. కాని, సాధారణ జనం ఇంకా ముందు ముందు మంచి జరుగుతుందని నమ్ముతున్నారు. మూడేళ్లలోనే అద్భుతాలు జరుగుతాయని వారు కూడా ఆశించలేదు. డెబ్బై ఏళ్లుగా పేరుకుపోయిన మురికి అంతా ఈజీగా పోయేది కాదని కామన్ పీపుల్ ఫీలింగ్! మోదీకి ఇది కూడా బాగా కలిసొస్తోంది.   మోదీ మూడేళ్ల పాలనలో జనం నుంచి ఇంచూమించూ పాజిటివ్ రెస్పాన్స్ రావటానికి మరో ప్రధానమైన కారణం ప్రతిపక్షాల డ్రామా రాజకీయాలు. పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో విద్యార్థులు మొదలు దిల్లీ జేఎన్ యూలో కన్నయ్యా కుమార్ బ్యాచ్ వరకూ అందరికీ జైకొట్టారు పెద్ద పెద్ద నేతలు. మోదీని ఒక హిందూత్వ ఉన్మాదిగా చూపించే ప్రయత్నమే తప్ప ఆయన ప్రధానిగా ప్రదర్శిస్తోన్న పర్ఫామెన్స్ పై గంభీరంగా ఆరోపణలు చేసిన వారు ఎవ్వరూ లేరు. బీఫ్ రాజకీయాలే నమో పట్ల జనంలో వ్యతిరేకత తెచ్చిపెడతాయని బలంగా నమ్మారు సెక్యులర్ నేతలు. అది పూర్తిగా తప్పని తేలిపోయింది. మతోన్మాదం ఎంత దారుణమో అంతే దారుణం అవినీతి, బంధుప్రీతి, పారదర్శకత లేని పాలన అని నిరూపించారు ఓటర్లు.   మూడేళ్లలో మోదీ ఏం చేసినా జనం ఆమోదించారు కాబట్టి ఇక ముందు కూడా పూలబాటే అనుకోవటానికి వీలులేదు. అప్పుడే కొన్ని సర్వేలు 2019లో కూడా మోదీనే పీఎం అనేస్తున్నాయి. అవి నిజమో కాదో తెలియదుగాని… జనం ఎప్పటికప్పుడు తమ ఓటుకు పదునుబెట్టి ప్రయోగిస్తుంటారు. అందుకే, నరేంద్ర మోదీ కూడా రానున్న రెండు సంవత్సరాలు మరింత జాగ్రత్తగా వ్యవహరించి పేదల కళ్లలో ఆనందం తీసుకురావాలి. అదొక్కటే పోలింగ్ బూత్ కి వెళ్లేప్పుడు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. మిగతాదంతా అప్రస్తుతమే!

నక్సలైట్ల తొలి రక్తపు చుక్కకి… 50ఏళ్లు!

  ఈ తరం స్మార్ట్ ఫోన్లు, ఫేస్బుక్ లు, ట్విట్టర్ ఖతాల యువతకి నక్సలైట్లు అంటే అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగే అన్నలని తెలుసు. వాళ్లకీ, పోలీసులకి, ప్రత్యేక భద్రతా దళాలకి మధ్య ఎన్ కౌంటర్లు నడుస్తుంటాయని కూడా తెలుసు. కాని, చాలా మంది భారతీయ యువతకి నిజంగా తెలియంది ఏంటంటే… ఈ నక్సలైట్లు ఎందుకోసం, ఎవరి కోసం, ఎవరిపైన పోరాటం చేస్తున్నారని! మావోయిస్టు సాయుధ పోరాటం మంచిదనే వారు, నిరుపయోగం అనేవారు, అనర్థం అనే వారు… ఇలా చాలా మంది వుంటారు. కాని, 50ఏళ్లు నిండిన నక్సల్ బరి హింసాత్మక పోరు… ఎందుకు మొదలైంది? ఎక్కడి దాకా వచ్చింది? ఎటు వెళ్లబోతోంది?   రెడ్ టెర్రర్… అంటే వామపక్ష ఉగ్రవాదం… ఇప్పుడు కేంద్రం ముందు వున్న అతి పెద్ద సవాళ్లలో ఒకటి. పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టుల మాదిరిగానే వీరిని కూడా ఆయుధాలతో అణిచేయాలని చూస్తోంది ఇండియన్ గవర్నమెంట్. కాని, జిహాద్ పేరుతో మతోన్మాదం నిండిన ఉగ్రవాదులు వేరు, పేదల కోసం, గిరిజన , ఆదివాసీల కోసం ప్రాణాలు అర్పించే నక్సలైట్లు వేరు. అందర్నీ ఒకే గాటన కట్టేయటం పొరపాటే అవుతుంది. అయితే, అమాయక జనం ప్రాణాలు తీసే ఉగ్రవాదుల్లాగే నక్సల్స్ కూడా హింసకు పాల్పడుతుండటం సామాన్య ప్రజల్లో వారిపట్ల సరైన అవగాహన, సానుభూతి లేకుండా చేస్తోంది! సరిగ్గా అర్థ శతాబ్దం కింద బెంగాల్ లోని నక్సల్ బరి అనే ఊళ్లో మొదలైంది ఈ సాయుధ పోరాటం. ఏదో స్వార్థం కోసం కాదు. పేద రైతుల భూమి హక్కు కోసం…   బెంగాల్ లోని డార్జిలింగ్ దగ్గరలో వున్న నక్సల్ బరి గ్రామంలో ఇవాళ్టి రోజునే రైతులు జమీన్ దార్ల ఆగడాలపై కదం తొక్కారు. ఆ క్రమంలో ఒక పోలీస్ వారి చేతిలో చనిపోయాడు. ఫలితంగా పోలీసుల చేతిలో పదకొండు మంది మృత్యు వాత పడ్డారు. 1967, మే 25న మొదలైన ఆ రక్తస్రావం ఇంకా ఆగటం లేదు. పదే పదే మావోలు భద్రతా దళాలపై పై చేయి సాధిస్తుంటే అంతే కర్కశంగా పోలీసులు, జవాన్లు అడవిలో అన్నల్ని అణిచేసే ప్రయత్నం చేస్తున్నారు. 50ఏళ్ల నక్సల్ హింసాత్మక ప్రస్థానంలో గత 20ఏళ్లలోనే 20వేల మంది ప్రాణాలు కోల్పోయారంటే… దారుణం ఎంతగా జరిగిందో గ్రహించవచ్చు.   ఒకప్పుడు బెంగాల్ లోని నక్సల్ బరిలో మొదలైన సాయుధ విప్లవం దేశమంతా వ్యాపించింది. పంజాబ్ నుంచీ ఆంధ్ర ప్రదేశ్ దాకా అనేక రాష్ట్రాలు అన్నల చేతుల్లోని తుపాకులకి గడగడలాడాయి. కాని, అంతే వేగంగా నక్సల్ బరి ఉద్యమం చావు దెబ్బతిన్నది కూడా. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు కర్కశంగా, కఠినంగా ఎర్ర దండుని అణిచేశాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపి, చివరకు సీపీఎం … అందరిదీ ఒకే దారి! ఆయుధానికి ఆయుధంతోనే సమాధానం…   50ఏళ్లుగా జనం కోసం పోరాడుతోన్న నక్సలైట్లు అదే జనంలోని కొందర్ని ఇన్ ఫార్మర్లు అంటూ కాల్చి చంపటం, పోలీసుల్ని గెరిల్లా పద్ధతుల్లో బలి తీసుకోవటం, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ, అభివృద్ధిని నిరోధిస్తూ… తద్వారా ఏ జనానికి మేలు జరగాలో వారికే అడ్డుగా మారటం… ఇవన్నీ చేశారు! కాని, అయిదు దశాబ్దాల తరువాత వారి పంథా ఎక్కడో పక్కదోవ పట్టిందని ఇవాళ్ల చాలా మంది భావిస్తుంటారు. మావోయిస్టు పార్టీగా వున్న ప్రస్తుత నక్సలైట్లు దళం ఇంకా చాలా మంది లెఫ్టు మేదావులకి, ఉద్యమకారులకి అమోదయోగ్యమే. వారి వల్ల మాత్రమే భారతదేశం నిజంగా బాగుపడుతుందని వీరు భావిస్తుంటారు. కాని, ప్రపంచీకరణ నేపథ్యంలో ఐటీ ఉద్యోగాల రేసులో క్షణం తీరికలేని యువత సాయుధ పంథాని ఏమంత పెద్దగా సమర్థించినట్టు కనిపించటం లేదు. అందుకే, మావోయిస్టు పార్టీలో చేరికలు క్రమంగా తగ్గుతున్నాయి. రోజు రోజుకు అడవిలోని అన్నల అస్థిత్వం కష్టతరం అవుతోంది.   మార్క్స్ చెప్పాడు. మావో ఆచరించాడు. అక్కడక్కడా చేగు వేరా, ఫిడెల్ క్యాస్ట్రో లాంటి వారు కూడా సాయుధ పోరాటంతో విజయం సాధించారు. సోవియట్ ఒకప్పుడు కమ్యూనిస్టు వెలుగులతో మెరిసిపోయింది. కాని, మిగతా ప్రపంచం అంతా మన నక్సలైట్లు చెబుతోన్న సిద్ధాంతాన్ని సీరియస్ గా తీసుకోలేదు. మన దేశంలోనూ అదే జరుగుతూ వస్తోంది. మావోయిస్టుల ఆశయాలు సమర్థించే వారు కూడా హింసని ఒప్పుకోలేకపోతున్నారు. అంతకన్నా ఓట్ల యుద్ధంలో గెలిచిన వారి నుంచే ఎంతో కొంత మార్పు ఆశిస్తున్నారు. అదీ కాక కులం, మతం, ప్రాంతం, భాషా లాంటి అనేక భిన్నత్వాలు, భిన్నాభిప్రాయాలు వున్న మన దేశంలో కోట్లాది మంది మూకుమ్ముడిగా సాయుధ పోరాటం చేస్తారని ఆశించటం అత్యాశే అవుతుంది. బ్రిటీష్ వారికి కూడా మనం ఏనాడూ ఐకమత్యంగా సాయుధ సమాధానం ఇవ్వలేకపోయామన్నది నిజం. అహింసాయుత మార్గాలే ఎక్కువ ఫలితాన్నిచ్చాయి. ఈ సత్యాన్ని , మన దేశ ప్రత్యేక సామాజిక, రాజకీయ పరిస్థితుల్ని మావోయిస్టులు గుర్తించాలి. 50ఏళ్లైనా తాము తమ అంతిమ లక్ష్యానికి ఏ మాత్రం దగ్గరగా వెళ్లలేకపోవటానికి బోలెడు కారణాలు దొరుకుతాయి.   రాజ్యాంగ వ్యతిరేకమైన హింసాత్మక మార్గం వదలాలా వద్దా అనేది నక్సల్స్ ఇష్టం. కాని, ఎన్నో ప్రాణాలు పణంగా పెట్టి అత్యంత తక్కువ స్థాయిలో విజయాలు సాధించుకోవటం ఖచ్చితంగా తెలివైన యుద్ధనీతి కాదు. దీనిపై మాత్రం 50ఏళ్లు నిండిన సాయుధ ఉద్యమం తప్పకుండా మనసు పెట్టి విశ్లేషించుకోవాలి!

బాబు వచ్చారు… జాబులొచ్చే టైం కూడా వచ్చేసింది!

  జగన్ చంద్రబాబుని టార్గెట్ చేయటం… టీడీపీ నేతలు జగన్ని కడిగిపారేయటం… మధ్యలో టీడీపీ, బీజేపీ నేతలు కూడా మాటల తూటాలు పేల్చుకోవటం… ఇదంతా రోజూ వుండే రాజకీయమే! కాని, నిజంగా ఆంధ్రా జనానికి ఏం కావాలి? ఉద్యోగాలు! అవును… హైద్రాబాద్ లేని నవ్యాంధ్ర ఉద్యోగాల లోటుతో సతమతం అవుతోంది. పెట్టుబడుల కోసం ఎదురుచూస్తోంది. అందుకే, స్వయంగా సీఎం చంద్రబాబే ఈ మధ్య అమెరికాలో పర్యటించి పెట్టుబడులు రాబట్టే ప్రయత్నం చేశారు. కాని, ఇంతకీ గ్రౌండ్ లెవల్లో… బాబు వస్తే జాబు వస్తుందన్న నినాదం ఎంత వరకూ వర్కవుట్ అవుతోంది?   ప్రతీ నేతా ఎన్నికలప్పుడు జాబులు గ్యారెంటీ అంటూ మాటిస్తారు. కాని, ఇప్పుడు ప్రపంచం వున్న పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాల కల్పన అత్యంత కష్టంగా మారిపోయింది. అదే చంద్రబాబుకు కూడా సవాల్ గా మారింది. కాని, జరుగుతోన్న అభివృద్ధి చూస్తోంటే వచ్చే ఎన్నికల నాటికి చాలా మంది ఆంధ్రా నిరుద్యోగుల ముఖం మీద నవ్వు తాండవించే అవకాశం వుందనిపిస్తోంది. అందుక్కారణం… రాబోయే కొన్ని నెలల్లో జరగను్న పరిణామాలే!   ఆగస్ట్ నెలలో కర్నూల్ లో మెగా ఫుడ్ పార్క్ కు శంఖుస్థాపన చేస్తారని తెలుస్తోంది. అమెరికాలోని అయోవా యూనివర్సిటీ సాంకేతిక సాయంతో ఈ ఫుడ్ పార్క్ నెలకొల్పబోతున్నారు. ఇది ఖచ్చితంగా కొత్త ఉద్యోగాలు కల్పించే భారీ ప్రాజెక్ట్. వెనుకబడ్డ రాయలసీమకే చెందిన మరో జిల్లా అనంతపురం. ఇక్కడ జూలైలో కియ మోటర్స్ యూనిట్ కు శంఖుస్థాపన జరగనున్నట్టు సమాచారం. ఇది కూడా నిరుద్యోగులకు మంచి చేసే ప్రాజెక్టే! ఇక హైద్రాబాద్ లో ఐటీ వృక్షానికి నారు,నీరు పోసి మహావృక్షంగా మార్చిన చంద్రబాబు నవ్యాంధ్రలో కూడా ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఆయన కృషి ఫలితంగా త్వరలోనే ఎనిమిది ఐటీ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. అలాగే, మరో 25 ఐటీ కంపెనీలు కూడా తిరుపతి, విశాఖా నగరాలకి త్వరలోనే రానున్నాయట!   లోకేష్ మంత్రిగా వున్న ఐటీ శాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది. గత అయిదు నెలల్లోనే 90వరకూ ఐటీ కంపెనీలు ఏపీలో తమ పని ప్రారంభించాయి. 550కోట్లకు పైగా పెట్టుబడులు వీటి ద్వారా రాష్ట్రానికి వచ్చాయి. అయితే, ఇలాంటి లెక్కలు పేపర్లపైన అద్బుతంగా వుంటాయి. చంద్రబాబు సర్కార్ వాటి ఫలితాల్ని సామాన్య జనం దాకా జాగ్రత్తగా చేరిస్తే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ టెన్షన్ ఫ్రీగా వుండవచ్చు. ఎందుకంటే, గతంలో కులం, మతం పోషించిన పాత్ర కంటే ఎక్కువ ప్రభావం ఇప్పుడు అభివృద్ధి, ఉద్యోగాల కల్పన చూపిస్తున్నాయి ఓటింగ్ టైంలో. ఆ విషయం సీఎం చంద్రబాబుకి తెలియంది కాదు…

ఇతర పార్టీల్ని డ్యామేజ్ చేసేందుకొచ్చిన షా… స్వంత పార్టీ రిపెయిర్ ని గుర్తించారా?

  బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టూర్ తెలంగాణలో టైం టేబుల్ ప్రకారం జరిగిపోతోంది. కాని, అందరూ ఊహించినట్టు ఏ పార్టీ నుంచీ కాషాయదళంలోకి వలసలు మాత్రం కనిపించ లేదు. మరీ ముఖ్యంగా, షా నల్గొండలో పర్యటిస్తోంటే కోమటిరెట్టి బ్రదర్స్ కదలికలే కనిపించలేదు. వారిద్దరూ కాంగ్రెస్ గూటి నుంచి బీజేపి కొమ్మలపై వాలతారని తీవ్రంగా ప్రచారం జరిగింది. అంతే కాదు, టీ టీడీపీలోని ఆర్ . కృష్ణయ్య లాంటి నేతలు కూడా పురంధేశ్వరి లాంటి నాయకులతో భేటీ అయ్యి కలకలం రేపారు. కాని, తీరా కమల రథసారథి వచ్చాక మాత్రం బ్రేకింగ్ న్యూస్ లు ఏం లేకుండా పోయాయి? ఇలా ఎందుకు జరిగింది?   అమిత్ షా ప్రస్తుత పర్యటనలో టీ టీడీపీ, టీ కాంగ్రెస్ , వీలైతే టీఆర్ఎస్ లకు షాక్ ఇవ్వాలిన కాషాయ దళం భావించింది. అందుకు తగ్గట్టే మీడియాకి లీకులిస్తూ హడావిడి జరిగింది. కాని, చివరి నిమిషంలో స్వయంగా అమిత్ షానే ఇప్పుడప్పుడే చేరికల కోలాహలం వద్దన్నారని టాక్! ఇందులో నిజం ఎంతో మనకు తెలియదుగాని అమిత్ షా దృష్టి మాత్రం టీ బీజేపీ నేతల అంతర్గత కుమ్ములాటలపై పడిందన్నది క్లియర్.   వాజ్ పేయ్ ప్రధానిగా వున్నప్పుడు ఒక వెలుగు వెలిగిన తెలుగు బీజేపి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ అంతంత మాత్రంగానే వుంది. అయితే, ఉత్తరాదిని ఎలాగో పిడికిట పట్టిన కమల దళం ఎలాగైనా దక్షిణాదిలో ఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది. కర్ణాటక తరువాత ఆ పార్టీ సీరియస్ గా టార్గెట్ చేస్తోంది తెలంగాణనే. ఎందుకంటే, ఏపీలో మిత్ర ధర్మం కొద్దీ టీడీపీపై ఇప్పుడప్పుడే బహిరంగా పోరాటం చేయలేని స్థితి. అలాగే, తమిళనాడులో పూర్తిగా రజినీకాంత్, పన్నీర్ సెల్వం లాంటి వారి మద్దతు కావాలి. కేరళలో అయితే విజయం చాలా చాలా దూరంలో వుంది. అందుకే, ఎంఐఎం లాంటి ప్రత్యర్థి వున్న తెలంగాణలో తమకు బలపడే అవకాశాలు పుష్కలంగా వున్నాయని భావిస్తోంది దిల్లీ బీజేపి. కాని, తీరా తెలంగాణకు వచ్చిన అమిత్ షాకి ఇక్కడి లోకల్ సీన్ అర్థమయ్యి బాగా డిజపాయింట్ అయ్యారట!   జాతీయ అధ్యక్షుడి మనస్తాపానికి కారణం… తెలంగాణ బీజేపీలో గ్రూపులు గ్రూపులుగా విడిపోయిన లీడర్లే! కిషన్ రెడ్డి, దత్తాత్రేయ ఒక వర్గం అని కొందరంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కి వారితో పడటం లేదని టాక్. ఇక తెలుగు దేశంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాగం జనార్దన్ రెడ్డి బీజేపీలో పూర్తిగా ఆగమైపోయారు. ఆయనతో కూడా కొందరు సీనియర్ బీజేపి నేతలకి పొసగటం లేదట. ఇక వీరందరి మధ్యలో ఓల్డ్ సీటీలో ఫ్రైర్ బ్రాండ్ హిందూత్వ లీడర్ గా ఎదిగిన రాజా సింగ్ ది మరో దారి! ఆయనకు కూడా చాలా మంది తెలంగాణ సీనియర్ బీజేపీ నేతలతో కయ్యమేనట! ఇవన్నీ కన్ ఫర్మ్ చేయటానికి ఎవ్వరూ నోరు విప్పటం లేదు కాని… అందరి మధ్యా లుకలుకలు వున్నాయని మాత్రం షా గ్రహించేశారు. అందుకే, కొత్త వార్ని వలస తెచ్చుకునే ముందు పాత వార్ని దారిలోకి తెచ్చుకుందామని ఆయన భావించారంటున్నారు కార్యకర్తలు.   నల్గొండలో సభ జరుగుతోంటే వేదిక మీదకి కిషన్ రెడ్డి వెళ్లలేదు. జాతీయ అధ్యక్షుడు అక్కడే ఈ మాజీ రాష్టర అధ్యక్షుడు కిందనే వుండిపోయారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న అమిత్ షా తరువాత కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చించారట. హైద్రాబాద్ వచ్చి ఫ్లైట్ ఎక్కేలోపు మిగతా బీజేపి గ్రూపులతోనూ ఆయన మాట్లాడి స్ట్రాంగ్ వార్నింగ్ లాంటి మెసేజ్ ఇవ్వొచ్చంటున్నారు. దాని సంగతి ఎలా వున్నా, కేసీఆర్ లాంటి నాయకుడి చేతిలో గుభాళిస్తోన్న గులాబీని ఎదుర్కోవటం… అంతర్గత కయ్యాలతో సతమతం అవుతూ వుంటే…  కమలానికి మాత్రం చాలా కష్టం! కాబట్టి ముందు ఇన్నర్ రిపెయిర్ ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది!

పొలిటీషన్ లా మాయ చేస్తూ… బిజినెస్ మ్యాన్ లా డీల్స్ సైన్ చేస్తోన్న ట్రంప్!

  ట్రంప్ అమెరికా దాటి బయట ప్రపంచంలోకి వచ్చాడు. తొలిసారి ఒక విదేశీ పర్యటనకి శ్రీకారం చుట్టిన ఆయన అమెరికాలో మాట్లాడినంత ఘాటుగా టెర్రరిజమ్ గురించి మాట్లాడలేదు. అలాగని, ట్రంప్ తన శైలి మార్చేసుకున్నాడని అనుకోటానికి వీల్లేదు. ఇస్లామిక్ ఉగ్రవాదం అంటూ ఎన్నికల్లో కలకలం రేపిన ఆయన సౌదీలో మాత్రం ఇస్లామిక్ టెర్రరిజమ్ అనలేదు. ఊరికే ఉగ్రవాదం అనే అన్నాడు. కాని, మరే అమెరికన్ ప్రెసిడెంట్ చేయని ఒక్క సాహసం మాత్రం చేశాడు. సౌదీ గడ్డపై ఉగ్రవాదం మూలాల్ని తెగ నరకండని 50 ఇస్లామిక్ దేశాల ప్రతినిధులకి తెగేసి చెప్పాడు! ఇది ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ వ్యాఖ్యే!   ఉగ్రవాదం మీద పోరంటూ పొద్దున్న లేస్తే హడావిడి చేసే అమెరికా సౌదీ అరేబియా లాంటి సంపన్న ఇస్లామిక్ దేశాల విషయంలో మాత్రం భిన్నమైన నీతి పాటిస్తుంటుంది. సౌదీ పాలకులు ప్రపంచంలోని చాలా సున్నీ ఉగ్రవాద ముఠాలకు ఫండింగ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చినా వైట్ హౌజ్ పెద్దగా పట్టించుకోదు. ఇప్పుడు అదే రూల్ ట్రంప్ కూడా ఫాలో అయిపోయాడు. 400బిలియన్ అమెరికన్ డాలర్స్ విలువ చేసే బిజినెస్ డీల్స్ సౌదీతో కుదుర్చుకున్నాడు. దీని వల్ల అమెరికాలో , సౌదీలో బోలెడు ఉద్యోగాలు వస్తాయని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కాకపోతే, సౌదీ, అమెరికా డీల్ సారాంశం ఎప్పటి లాంటిదే! సౌదీ డబ్బు అమెరికాకి చేరుతుంది. అమెరికా ఆయుధాలు సౌదీకి చేరతాయి! ఇక ఉగ్రవాదం ఎలా అంతం అవుతుంది? ట్రంప్ కే తెలియాలి!   ఒకవైపు ఆయుధాలు పంచుతూ మరో వైపు ఉగ్రవాదం అరికట్టండి అని ఇస్లామిక్ దేశాలకు ట్రంప్ చెప్పటం ఒక విధంగా రాజకీయమే అవుతుంది. అంతకంటే ఎక్కువ నిజాయితీ ఆ మాటల్లో ఆశించటం దండగ. అయితే, ట్రంప్ మధ్య ప్రాచ్య పర్యటనలో ఒక్క విషయం మాత్రం ఇండియాకు అనుకూలమని చెప్పుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు సౌదీ గడ్డపై ప్రసంగిస్తూ రష్యా, చైనా, యూరప్, అమెరికాల్లాగే ఇండియా కూడా ఉగ్రవాదానికి ఎంతో నష్టపోయిందని అన్నాడు. ఇది ఒక విధంగా మన దౌత్య నీతిలో భాగంగా దక్కిన చిన్న విజయంగా చూడవచ్చు. ప్రత్యేక లాభం ఏమీ లేకపోయినా… ఉగ్రవాద వ్యతిరేక పోరులో భారత్ ముందంజలో వుందని అమెరికా కూడా ఒప్పుకున్నట్లైంది!   సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ట్రంప్ అత్యంత సంపన్న రాజ్యపు పాలకుల్ని సంతోష పెట్టడానికి ఇరాన్ ను సీరియస్ గా టార్గెట్ చేశాడు. తీవ్ర పదజాలంతో ఇరాన్ చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాడు. ఇది ఇరాన్ ను వ్యతిరేకించే సౌదీ అరేబియాకు సంతోషకరమైన అంశం. అలాగే, మధ్య ఆసియాలో ఇజ్రాయిల్ తో సరిహధ్దు పంచుకునే ఇరాన్ అంటే అమెరికాకు ముందు నుంచీ కోపమే. తన దారికి రాని ఆ ఇస్లామిక్ దేశమంటే అగ్ర రాజ్యానికి అసహనం. అదే మరోసారి ట్రంప్ మాటల్లో బయటపడింది. కానీ, అంతే ధీటుగా జవాబిచ్చాడు ఇరాన్ విదేశాంగ శాఖా మంత్రి.   ఉత్తర కొరియాతో యుద్ధమంటూ ప్రచారం జరుగుతోన్న వేళ ట్రంప్ ఆసియాలో పర్యటించటం నిజంగా విశేషమే. అయితే, ఎన్నికలప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదం విషయంలో ఎంతో కఠినంగా మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు మాత్రం ప్రపంచ ఉగ్రవాదానికి నిధులు వరదలా పారిస్తున్న దేశాలతోనే డీల్స్ ఓకే చేసుకోవటం మారిపోతున్న ఆయన రూటుకి నిదర్శనం. సౌదీ లాంటి దేశాల మైత్రి ట్రంప్ కు ఇప్పుడు చాలా అవసరం. కేవలం అమెరికాలో పెట్టుబడులు పెట్టించటానికి మాత్రమే కాదు… ఉత్తర కొరియా చెలరేగిపోతున్న తరుణంలో ఇస్లామిక్ దేశాలతో వైరం అమెరికా ఎంత మాత్రం తట్టుకోలేదు. అందుకే, ట్రంప్ ఇస్లామిక్ దేశాలకు సరికొత్త స్నేహ హస్తం అందించాడు. సరిగ్గా అదే సమయంలో నార్త్ కొరియా మిసైల్స్ పరీక్షిస్తూ కయ్యానికి కాలు దువ్వటం ట్రంప్ ను ఒత్తిడికి గురి చేస్తున్న అసలు అంశం ఏదో చెప్పకనే చెబుతుంది!   ఎన్నికలప్పుడు ఓటర్ల చప్పట్ల కోసం నినాదాలు ఇచ్చిన ట్రంప్ మెల్ల మెల్లగా తత్వం గ్రహిస్తున్నాడు. అప్పట్లో ఆయనలోని టీవీ హోస్ట్ చెలరేగిపోతే… ఇప్పుడు ఆయనలోని బిజినెస్ మ్యాన్ ఆచితూచి అడుగులు వేయిస్తున్నాడు!

అంతర్జాతీయ కోర్టులో భారత్… గెలిచి కూడా ఓడనుందా?

  కుల్భూషణ్ జాదవ్ ఉరిశిక్ష కేసు , అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ పోరు… ఇవన్నీ ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంత ఇంట్రస్టింగ్ కాకపోవచ్చు సామాన్య జనానికి. కాని, భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్ని ఆసక్తిగా అధ్యయనం చేసేవారికి ఇదో పెద్ద సంకేతం. ఇంత కాలం ఇండియా అంటే విదేశాంగ విధానంలో బలహీనంగా ముందుకు పోయే దేశం. కాని, ఇప్పుడు మెల్లమెల్లగా ఆ పరిస్థితి మారిపోతోంది. మరీ ముఖ్యంగా, పాకిస్తాన్ విషయంలో మోదీ సర్కార్ తాను చేయగలిగింది ధీటుగా చేస్తోంది. అయినా కూడా పదే పదే అరాచక దేశమైన పాకిస్తాన్ మన సైనికుల ప్రాణాలు బలితీసుకుంటూనే వుంది. తలలు నరుకుతోంది. సరిహధ్దు గ్రామాల్లోని అమాయక ప్రజల్ని పొట్టన పెట్టకుంటోంది. ఇవన్నీ పాకిస్తాన్ కు సింహస్వప్నం అవుతాడనుకున్న మోదీకి కళంకం కలిగించేవే. అయినా, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ క్రమ క్రమంగా పాక్ పై పై చేయి సాధిస్తోందన్నది మాత్రం నిజం…   మన సరిహద్దుల్లోకి చొరబడి మన సైనికుల తలలు నరికితే… మన కాశ్మీరీ సైనికుడ్ని మన భూభాగంలోనే ఉగ్రవాదులు కాల్చి చంపితే … ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. కాని, అమాంతం యుద్ధం ప్రకటించి దాడి చేయటానికి పాకిస్తాన్ ఏం మరీ బలహీనమైన దేశం కాదు. అణు సామర్థ్యం కలిగిన ఉగ్రవాద దేశం. భారత్ ఎంత తొందరపాటుతో యుద్ధం మొదలు పెడితే అంత త్వరంగా బాంబు వేయాలని చూస్తోంది పాక్. అది మనకు ఎంత మాత్రం క్షేమం కాదు. అందుకే, గతంలో మన్మోహన్ అయినా, ఇప్పుడు మోదీ అయినా ప్రత్యక్ష యుద్ధానికి ముందడుగు వేయటం లేదు. అయితే, కుల్భూషణ్ జాదవ్ ఉరిశిక్ష కేసుని అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు తీసుకు పోయి మోదీ, సుష్మా స్వరాజ్, హరీష్ సాల్వే ఎంతో కీలకమైన ద్వైపాక్షిక విజయం సాధించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇండియా తనంతట తానుగా పాక్ ను అంతర్జాతీయ వేదిక మీదకి ఈడ్చింది. ఇది తొలి విజయం. అంతటితో ఆగక బలమైన వాదన వినిపించి పాక్ ను కట్టడి చేయగలిగింది. ఇంటర్నేషల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ముందు, జాదవ్ వ్యవహారం తమ పరిధిలోకి రాదన్న పాక్ వాదనను కొట్టి వేయించగలిగింది. ఇప్పుడు కేసు అంతర్జాతీయ కోర్టు పరిధిలోకి చేరింది. అలాగే అంతిమ తీర్పు వచ్చే దాకా జాదవ్ ఉరి కూడా ఆగిపోయింది. ఇవన్నీ పాక్ పై భారత్ సాధించిన విజయాలనే చెప్పుకోవాలి.   ఇంటర్నేషనల్ కోర్టు ఆదేశాలు, తీర్పులు సార్వభౌమాధికారం గల దేశాలు పట్టించుకోవాల్సిన పని లేదు. కాబట్టి పాక్ ఏ క్షణానైనా జాదవ్ ను గూఢచారిగా నిర్ధారిస్తూ ఉరి తీయవచ్చు. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యమే. అయినా అంతర్జాతీయ కోర్టు ద్వారా ఒత్తిడి తేవటం మోదీ సర్కార్ సక్సెస్సే. ఎందుకంటే,రేపు పాక్ జాదవ్ ను తన ఇష్టానుసారం ఉరి తీస్తే అది అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడుతుంది. అంతర్జాతీయ కోర్టు ధిక్కారణ పర్యవసానాలు ఐక్యరాజ్య సమితిలోనూ వుంటాయి. అక్కడ కూడా పాక్ దోషిగా నిలబడాల్సి వస్తుంది. అమెరికా లాంటి దేశాలు భారత్ తరుఫున పాక్ పై మరింత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం వుంటుంది.   ఇక రాజకీయంగానూ నరేంద్ర మోదీ కుల్భూషణ్ జాదవ్ విషయంలో ధీటుగానే స్సందించారు. ఈ మధ్య పదే పదే ఆయన మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ విషయంలో తాము ఆశించింది మోదీ చేయలేకపోతున్నారని ప్రతిపక్షలే కాదు… మోదీ భక్తులు కూడా అసంతృప్తిగా వున్నారు. పాక్ హింసాత్మకంగా చెలరేగిపోయిన ప్రతీ సారి నమో బలంగా జవాబు ఇవ్వటం లేదనే భావన పెరుగుతోంది. కాని, ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా పాక్ కు దాని భాషలోనే సమాధానం ఇవ్వటం కుదరదు. అందుకే, అంతర్జాతీయ కోర్టును ఎంచుకోవటం ద్వారా మోదీ పాక్ పైన పై చేయి సాధించారు. అదే సమయంలో దేశం లోపల పాక్ ను కట్టడి చేసే విషయంలో తాను సీరియస్ గానే వున్నట్టు విమర్శకులకి గట్టి సంకేతాలిచ్చారు. అయితే, అంతిమంగా పాక్ కు బుద్ది చెప్పటం, కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనటమే మోదీ పరమ విజయం అవుతుంది. ఆ దిశగా కుల్భూషణ్ జాదవ్ వివాదంలో పై చేయి సాధించటం ఒక ముందడుగు ఖచ్చితంగా అవుతుంది…

ట్రంప్… తీసి పక్కన పడేయలేని ముళ్ల కిరీటం!

ఇప్పటి వరకూ అగ్రరాజ్యం ఎందరో అధ్యక్షుల్ని చూసింది. కాని, డొనాల్డ్ ట్రంప్ వారెవరి కోవలోకి రావటం లేదు. ఇటు జనం, అటు మీడియా, మొత్తం ప్రపంచం ఈ బిజినెస్ మ్యాన్ ని చూసి అవాక్కవుతూనే వుంది. అంతే కాదు, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సంవత్సరం కూడా పూర్తి చేసుకోకుండానే ఓ అమెరికా అధ్యక్షుడు అభిశంసనకి గురవుతాడా అన్న చర్చ కూడా అంతకంతకూ పెరుగుతోంది! నాలుగేళ్ల పదవి కాలం ట్రంప్ వైట్ హౌజ్ లో పూర్తి చేసుకుంటాడా? లేక మధ్యలోనే వైట్ హౌజ్ నుంచి ఆయన హౌజ్ కి సాగనంపేస్తారా? ఇప్పుడు ఇదే ఎద్ద చర్చగా మారింది యూఎస్, యూరప్ లలో!   ట్రంప్ అధికారంలోకి వస్తాడనే ఎవరూ భావించలేదు. కాని,అనూహ్యంగా అద్యక్షుడైన ఆయన అంతే అనూహ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మీడియాను తిట్టడం, రష్యాను పొగడటం, చైనాను రెచ్చగొట్టడం, ముస్లిమ్ దేశాల వార్ని నిషేధించటం, అమెరికాలోని వలస ఉద్యోగుల బీపీ పెంచేయటం, మెక్సికో సరిహద్దులో గోడ కట్టడం… ఇలా అన్నీ బ్రేకింగ్ న్యూస్ లే! ఇవన్నీ ట్రంప్ తెలియక చేస్తున్నాడా? అర్థం కాక చేస్తున్నాడా? కావాలనే చేస్తున్నాడా? ఏది ఏమైనా అమెరికాతో పాటూ ప్రపంచమంతా ట్రంప్ దెబ్బకు అల్లాడిపోతోంది. ఎంతగా అంటే, ట్రంప్ అభిశంసనకి గురై అధ్యక్ష పదవి కోల్పోతే బావుండుననేంతగా!   డొనాల్డ్ ట్రంప్ రష్యా సహకారం తీసుకున్నాడనే పుకార్లే తప్ప నిజంగా ఆయన తప్పు చేశాడనీ ఇప్పటి వరకూ నిరూపితం కాలేదు. కాబట్టి ఆయన విజయం నిఖార్సైందే అనుకుంటే నాలుగేళ్లు అమెరికాని ఏలే హక్కు ఆయనకు అమెరికన్ ఓటర్లే ఇచ్చినట్టు. కాని, తామే ఎన్నుకున్న మహానుభావుడ్ని ఇప్పుడు వారే భరించలేకపోతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా పబ్లిక్ పాలసీ పోలింగ్ అనే ప్రైవేట్ సంస్థ తమ అధ్యక్షుడిపై సర్వే నిర్వహించింది. ఇందులో 54శాతం మంది ట్రంపు పాలన కంపుగా వుందని అభిప్రాయపడ్డారు. 40శాతం మంది ఓకే అంటే 6శాతం తమకు నో ఐడియా అని చెప్పారు. అంటే, మొత్తం మీద ట్రంప్ అప్పుడే జనం నుంచి విసుగు, చిరాకు ఎదుర్కొంటున్నాడన్నమాట! దీని కంటే ఆందోళనకరమైన విషయం మరోకటి వుంది. సర్వేలో పాల్గొన్న వారందరిలో 48శాతం మంది ప్రెసిడెంట్ ని తొలంగించాలని ఫీలయ్యారట! 41 శాతం మంది మాత్రమే ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకున్నారట! ఇది ట్రంప్ కి ఖచ్చితంగా రెడ్ సిగ్నల్ లాంటిదే!   అమెరికా ఫస్ట్ అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ నిజానికి జనాల నాడి పట్టుకున్నాడనే చెప్పాలి. కాని, అదే సమయంలో వైట్ హౌజ్ లోకి వచ్చాక కామన్ అమెరికన్స్ కి ఆయన చేసిన మేలంటూ ఏం లేదు ఇప్పటి వరకూ. రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ కలకలం సృష్టిస్తున్నాడు. తనకు నచ్చకపోతే అడ్వకేట్ జనరల్ మొదలు ఎఫ్బీఐ బాస్ వరకూ అందర్నీ బలవంతంగా తొలగించేస్తున్నాడు. వీటి వల్ల ఆయనకు శత్రువులు పెరుగుతున్నారే తప్ప అమెరికాలోని ట్రంప్ కు ఓటేసిన సామాన్య జనం లాభపడింది ఏం లేదు. ఇక మీదటన్నా తన దాదాగిరి పక్కన పెట్టి జనం ఏం కోరుకుంటున్నారో ఆలోచిస్తే బావుంటుంది. లేదంటే… ట్రంప్ అభిశంసనతో తప్పుకోకున్నా… నాలుగేళ్ల తరువాత చేతులెత్తేసి పక్కకు పోవాల్సిందే. కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ గా దొరికిన అత్యంత అరుదైన అద్భుత అవకాశాన్ని ట్రంప్ చక్కగా వాడుకోవాలని కోరుకుందాం!

సీబీఐతో గురి చూసి… ఐటీ రైడ్లతో కొడుతోన్న మోదీ!

  దశాబ్దాల తరబడీ కాంగ్రెస్ భారతదేశాన్ని పాలించింది. ఎట్టకేలకు 2014లో మోదీ తన స్వంత మెజార్జీతో ఇదే రోజు దేశాన్ని కైవసం చేసుకున్నారు. అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. కాని, ఇప్పుడు ఒకసారి వెనక్కి చూస్తే మోదీ కూడా కాంగ్రెస్ మార్కు రాజకీయం బాగానే ఒంటబట్టించుకున్నట్టు కనిపిస్తోంది! మిగతా అన్ని విషయాల్లో నమో కాంగ్రెస్ ప్రధానుల కంటే చాలా డిఫరెంట్. కాని, సీబీఐ,ఐటీ అస్త్రాల్ని ఎక్కుపెట్టడంలో మాత్రం ఆయన గతంలోని పీఎంలు అందర్నీ మించిపోయారనే చెప్పాలి!   నరేంద్రుడు ప్రధానై మూడు ఏళ్లు గడిచిన ఈ క్షణంలో సీబీఐ, ఐటీ బృందాలు ఏం చేస్తున్నాయో తెలుసా? ముఖ్యంగా, ఆదాయ పన్ను శాఖ ఉత్రాదిన లాలూకి, దక్షిణాదిన చిద్దూకి తన ప్రతాపం చూపిస్తోంది. మోదీ సర్కార్ వేడికి చిదంబరం అయితే కనీసం స్పందించాడు. లాలూ ఆ ఓపిక కూడా లేక మౌనంగా వుండిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితే చాలా మంది మోదీ వ్యతిరేక నాయకులకి ఎదురవుతోంది! అలాగని వీళ్లందర్నీ మోదీ కేవలం తప్పుడు కేసుల్లో ఇరికించి కక్ష తీర్చుకుంటున్నాడనీ అనలేం. ఏళ్ల తరబడి రాష్ట్రాల్ని, కేంద్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న చాలా మంది నేతలు దొరికినంత దోచేశారు. ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాకే పార్టీలకతీతంగా నాయకులందరికీ మోదీ ఫోబియా పట్టుకునేలా చేస్తోంది!   దాదాపుగా ఒకే రోజు దాడులు ఎదుర్కొన్న ఇద్దరిలో లాలూ సంగతి చెప్పే పనేలేదు. ఆయన దాణా కేసులో తొక్కని కోర్టు గడపంటూ లేదు. బీహార్ కోర్టులు మొదలు సుప్రీమ్ అంతటా ఆయనకు చుక్కెదురు అవుతూ వచ్చింది. చివరకు, పదవి ఊడి ఎన్నికల్లో పాల్గొనలేని అవమానకర పరిస్థితి దాపురించింది. అయినా ఎలాగోలా బీహార్లో బండి నెట్టుకొస్తున్న లాలూకి ఇప్పుడు రోజుకో గండం ఎదురవుతోంది. ఈ మధ్యే ఆయన మాఫియా డాన్ షాబుద్దీన్ ఫోన్ వేసిన ఆర్డర్ల ప్రకారం ఎలా పోలీసుల్ని ట్రాన్స్ ఫర్ చేయించాడో వెలుగు చూసింది. అది చాలదన్నట్టు ఇప్పుడు ఆయన కుమార్తెలు దిల్లీలో అక్రమ మార్గాల్లో చౌకగా భూమి కొన్నారని ఆరోపణలు మొదలయ్యాయి. ఈ కేసులో భాగంగానే లాలూకు అత్యంత సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి!   లాలూపై కేంద్రం ప్రయోగిస్తున్న అస్త్రాల్ని తట్టుకుని ఆయన నిలబడతారా? చెప్పలేం. ఎందుకంటే, త్వరలో ముంచుకొస్తోన్న రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆయన మోదీ నిలబెట్టబోయే అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించారు. అలాగే, 2019లో యాంటీ మోదీ బ్యాచ్ ఏర్పాటు చేయాలని కుతూహలపడుతున్నాడు. ఇవన్నీ చేయాలంటే లాలూపై ఇలాంటి దాడుల ఒత్తిడి వుంటే… కష్టమే!   ఇక లాలూ లాగే ఎండా కాలం వేడితో పాటూ మోదీ హీట్ కూడా ఎదుర్కొంటున్న మరో నాయకుడు చిదంబరం. ఈయనకైతే గండం మరీ దగ్గరగా వచ్చేసింది. చిదంబరం ఇంటికే వచ్చిన అధికారులు సోదాలు చేసేశారు. ఒక మాజీ ఆర్దిక, హోమ్ మంత్రి ఇంటిని రైడ్ చేయటం చిన్న విషయమేం కాదు. మోదీ సర్కార్ బలమైన ఆధారాలు లేకుండానే ఇలా తొందరపడి వుంటుందని అస్సలు భావించలేం. చిదంబరం కొడుకు కార్తి చిదంబరం ప్రస్తుతం జైల్లో వున్న పీటర్ ముఖర్జీయా, ఇంద్రాణి ముఖర్జీయాల మీడియా సంస్థకి అడ్డదారిలో ఆర్ధిక మేలు చేశాడని ఆరోపణ వెలుగులోకి వచ్చింది. వెంటనే దాడులు మొదలైపోయాయి. వీటి ద్వారా మోదీ ఏం హెచ్చరించదలిచారు?   చిదంబరం లాంటి కాంగ్రెస్ అగ్ర నాయకుడి మీద దాడులు చేయించటం ద్వారా నమో తమకు ఎవరైనా లెక్కలేదని చెప్పకనే చెబుతున్నారు. ఈ ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా చాలా మంది నేతలపై ఆల్రెడీ పని చేస్తోంది. మొన్నటికి మొన్న జగన్ ప్రధానితో నాలుగు మాటలు మాట్లాడి వచ్చి రాష్ట్రపతి అభ్యర్థికి తమ బేషరతు మద్దతు ప్రకటించారు. ఇది ఖచ్చితంగా కాంప్రమైజ్ ఫార్ములానే తప్ప మరోకటి అనుకోటానికి లేదు. నిజానికి మోదీ సక్సెస్ అంతా రాహుల్, సోనియా గాంధీలతో సహా దేశంలోని అత్యధిక శాతం మంది నాయకులు ఎదుర్కొంటోన్న అవినీతి ఆరోపణల్లోనే వుంది! ప్రతీ వారికి ఓ గతం వెంటాడుతూ వుండటంతో అందరూ భయం భయంగానే రాజకీయం చేయాల్సి వస్తోంది! మూడేళ్ల మైలురాయి దాటిన మోదీ శకం మూడు దాడులు, ఆరు కేసులుగా సాగిపోతోంది!

నయీం… పోలీసులకి సస్పెన్షన్! నాయకులకి టెన్షన్!

  పోలీసులు, రాజకీయ నేతల అండ లేకుండా ఎవరైనా డాన్ గా ఎదగగలరా? అసాధ్యం. కాని, మాఫియా, పొలిటీషన్స్, పోలీసుల సంబంధాలు దాదాపు ఎప్పుడూ నిరూపితం కావు. ఎందుకంటే, రాజకీయ నేతలు తమని తాము కాపాడుకుంటారు. తమతో పాటూ తమకు ఎంతో అవసరమైన పోలీసుల్ని కూడా బాగానే కాపాడతారు. ఇక మిగిలింది ప్రాణాలకు తెగించి ప్రాణాలు తీసే బిజినెస్ చేసిన మాఫియా డాన్లు. వీళ్లు నేతలకి, పోలీసులకి ఉపయోగపడ్డంత కాలం బండి నెట్టుకొస్తారు. ఎక్కడో ఏ చిన్న తేడా వచ్చినా… శాల్తీలు లేచి పోతుంటాయి! నయీం అలాంటి బెడిసికొట్టిన మాఫియా బాంబే!   కేవలం నయీమే కాదు… చాలా మంది మాఫియా వారు పోలీసుల్ని తప్పించుకు తిరుగుతుంటారు. కాని, నిజానికి వార్ని ఖాకీలు, రాజకీయ నేతలే చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. దాని వల్ల ఇద్దరికీ లాభముండటమే ఈ వ్యూహానికి కారణం. దావూద్ అయినా, గల్లీల్లో వుండే దాదా అయినా… అంతటా ఒకటే రూల్ అప్లై అవుతుంది! ప్రస్తుతం పాకిస్తాన్ లో వున్న దావూద్ తన వేల కోట్ల దందా హ్యాపీగా చేసుకోటానికి కారణం… ముంబై పోలీసుల్లోని చాలా మంది అధికారులు, మహారాష్ట్ర రాజకీయ నేతలే! అయితే, ఇది సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేయటం మాత్రం కష్టమే!   దావూద్ లాగే తమిళ అడవి దొంగ వీరప్పన్ కూడా పోలీసులు, రాజకీయ నేతలకి చాలా దగ్గరి వాడుగా వుండేవాడట. ఆయనకి సాయం చేసిన స్వార్థపరులు ఎవరో తెలియదుగాని… వీరప్పన్ న్యూసెన్స్ ఎక్కువైపోయిందని అనినిపించిన వెంటనే అతడ్ని అమాంతం వేసేయించారు. నయీం కూడా అలానే చేసుకున్నాడు. కొరివితో తలగోక్కుని అంతమయ్యాడు. ఇక ఇప్పుడు అతడు బతికి వుండగా నయీంతో అంటకాగిన పోలీసులకి, రాజకీయ నేతలకి బ్యాడ్ టైం మొదలైంది. నిజానికి ఆ మధ్య ఓ రిపోర్ట్ లో తమ పోలీసులెవరూ నయీంతో సంబంధాలు పెట్టుకోలేదని రిపోర్ట్ కూడా ఇచ్చారు డిపార్ట్ మెంట్ పెద్దలు. కాని, దానిపై తీవ్రమైన వ్యతిరేక రావటంతో నయీంకు మరీ దగ్గరగా వెళ్లిన అవినీతిపరులైన కొందరు పోలీసులపై వేటు వేయక తప్పలేదు. అంతే కాదు, పోలీసులు కొందరు ఇప్పటికే సస్పెండ్ కాగా కొందరు రాజకీయ నేతలు కూడా జైలుకి వెళ్లే ప్రమాదంలో వున్నారు. ఎగ్జాక్ట్ లీ ఎవరు నయీం స్ట్రోక్ ఎదుర్కోబోతున్నారో ఇంకా క్లారిటీ లేదు కాని… ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ స్థాయి వారే డాన్ దెబ్బను అనుభవించనున్నారట!   నయీం కేసులో ఎందరు రాజకీయ నేతలు జైలుకి వెళతారో మనకు తెలియదుగాని… పాలిటిక్స్ , రౌడీయిజం ఎప్పటికీ విడదీయలేనివి. సస్పెన్షన్ లు, జైలుకి వెళ్లటాలు వాట్ని ఒకదానికొకటి దూరం చేయలేవు. అందుకు మంచి ఉదాహరణ, ఆర్నాబ్ గోస్వామి బయటపెట్టిన లాలూ, షాహాబుద్దీన్ రిలేషన్! షాహాబుద్దీన్ ప్రస్తుతం జైల్లో వున్న ఒక బీహారీ మాఫియా డాన్. అతడితో ఫోన్లో మాట్లాడిన లాలూ ఆయన కోరుకున్న విధంగా పోలీసు ఉన్నతాధికారుల్ని ట్రాన్స్ ఫర్లు చేశాడు! ఒక మాజీ సీఎం అయి వుండీ….  నిస్సిగ్గుగా ఒక మాఫియా డాన్ ఆర్డర్లు శిరసావహించాడు! భారత దేశంలో రాజకీయాలు, రౌడీయిజం ఎంతలా పెనవేసుకుపోయాయో అర్థం కావటానికి ఈ ఒక్కటీ చాలు…

కమలం వైపు జగన్ కదులుతున్నారా… కమలమే, కమాన్ అంటోందా?

2014 నుంచీ విజయపరంపరలో సాగుతోంది బీజేపి. మోదీ ప్రధాని అయిన తరువాత చాలా రాష్ట్రాలే కమలం ఖాతాలో పడ్డాయి. బీహార్, దిల్లీ ఎన్నికల్లో తీవ్రమైన ఓటమి ఎదురైనా మళ్లీ ఈ మధ్య కాలపు ఎన్నికల ఫలితాలతో అందరికీ బలమైన సమాధానం ఇచ్చింది కాషాయదళం. కాని, ఇప్పుడు మరో ఎన్నిక ఎన్డీఏకు, మరీ ముఖ్యంగా బీజేపికి సవాలుగా మారింది. అదే రాష్ట్రపతి ఎన్నిక! ప్రణబ్ ముఖర్జీ తరువాత దేశ ప్రథమ పౌరుడు అయ్యేది ఎవరన్న సస్పెన్స్ అందరిలోనూ వుంది! అయితే, ప్రెసిడెంట్ ఎలక్షన్ రానున్న 2019 ఎన్నికల ముఖ చిత్రాన్ని కూడా కొద్దికొద్దిగా స్పష్టం చేస్తున్నట్టు కనిపిస్తోంది!   రాష్ట్రపతి ఎన్నికలు మోదీ సర్కార్ కి పెద్ద ఇబ్బందేం కాదు. యూపీ మొదలు మణిపూర్ వరకూ చాలా రాష్ట్రాలు బీజేపీ చేతిలో వున్నాయి. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల చేతిలో వున్న రాష్ట్రాలతో కూడా పెద్ద టెన్షన్ ఏం లేదు. అందుకు మంచి ఉదాహరణ మన ఏపీనే! ఇక్కడ అదికారంలో వున్నది టీడీపీ కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు సునాయాసంగానే పొందవచ్చు. కాని, ట్విస్ట్ ఏంటంటే, ఆంధ్రా అసెంబ్లీలో ఎప్పుడూ ఉప్పు, నిప్పులా వుండే టీడీపీ, వైసీపీ రెండూ మోదీ నిలబెట్టబోయే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కే మద్దతు పలకునున్నాయి. ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ సపోర్ట్ చేస్తుందని మనకు ముందు నుంచీ తెలుసు. కాని, లేటెస్ట్ మీటింగ్ తరువాత జగన్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు! అదే ఇప్పుడు అనేక ఊహాగానాలకు కారణం అవుతోంది!   ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా వున్న శివసేన ఇప్పటి వరకూ మోదీ నిర్ణయించే అభ్యర్థికి తమ మద్దతని చెప్పటం లేదు. చాలా రోజులుగా గుర్రుగా వుంటోన్న ఉద్ధవ్ థాక్రే రాష్ట్రపతి ఎన్నిక టైంలో బీజేపికి చుక్కలు చూపాలని ఆశ పడుతున్నారు. కాని, ఎన్డీఏలో భాగస్వామి కాని వైసీపీ మాత్రం బీజేపి రాష్ట్రపతి అభ్యర్థికి క్లియర్ సపోర్ట్ అంటోంది! దీనర్థం ఏంటి? జగన్ మాటల్లో అయితే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి గెలిచే అవకాశం లేదు కాబట్టి వైసీపీ అతి పెద్ద పార్టీ అయిన కమలదళానికే మద్దతు ఇస్తోంది! కాని, దీని వెనుక ఇంతే మ్యాటర్ వుందని విశ్లేషకులు భావించటం లేదు!   జగన్ పైన వున్న కేసులు, జైలుకు వెళ్లాల్సి వచ్చే గండం ఆయన్ని మోదీతో రాజీకి తీసుకొచ్చాయంటున్నారు విశ్లేషకులు. అంతే కాక, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎన్డీఏలో చేరి ఏపీలో అధికారం చేపట్టాలని జగన్ భావిస్తున్నారట! అలాగే, కేంద్రంలోనూ మంత్రి పదవులు తీసుకుని అధికారం ఆస్వాదించాలని ఆయన ఆశిస్తున్నారట! పార్టీ పెట్టి ఇంత కాలమైనా ప్రతిపక్షంలో కాలం గడిచిపోతోంది. అందుకే, జగన్ బీజేపితో పొత్తుకి తహతహలాడుతున్నారని టాక్! మరి ఎన్డీఏలో ఎంతో కీలకమైన టీడీపిని కాదని మోదీ, అమిత్ షా జగన్ ను చేరదీస్తారా? హిందూత్వా బ్రాండ్ ను నమ్ముకునే కాషాయదళానికి క్రిస్టియన్ మైనార్టీల్లో మంచి ఫాలోయింగ్ వున్న వైసీపీతో పొసుగుతుందా? ఇవన్నీ ముందు ముందు తేలాల్సిన ఆసక్తికర అంశాలు!   ఇక మోదీ పట్టుదలతో వర్కవుట్ చేస్తోన్న ఒక దేశం ఒకేసారి ఎన్నికలు కాన్సెప్ట్ కు కూడా జగన్ బేషరతుగా ఓకే చెప్పారు! మరో వైపు ప్రత్యేక హోదా మరిచిపోలేదని అన్నప్పటికీ దానిపై ప్రత్యేకంగా గొడవ చేయటం ఇక మీదట వుండదని జగన్ మాటలు వింటే అర్థమైపోతుంది! ఇలా ఇంత చక్కగా మోదీకి మద్దతు పలికిన విపక్ష పార్టీ వైసీపీ తప్ప దేశంలో మరేదీ లేదనుకుంటా!   మోదీకి, బీజేపికి, కేంద్రానికి జగన్ మద్దతు వెనుక ఆయన మీద వున్న కేసులు కారణమా? లేక భవిష్యత్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కమలానికి ఫ్యాన్ని దగ్గర చేసే వ్యూహమా? లేక వ్యక్తిగత, రాజకీయ కారణాలు రెండూ వున్నాయా? ఏమో.. ఏమీ చెప్పలేం! కాని, ఇప్పుడు బాల్ బీజేపి కోర్టులో వుంది. టీడీపీ జాగ్రత్తగా జగన్ కదలికల్ని, బీజేపి హావభావాల్ని గమనిస్తూ వుండాల్సిందే!

ఒక ట్రంప్, ఒక మోదీ లాంటి మిసెస్ మెరైన్ ను ఫ్రాన్స్ మిస్సైందా?

  భారతీయులకి అమెరికా అంటే వుండే ఆరాటం మరే దేశం పేరు చెప్పినా వుండదు. కాని, ప్రపంచ రాజకీయాల్ని ప్రభావితం చేసే అభివృద్ధి చెందిన ఫ్రాన్స్. యూరప్ లో అయితే ఫ్రాన్స్ పాత్ర మరీ కీలకం. ఎప్పుట్నుంచో అక్కడ ఒక సామెత కూడా వాడుకలో వుంది. ఎప్పుడైతే ఫ్రాన్స్ తుమ్ముతుందో … అప్పుడు యూరప్ కి జలబు చేస్తుందీ అని! అది ఇప్పుడు ఒకప్పటంత నిజం కాకపోయినా… ఇంకా యూరోపీయన్ యూనియన్ లో ఫ్రాన్స్ అత్యంత ప్రధాన దేశం! ఆ దేశానికి సరికొత్త ప్రెసిడెంట్ ఎవరో తెలుసు కదా? ఎమ్మాన్యువల్ మాక్రోన్…   అమెరికా లాగానే ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ వుంటుంది ఫ్రాన్స్ లో. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడవచ్చు. అయితే, ఈసారి ఆశ్చర్యకరంగా ఒక ఇండిపెండెంట్ అయిన ఎమ్మాన్యువల్ మాక్రోని గెలిచాడు. అదీ దాదాపు 65శాతం ఓట్లతో! అంతగా ఆయనలో ఫ్రెంచ్ వారికి నచ్చింది ఏంటి? మరేం లేదు… చారిత్రకంగా కూడా ఫ్రాన్స్ ప్రజలు ఆదర్శవాదులు, స్వేచ్ఛా ప్రేమికులు. ప్రజాస్వామ్యం గురించి చెప్పేటప్పుడు తప్పక చెప్పే స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి పదాలన్నీ అక్కడే ఊపిరి పోసుకున్నాయి. అక్కడ విప్లవాలు మొదలయ్యేక యూరప్ అంతటా మార్పు మొదలైంది. ఇవాళ్ల ప్రజాస్వామ్యం ప్రపంచాన్ని ఆవరించిందంటే అది ఫ్రాన్స్ లో మొదలైన పరిణామమే! ఇప్పుడు ఆ నేపథ్యమే మాక్రోన్ ని ఎన్నుకునేలా చేసింది!   ఫ్రాన్స్ లో కూడా ఇండియా, అమెరికా లాంటి దేశాల్లో జరిగిన తాజా ఎన్నికల్లాగే పోరు నడిచింది. అమెరికాలో ఆదర్శవాద వర్గానికి చెందిన హిల్లరీని ట్రంప్ ఆశ్చర్యకరంగా ఓడించాడు. అంతకు ముందే, ఇండియాలోనూ మోదీ లెక్కలన్నీ తారుమారు చేశాడు. ఒక రైట్ వింగ్ లీడర్ స్వంత మెజార్టీతో భారత ప్రధాని అవ్వటం ఎవ్వరూ ఊహించగలిగింది కాదు కొన్నాళ్లు కిందటి వరకూ! కాని, మీడియాని, మేదావుల్ని అందరూ షాక్ కి గురి చేస్తూ ఒక ఆరెస్సెస్ ప్రచారక్ దేశ సారథ్యాన్ని చేపట్టాడు! ఫ్రాన్స్ లోనూ ఈసారి పోటీ ఇలాంటి భిన్న ధృవాలే మధ్యే జరిగింది!   ఎమ్మాన్యువల్ మాక్రోన్ లిబరల్. అంటే, మన దగ్గరి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ల వంటి వాడన్నమాట. ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్ లో వుండాలనీ, వలస వచ్చే వార్ని అక్కున చేర్చుకోవాలనీ, జాతీయ వాదం పెద్దగ అక్కర్లేదని వాదించేవాడు. ఆయనతో పోటీ పడ్డ మెరైన్ లీ పెన్ పక్కా రైటిస్ట్. అంటే, ఆమె మాటల్లో , చేతల్లో ఫ్రాన్స్ ఫస్ట్ ఉద్దేశం ఇట్టే పసిగట్టవచ్చు. జాతీయ వాదమే కాదు మెరైన్ ఫ్రాన్స్ లోకి వచ్చిన ముస్లిమ్ వలస వాదుల్ని కూడా టార్గెట్ చేశారు. వాళ్లు మన దేశాన్ని ఆక్రమించారనీ… వారి నుంచీ ఫ్రాన్స్ ను కాపాడుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు. కాని, కేవలం 35శాతం ఓటర్లు మాత్రమే మెరైన్ వెంట నిలిచారు. అంతకు రెట్టింపు జనం అభ్యుదయ భావాల గల ఎమ్మాన్యువల్ కే ఓటు వేశారు!   ఫ్రాన్స్ లో ఒక ఇండిపెండెంట్ అద్భుతంగా గెలవటంతో కథ సుఖాంతం కాలేదంటున్నారు విశ్లేషకులు. పైకి జాతీయవాదం వినిపించిన మెరైన్ ఓడిపోయినట్టు కనిపించినా అసలు జరిగింది వేరంటున్నారు. ఆమె పార్టీకి ఒకప్పుడు 4.5మిలియన్లు ఓట్లు వస్తే ఈ సారి ఎన్నికల్లో 11మిలియన్ ఓట్లు వచ్చాయి! ఇంత పెరుగుదల ఫ్రాన్స్ లోనూ రాజుకుంటున్న అసంతృప్తి నిప్పుకి నిదర్శనం అంటున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేద్దాం,మనకు ఫ్రాన్స్ ముఖ్యం, వలస జనాలతో దేశ భద్రతకి ముప్పు వుంది లాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన మెరైన్ ఎక్కువ ఓట్లు కొల్లగొట్టింది 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సులోని ఓటర్ల నుంచే! అంటే, ఈ సారి ఎన్నికైన మాక్రోన్ ఫ్రాన్స్ లో క్రమంగా పెరుగుతోన్న నిరుద్యోగం, గ్లోబలైజేషన్ పై అసంతృప్తి, ఈయూ విషయంలో అసహనం వంటి వాట్ని సరిగ్గా డీల్ చేయకుంటే … వచ్చే ఎన్నికల్లో కరుడుగట్టిన మెరైన్ లీ పెన్ దే విజయమంటున్నారు ఎక్స్ పర్ట్స్!   ఒక్క ఫ్రాన్సే కాదు… ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అటుఇటుగా ఒకే ట్రెండ్ నడుస్తోంది. జాతీయ వాదాన్ని పక్కన పెట్టే నాయకుల్ని క్రమక్రమంగా జనం ఆదరించటం మానేస్తున్నారు. దేశం కంటే మానవత్వం, సెక్యులరిజమ్, ఆదర్శవాదం గొప్పవనే వార్ని కూడా ఓటర్లు నమ్మటం లేదు. గ్లోబలైజేషన్ వల్ల నిరుద్యోగంతో సతమతం అవ్వటం అనివార్యం అవ్వటంతో అభివృద్ధి చెందిన దేశాల యువత కూడా అసహనానికి గురవుతోంది! ఈ కామన్ ట్రెండ్స్ ని ఇండియా మొదలు ఫ్రాన్స్ వరకూ అన్ని దేశాల లిబరల్, సెక్యులర్ నాయకులు గమనించి ముందుకు సాగాలి. ఊరికే మాటలకే పరిమితమైపోతే… ముందు ముందు ప్రపంచమంతా ట్రంప్ లు, మోదీలదే అవుతుంది!    

ఆయన వాళ్లకు 5ఏళ్లు… ఆయనకి వాళ్లు 6నెలలు… శిక్షలు విధించుకున్నారు!

పైకి ఎవ్వరూ దూకుడుగా విమర్శించనప్పటికీ మన న్యాయ వ్యవస్థపై చాలా మందికి అనుమానాలు, అసహనాలు వున్నాయి. అంతే కాదు, ఒక కోర్టు ఇచ్చిన తీర్పును మరో కోర్టు కొట్టేయటం, ఆ కోర్టు ఇచ్చింది మళ్లీ సుప్రీమ్ వ్యతిరేకించటం… ఇలా జరుగుతుంటుంది. దీనిపై కూడా అనేక మంది అనేక విధాల స్పందిస్తుంటారు. అయితే, న్యాయమూర్తుల తీర్పుల్ని పరిధికి మించి విమర్శించే హక్కు లేదు కాబట్టి సాధారణ సందర్భాల్లో అందరూ మౌనంగానే వుండిపోతుంటారు. ఇక ఇప్పుడు సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తులే ఒకరికి ఒకరు శిక్షలు వేసుకుంటూ న్యాయ వ్యవస్థని అభాసుపాలు చేస్తున్నారు. జనంలో వున్న అనుమానాలు, అపనమ్మకాలు మరింత పెరిగేలా ప్రవర్తిస్తున్నారు!   జస్టిస్ కర్ణన్ కోల్ కతా హై కోర్ట్ లో న్యాయమూర్తి. ఆయన ఏం చేశారో తెలుసా? ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఖేహర్ కి, మరో ఏడుగురు న్యాయమూర్తులకి ఐదేళ్ల కఠిన కారాగారా శిక్ష విధించాడు! వాళ్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నేరస్థులంటూ లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధించాడు. అది కట్టకపోతే మరో ఆరు నెలలు జైల్లో వుండాలంటూ ఆదేశించాడు! వింటుంటేనే విడ్డూరంగా వున్న ఈ ఉదంతం చాలా రోజులుగా రాజుకుంటున్న నిప్పుకి అంతిమ ఫలితం. జస్టిస్ కర్ణన్ గతంలో మద్రాస్ హైకోర్ట్ లో న్యాయమూర్తిగా పని చేశారు. అప్పట్నుంచీ ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా వుంటూనే వస్తోంది. ఇక కోల్ కతా హైకోర్ట్ కి ట్రాన్స్ ఫర్ అయ్యాక ఆయన ఆరోపణలు మరీ శృతీ మించాయి. తాను దళితుడ్ని కాబట్టే తనని ఇతర జడ్జీలు అవమానిస్తున్నారని, తగిన విధంగా ప్రమోషన్లు రావటం లేదని ఆరోపిస్తూ వచ్చారు. ఆయన సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్ ను కూడా వదలకుండా విమర్శలు చేశారు!   జస్టిస్ కర్ణన్ సుప్రీమ్ లో విచారణకు హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశిస్తే అందుకు కూడా ససేమీరా అన్నారు కర్ణన్. పైగా అత్యున్నత న్యాయస్థానం ఆయన ఎలాంటి కేసు విచారణలు చేయకూడదని ఆదేశించాక కూడా ఎనిమిది మంది జడ్జీలకు శిక్షలు వేశాడు. ఇక జస్టిస్ కర్ణన్ అసాధారణ ప్రవర్తనను సీరియస్ గా తీసుకున్న సుప్రీమ్ తాజాగా ఆయన ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జూన్ 11న రిటైర్ కానున్న కర్ణాన్ పదవిలో వుండగా జైలు పాలైన తొలి భారతీయ జడ్జీగా చరిత్రలో మిగలనున్నాడు!   అసలు జస్టిస్ కర్ణన్ దళిత కులానికి సంబంధించిన ఆరోపణలు సహేతుకమైనవా? కావా? ఆయన మానసిక స్థితి ఏంటి? అలాగే, సుప్రీమ్ కోర్టు జడ్జీల తీర్పు సరైందేనా? న్యాయమూర్తిగా వున్న కర్ణన్ ను జైలుకి పంపటం సబబా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పుడు ఎవరి వద్దా సమాధానం లేదు. కాకపోతే, సామాన్య జనానికి మాత్రం దేశంలోని అత్యున్నత గౌరవ ప్రదమైన న్యాయమూర్తుల స్థానంలో వుండి …. వీరంతా ఇలా పరస్పర శిక్షలు వేసుకోటం ఆశ్చర్యం కలిగిస్తోంది! పేదలు, బలహీనులు తమకు న్యాయం జరుగుతుందని కోర్టుల్ని ఆశ్రయిస్తారు. అలాంటిది ఆ వ్యవస్థలోనే ఇంతగా అరాచకం వుంటే ఇక విశ్వాసం నిలిచేదెలా? ఇప్పుడే ఇదే అతి పెద్ద ప్రశ్న!   కోర్టులు, న్యాయమూర్తులపై… ప్రజల్లో ప్రభుత్వాలు, నాయకులపై కన్నా కాస్త ఎక్కువే నమ్మకమే వుంది ఇప్పటికీ. కాని, జస్టిస్ కర్ణన్ కేసు లాంటి ఉదంతాలు ఎన్ని ఎక్కువ బయట పడితే అంతగా న్యాయ వ్యవస్థ పటుత్వం దెబ్బతినే ప్రమాదం వుంది. అందుకే, జడ్జీలు తమ వ్యవస్థలోని లోపాల్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు అమాంతం మొదలు పెట్టాలి. ప్రభుత్వం చేయగలిగింది ఏమైనా వుంటే సూచించాలి. అలా కాకుండా జడ్జీలే పరస్పర ఆరోపణలు చేసుకుని శిక్షలు వేసుకుంటే సామాన్య జనం న్యాయం కోసం కోర్టుల్ని ఆశ్రయించటం తగ్గిపోవచ్చు!

కాశ్మీర్ టూ కేరళ… క్యాన్సర్ విస్తరిస్తోంది! కాలం మించిపోతోంది!

  ఉగ్రవాదం… ఇప్పుడు మనొక్కరి సమస్య కాదు. యావత్ ప్రపంచం సతమతం అవుతోంది. అమెరికా నుంచి ఆఫ్రికా దాకా ధనిక, పేద దేశాలు, ఖండాలు అన్నీ వణికిపోతున్నాయి. అయితే, ఇండియాకి టెర్రరిజమ్ కొత్త కాదు. దశాబ్దాలుగా మనం నెత్తురోడుతూనే వున్నాం. కాని, రాను రాను ఉగ్ర ముప్పు అన్ని దిక్కుల్లోంచి ముసురుకుంటోంది. ఉగ్రవాదం ప్రత్యక్ష యుద్ధం కాదు కాబట్టి… మనం నిజానికి ఇప్పుడు పరోక్ష యుద్ధంలోనే వున్నామని అర్థం. ప్రతీ రోజూ, ప్రతీ నిమిషం శత్రువు మనకు ఒక్కో అడుగు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఆధునిక టెక్నాలజీని టెర్రరిజమ్ వాడుకోవటం… మరింత ఆందోళనకారం!   గడిచిన కొన్ని గంటల్లో రెండు ఆందోళనకర వార్తలు వచ్చాయి మీడియాలో. వాట్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అంతగా ఉగ్రవాదం మనకు నిత్యకృత్యం అయిపోయింది. ఇక మొదటి వార్త ఏంటంటే… కాశ్మీర్లో ఓ లష్కరే ఉగ్రవాది ఎన్ కౌంటర్లో మరణించాడు. అతడి అంత్యక్రియల్లో ఇతర ఉగ్రవాదులు జనం మధ్యలో చొరబడ్డారు. గాల్లోకి కాల్పులు జరిపి సాల్యూట్ చేసి వెళ్లారు! అలా గన్ సాల్యూట్ ఎవరికి చేస్తారు? దేశం కోసం మరణించిన అమరులకి, ఉన్నత స్థానాలు అలంకరించిన నేతలకి చేస్తారు! కాని, మన దేశంలో ఉగ్రవాదులు నిర్భయంగా కెమెరాల ముందే గాల్లోకి కాల్పులు జరిపి తమ గౌరవం, భక్తి చాటుకున్నారు! కాశ్మీర్లో ఇలాంటి దుర్మార్గ స్థితి మనం ఊహించలేనిదేం కాదు. అక్కడ ఉగ్రవాదులు రాళ్లు మొదలు బుల్లెట్ల దాకా అన్నీ వాడుకుంటున్నారు. ఆవేశంలో వున్న కాశ్మీరీ యువతను కూడా తమ స్వార్థానికి వాడేసుకుంటున్నారు…   కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు, కలకలం ఎంత మాత్రం  విశేషం కాదు. నిజానికి కాశ్మీర్ లోయలో ఏదైనా ఒక రోజు కాల్పుల చప్పుళ్లు వినిపించకపోతే అదీ అసలు విశేషం! కాని, ఇప్పుడు మనం నిజంగా వణికిపోవాల్సింది ఎక్కడో దక్షిణాన వున్న కేరళలో కూడా ఉగ్ర కదలికలు బయటపడుతుండటమే! తాజాగా ఎన్ఐఏ బయటపెట్టిన సమాచారం ప్రకారం… కేరళలోని కొందరు ఒక వాట్సప్ గ్రూప్ ద్వారా అఫ్గనిస్థాన్ లోని టెర్రరిస్టులతో టచ్ లో వున్నారట! వాళ్లు ఇక్కడ నుంచే వెళ్లిన కేరళ భారతీయులు. ఐఎస్ఐఎస్ లో చేరారు. దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. వారితో వాట్సప్ సంబంధాలు కొనసాగిస్తున్నారు ఇక్కడి దేశ ద్రోహులు! ఇప్పటికే ఎంతో మంది ఐఎస్ఐఎస్ లో చేరి కూడా వుండొచ్చని జాతీయ భద్రతా అధికారులు అంచనా వేస్తున్నారు!   కాశ్మీర్ , కేరళ మాత్రమే కాదు… ఉగ్రవాదం ఇప్పుడు భారతదేశంలో నలుమూలలా విస్తరిస్తోంది. బీజేపి అధికారంలో వున్న రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, ప్రాంతీయ పార్టీల ఏలుబడి సాగుతోన్న రాష్ట్రాల్లో అంతటా ఒకటే పరిస్థితి. పాక్ లోని, ఇతర ఇస్లామిక్ దేశాల్లోని ఉగ్రవాదులు ఇక్కడి మైనార్టీల మనసులు మారుస్తున్నారు. మన వార్నే మనకు శత్రువులుగా తయారు చేస్తున్నారు. అందుకోసం ఫేస్బుక్, వాట్సప్ లాంటి టెక్నాలజీ వాడుకుంటున్నారు. కాశ్మీర్ అల్లర్లకు వాట్సప్ గ్రూపులే కారణమంటోంది ఎన్ఐఏ. అలాగే, పట్టించుకునేవాడు లేకుండా ప్రసారమైపోయే ఎన్నో ఛానల్స్ కూడా దేశం పై పగని బోధిస్తున్నాయని తేలుతోంది! దీని వల్ల ఒకే దేశంలోని రెండు వర్గాలు ఒకర్ని ఒకరు అనుమానాస్పదంగా చూసుకోవాల్సిన దుస్థితి వస్తోంది!   కాశ్మీర్లో తాజాగా ఎన్ కౌంటరైన లష్కర్ ఉగ్రవాది ముస్లిమ్. అతడికి మద్దతుగా అంత్యక్రియల్లో పాల్గొన్నది కూడా ముస్లిమ్ లే. గన్నులతో కాల్పులు జరిపి కలకలం రేపిన వారు కూడా ముస్లిమ్ లే. అయితే, ఇక్కడే మరో కోణమూ వుంది. లష్కర్ ఉగ్రవాదిని ఎన్ కౌంటర్ చేయటంలో సాహసోపేతంగా పాలుపంచుకుని ప్రాణాలు కోల్పోయింది కూడా ముస్లిమ్ పోలీసే! మెహమూద్ అనే యువకుడు ఎన్ కౌంటర్లో అమరుడయ్యాడు! కాని, ఎవరో కొందరు ఆవేశపరులైన మైనార్టీ యువకులు చేస్తోన్న ఉగ్ర కార్యకలాపాల వల్ల వారి సమాజం మొత్తానికి అనుమానాస్పద చూపులు తప్పటం లేదు. ఇదే స్థితి ప్రపంచ ముస్లిమ్ లందర్నీ వేధిస్తోంది. ఇండియాలో చాలా వరకూ హిందూ, ముస్లిమ్ సంబంధాలు ఎంతో పటిష్టమనే చెప్పాలి.   దేశం మొత్తం క్యాన్సర్ లా విస్తరిస్తోన్న ఉగ్రవాదాన్ని ప్రధానంగా కేంద్రం ప్రభుత్వం అరికట్టాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాజకీయ శత్రుత్వాలు, లాభాలు పక్కన పెట్టి కేంద్రానికి తగిన సహకారం అందించాలి. మనలో మనకి ఎన్ని విభేదాలున్నా ఎవ్వరూ విభేదించకుండా వుండలేని ఉగ్రవాదం. తప్పకుండా ఉగ్రపోరులో దేశమంతా ఒక్కటి కావాలి. ఎందుకంటే, దేశం లోపలి ఉగ్రవాదం పాకిస్తాన్ కంటే ప్రమాదకరమైంది. అది వేటు వేయదు… వేయి గాట్లతో రక్తమోడేలా చేస్తుంది!

రాక్షసుల్ని ఉరి తీయాలి… రాక్షసత్వాన్ని గురి పెట్టాలి!

  నిర్భయ… ఈ పేరు ఒక మామూలు శబ్దం కాదు. స్వతంత్ర భారతంలో దశాబ్దాలు రాజ్యమేలిన నిశ్శబ్ధానికి చరమగీతం! అనాదిగా స్త్రీలపై దౌర్జన్యం , అమానుషం జరుగుతూ వస్తూనే వున్నా ప్రజాస్వామ్య యుగంలో, స్వతంత్ర భారత వ్యవస్థలో తగ్గు ముఖం పట్టాలి. కానీ, అలా జరగలేదు. మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలో మహిళల స్థితి దయనీయంగా మారిపోయింది. అది దేశం గుండెల్లో రగలి రగలి పెను దావాణలమై దిల్లీని కమ్మేసింది నిర్భయ విషాదం తరువాత. చివరకు, అయిదేళ్ల నిరీక్షణ అనంతరం ఉరే సరి అన్న తీర్పుతో కొంత వరకూ న్యాయానికి న్యాయం చేస్తూ ముగింపుకొచ్చింది!   నిర్భయ ఉదంతం మనలో అందరికీ తెలిసిందే. దేశాన్ని కుదిపేసిన ఆ రేప్ సంఘటన ప్రపంచానికి, చరిత్రకి ఒక పెద్ద విషాదకమరైన మలుపు కావచ్చు. కాని, నిజంగా, నిజాయితీగా మాట్లాడుకుంటే… భారతదేశంలో నిత్యం ఎందరో నిర్భయలు. వారందరి ఆర్తనాదాలు రాజధాని వీధుల్లో నినాదాలై మార్మోగవు. ఊళ్లలోని పాకల్లో, పట్టణల్లోని గుడిసెల్లో,నగరాల్లోని బంగాళ్లాల్లో కామాంధుల కసి పిడికిళ్లలో ఆ గొంతుకలు పూడుకుపోతాయి. మన దేశంలో లెక్కకు మించి రేప్ కేసులు పోలీస్ స్టేషన్ దాకా రానే రావు. వచ్చిన కోర్టు దాకా వెళ్లవు. వెళ్లినా న్యాయమనే ఉపశమన గమ్యాన్ని చేరవు. నిర్భయ దారుణం తరువాత ములాయం లాంటి ఒక సీనియర్ జాతీయ నేత ఏమన్నారో గుర్తే కదా? మగపిల్లలన్నాక తప్పులు జరుగుతుంటాయి. అది సహజం అన్నాడు! అలా అత్యాచారాన్ని సహజంగా తీసుకునే అమానుష సమాజం మన చుట్టూ ఇంకా అలానే వుంది!   నిర్భయ ఉదంతం తరువాత నిర్భయ చట్టం వచ్చింది. దాని అమలు ఎలా వుందో రోజూ మనం చూసే అత్యాచారా వార్తలతోనే తెలసిపోతుంది. ఎంతటి కఠినమైన చట్టమైనా మన దేశంలో సాధ్యమైనంత ఎక్కువ కాలం తీసుకునే అంతి తీర్పు వద్దకొస్తుంది. నిర్భయ నిందితులకే ఉరి శిక్ష వేయటానికి ఏళ్లు పట్టింది. ఇక మీడియా, సామాన్య జనం ఒత్తిడి లేని ఇతర మామూలు రేప్ కేస్ ల సంగతేంటి? న్యాయం దక్కినా… అది దశాబ్దాల అనంతరం వచ్చేదే తప్ప తక్షణం అమలయ్యే సూచనలే లేవు! అందుకే, జనం కూడా రేపిస్టులు మొదలు ఉగ్రవాదుల దాకా నేరం చేసిన వాడ్ని పోలీసులు, సైనికులు ఎన్ కౌంటర్ చేయాలనే కోరుకుంటున్నారు దేశంలో! చట్టబద్ధంగా విచారణ జరపటం అంటే ఇక్కడ బిర్యానీలు పెట్టి రాచమర్యాదలు చేయటమే! నిర్భయ చట్టం లాంటివి తేవటం కంటే ముందు మన న్యాయ వ్యవస్థ తాబేలు నడకని సింహం వేటలాగా మార్చే ప్రయత్నాలు చేయాలి. అది చాలా ముఖ్యం!   నిర్భయ కేసులో ఉరిశిక్షలు పడటం అందర్ని సంతృప్తి పరిచి వుండవచ్చు. కానీ, మన దేశ న్యాయవ్యవస్థ దుర్భలత్వం కూడా ఇదే కేసుతో బయటపడింది. నిర్భయ స్వయంగా ఇచ్చిన వాంగ్మూలంలో తన శరీరంలోకి రాడ్డుని దింపి నరకం చూపించాడని చెప్పిన వాడు ఇవాళ్ల స్వేచ్ఛగా సభ్య సమాజంలో కలిసిపోయాడు! కారణం ఆ కరుడు కట్టిన కామాంధుడు మెజార్టీ నిండటానికి ఇంకా కొన్ని నెలలు తక్కువగా వుండటమే! అయినా… అసలు ఒక స్త్రీని రేప్ చేయాలని తెలిసిన వాడు బాలుడెలా అవుతాడు? అత్యాచారం చేయటమే కాకుండా ఆమె మరణానికి కారణమయ్యేలా రాక్షసంగా హింసించిన వాడు మనిషెలా అవుతాడు? కాని, మన చట్టాలు, వాటిలోని లోపాలు సదరు బాల పిశాచానికి ఉరిని తప్పించేశాయి. కనీసం జైలు జీవితం కూడా లేకుండా స్వేచ్ఛగా రోడ్డు మీద వదిలేశాయి!   నిర్భయ అసలు రేపిస్టు తప్పించుకున్నాక చట్టంలో మార్పు తీసుకొచ్చి పద్దెనిమిది నుంచీ పదహారుకు తగ్గించినా… జరిగిన నష్టం మాత్రం పూడ్చలేనిది. అసలు వాడ్ని వదిలేసి మిగతా వారికి ఉరి వేయటం సంపూర్ణ న్యాయం ఏనాటికీ కాదు. కనీసం ముందు ముందు అయినా చట్టం అమలు పటిష్టంగా వుండి నేరం చేసిన వాడు తప్పించుకునే అవకాశాలు లేకుండా చేయాలి. అదీ రేప్ లాంటి అమానుష నేరాలకి శిక్షలు వేసే విషయంలో లోపాలకి ఎంత మాత్రం వీలుండకూడదు!   నిర్భయ రేప్ కేసు కేవలం చట్టాలు, న్యాయ వ్యవస్థ వంటి అంశాలకు మాత్రమే సంబంధించింది కాదు. మన దేశంలో స్త్రీని ఆదిపరాశక్తి అంటూ గుళ్లు కట్టి పూజిస్తారు. అటువంటి భక్తుల మధ్యలోనే ఎలా రేప్ లు చేసే రాక్షసులు పుట్టుకొస్తున్నారు? కారణం… రోజు రోజుకి పడిపోతన్న నైతిక విలువలు! టీవీలో, సినిమాల్లో, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లలో,ఇంటర్నెట్ లో … ఎక్కడా స్త్రీని శృంగార భావంతో తప్ప మరోలా చూపించటం లేదు. స్కూళ్లు, కాలేజీల్లో మార్కుల వేట తప్ప నీతి చెప్పే తీరిక లేదు. అందుకే, స్త్రీని అమ్మగా భావించిన సంస్కృతిలోని వారే ఇవాళ్ల బొమ్మగా చూస్తున్నారు. రేప్ లు, లైంగిక దాడుల వంటివి పెరిగిపోవటానికి కారణం అవుతున్నారు. కాబట్టి, సమాజంలోని స్త్రీ నిర్భయలా బాధితురాలు కాకుండా నిర్భయంగా వుండాలంటే… కావాల్సింది కొత్త చట్టాలు కాదు. మారాల్సింది మనం…

స్వచ్ఛ్ రేస్ లో… గుజరాత్ క్లీన్! ఉత్తర్ ప్రదేశ్ క్లీన్ బౌల్డ్!

మోదీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో స్వచ్ఛ్ భారత్ ఒకటి! ఆయన ప్రధాని అయిన వెంటనే ఈ నినాదం ఎత్తుకున్నారు. అయితే, స్వచ్ఛ్ భారత్ కేవలం సెలబ్రిటిలు చీపుర్లు పట్టుకుని కెమెరాలకు ఫోజులు ఇవ్వటానికే అన్న విమర్శలు వచ్చాయి మొదట్లో. కాని, రాను రాను పరిస్థితిలో మార్పు వచ్చింది. స్వచ్ఛ్ భారత్ నినాదం వెనుక వున్న ఆంతర్యం అర్థమైంది. మేధావుల మాటెలా వున్నా సామాన్య జనం గతంలో కంటే కొంత మెరుగ్గా ఆలోచిస్తున్నారు. మన ఇళ్లు ఎందుకు స్వచ్ఛంగా వుంచుకుంటామో అందుకే మన ఊరు, మన నగరం కూడా స్వచ్ఛంగా వుంచుకోవాలని భావిస్తున్నారు. అనేక రకాల రోగాలకు కారణమైన అపరిశుభ్రత, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన వంటివి తగ్గుముఖం పట్టాయి. భారత దేశమంతటి పెద్ద దేశం రాత్రికి రాత్రి స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లా అందంగా మారిపోవటమైతే కుదరదు కదా…   2017 సంవత్సరానికిగానూ కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ లో నగరాలు, పట్టణాల్లో వస్తోన్న ఆశాజనకమైన మార్పు సంతోషం కలిగించేదే! గతంలో నెంబర్ వన్ స్థానంలో వున్న నగరాలు ఇప్పుడు కిందకి దిగజారాయి. కొత్త నగరాలు పరిశుభ్రంగా మెరిసిపోయాయి. దీనర్థం గతంలో స్వచ్ఛ నగరాలు అనిపించుకున్నవి చెడిపోయాయని కాదు. పోటీలో భాగంగా ఇతర నగరాలు తగు జాగ్రత్తలు తీసుకుని పైకి ఎగబాకయని! ఇది అత్యంత ఆవశ్యకం!   స్వచ్ఛత విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు బాగానే బాగానే ర్యాంక్ లు సాధించాయి. అయితే, తెలంగాణ కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మార్కులు కొట్టేసింది. దేశం మొత్తంలోనే మూడో స్వచ్ఛమైన నగరంగా విశాఖ నిలిచింది. తొమ్మిదో స్థానంలో తిరుపతి చోటు దక్కించుకుంది. అంతే కాదు, ఎక్కువ పరిశుభ్రమైన నగరాలు గల రాష్ట్రంగా కూడా ఏపీ మూడో స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్, గుజరాత్ తరువాతి స్థానం నవ్యాంధ్రకే దక్కింది.   ఇక తెలంగాణ కూడా హైద్రాబాద్ ను 22వ స్థానంలో నిలుపుకుంది. వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, సూర్యాపేట లాంటి పట్టణాలు కూడా రేస్ లో మంచి పర్ఫామెన్సే ఇచ్చాయి. అయితే, స్వఛ్ఛ్ భారత్ ఉద్యమంలో తెలుగు రాష్ట్రాల కన్నా ఆశ్చర్యకర ఫలితాలన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లోనే వచ్చాయి. అత్యుత్తమ నగరాలు, అతి మురికి నగరాలు రెండూ నార్త్ లోనే ఇమిడిపోయాయి!   పన్నెండు అత్యంత పరిశుభ్ర నగరాలతో గుజరాత్ టాప్ క్లీన్ స్టేట్ గా వుండగా రెండో స్థానంలోనూ బీజేపి పాలిత మధ్యప్రదేశ్ నిలిచింది. అయితే, ఈ మధ్యే కమలం ఖాతాలో పడ్డ యూపీ మాత్రం అత్యంత మురికైన నగరాలతో అట్టడుగున నిలిచింది. నాలుగు అత్యంత అపరిశుభ్ర నగరాలు ఉత్తర్ ప్రదేశ్ లోనే వున్నాయి. యోగీ ఆదిత్యనాథ్ వచ్చే స్వచ్ఛ్ సర్వే నాటికి ఎంత వరకూ బాగు చేస్తారో చూడాలి!   ఉత్తర్ ప్రదేశ్ లోని నగరాలేవీ టాప్ టెన్ కాదు కదా… టాప్ హండ్రెడ్ లో కూడా నిలవలేకపోయాయి! కేవలం ప్రధాని మోదీ నియోజక వర్గం, విశ్వనాథుని మహాక్షేత్రం వారణాసి మాత్రం 32వ ర్యాంక్ సాధించింది!   ఉత్తర్ ప్రదేశ్ తో పాటూ దేశంలో కంపుగొడుతోన్న నగరాలు అత్యధికంగా వున్న రాష్ట్రాలు ఉత్తరాఖండ్, పంజాబ్, బీహార్, మహారాష్ట్ర. బీహార్ రాష్ట్రం కూడా యూపీ స్టైల్లోనే టాప్ హండ్రెడ్ సిటీస్ లో ఒక్క సిటీని కూడా నిలపలేకపోయింది. టాప్ హండ్రెడే కాదు టాప్ టూ హండ్రెడ్ సిటీస్ లోనూ బీహార్ నగరాలు ఎక్కడా కనిపించలేదు! మరో పెద్ద రాష్ట్రం రాజస్థాన్ పరిస్థితి కూడా అలానే వుంది.   పరమ మురికిగా వున్న నగరాలు, పట్టణాలు ఏంటో తెలుసా? యూపీలోని గోండా, మహాలోని బుసావల్, బీహార్లోని బాగా, ఉత్తర్ ప్రదేశ్ లోని హర్దోయ్. బీహార్ కే చెందిన కతిహార్.. టాప్ ఫై చెత్త సిటీలుగా మిగిలాయి. అయితే, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విడ్డూరం ఏంటంటే… మమతా బెనర్జీ ఆధీనంలోని బెంగాల్ స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో అసలు పాల్గొనలేదు! పాల్గొని వుంటే ఆ రాష్ట్రం నుంచి కూడా దుర్వాసన బాగానే వచ్చి వుండేది!   ఒక్కసారి 434 నగరాలు, పట్టణాల పూర్తి లిస్టు పరికిస్తే మనకు ఒక్క విషయం స్పష్టమవుతుంది. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీలు… ఇలా ఎవరి ఏలుబడిలో వున్నా శుభ్రమైన నగరాలు, పట్టణాలు, అపరిశుభ్రమైన నరక కూపాలు అన్ని చోట్లా వున్నాయి. కాబట్టి అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వాలు సమిష్ఠిగా కృషి చేసి దేశాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చుకోవాలి. అది నిస్సందేహంగా మన మంచికే. అంతేకాక 2019 అక్టోబర్ 2 నాటికి… అంటే మహాత్ముని 150వ జయంతి నాటికి దేశంలో ఎవ్వరూ బహిరంగ మల విస్టర్జనకి పాల్పడకుండా వుండేలా చూసుకోవాలి! అలా జరిగితేనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా మనకు ప్రపంచం ముందు గౌరవం దక్కుతుంది!    

చంద్రబాబు అమెరికా టూర్‌... డే టు డే షెడ్యూల్‌ డిటైల్స్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా వెళ్లారు. ఐటీ, వ్యవసాయం, ఫిన్‌టెక్‌ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పర్యటన సాగనుంది. పలు రాష్ట్రాలతో అగ్రిమెంట్స్‌ చేసుకోవడంతోపాటు యాపిల్‌, సిస్కో, గూగుల్‌, ఒరాకిల్‌, టెస్లా వంటి దిగ్గజ కంపెనీల సీఈవోలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. పెట్టుబడులకు ఏపీలో ఉన్న అనుకూలతలు, కల్పించనున్న సౌకర్యాలను వివరించనున్నారు. ఇక ఈనెల 9న వరల్డ్‌ ఎకనమిక్ ఫోరం కార్యాలయంలో పోర్త్ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌ అంశంపై ప్రసంగించనున్నారు. అదేవిధంగా ప్రసాంధ్రులతో మూడుసార్లు భేటీకానున్నారు. చిత్తూరు జిల్లాలో యాపిల్‌ కంపెనీ ఏర్పాటుపై ఈ టూర్లో క్లారిటీ రానుంది. అదేవిధంగా టాప్‌ మోస్ట్‌ 30మంది సీఈవోలతో ముఖాముఖి కానున్న చంద్రబాబు... ఏపీలో శాఖలను ఏర్పాటు చేయాలని కోరనున్నారు. అలాగే కర్నూలు జిల్లాలో సీడ్‌ ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటుపై అయోవా యూనివర్శిటీతో ఒప్పందం చేసుకోనున్నారు.    మొదటి రోజు... గ్లోబల్‌ కల్టిమేట్‌ లీడర్ అంశంపై కాలిఫోర్నియా రాష్ట్రంతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ చేసుకోనుంది. ఆ తర్వాత ఆమ్వే సంస్థ ప్రతినిధులతో బాబు భేటీకానున్నారు. అనంతరం వరిన్‌ మెడికల్‌ సంస్థను పరిశీలించనున్నారు. మొదటి రోజు చివరిగా ఒరాకిల్‌ సీఈవోతో సమావేశం కానున్నారు. రెండోరోజు యూఎస్‌ఐబీసీ ఏర్పాటుచేసిన బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌లో చంద్రబాబు బృందం పాల్గోనుంది. అనంతరం టెస్లా కార్యాలయానికి వెళ్లి ఎగ్జిక్యూటివ్స్‌తో బాబు భేటీకానున్నారు. ఆ తర్వాత ఎన్‌ఐవో సీఈవో వారియర్‌తో సమావేశమై...... అరిస్టా సీఈవోతో లంచ్‌ మీటింగ్‌కి హాజరుకానున్నారు. అనంతరం నుటానిక్స్‌ సీఈవోతో... హెవలెట్‌ సీఈవో వైట్‌మెన్‌తో భేటీకానున్నారు. రెండోరోజు లాస్ట్‌ మీటింగ్‌.... సీఎక్స్‌ కంపెనీ ప్రతినిధులతో జరగనుంది.   మూడోరోజు కేపీఎంజీ ప్రతినిధులతో బ్రేక్‌ ఫాస్ట్‌ భేటీకి హాజరుకానున్న బాబు టీమ్..... రాత్రికి డల్లాస్ చేరుకుని, ప్రవాసాంధ్రులతో డిన్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. నాల్గోరోజు అయోవా యూనివర్శిటీలో బాబు బృందం పర్యటించనుంది. వ్యవసాయరంగంలో నూతన పరిశోధనలను పరిశీలించనున్నారు. అలాగే సీడ్‌ ఉత్పత్తిపై అయోవా యూనివర్శిటీతో ఒప్పందం చేసుకోనున్నారు. చివరిగా ప్రవాసాంధ్రులతో డిన్నర్ మీటింగ్‌ జరగనుంది.    ఐదోరోజు సిస్కో ఆఫీస్‌కు వెళ్లి ఎగ్జిక్యూటివ్స్‌తో భేటీ అవుతారు. ఇదే రోజు యాపిల్‌, ఫ్లెక్స్‌ ట్రానిక్స్‌, గూగుల్‌ కార్యాలయాలను సందర్శించనున్నారు. ఆ తర్వాత యూఎస్‌ఐబీసీ-వెస్ట్‌కోస్ట్‌ సమ్మిట్‌లో పాల్గోనున్నారు. ఐదోరోజు చివరిగా జాన్‌ ఛాంబర్స్‌ అండ్‌ సీఈవోలతో డిన్నర్‌ మీటింగ్‌లో పాల్గోనున్నారు. ఆరోరోజు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ ప్రతినిధులతో సమావేశంకానున్నారు. ఆ తర్వాత జెన్సీ అండ్ జాన్సన్ ‌కో ఎగ్జిక్యూటివ్స్‌తో భేటీ అవుతారు. అనంతరం డబ్యూఈఎఫ్‌ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.   ఏడోరోజు వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు బృందం పాల్గోనుంది. ఎనిమిదోరోజు ఇలినాయిస్‌ గవర్నర్‌తో భేటీ అయి... ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. అనంతరం చికాగో నుంచి ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.

కంప్రెస్, సప్రెస్ అయిపోతోన్న ప్రెస్ ఫ్రీడమ్…

మే 1 లేబర్ డే! ఇది అందరికీ తెలిసిందే! కాని, మే 3 ఏంటో తెలుసా? వాల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే! ఈ విషయం చాలా మంది జర్నలిస్టులకి కూడా తెలుసో లేదో! కాని, మే 3ని ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన దినంగా అధికారికంగా జరుపుతున్నారు ఎన్నో ఏళ్లుగా! అయితే, పత్రికలతో మొదలై ఇవాళ్ల టెలివిజన్, వెబ్ జర్నలిజం, సోషల్ మీడియా సైట్లతో కలిపి మీడియా ఎంతో విస్తరించింది. మరి ప్రెస్ ఫ్రీడమ్ సంగతో? అది మాత్రం అంతకంతకూ కుంచించుకుపోతోంది!   వాల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా ఒక్కసారి ప్రపంచాన్ని పరికిస్తే జర్నలిస్టుల భద్రత, సంరక్షణ ఎంత బాగా వున్నాయో ఇట్టే అర్థమైపోతుంది! తన రహస్యాలు బయటపెట్టాడని అసాంజే మీద తప్పుడు కేసులు పెట్టి వేటాడుతోన్న అమెరికా మొదలు… జర్నలిస్టుల తలలు నరికేసే ఐఎస్ఐఎస్ వరకూ అంతటా, అందరూ అదే టైపు! క్రూరత్వంలో కాస్త అటు ఇటూ తప్ప పత్రికా స్వేచ్ఛని ధైర్యంగా అంగీకరించే వ్యవస్థ ఎక్కడా లేదు! ఇందుకు మన దేశమూ అతీతం కాదు! ది హూట్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ విషయంలో 136వ ర్యాంక్ సంపాదించుకుంది! మొత్తం ర్యాంక్ లు పొందిన దేశాలెన్ననుకున్నారు? 180!   180 దేశాల్లో 136వ స్థానంలో భారత్ నిలిచిందంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు! అందుకు తగ్గట్టే సంఖ్యలు కూడా కనిపిస్తాయి మనకు! జనవరి 2016 నుంచీ ఏప్రెల్ 2017వరకూ జర్నలిస్టుల మీద యావత్ దేశంలో 54దాడులు జరిగాయి! ఏడుగురు పాత్రికేయులు హత్యకి గురయ్యారు కూడా! ఇదంతా కేవలం పోలీస్టేషన్ల దాకా వచ్చిన కేసుల సారాంశమే! అసలు రిపోర్ట్ అవ్వని దాడులు, మర్డర్లు ఇంకా ఎన్నో!   ఇంతకీ, పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగేలా జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నది ఎవరు? చాలా మంది! పొలీసులు, పొలిటికల్ లీడర్లు, వారి అనుచరులు, వివిధ రంగాల్లోని మాఫియాలో వున్న కరుడుగట్టిన నేరగాళ్లు, నిరసనలు, ధర్నాలు చేసే జనాల గుంపులు, చివరకు, లాయర్లు కూడా ఈ లిస్ట్ లో వున్నారు! మీడియా, జర్నలిస్టులు అన్నివేళలా కరెక్టే అని మనం చెప్పకున్నా… దాడుల్ని మాత్రం సమర్థిచలేం. కాని, జరుగుతున్నది మాత్రం అదే! రోజు రోజుకి పత్రికా స్వేచ్ఛ పట్ల అసహనం పెరిగిపోతోంది! పాలకులు మొదలు సామాన్య జనం దాకా అందరికీ ఏదో ఒక సమయంలో ప్రెస్ అంటే కోపం తన్నుకొస్తోంది!   మీడియా పై దాడులు ప్రతీ యేడూ పెరగటానికి అసలు కారణం… దాడి చేసిన వారి అరెస్ట్ విషయంలో జరుగుతోన్న జాప్యం, అలసత్వం! 2014లో మీడియా పై జరిగిన దాడులకు సంబంధించి 114కేసులు నమోదైతే… కేవలం 32మందిని మాత్రమే అరెస్ట్ చేయటం జరిగింది! దీని వల్ల కూడా పత్రికా స్వేఛ్ఛకు భంగం కలిగించే వారిలో భయం కొంచెం కూడా లేకుండాపోతోంది.   దేశ వ్యాప్తంగా వివిధ ఛానల్స్ , పత్రికలు నిషేధానికి గురవ్వటం కూడా ఈ మధ్య పెరిగిపోయిందట! మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఛానల్స్ రోజుల తరబడి జనాలకు అందుబాటులో లేకుండా పోవటం మనకు తెలిసిందే! ఇక కేరళ మొదలు కాశ్మీర్ దాకా అంతట ఒకేలాంటి పరిస్థితి వుందని చెబుతున్నాయి రిపోర్ట్స్! నిత్యం అల్లర్లతో అట్టుడికే కాశ్మీర్లో అయితే ప్రెస్ ఫ్రీడమ్ మరింత దుర్భరంగా వుంటోంది. కాశ్మీర్ రీడర్ అనే పత్రికని ఏకంగా మూడు నెలలు అచ్చవ్వకుండా బ్యాన్ చేశారు! దీని వెనుక కారణాలు, వివరణలు ఎలా వున్నా పత్రికా స్వేచ్ఛకి మాత్రం ఇది తీవ్రమైన భంగమనే చెప్పాలి!   పత్రికలు, ఛానల్స్ మాదిరిగానే ఇంటర్నెట్ కూడా పదే పదే నిషేధానికి గురవుతోంది వివిధ రాష్ట్రాల్లో. ఫేస్బుక్, వాట్సప్ పోస్టులు కూడా హింసకు, అల్లర్లకు దారి తీస్తుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల కోసం ఇంటర్నెట్ బ్యాన్ చేసేస్తున్నాయి. ఈ విషయంలో కూడా రాళ్ల దాడులతో సతమతం అవుతోన్న కాశ్మీర్ ముందంజలో వుంది!   మీడియాని తొక్కిపెట్టే క్రమంలో సినిమాకి కూడా సెగ తగులుతోంది. సెన్సార్ బోర్డ్ కత్తెర ముందు గజగజ వణికిపోతోన్న సినిమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దక్షిణాదిలో కమల్ హసన్ విశ్వరూపం సినిమాకు రకరకాల ఇబ్బందులు ఎదురుకావటం మనకు తెలుసు. అలాగే, పంజాబ్ ఎన్నికలకు ముందు ఉడ్తా పంజాబ్ సినిమాకి కూడా సెన్సార్ బోర్డ్ చుక్కలు చూపింది. ఇలా రాష్ట్ర స్థాయిలో , జాతీయ స్థాయిలో రోజూ ఏదో ఒక సినిమా అవాంతరం ఎదుర్కుంటూనే వుంది! ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ కి చాలా పెద్ద దెబ్బ!   మీడియా సంస్థలు, జర్నలిస్టులు, సినిమాలు మాత్రమే కాదు… వివిధ రంగాల్లో ఒంటరి వ్యక్తులు కూడా అంతకంతకూ స్వేచ్ఛకి దూరమవుతున్నారట! ఏకంగా ప్రభుత్వాలే దేశ ద్రోహం కేసులు, పరువు నష్టం కేసులు వేస్తున్నాయి తమకు నచ్చని వారి మీద! తమిళనాడు ప్రభుత్వం అత్యధికంగా 16కేసులు పెట్టిందట మీడియా మీద! అదీ ఈ సంవత్సరం ప్రారంభంలో కేవలం మూడు నెలల్లోనే! ఈ విధంగా కక్ష సాధింపుకి అస్త్రాలుగా మారిపోయాయి దేశ ద్రోహం, పరువు నష్టం కేసులు!   జనాలని సమాచారానికి దూరం చేస్తోన్న మరో దారుణమైన పరిణామం ఆర్టీఐ యాక్టివిస్టుల మర్డర్లు! సమాచార హక్కు చట్టం ఉపయోగించి నిజాలు వెలికితీసే సాహసం చేసిన చాలా మంది అనుమానాస్పద మరణాలకి గురవుతున్నారు. నానాటికీ ఈ కేసుల సంఖ్య ఆర్టీఐ ఉద్దేశాన్ని నీరుగార్చేస్తోంది. ప్రాణాలకు తెగించిన వారు తప్ప మామూలు జనం ఆర్టీఐ జోలికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది!   ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ! ఆ స్వేచ్ఛకి భంగం కలిగేలా దేశం దయనీయ స్థితిలో వుంటే అది అందరికీ ప్రమాదకరమే! అందుకే, ప్రజలు చైతన్యవంతంగా మారి పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాలి. లేదంటే దీర్ఘకాలంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం అర్థం లేనిదైపోతుంది!

దిగ్విజయ్ డిప్రెషన్‌లో ఉన్నాడా..?

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం..నూట పాతికేళ్ల చరిత్ర కలిగిన పార్టీకి జనరల్ సెక్రటరీ..అలాంటి వ్యక్తి ఒక మాట మాట్లాడేముందు వెనుకా ముందు ఎంత ఆలోచించాలి. కానీ అది ఏమాత్రం పట్టించుకోకుండా దిగ్విజయ్ తరచూ నోరు జారుతున్నారు. తాజాగా తెలంగాణ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి విమర్శల పాలయ్యారు. తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్ వెబ్‌సైట్ తయారుచేసి యువతను రెచ్చగొడుతున్నారని, యువతను అలా రెచ్చగొట్టాలని పోలీసులకు సీఎం అధికారం ఇచ్చారా అంటూ డిగ్గీ రాజా చేసిన ట్వీట్ తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.   ప్రజలను కాపాడేందుకు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా దేశం కోసం పనిచేస్తున్న సైనికులు, పోలీసులపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతినేలా ఆయన మాట్లాడారని, ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ పోలీసులు..దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నారంటూ స్వయంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో ఉరి సైనిక స్థావరంపై దాడి జరిగినప్పుడు 19 మంది భారత సైనికులు అమరులైనప్పుడు సైనికులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.   అసలే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి గాలిలో దీపంలాగా ఉంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా చావు తప్పి కన్ను లోట్టపోయింది అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ వ్యవహారం. సరే దేశం సంగతి పక్కనబెడదాం..ఆయన గారు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న తెలుగు రాష్ట్రాల సంగతి చూస్తే..ఏపీలో ఇప్పుడప్పుడే లేచే పరిస్థితి లేదు...తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఛాన్స్ రాకుండా చేస్తున్నారు కేసీఆర్. బలమైన క్యాడర్ ఉండి కూడా అక్కడ నిలబడలేకపోవడం హైకమాండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.   ఈసారి ఎలాగైనా పార్టీ పుంజుకునేలా చేసే బాధ్యతను దిగ్విజయ్ సింగ్ చేతిలో పెడితే ఆయన ఇలా నోటి కొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు. ఇదే అదనుగా టీఆర్ఎస్ డిగ్గీరాజాను ఓ ఆట ఆడుకుంటోంది. తమ పోలీసులు నైతిక స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు గులాబీ నేతలు. ఇవన్నీ చూసిన వారు రెండు రాష్ట్రాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా తీసేయడంతో దిగ్విజయ్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని..ఆ బాధలోనే ఏది పడితే అది మాట్లాడుతున్నారని అంటున్నారు. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ఇక నుంచైనా డిగ్గీరాజా ఆచితూచి మాట్లాడితే మంచిది.

రామానుజాచార్య : 1000ఏళ్లుగా వీస్తోన్న ఆధ్యాత్మిక సుగంధం!

  ఒక వ్యక్తి ప్రభావం ఎంత వరకూ వుంటుంది? అతడి గురించి బాధపడేవారు, జ్ఞాపకం వుంచుకునేవారు, ఆలోచించే వారు, అతడి ప్రభావానికి లోనయ్యే వారు అతడి తరం వారై వుంటారు! అతడి బంధువలు, మిత్రులు, ఇతరులు ఇలాంటి వారు. అలాగే, తరువాత తరంలోని పిల్లలు, ముందు తరంలోని పెద్దలు కూడా కొన్ని సార్లు వ్యక్తుల ప్రభావానికి లోనవుతుంటారు! కాని, ఇదంతా సామాన్యుల సంగతి! అసామాన్యుల సంగతి వేరు! వారు తమ తరాన్ని, తరువాతి తరాల్ని కూడా ప్రభావితం చేస్తారు! రాబోయే ఎన్నో ఏళ్ల వరకూ గొప్ప వారి ప్రభావం వుంటుంది. ఒక గాంధీ, ఒక బోస్, ఒక భగత్ సింగ్… ఇలాంటి వారన్నమాట!   మనం ఎప్పుడూ పెద్దగా ఆలోచించం కాని… మానవ జాతి చరిత్రలో అత్యంత ప్రబావం చూపిన గొప్పవాళ్లు ఎవరు? మనం ఇప్పుడే మాట్లాడుకున్నట్టు మహాత్మా గాంధీ లాంటి వారు ప్రభావవంతులే! కాని, వారి ప్రభావానికి కూడా ఒక పరిమితి వుంటుంది. ఒక్కో రోజు గడిచే కొద్దీ ఎంతటి గొప్ప వ్యక్తి ప్రభావమైనా జనంపై తగ్గిపోతూ వస్తుంది. అందుకే, ఒకప్పటి రాజుల గురించి ఆనాటి పుస్తకాలు గొప్పగా చెబుతాయి. మనకి మాత్రం అంత ఫీలింగ్ ఏం కలగదు. అలెగ్జాండర్ ది గ్రేట్ అనిపించుకున్న జగత్ విజేత ఇవాళ్ల మనుషులకి ఏమంత గ్రేటని?   గొప్ప గొప్ప వారు సాధించే భౌతిక విజయాలు అగ్ని లాంటివి! అప్పటి వారికి అవ్వి వెచ్చగా తగలవచ్చు. కాని, ఒక్కో తరం గడుస్తున్న కొద్దీ వారి విజయాల సెగ క్రమంగా తగ్గిపోతుంది. కాని, ఒక మహాత్ముడి ప్రభావం వెయ్యేళ్ల తరువాత ఇవాళ్ల కూడా మనపై తీవ్రంగా వుందంటే… దాన్ని మీరేమంటారు? ఖచ్చితంగా అది రాజ్య విస్తరణో, ధన సంపాదనో లాంటి భౌతిక విజయమైతే కాదు! అంతకన్నా ఎక్కువైన మరేదో! అలాంటి అలౌకికమైన ప్రభావం ప్రదర్శించిన సంఘ సంస్కర్త, భారతీయ తత్వచింతనకు తీక్షణమైన నిదర్శనం … రామానుజాచార్యులు!   రామానుజులు అనగానే మనకు వైష్ణవులు గుర్తుకు వస్తారు, వైష్ణవ ఆలయాలు కళ్ల ముందు కదులుతాయి. అయితే, ఆయన వెయ్యేళ్ల కిందట ఆదిశంకరుల జయంతికి ఒక్క రోజు తరువాత పుట్టారు. 1017వ సంవత్సరంలో ఆయన శంకరుల అద్వైతాన్ని మరో అడుగు ముందుకు తీసుకు వెళ్లటానికి అవతరించారు. అంతే కాదు, అద్వైతం అంతా ఒక్కటేనని చెబితే … రామానుజులు ఆ ఒక్కటీ శ్రీమహావిష్ణువే అని నొక్కి చెప్పారు. అందుకే, ఆయన వాదాన్ని విశిష్టాద్వైతం అంటారు! ఆదిశంకరులు తమ కాలంలో ప్రబలిపోయిన ఆచారకాండని ఖండించేందుకు వేదాంత ఆధారంగా అద్వైతం ప్రచారం చేశారు. కాని, రామానుజుల కాలం నాటికి బౌద్ధ, జైన మతాల నుంచి హిందూ మతం ఒత్తిడి ఎదుర్కొంది. అంతే కాదు, రానున్న కాలంలో ముస్లిమ్, క్రిస్టియన్ మతాలు కూడా మన దేశంలోకి రాబోతున్నాయి. అటువంటి సమయంలో రామానుజులు నిరాకార పరబ్రహ్మాన్ని ఉపాసించే అద్వైతం బదులు మూర్తి రూపంలో విష్ణువును పూజించే విశిష్టాద్వైతం ముందుకు తెచ్చారు. ఇదే తరువాతి కాలంలో ఎందరో అవతార పురుషులు నమ్మి ఆచారించిన భక్తి ఉద్యమానికి మూలమైంది. భారతీయ సమాజంలో విషంలా పాకిన కులాల సంస్కృతికి వ్యతిరేకంగా భక్తి ఉద్యమం పని చేసింది. స్వతంత్ర పోరాటానికి కూడా అది మేలు చేసింది. అలా వెయ్యేళ్ల కిందటే రామానుజులు భవిష్యత్ భారతావనికి కావాల్సిన ప్రబోధాల్ని సమాజానికి అందించారు!   రామానుజాచార్యులు పుట్టుకతో తమిళ బ్రాహ్మణుడైనా మనుషులందరూ సమానమని నమ్మిన ఆదర్శవాది! ఆయన కాలంలో నారాయణ అష్టాక్షరి మంత్రం కూడా పరమ రహస్యంగా వుండేది. దాన్ని అన్ని కులాల వారికి అందించటం కోసం శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయ గోపురం ఎక్కి ఊరంతా వినపడేలా ఉచ్ఛరించాడట! తనతోటి వారు ఏ కులం వారైనా, మతం వారైనా ఉద్ధరిపంబడాలనేదే ఆయన ఆకాంక్ష! అదే తరువాతి కాలంలో ఎందరో సంఘ సంస్కర్తలకి ప్రేరణగా నిలిచింది. ఆర్య సమాజం స్థాపించిన దయానంద్ సరస్వతి రామానుజుల తరహాలోనే గాయత్రీ మంత్రాన్ని అన్ని కులాలు, మతాల వారికి ఉపదేశించారు!   భారతదేశం ఉత్తరాన వున్న ఆర్యావర్తంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి అవతార పురుషులు ఉద్భవించి ధర్మ రక్షణ చేశారంటున్నాయి పురాణాలు. అదే ధర్మ రక్షణ దక్షిణాదిలో ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు జ్ఞాన మార్గంలో చేశారు. రామ, కృష్ణులు రాక్షస సంహారం చేస్తే ఆదిశంకర, రామానుజ, మధ్వాచార్యులు రాక్షస ప్రవవృత్తుల్నీ, రాక్షస ఆచారాల్ని అంతం చేశారు! ఈ కోవలో హిందూ మతానికి పటిష్టమైన ఆలయ వ్యవస్థని అందించిన భగవద్ రామానుజులు ప్రాతః స్మరణీయులు! ఆయన చేసిన కృషి వల్లే ఇవాళ్ల మన ప్రపంచ ప్రఖ్యాత తిరుమల ఆలయంతో సహా ఎన్నో దేదీప్యమానంగా కళకళలాడుతున్నాయి. రామానుజులు ఏర్పాటు చేసిన నియమాలే ఆయా ఆలయాల్ని ఎన్ని విదేశీ దండయాత్రలు జరిగినా భద్రంగా కాపాడాయి. కాపాడుతూ వున్నాయి! అందుకే, వెయ్యేళ్లైనా ఆ మహాభాగవతుడి ప్రభావం చెక్కుచెదరటం లేదు!